Others

లేత మనసులు (ఫ్లాష్‌బ్యాక్ @ 50)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథ: జీవర్ సీతారామన్
మాటలు: డివి నరసరాజు
సంగీతం: ఎంఎస్ విశ్వనాథం
ఎడిటింగ్: పంజాబి
కళ: ఎకె శేఖర్
నృత్యం: వెంపటి సత్యం, తంగప్పన్
ఫొటోగ్రఫీ: వినె్సంట్, ఎస్ సుందరం
నిర్మాత: ఎవి మొయ్యప్పన్
దర్శకత్వం: కృష్ణన్- పంజు

ప్రముఖ నిర్మాణ సంస్థ ఎవిఎం వారు 1965లో తమిళంలో నిర్మించిన చిత్రం ‘కుళందైయుమ్ దైవముమ్’. జమున, జయశంకర్, కుట్టిపద్మిని, నాగేష్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఆధారం బ్రిటీష్ కామెడీ మూవీ ‘ట్వైస్ అపాన్ ఎ టైమ్’, డిస్నీ సంస్థ రూపొందించిన ‘పేరెంట్ ట్రాప్’ చిత్రాలు. ఈ రెండు చిత్రాలు జర్మన్ నవల ‘లొట్టి అండ్ లిసా’ ఆధారంగా నిర్మించారు. 1965లోని తమిళ చిత్రం ఆధారంగా ఎవిఎం వారు తెలుగులో రూపొందించిన చిత్రం ‘లేత మనసులు’. 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 1966లో విడుదలైంది. తమిళంలో ప్రముఖ దర్శకద్వయం ‘కృష్ణన్- పంజు’ తొలిసారి తెలుగులో ‘లేత మనసులు’ చిత్రానికి దర్శకత్వం వహించారు.
మద్రాసులో కనకదుర్గా ట్రాన్స్‌పోర్టు కంపెనీ యజమాని శంభులింగం (రేలంగి). అతని భార్య కనకదుర్గ (జి.వరలక్ష్మి). ఆ దంపతుల కుమార్తె సత్యభామ (జమున). అదే కాలేజీలో చదువుతున్న చంద్రశేఖర్ (హరనాథ్) అన్నింటా ఫస్ట్‌గా ఉంటాడు. అతని తాతగారు రావుబహద్దుర్ రంగనాయకుల వల్ల సాయంపొంది గొప్పవాడైన శంభులింగం, చంద్రశేఖర్ చదువుకు సాయం చేస్తుంటాడు. ఆ సంగతి శేఖర్‌కు తరువాత తెలుస్తుంది. అల్లరితో మొదలైన భామా, శేఖర్‌ల పరిచయం ప్రేమగా మారి పెళ్ళికి దారితీస్తుంది. శేఖర్ పేదవాడని తొలుత సంశయించిన కనకదుర్గమ్మ, అతని తెలివికి మెచ్చి అతన్ని ఆఫీసు మేనేజర్‌గా నియమిస్తుంది. శేఖర్, భామలకు కవల పిల్లలు లల్లీ, పప్పీ (లలిత, పద్మిని)లు జన్మిస్తారు. అత్తగారి అజమాయిషీకి ఇబ్బందిపడుతున్న శేఖర్ కంపెనీ రజతోత్సవాలు సందర్భంగా జరిగిన అవమానం కారణంగా భామతో కలిసి ఇల్లు వదిలి వెళ్ళాలనుకుంటాడు. అత్తగారు అడ్డుపడటంతో, చిన్న కూతురు పప్పీతో ఇల్లువదిలి రంగూన్ వెళ్ళి లక్షాధికారిగా మారి ఏడేళ్ల తరువాత తిరిగి మద్రాసు వస్తాడు. శేఖర్ జాడ తెలియక భామ దిగులుతో ఉంటుంది. పప్పీ, లల్లీ చదివే స్కూల్లోనే జాయిన్ కావటం, ఒక పిక్‌నిక్ సందర్భంగా వారిరువురూ అక్కాచెల్లెళ్ళని తెలుసుకొని, ఒకరి స్థానంలోకి, మరొకరు వెళ్తారు. శేఖర్ ఇంట్లో పప్పీకి డాన్స్ టీచర్‌గా ఉంటుంది నిర్మల (గీతాంజలి). ఆమె తల్లి జలజమ్మ (తిలకం) శేఖర్‌ను మోసం చేసి నిర్మలకు శేఖర్‌కు పెళ్ళి చేయాలని అనుకుంటుంది. తల్లిని, తండ్రిని కలపాలని ప్రయత్నిస్తుంటారు పిల్లలు. విషయం తెలిసి శేఖర్ ఇంటికి వచ్చిన భామను అతను తిరస్కరిస్తాడు. ఇదే సమయంలో పిల్లలను తిరపతి పంపి చంపించాలనుకున్న జలజమ్మ కుట్ర శేఖర్‌కు తెలుస్తుంది. భామతో కలిసి తిరపతి వెళ్ళటం.. తల్లీతండ్రి కలిసుండాలని వెంకటేశ్వరుని ప్రార్థించాలని పప్పీ, లల్లీ కొండ ఎక్కటం.. వారిని చంపబోయిన విలన్ జగ్గు (జగ్గారావు) పాము కాటుతో మరణించటం.. కిందకి దిగిరమ్మని కోరిన తలిదండ్రులను పిల్లలు -ఇరువురూ కలిసి ఉంటామని శ్రీ వెంకటేశ్వరునిపై ప్రమాణం చేయించటం, అందరూ కలిసి స్వామిని పూజించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
