Others

హామీల అమలులో కేంద్రం నిలువెత్తు దగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ రైల్వే జోన్ ఆంధ్రుల హక్కు. దశాబ్దాల కల. జోన్ ఏర్పాటు కేవలం ఉత్రరాంధ్ర ప్రజల డిమాండ్ మాత్రమే కాదు.. 5 కోట్ల ఆంధ్రుల అభీష్టం. విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం భర్తీలో భాగంగా చేసిన చట్టంలో, ఇచ్చిన హామీలలో ఒకటి రైల్వే జోన్ ఏర్పాటు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014, 13వ షెడ్యూల్‌లో ‘‘్భరతీయ రైల్వే నూతనంగా ఏర్పడుతున్న రాష్ట్రంలో విభజన జరిగిన తేదీ నుంచి 6 నెలలలోపు, కొత్త రైల్వే ఏర్పాటు కొరకు పరిశీలించి సదరు పరిశీలన మేరకు సత్వర నిర్ణయం తీసుకోవలెను’’ అని స్పష్టంగా పేర్కొన్నారు. కానీ విభజన జరిగి ఐదేళ్లవుతున్నా విశాఖ రైల్వేజోన్ అతీగతీ లేదు. ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విభజన అంశాల అమల్లో చట్టాన్ని చట్టుబండలు చేసింది. అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటులో చర్చించి, ఆమోదించిన విభజన చట్టంలోని అంశాలను అమలు చేయకుండా యావత్ ఆంధ్రులను అవమానిస్తోంది.
కేంద్రం దాగుడుమూతలు
ఏపీలోని నాలుగు డివిజన్లు అయిన విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్‌ను కొత్తగా ఏర్పడే విశాఖ రైల్వేజోన్ పరిధిలోకి తీసుకు రావాల్సి వుంది. ఏపీలో 3 డివిజన్లు సికింద్రాబాద్ రైల్వేజోన్‌లో ఉండగా, వాల్తేరు డివిజన్ భువనేశ్వర్ రైల్వే జోన్‌లో ఉంది. ఇక జోన్ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాల పరిశీలన పేరుతో ఏర్పాటైన కమిటీ తమ నివేదిక ఇచ్చినప్పటికీ రైల్వేశాఖ జోన్ ఏర్పాటుపై కేంద్రం ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కేంద్ర రైల్వేమంత్రి, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎంపీలు, పలు భాగస్వామ్య వర్గాల అభిప్రాయాల పేరుతో ఏళ్ల తరబడి తాత్సారం చేస్తున్నారు.
ఎన్నో ప్రయోజనాలు
విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటుచేస్తే అక్కడి నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు నూతన రైలు మార్గాల నిర్మాణం, కొత్త రైళ్ల ప్రారంభానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. విశాఖ, రాజమండ్రి, విజయవాడ, అనంతపురాన్ని కలుపుతూ కొత్త రైళ్లను ప్రారంభించ డానికి మార్గం సుగమం అవుతుంది. మరిన్ని రైల్వే ప్రాజెక్టులు ప్రతిపాదించి నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం భువనేశ్వర్ జోన్‌లో అధిక ఆదాయం వచ్చే వాల్తేరు డివిజన్ నుంచే. ప్రగతిపథంలో దూసుకుపోతున్న వాల్తేరు డివిజన్ ఆదాయంలో దేశంలోనే 2వ స్థానంలో ఉంది. ఏటా మూడు కోట్ల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వందకు పైగా రైళలు వచ్చిపోతున్నాయి. సరుకు రవాణాలోనూ ముందంజలో ఉంది. ఏ డివిజన్‌లో ఆదాయం వచ్చినా దాన్ని తొలుత ఎక్కడ ఉపయోగించాలన్న అంశంపై నిర్ణయాలు తీసుకోవడానికి ప్రతిపాదనలు జోనల్ కేంద్రంగా ఉండే ప్రధాన కార్యాలయంలోనే రూపొందుతాయి. అయితే విశాఖ జోన్ ఆవిర్భవిస్తే పరిపాలనకు ఓ కార్యాలయం ఏర్పాటు అవుతుంది తప్ప పెద్దగా ఆర్థిక ప్రయోజనాలు ఏమీ లేవంటున్న రైల్వే శాఖ వాదన అర్థరహితం. జోన్ వల్ల ప్రాధాన్యం లేదన్నప్పుడు దాన్ని ఏర్పాటు చేయడానికి వెనకడుగు వేయడం ఎందుకో కేంద్ర రైల్వేశాఖ చెప్పాల్సిందే. ఆర్థిక పరిస్థితి బాగా లేదని చెప్పడం, జోన్ ఏర్పాటుచేస్తే అదనపు భారం పడుతుందన్న వారి వాదనలోనూ వాస్తవం లేదు. అధిక ఆదాయం వచ్చే విశాఖ రైల్వే డివిజన్‌నే జోన్‌గా మార్చాలని మనం కోరుతున్నాం. దక్షిణ మధ్య రైల్వే జోన్ నుంచి హుబ్బళ్లి డివిజన్‌ను విడదీసి అక్కడ కొత్త జోన్ ఏర్పాటుచేయడం సమంజసమేనని 2003లో రైల్వేశాఖ చెప్పింది. అదే మాదిరిగా ఇప్పుడు భువనేశ్వర్ జోన్ నుంచి విశాఖ డివిజన్‌ను విడదీసి కొత్త జోన్ ఏర్పాటు చేయమంటే మాత్రం కుదరదని కేంద్రం కుంటిసాకులు చెప్పడం వివక్ష కాకమరేంటి?
