AADIVAVRAM - Others

ప్రాచీన శిల్పకళకు ప్రతిరూపం ధర్మపురి శివాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత దేశ ప్రాచీన సంస్కృతీ సభ్యతలకు నిలయంగా, సనాతన సాంప్రదాయాలకు పుట్టినిల్లుగా, వేదవేదాంగ, శాస్త్రాగమ, నృత్య గీత నాట్యాది సకల కళలయందు నిష్ణాతులైన ధార్మిక కార్యాచరణాసక్తులైన ప్రజానీకంతో, మరెచ్చటా కానరానన్ని ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్న పలు దేవాలయాల సముదాయం కలిగి, రాష్ట్రంలో సుప్రసిద్ధ ప్రాచీన పవిత్ర గోదావరీ తీరస్థ తీర్థంగా, పుణ్య క్షేత్రంగా మిగుల ప్రాచుర్యం పొందింది నాటి అవిభక్త కరీంనగర్, నేటి నూతన జగిత్యాల జిల్లాలోని ధర్మపురి క్షేత్రం. శ్రీలక్ష్మీనరసింహ, శ్రీరామలింగేశ్వరస్వాముల దేవాలయాలు, మసీదూ పక్కపక్కనే కలిగి అనాదిగా వైష్ణవ, శైవ, ముస్లిం మత సామరస్యానికి సాక్షీభూతంగా నిలిచియుందీ క్షేత్రరాజం. గంభీర గౌతమీనదీ తీరాన వెలసి, అలనాటి శిల్పకళా చాతుర్యానికి ప్రతిబింబమై పౌరాణిక, ఐతిహాసిక, చారిత్రిక ప్రాధాన్యతను సంతరించుకుని దక్షిణ కాశిగా పేరెన్నికగనుటకు మూలకారణమైనది ఈక్షేత్రంలోని శ్రీరామచంద్ర స్థాపిత శ్రీరామలింగేశ్వరాలయం. భృగు మహర్షి త్రిమూర్తులను పరీక్షించిన నేపథ్యంలో, కైలాసమేగిన సందర్భంలో, నిత్యానందంలో మునిగి తేలుతూ ఆ మహర్షి రాకను గమనింపని పార్వతీ పరమేశ్వరులను గాంచిన భృగు మహర్షి, శివుడు లింగరూపులోఉంటూ, ఎవరిచేతా పూజింపబడకుండునట్లు శాపమిచ్చెనని పురాణాలు విశదీకరిస్తున్నాయి. తన శాప విముక్తికై పరమ శివుడు, మహా విష్ణువును గురించి ఘోర తపస్సుచేయగా రామావతారంలో, ధర్మపురి క్షేత్రంలో స్వయంగా తాను లింగాన్ని ప్రతిష్ఠించి, పూజించి శాపవిమోచనం కలిగించగలనని మహా విష్ణువు వరమిచ్చినట్లు స్థానిక పురాణాలు స్పష్టపరుస్తున్నాయి. రామావతారంలో దశరథుని ఆజ్ఞానుసారం వనవాస దీక్షలో, దండకారణ్యంలో సంచరిస్తూ, ధర్మపురి క్షేత్రానికి ఏతెంచిన శ్రీరాముడు అలనాటికే వెలసియున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఈశాన్యాన సైకత (ఇసుక) లింగాన్ని ప్రతిష్ఠ చేసినట్లు, శ్రీరామునిచే స్థాపించ బడినందున శ్రీరామలింగేశ్వరుడని నామాంకితుడైనట్లు స్థల పురాణం స్పష్టం చేస్తున్నది. ఆరవ శతాబ్ధంలో స్థాపించబడి, ఎనిమిదవ శతాబ్దాంతం వరకూ వర్థిల్లిన చాళుక్య రాజుల ప్రాభవంలో పునర్మించబడిన రామేశ్వరాలయంలోని గణేశ విగ్రహములు అలనాటి శిల్పకళకు అద్దం పడుతున్నాయి. క్రీ.శ.973నుండి 1140 వరకు పాలించిన కల్యాణి చాళుక్యుల వంశానికి చెందిన విక్రమార్క బిరుదాంకితుడగు ఆరవ విక్రముని (1076-1126) నాటి శిలాశాసనం ఈఆలయంలో ఉంది. ఇందులో ఈ చాళుక్యరాజు పరమేశ్వర, రణరంగభైరవ, మార్వల భైరవ, ఆయ్తగంధ వారణ, విక్రమాదిత్య బిరుదులతో ప్రశంసింప బడినాడు. శాలివాహన శకం 1168 పరాభవ నామ సంవత్సర కాలం నాటి కాకతి గణపతి దేవుని శిలాశాసనం రామేశ్వరాలయంలో