చిత్రంలో శేఖర్ స్నేహితుడు సుందరంగా పద్మనాభం, శేఖర్ సాయంతో పెళ్ళాడిన దంపతులుగా రమేష్, మణిమాల నటించారు. తిరపతి కొండలు నేపథ్యంగా చూపటం, తల్లీపిల్లల బొమ్మలపై టైటిల్స్ రావటం, చిత్రం చివరలో కలర్‌లో తిరువీధులు, స్వామిని కుటుంబాన్ని చూపటం జరిగింది. ఈ చిత్రంలో హీరో శేఖర్‌గా హరనాథ్ -్భమను ఆటపట్టించటంలో చురుకు, ఉత్సాహం ప్రదర్శించి ఆకట్టుకున్నాడు. భర్తగా, ప్రియునిగా నిజాయితి, బాధ్యత వహించటం, అత్తగారి ఆధిపత్యానికి తల ఒంచక ఆత్మగౌరవాన్ని ప్రదర్శించే పాత్రలో ఒదిగిపోయాడు. కూతురు పప్పీపట్ల వాత్సల్యం గల తండ్రిగా ఎంతో పరిపక్వత, పరిణితితో నటించి మెప్పించారు.
సత్యభామ పాత్ర పోషించిన జమున -కాలేజీ యువతిగా తెగువ, డాంబికాన్ని ప్రదర్శించి మెప్పించింది. భర్తకు తల్లికి మధ్య నలిగిన ఇల్లాలిగా వేదన, క్షోభ, పిల్లలపట్ల మమకారం, ఎంతో నిండుతనంతో కూడిన నటనను ప్రదర్శించి ఆకట్టుకుంది. ఆధిపత్యంగల స్ర్తిగా దర్పం, డాబూ చూపే పాత్రలో జి వరలక్ష్మి, భార్యా విధేయుడైన భర్తగా రేలంగి తమ పాత్రలకు న్యాయం చేశారు.
దర్శకులు కృష్ణన్-పంజు సన్నివేశాలను అర్ధవంతంగా తీర్చిదిద్దారు. లల్లీ, పప్పీల చేత అమ్మమ్మను, తండ్రిని తెలివైన ప్రశ్నలు అడిగించటం, అమ్మమ్మ కారు ఎక్కనన్న భామను లల్లీ తెలివిగా కారుఎక్కించి, ఆ సంగతి గుర్తుచేయటం వంటి చిన్న విషయాలను ప్రేక్షకులకు అర్థమయ్యేలా చిత్రీకరించారు. తమిళ టైటిల్ అర్థం పిల్లలూ- దేముడూ మాటలు ఉపయోగించి వ్రాయించిన గీతం ‘పిల్లలూ దేవుడు చల్లనివారే’. క్లాస్‌రూం క్యాంప్‌ఫైర్‌లో చిత్రీకరించిన ఈ గీతానికి సాహిత్యాన్ని ఆరుద్ర అర్ధవంతమైన ప్రయోగంతో అందించారు. వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మూయును/ మనిషి తెలివి అనే సూర్యుణ్ణి కోపం మూయును’ (గానం- పి సుశీల, రచన- ఆరుద్ర). ఈ చిత్రంలోని హిట్ సాంగ్ -అందాల ఓ చిలుకా అందుకో నా లేఖ (పిబి శ్రీనివాస్, పి సుశీల). తొలుత ఆనందంగా, ఆహ్లాదకరంగా, తరువాత విషాదంగా చిత్రీకరణలో వైవిధ్యాన్ని చూపించారు. తల్లితండ్రుల ఎడబాటును ప్రస్తావిస్తూ లల్లీపై చిత్రీకరించిన గీతం -కోడి ఒక కోనలో’. ఆవుదూడలు, పక్కింటివారిని, కోడి పిల్లలను చూపుతూ పాటను చిత్రీకరించారు. గీతాంజలిపై రెండు నృత్య గీతాలు, హరనాథ్, జమున విద్యార్థులపై టీజింగ్ సాంగ్, హరనాథ్, జమునల హనీమూన్ గీతం -ఈ పువ్వులలో ఒక చల్లదనం (పిబి శ్రీనివాస్, సుశీల) అలరించేలా రూపొందించారు. ‘కోడి ఒక కోనలో’ ‘పిల్లలూ దేవుడు చల్లనివారే’ గీతాలను ఆరుద్ర రచిస్తే, మిగిలిన గీతాలను దాశరథి అందించారు. ‘లేత మనసులు’ చిత్రంలో లల్లీ, పప్పీలుగా కుట్టిపద్మిని ఎంతో పరిణితితో కూడిన నటనతో అలరించేలా నటించటం విశేషం. ఈ చిత్రాన్ని హిందీలో ‘దో కలియాన్’ (1967)గా మాలాసిన్హా, బిశ్వజిత్ జంటగా నిర్మించారు. కుట్టిపద్మిని పోషించిన పాత్రను బేబీ సోనియా (ఎదిగిన తరువాత హీరోయిన్ నీతూ సింగ్) పోషించింది. ఈ చిత్రాన్ని మలయాళంలో ‘సేతుబంధనం’గా, కన్నడంలో ‘మక్కల్ భాగ్య’గా నిర్మించారు. ఓ చక్కని కుటుంబ నేపథ్యంతో, తల్లీపిల్లలు, తండ్రీ కూతుళ్ళ అనుబంధంతో ఆకట్టుకునేలా రూపొందించబడిన చిత్రంగా మహిళా ప్రేక్షకుల ఆదరం పొందింది లేత మనసులు.

-సివిఆర్ మాణిక్యేశ్వరి