AADIVAVRAM - Others

వంకాయ కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వంకాయ వంటి కూరయు
పంకజ ముఖి సీత వంటి భార్యామణియున్
శంకరుని వంటి దైవము
లంకాధిపు వైరి వంటి రాజున్ కలడే
అంటూ ఒక కవి వంకాయని కొనియాడేడు కదా. పేర్ల మీద పిచ్చి ఉన్న నాకు వంకాయకి ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలనే కుతూహలం రావటం సహజం.
వంకరగా ఉన్న కాయని వంకర కాయ లేదా వంకాయ అనొచ్చు. కాని మెట్ట వంకాయలు గుండ్రంగానో, గుడ్డు ఆకారంలోనో ఉంటాయి. నీటివంకాయలైతే కోలగా ఉంటాయి; కాని వంకర టింకరగా ఉన్న వంకాయలు నాకు తారసపడలేదు.
వంగపండు, వంగనార వంటి మాటలని బట్టి వంకాయ అంటే వంగ కాయ అయి ఉండొచ్చు. అంటే, వంగ దేశపు కాయ కాబోలు. బంగాళా దుంపలకీ, బెంగాలుకీ మధ్య బాదరాయణ సంబంధమే (బంగాళా దుంపలు దక్షిణ అమెరికా ఖండపు పంట) కాని, వంకాయకీ, వంగ దేశానికీ దగ్గర సంబంధమే ఉందనవచ్చు.
వంకాయని బెంగాలీలో ‘బేగున్’ అంటారుట. దీన్ని ‘బే గుణ్’ అని విడగొడితే ‘గుణం లేనిది’ అనే అర్థం వస్తుంది. ఇక్కడ ‘గుణం’ అంటే ‘నీతి, నియమం, శీలం, సత్ప్రవర్తన’ వంటి అర్థాలు కాకుండా ఒక ప్రత్యేకమైన లక్షణం అని అర్థం చెప్పుకోవచ్చు. కందకి దురద వేసే గుణం ఉంది. కాకర కాయకి చేదు అనే గుణం ఉంది. కనరు పట్టిన వంకాయలు చేదుగా ఉంటాయి కాని ఆ చేదు వంకాయ గుణం కాదు. తనకి స్వగుణం లేదు కనుక మనం ఎలా వంచితే అలా వంగుతుంది. ఎలా వండితే అలా మొగ్గుతుంది. అందుకే వంకాయ - మెంతి కారం, వంకాయ - కొత్తిమీర కారం, వంకాయ - ఉల్లికారం, వంకాయ వేపుడు, వంకాయ బజ్జీలు పచ్చడి (వంకాయని కాల్చి చేసే పచ్చడి), హైదరాబాదీ వంకాయ కూర, ఇలా ఎనె్నన్ని విధాలుగానో వంకాయని వాడుకోవచ్చు.
ఈ ‘బేగున్’ హిందీలో బైంగన్ అయింది.
హిందీ కంటె పాతది సంస్కృతం కదా. సంస్కృతంలో వంకాయని ‘వృంతాకం’ అనీ, ‘పీతఫలం’ అనీ అంటారు. వృంతం అంటే తొడిమ కనుక వృంతాకం అంటే తొడిమ ఉన్నదనే అర్థం వచ్చింది. ఎందుకైనా మంచిదని నిఘంటువులో చూస్తే వంకాయని ‘వార్తాకీ’ అంటారని ఉంది. ఏది ఏమైతేనేం, ఈ మాట ‘వతింగన్’ అయి, దరిమిలా పారశీక భాషలో ‘బదింగన్’ అయింది. పారశీకం నుండి అరబ్బీలోకి వెళ్లి అక్కడ ‘ఆల్ బదైన్జన్’ అయింది. అరబ్బీలో ‘ఆల్’ అనే ప్రత్యయం మన తెలుగులో డు, ము, వు,లు లాంటిది; తరచు కనిపిస్తూ ఉంటుంది. అరబ్బీ నుండి కేటలీనా వెళ్లి అక్కడ ‘ఆల్బర్జీనా’ అయింది. అక్కడ నుండి ఫ్రెంచి భాషలోకి వెళ్లి ‘ఔబర్జీన్’ అయింది. ఈ ఫ్రెంచి మాట ఆఫ్రికాలో ఉన్న ఐబీరియా వెళ్లి అక్కడ ‘బెరింజెలా’ అయింది. బుడతగీచులు ఈ మాటని బ్రింజెల్లా చేస్తే, బ్రిటిష్ వాళ్లు ‘బ్రింజాల్’ చేసి ఇండియా తీసుకొచ్చేరు. వంగ కాయ కాస్తా ప్రపంచం అంత తిరిగి పేరు మార్చుకుని ఇంటికొచ్చింది.