పూర్వపు చాళుక్య స్థంభంపైనే చెక్కబడి ఉంది. గణపతి దేవుడు ఇచటి రామేశ్వర, చండికల అంగరంగ వైభోగములకు గావించిన కొన్ని దానములు శాసనములలో పేర్కొనబడినవి. చాళుక్య శైలిలో బొజ్జ ఎత్తుగానుండి, సహజమైన ఏనుగు తలను కలిగి, మానవరూపంలేని గణపతి విగ్రహం ఆలయ సముదాయంలోనుంది. శివాలయ శిఖర నిర్మాణంలో చాళుక్య శైలి ఉంది. శిఖరం చాపాకృతిని పోలి, కిందనుండి పైకి ఎక్కుపెట్టిన విల్లులా ఉంది. శిఖర సౌందర్యానికి పైన అమలకములు వృత్తకారంలో చుట్టూరా కలిగి ఆపైన భాండాకృతి అంతకుపైన చిన్న కలశం, తూర్పున శుకనాసం ఉన్నాయి. శుకనాసం చిలుక ముక్కులాగా ముందుకు పొడుచుకు వచ్చిన గూడు. శిఖర నిర్మాణం ఉత్కళ శైలిలో, లింగరాజ స్వామి ఆలయం (్భవనేశ్వర్) దేవాలయ శిఖరాకృతిని పోలి ఉంది. ప్రవేశ మంటపం తర్వాత దూరంగాగల ఆలయంలో మొదట ముఖ మంటపం ఉంది. మధ్యన గల రంగశిల ప్రాచీనంగా నర్తకీమణుల వేదిక, నేడది వల్లుబండ. తర్వాత చీకటిగానుండే అంతరాళము. ఆపైన గర్భగృహము, అందు శ్రీరామచంద్ర స్థాపిత సైకత (ఇసుక) లింగం. ముఖ మంటపము, ప్రవేశ మంటపము, గర్భగృహములు దాటితే శివుని దర్శనం. ఆలయ ప్రాంగణంలో మూడు ద్వారాలకు అభిముఖంగా మూడు నల్లరాతితో నిర్మించిన ఆభరణాలు అధికంగాగల, పీఠంపై ఉబ్బెత్తు హారాలు గలిగి, కాకతీయ శివాలయాలలోవలె అధ్భుతమైన శిలాకృతులు, జిలుగు నగిషీలు, మెడలో గంటలు, మువ్వల పట్టి, మెడ పట్టెడలు, గంగడోలు, వంపు తిరిగిన మెడ, వృహణాలతో నందులు ఉన్నాయి. పైకప్పుపై అపురూపాలైన ఏకముఖ ద్విదేహ నందులు నాలుగు మూలల ఉండేవి. సాలహార పునర్నిర్మాణ సమయంలో కూల్చి వేయడం జరిగింది. దేవాలయం కప్పుకన్నా ఎత్తుగా, నిటారుగా 15అడుగుల ఎత్తు ఉన్న ధ్వజస్థంభం (విజయ స్థంభం) ఉంది. శివాలయంలో ఈశాన్య భాగాన గణపతికి ప్రత్యేక గుడి ఉంది. ఇది కూర్చోని ఉన్న భారీ విగ్రహం. చాళుక్యుల కాలంనాటి విగ్రహానికి కుడి చేతులో గద ఉంది, నాగభంధం కలదు. ఎడమ చేతిలో గండ్రగొడ్డలి వంటి ఆయుధం, ఎడమ కింది చేతిలో మోదకాలు (ఉండ్రాళ్ళు) ఉన్నాయి. చెవులు చేటలవలె విశాలంగా ఉన్నాయి. శివాలయంలో రెండు వీర గల్లుల శిల్పాలున్నాయి. పదాతిదళపు వీరుడు శతృవులను చీల్చిచెండాడుతున్న దృశ్యం. ప్రాంగణం బయట నాగిని విగ్రహముంది. పైన నాగుల ఐదు పడగలతోకింద స్ర్తిమూర్తి. చివర తోక, కాళ్ళు లేకుండా ఉంది. ఎనిమిది చేతుల మహిషాసుర మర్ధిని విగ్రహం ఉంది. అలాగే అపురూపాలైన బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ లేదా వరాహ పురాణంలో చెప్పబడిన యోగీశ్వరి ఆదిగా సప్తమాతృకల విగ్రహాలున్నాయి. ఒకే పీఠంతో చతురస్రాకార శిల్పమిది. ఇరు పార్శ్వాలలో గణపతి వీర భద్రుని విగ్రహాలు ఉన్నాయి. ప్రధాన దైవత లింగంకాక ముఖ మంటపంలో వాయవ్యాన కాశీ విశ్వనాథుడనే పేరుతో పూజలందుకునే అందమైన నాలుగడుగుల ఎత్తుగల లింగం ఉంది. దండకారణ్యంలో సంచరిస్తూ, ధర్మపురి గోదావరిలో స్నానమాచరించి, శివుని పూజించేందుకు, హనుమంతుని లింగం