Others

ఆటవిడుపుగా అభిమానించండి (ఆనాటి హృదయాల..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది ఏడవ దశకం.. ద్వితీయార్థం.
అక్కినేని, యన్‌టి రామారావుల ఫ్యాన్స్ వీర విహారం చేసేవాళ్లు థియేటర్ల దగ్గర. వారి తర్వాత అదేస్థాయిలో శోభన్‌బాబు, కృష్ణ ఫ్యాన్స్‌ల మధ్య అంతే ‘వార్’ నడిచేది. సినిమా ప్రారంభాలూ.. షూటింగు ప్రోగ్రెస్‌లూ.. రిలీజ్ పబ్లిసిటీకి సంబంధించిన ఫొటోగ్రాఫ్స్ విధిగా కృష్ణ ఫ్యాన్స్‌కి అందుతుండేవి. శోభన్‌బాబు మాత్రం అతి ముఖ్యమైన ఫ్యాన్స్‌కి ఉత్తరాలతో సరిపెట్టేవాడు. అయినా శోభన్‌బాబు ఫ్యాన్స్ ఉన్నంతలో సినిమా రిలీజ్ సందర్భంలో శక్తికొద్దీ పబ్లిసిటీ ఇచ్చేవారు. దీంతో పిచ్చి ముదిరిపోయింది. కాదు పట్టుదలలు పెరిగిపోయాయి.
కాకినాడలో ఈ పిచ్చి మరీ ఎక్కువ. వారి వారి అభిమాన హీరోలమీద ఈగ వాలనిచ్చేవారు కాదు. స్థానికంగా నేను కాకినాడలో వుండటం వలన అప్పుడప్పుడూ చెన్నై వెళ్లి వస్తుండేవాడ్ని. ఆ రోజుల్లో సినిమా ఫీల్డులో పనిచేస్తున్నవారు ఎవరైనా వూరొస్తే బ్రహ్మరథం పట్టేవారు. చుట్టూ గుమిగూడి సినిమా ముచ్చట్లతో కాలం గడిపేవారు. బఫే డిన్నరు చేసినంత ఆనందంతో రాత్రి రెండో ఆట ప్రారంభమైన తర్వాత.. ఆ కలెక్షన్ల వివరాలు చూసుకొని మరీ ఇళ్లమొహం పట్టేవారు.!
ఆ సమయంలోనే కాకినాడ క్రౌన్ టాకీస్‌లో ‘ముందడుగు’ సినిమా రిలీజయ్యింది. కె బాపయ్య డైరెక్టరు, రామానాయుడు నిర్మాత. ఇప్పట్లా విజయోత్సవ యాత్రలవీ వుండేవి కావుగానీ, ప్రొడ్యూసరూ, డైరెక్టరూ వచ్చి థియేటర్లను సందర్శించి.. నగరంలో సక్సెస్‌ఫుల్‌గా ఆడుతున్న సినిమాల వివరాలూ, కలెక్షన్లు వివరాలూ, వాల్‌పోస్టర్లు నాలుగువారాలకీ, యాభై రోజులకీ, డెబ్బైఅయిదు రోజులకీ, వంద రోజులకీ ఏ పోస్టర్లు వేస్తే బావుంటుంది అని కొంతమంది పేరున్న సినీ గోయెర్స్‌ని సంప్రదించేవాళ్లు. ఆ రోజుల్లో ఫ్లెక్సీలు లేవు. ఎయిట్ షీటరు వాల్‌పోస్టరే పెద్ద క్రేజు. ముందడుగు సినిమా నాలుగు వారాలాడింది. మునిసిపల్ ఆఫీసు బయట కల్పనా థియేటరు పక్కన సాంబమూర్తినగర్ వెళ్లేదారి మొదట్లో ఎయిట్ షీట్ పోస్టరు వేశారు. అందులో హీరో కృష్ణ బొమ్మ పెద్దది శోభన్‌బాబు బొమ్మ చిన్నది. దాంతో శోభన్ ఫ్యాన్స్‌కి చిర్రెత్తుకొచ్చింది. పోస్టరు వుండటానికి వీల్లేదని శోభన్‌బాబు ఫ్యాన్స్ పట్టుపడితే, ముట్టుకుంటే గొడవలు జరుగుతాయని కృష్ణ ఫ్యాన్స్ ఎదురు తిరిగారు. చిలికి చిలికి గాలివానయ్యింది. కాకినాడలో గొడవ జరుగుతుందంటే.. స్టూడెంట్స్ మొత్తం రెండు గ్రూపులుగా విడిపోయి యుద్ధానికి సన్నద్ధమవుతారు. అదే జరిగింది.