మన తెలుగు వాడికి వంకాయని వంకాయ అనటానికి సిగ్గు; బ్రింజాల్ అనే ఇంగ్లీషు మాటనే వాడతానంటాడు. బ్రిటీష్ వాడు మాత్రం తక్కువ తిన్నాడా? వాడికి బ్రింజాల్ ని బ్రింజాల్ అనటానికి సిగ్గు; వాడు ఫ్రెంచి మాట ‘అబర్జీన్’ అనే అంటానంటాడు (‘అబర్జీన్’ అంటే ముదురు బక్కలిపండు రంగు అని అర్థం) అందుకని లండన్‌లో బ్రింజాల్ అంటే ఎవ్వరికీ అర్థంకాదు; ఫ్రెంచి మాట వాడాల్సిందే!
తెలుగు వాడు మాత్రం తక్కువ తిన్నాడా? బ్రిటిష్ వాడి దగ్గర శిష్యరికం చేసి ఉన్నాడేమో ‘అమెరికాలో ఉన్న మీ అగ్రవర్ణాలు ఇంగ్లీషు నేర్చేసుకుని మంచి మంచి జాబ్స్ కొట్టేసి మనీ చేసేసుకుంటున్నారు. ఇండియాలో ఉన్న మాకు తెలుగు నేర్పేసి మమ్మల్ని దళితలుగా నొక్కేద్దామని చూస్తున్నారు. కనుక మేం ఛస్తే తెలుగు నేర్చుకోం. ఇంగ్లీషులోనే ‘బ్రింజాల్’ అంటూ శంకరాభరణం సినిమాలో లాల్చీ మేష్టారు లాంటి వ్యక్తి ఒకడు దబాయించేడు.
కాని ఈ అమెరికావాడు ఉన్నాడే వీడు నా పాలిట ఒక తంటసుడు; అంటే తంటసం తెచ్చిపెట్టినవాడు. ఇంగ్లీషు మరిగిన తెలుగు వాడికి తంటసం అంటే ఏమిటో తెలియకపోవచ్చు. తంటసం అంటే ముల్లు. ఈ ముల్లు ఒక ప్రత్యేకమైన శరీర భాగంలో గుచ్చుకుంటే కూర్చోలేం, నిలబడలేం. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, ఈ అమెరికావాడు, ఈ తంటసుడు, వంకాయ పేరులోని పూర్వ చరిత్రని పూర్తిగా విస్మరించి ఒక కొత్త పేరు పెట్టేడు. అమెరికాలో వంకాయని ‘ఎగ్‌ప్లేంట్’ అంటారు. దీన్ని తెలుగులో ‘గుడ్డు చెట్టు’ అనో, ‘గుడ్డు మొక్క’ అనో గాడిద గుడ్డు అనో అనుకోవచ్చు. నేను అమెరికా వెళ్లిన కొత్తలో ‘ఎగ్‌ప్లేంట్’ అన్న మాట విని ఈ అమెరికా వాళ్లు గుడ్లని చెట్ల మీద కాయింపిస్తారు కాబోలని అనుకునేవాడిని. వీళ్లంటే నాకంత గురి. నిఝం! ‘హాట్ డాగ్’ అన్న మాట విని వీళ్లు కుక్కల్ని కాల్చుకుని, కారం జల్లుకుని తింటారు కాబోలు అని కూడ అనుకునేవాడిని.
ఇంతకీ అమెరికా వాడు ‘ఎగ్‌ప్లేంట్’ అని పేరు పెట్టటానికి కారణం లేకపోలేదు. అప్పట్లో అమెరికాలో ఉన్న వంగ మొక్కలకి గుండ్రంగా, తెల్లగా, కోడిగుడ్డు ఆకారంలో, అదే పరిమాణంలో ఉన్న కాయలు కాసేవి. చూట్టానికి అచ్చం గుడ్లలా ఉంటాయి. నేను అమెరికా వచ్చిన కొత్తలో ఈ రకం కాయలు చూసేవాడిని. ఈ రోజుల్లో కనిపించటం లేదు. (ఈ రోజుల్లో కూరగాయలు కొనే బాధ్యత నాది కాకపోవడమే దీనికి కారణం) వీటిని చూసి మొక్కలు గుడ్లు పెడుతున్నాయనుకొని ఆ మొక్కలని ‘ఎగ్‌ప్లేంట్’ అని పిలిచేవారు. వాటికి కాసిన కాయలకీ అదే పేరు స్థిరపడిపోయింది.
నాకు ఆశ్చర్యం వేసే విషయం ఏమిటంటే మన తెలుగు వాడు, ఈ అమెరికా వాడిని చూసి నిక్షేపంలాంటి బ్రింజాల్ అన్న టెలుగు పేరుని మార్చేసి ‘గుడ్డు మొక్క’ అనకుండా ఇంకా బ్రింజాల్ అనే అంటున్నాడేమిటా అని!

- వేమూరి వెంకటేశ్వరరావు