తెమ్మని కాశీకి పంపగా, ప్రతిష్ఠించే సమయానికి ఆంజనేయుడు రాని స్థితిలో, సైకత లింగ ప్రతిష్ఠ గావించారని, ఆలస్యంగా ఏతెంచిన హనుమ సేవలు వ్యర్థం కాకుండా, హనుమల్లింగాన్ని ప్రతిష్ఠచేసి, ఆ లింగాన్ని పూజింజాకే, గర్భాలయంలోకి వెళ్ళేలా నియమం శ్రీరాముడు ఏర్పరచారని స్థల పురాణం స్పష్ట పరుస్తున్నది. ఆలయంలో 13శతాబ్దికాలంనాటి చండిక విగ్రహం కలదు. ఈవిగ్రహంలో అమ్మవారు చక్రస్తని, త్రిశూల, ఖడ్గహస్త, మకుట ధారిణి, చతుర్భుజ, శూల ధారిణిగా ఉంది. కాశీ విశ్వనాథుని పక్కన ప్రాచీన పార్వతీదేవి శిల్పం, మహిషాసుర మర్ధిని, షణ్ముఖుడు (కుమార స్వామి), ఉమా మహేశ్వరులు విడివిడిగా నల్ల శిలపై మలచబడి ఉన్నాయి. ఆలయంలో విక్రమాదిత్యుని, గణపతిదేవుని, ప్రధాన ద్వార కడప ముందర, బంకుళ్ళలో, దక్షిణ ప్రవేశ ద్వార స్థంభం, నైరుతి దిశలో ప్రహారీగోడ బాహ్యాది ఆరు శాసనాలున్నాయి. చుట్టూ రథం తిరిగేంత ప్రాంగణం, 10 అడుగుల ప్రహారీ కలిగి ఉన్నదీ ఆలయం. చారిత్రిక నేపథ్యం ప్రకారం, క్రీ.శ.1309లో ఢిల్లీనేలిన అల్లాఉద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ నాయబ్ కాపూర్, ఇందూరు (నిజామాబాద్ ) మీదుగా ధర్మపురి మార్గంలో కాకతీయులపైకి దండెత్తివెళ్ళిన సమయంలో క్షేత్రంలోని రామేశ్వర, నృసింహాలయాలు ధ్వంసం చేయబడినవి. క్రీ.శ.1332-1367 మధ్యకాలంలో తెలంగాణాలోని వెలమ వీరుల సాయంతో, ముస్లింలనుండి దాస్య విముక్తి కలిగించిన ముసునూరి కాపయామాత్యుని పాలనా కాలంలో, పరమహంస పరివ్రాజకాచార్య నారాయణాశ్రమ స్వామి ఉభయ దేవాలయాలకు చేయూతనిచ్చి తిరిగి అర్చనాదులకై కట్టుదిట్టం చేశారు. అబుల్ హసన్ తానాషా(1674-1687) మంత్రియగు మాదోభానూజీ సూర్యప్రకాశ రావుమజుందార్ (మాదన్నమంత్రి) ఉభయ ఆలయాల అర్చనకు సహకరించారు. నాటినుండి స్థానిక దాతలైన విప్రవరుల, ఆర్యవైశ్యుల, భక్తుల సహకారంతో పూజా నైవేద్యాది విధివిదాన కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగిస్తూ, కొంతకాలం క్రితం దేవాలయం దేవాదాయ శాఖ ఆధీనంలోనికి తీసుకోబడింది. ఫలితంగా లక్ష్మీనరసింహ దేవస్థానంలో అంతర్భాగమైంది. వివిధ ధర్మకర్తల మండలుల కృషితో, దాతల చేయూతతో నిధులను ప్రోగుచేసుకుని ముఖ్యమంత్రి సర్వశ్రేయోనిధి ద్వారా ప్రత్యేక నిధులుపొంది దేవాలయ పునరుద్ధరణ, సాలహార నిర్మాణం, అమ్మవారు, నంది, కలష, నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠలు పూర్తి చేసుకుని , శృంగేరి శంకరాచార్య బహూకృత ఆదిశంకర, శారదామాత మూర్తులను ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగింది. శివరాత్రి, శివ కళ్యాణం, రథోత్సవం, గణపతి, నవగ్రహ పూజలు, శంకర జయంతి, శరన్నవరాత్రుల ఉత్సవాలను, నరసింహ స్వామివారల బ్రహ్మోత్సవ వేడుకలలో అంతర్భాగంగా ఉత్సవాలను ఈఆలయంలో ఏటా సాంప్రదాయ రీతిలో ఘనంగా నిర్వహిస్తున్నారు.

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494