కృష్ణ అభిమాని పోస్టర్ దగ్గరకెళ్లి సరుకు మొద్దుల ఆధారంతో పోస్టర్‌కి అడ్డంగా నిలబడ్డాడు. అతగాడ్ని తప్పించి పోస్టర్ చించాలని, వాళ్లపంతం నెరవేరాలని శోభన్‌బాబు ఫ్యాన్స్ పట్టుపట్టారు. పంతాలు పరాకాష్టకి చేరి కొట్టుకోవడం జరిగింది. ఇంత గొడవ జరుగుతున్నా పోస్టర్‌కి సపోర్ట్‌గా వున్న కర్రలన్నీ విరిగిపోయి ఆ డిస్‌ప్లే చేసిన ఫ్రేము కుప్పకూలిపోయింది. పోస్టర్‌కి అడ్డంగానుంచున్న సురేష్ అన్న కుర్రాడి నడుం విరిగిపోయింది. వెంటనే గవర్నమెంట్ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. కాకినాడ టౌను కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తిరుమలశెట్టి వెంకట సుబ్బారావు ఈ విషయాన్ని హీరో కృష్ణ దృష్టికి తీసుకెళ్లాడు. వెంటనే స్పందించి ఆయన చేతికి పదివేల రూపాయలిచ్చి వైద్య ఖర్చులు నిమిత్తం వాడుకోమని చెప్పి, నేను కాకినాడ రావడం జరిగితే ఆ పిల్లాడ్ని పరామర్శిస్తానని, ఇంకెప్పుడూ గొడవలు పడొద్దని బుద్ధి చెప్పి పంపించేశాడు.
శోభన్‌బాబుకీ విషయం తెలిసి చాలా బాధపడ్డాడు. వెంటనే తన ఫ్యాన్స్‌ను పిలిపించుకొని ‘మేం డబ్బులు తీసుకొని నటిస్తాం. మాది నటన. మీరు పైసా తీసుకోకుండా ప్రేమిస్తారు. మీది వాస్తవం! తల్లిదండ్రులు మీ మీద కోటి ఆశలుపెట్టుకొని పెంచుతారు. వారి ఆశలని వమ్ముచేయకండి. ముందు మీ చదువులు, మీ భవిష్యత్తు చూసుకోండి! ఆట విడుపుగా అభిమానించండి. పోట్లాట మనస్తత్వం వున్నవారు శోభన్‌బాబు ఫ్యాన్స్‌గా వుండటానికి అనర్హులు. మీరు సమాజహితమైన కార్యక్రమాలు చెయ్యండి. అదీ మీ డబ్బుతో కాదు, నాకు తోచింది నేసిస్తాను. నేనేమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను. ఇది సత్యం!’ అంటూ అందరికీ తనతో సమానంగా భోజనాలు పెట్టి, పదివేలు క్యాష్, దెబ్బలు తగిలిన వారికి వైద్య ఖర్చులూ, మీ దారి ఖర్చులకు వుంచండి. ఏ విషయం బైటికి తెలియనివ్వకండి’ అని సున్నితంగా చెప్పి పంపించేశాడు. అప్పట్నిండీ ఫ్యాన్స్ ముష్టియుద్ధాలకు దిగడం మానేశారు. విశేషమేవిటంటే, అప్పటి చాలామంది ఫ్యాన్స్ సినీ పరిశ్రమలోనే స్థిరపడ్డారు.

-ఇమంది రామారావు