రాష్ట్రం మొత్తాన్ని ఒకే జోన్ పరిధిలోకి తెస్తే తీరంలోని పోర్టులన్నీ దానికిందకే వస్తాయి. వీటి ద్వారా జరిగే రవాణా మొత్తం జోన్‌కే వస్తుంది. ఇతర జోన్‌ల వారు ఈ పోర్టుల నుంచి సరకు రవాణా చేసుకుంటే చెల్లించే రుసుములు కూడా ఈ జోన్‌కే చెందుతాయి. అలాగే రైల్వే జోన్ ఏర్పాటుకు కావాల్సిన అన్ని వౌలిక వసతులు విశాఖలో ఉన్నాయి. ఈస్ట్ రైల్వేజోన్‌లో అత్యధిక ఆదాయం ప్రస్తుతం వాల్తేర్ డివిజన్ నుంచే వస్తుంది. విశాఖలో అన్నిరకాల విద్య, వైద్య, క్రీడా వసతులు, వౌలిక సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ రెండు భారీ ఓడరేవులు ఉండటం సహజసిద్ధంగా కలిసివచ్చే అంశం. విశాఖ రైల్వే స్టేషన్ వద్ద 800 ఎకరాల భూమి జోన్ ఏర్పాటుకు అందుబాటులో ఉంది. వాల్తేర్ డివిజన్‌కు అతిపెద్ద లోకో షెడ్, అద్భుతమైన కోచ్ మెయింటెనెన్స్ డిపో ఉన్నాయి. తూర్పు నావికాదళ కేంద్రం, ఎన్‌ఎస్‌టిఎల్, బిహెచ్‌ఈఎల్, బిఏఆర్‌సి, హెచ్‌పిసిఎల్ రిఫైనరీ, హిందుజా పవర్ ప్రాజెక్ట్ తదితర ప్రముఖ సంస్థలతో విశాఖపట్నం ఆసియాలోనే శరవేగంతో వృద్ధిచెందుతున్న నగరంగా ఉంది.
కానరాని హేతుబద్ధత
రైల్వేకి సంబంధించిన కీలక నిర్ణయాలు రాజకీయ పరమైన ఒత్తిళ్లతోనే సాధ్యపడతాయనడానికి గతంలో ఏర్పాటైన జోన్లు, డివిజనే్ల ఉదాహరణ. గతంలో రైల్వే మంత్రులుగా పనిచేసిన పలువురు నేతలు తమ సొంత ప్రాంతాలకు రైల్వే ప్రాజెక్టులను ఇష్టారీతిగా మంజూరు చేసుకున్నారు. రాం విలాస్ పాశ్వాన్ రైల్వే మంత్రిగా ఉండగా తన సొంత నియోజకవర్గం హాజీపూర్ కేంద్రంగా తూర్పు మధ్య రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నారు. మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు కోల్‌కతా మెట్రోకి ఒక జోన్ హోదా ఇప్పించారు. కర్ణాటక నేతలు మల్లిఖార్జున ఖర్గే, జాఫర్ షరీఫ్ లు రైల్వేసారధులుగా ఉన్న సమయంలో సొంత రాష్ట్రానికి మేలు చేసుకున్నారు. రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నా రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టుల విషయంలో కలిసికట్టుగా పోరాడే తమిళనాడుకూ రైల్వే పరంగా చాలానే ప్రయోజనాలు చేకూరాయి. తీరా మన రాష్ట్రానికి రైల్వే జోన్ అంశం తెరపైకి వచ్చేప్పటికి కేంద్రం కొత్త పల్లవి అందుకుంది. దేశంలో పేరొందిన విఐపీలు తమ ప్రాంతానికీ జోన్ కావాలి, డివిజన్ కావాలని అడుగుతున్నారంటూ దానికి విశాఖ రైల్వే జోన్ ను ముడిపెట్టి రైల్వేశాఖ కాలం వెళ్లదీస్తూ వస్తోంది. 2002-2003లో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి నేతృత్వంలోని ప్రభుత్వం 7 కొత్త రైల్వేజోన్లను ప్రకటిం చింది. మరి అటల్‌జీ ఇవ్వగాలేనిది మోదీకి వచ్చిన అడ్డంకులేంటో ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాలి.
ఇదెక్కడి అన్యాయం?
కేంద్రం ఆంధ్రప్రదేశ్ పై సవతి తల్లి ప్రేమ చూపుతోంది. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి అన్నీ ఇచ్చేస్తామని చెబుతూనే ఉన్నారు. కానీ వాస్తవంలో ఏవీ కార్యరూపం దాల్చలేదు. రైల్వే జోన్ ఏర్పాటు డిమాండ్ తో ఇప్పటికే స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ జోన్ ఏర్పాటు చేయమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి వినతులు అందజేశారు. రైల్వేశాఖకు ఎన్నో లేఖలు రాశారు. జోన్ కోసం తెలుగుదేశం ఎంపీలు పార్లమెంటు లోపలా బయటా రాజీలేని పోరాటం చేస్తూనే ఉన్నారు. జోన్ సాధన ఉద్యమం ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశమైనా కేంద్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన మొండివైఖరి విడనాడి ఏపీకి రైల్వే జోన్ ప్రకటించాలి... అని ఆంధ్ర ప్రజలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు.

- జి. మురళి