Others

ఈ నల్లని రాలలో.. (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1964లో అక్కినేని హీరోగా విడుదలైన ‘అమరశిల్పి జక్కన్న’ చిత్రంలోని పాట ఇది. ఓ కవి ఎంత లోతుగా, వైవిధ్యంగా ఆలోచించగలడో తెలియజెప్పడానికి సి నారాయం రెడ్డి రాసిన గీతమనుకోవాలి. రాళ్లలో కూడా మానవత్వాన్ని, జీవాన్ని చూపించి.. రాళ్లు ‘కాఠిన్యానికి’ ఉదాహరణ కాదని సినారె ఈ పాటతో విశదీకరించారు. రాళ్లను మహాశిల్పాలుగా మలిచే ఒక గొప్ప శిల్పి, వాటిని ఉద్దేశించి పాడుకునే గీతమిది.
‘ఈ నల్లని రాళ్లలో/ ఏ కన్నులు దాగెనో/ ఈ బండలమాటునా/ ఏ గుండెలు మ్రోగెనో’ అంటూ ఉదాత్త భావంతో పాట మొదలవుతుంది. కేవలం రెండు వాఖ్యాల్లో శిలల జీవితాన్ని, వాటికి ప్రాణం ఉందనీ చెప్పకనే చెప్పేశారు సినారె. ‘పాపాలకు, తాపాలకు బహుదూరములోనున్నవి/ మునులవోలె కారడవుల మూలలందు పడిఉన్నవి’ అంటూ వాటి పవిత్రతను ఎంతో ఎత్తులో కూర్చోబెట్టారు. అంతేకాదు, జీవమున్న మనుషులే పాపకార్యాలకు పాల్పడుతున్నారంటూ చురకలు అంటించారు కూడా. రాళ్లను మహాత్ములైన ఋషులతో పోల్చడం ద్వారా వాటి గొప్పదనాన్నీ పెంచారు. ‘కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు/ ఉలి అలికిడి వినినంతనే గలగల పొంగి పొరలు’ అంటూ వాటికి సహజంగా చలనం లేకపోయినా శిల్పి ఉలి తగలగానే అతని భావాలకు అనుగుణంగా అందమైన శిల్పాలుగా మారిపోతాయని ఎంతో అందంగా చెప్పారు సినారె.
కఠిన మనస్తత్వం మానవత్వం లేకుండా ప్రవర్తించే మానవులకన్నా శిల్పి ఉలి అలికిడితో ఆయన భావాలకు అనుగుణంగా మలచబడడానికి తోడ్పడే గొప్ప లక్షణం వాటిల్లో ఉందని చెప్పడం విశేషం. ఈ పాటకు సాలూరి రాజేశ్వరరావు సమకూర్చిన బాణి, వాయిద్య సహకారం, ఘంటసాల మధుర గానం ప్రాణం పోసాయి. పాట ప్రారంభంలో ఉలి శబ్ధంగా వినిపించిన శబ్ధంతోనే ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఈ గీతం ప్రేక్షకులను నేటికీ రంజింపచేయడమే కాదు ఏ శిలనైనా, కొండనైనా చూసినపుడు ఈ పాట ప్రతీ తెలుగువారి గుండెల్లో మారుమోగుతూనే ఉంది. అక్కినేని అభినయంతో ఇది ప్రేక్షకులకు మరింత చేరువైంది.

-ఎస్‌ఎస్ శాస్ర్తీ, విశాఖపట్నం