Others

మహాత్యాగి బులుసు సాంబమూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేపు ‘మహర్షి’ జయంతి సందర్భంగా...
*
భారత స్వాతంత్య్ర పోరాట సమరయోధులు, త్యాగధనులు ఎందరో కనుమరుగైపోయారు. దేశం విస్మరించిన దేశభక్తుల జాబితా ఎంచలేనిది. వీరందరిలో బులుసు సాంబమూర్తి వంటి మహోన్నత వ్యక్తి జాడ తెలియకుండా కాలగర్భంలో కలిసిపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు.
వీరిని ‘మహర్షి’ అని వ్యవహరించడంలోనే ఆయన వ్యక్తిత్వం వ్యక్తవౌతుంది. వారు వృత్తిరీత్యా న్యాయవాదులు. ఆయనకున్న పరిజ్ఞానానికి న్యాయవాద వృత్తిలో ఆర్థికంగా ఉన్నత స్థానానికి ఎదిగి వుండేవారు. కానీ దీనిని పక్కకు పెట్టి దేశ స్వాతంత్య్రం కోసం ఉద్యమంలోకి దిగారు. ఈ స్వాతంత్య్ర యోధుడి చివరి రోజులు దుర్భర దారిద్య్రంతో గడిచి దేశమాత ఒడిలో ఎలా ఒదిగిపోయాడనే విషయం ప్రతి ఒక్కరినీ ఆలోచింపచెయ్యగలదు.
సాంబమూర్తిగారు తూర్పుగోదావరి జిల్లాలో దుళ్ళ గ్రామంలో వేద పండితుల ఇంట 1886, మార్చి 4న జన్మించారు. ఆ రోజు శివరాత్రి కావడంవలన పరమశివుని ప్రసాదమని భావించి సాంబమూర్తి అని నామకరణం చేశారు.
1909లో ఆయనకున్న సహజమైన మేథోసంపత్తి ఆయనను భౌతిక శాస్త్రం చదివేలా చేసింది. విజయనగరం మహారాజా కాలేజీలో అధ్యాపకుడిగా కొంతకాలం పనిచేశారు. స్వతంత్ర ప్రతిపత్తిగల సాంబమూర్తిగారికి ఆ ఉద్యోగం నచ్చలేదు. ఆ రోజులలో యువకులని అమితంగా ఆకర్షించింది న్యాయవాద వృత్తి. మద్రాసులో బిఎ, బి.ఎల్ పూర్తిచేసి 1911లో కాకినాడలో న్యాయవాద వృత్తిని చేపట్టారు. తూర్పుగోదావరిలో వున్న మూడు కోర్టులలో పేరు ప్రఖ్యాతులు, ధనం బాగా సంపాదించారు. ఖరీదైన వస్తధ్రారణతో మోటారు బైక్‌మీద తిరుగుతూ విలాసవంతమైన జీవితం గడిపేవారు. ప్రకాశం పంతులుగారికి సహాయకుడిగా పనిచేస్తూ వారితో కలిసి రాజమండ్రి ప్రసిద్ధ నాటక ప్రదర్శనశాల చింతామణి థియేటర్ అధిపతిపై వచ్చిన దొంగనోట్ల కేసును పరిశీలించి, మద్రాసు హైకోర్టులో వాదించి గెలిపించారు. క్రిమినల్ లాయర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు.
ఇదిలా వుండగా దేశభక్త కొండా వెంకటప్పయ్యగారి ప్రసంగం విన్న సాంబమూర్తి జీవితం మారిపోయింది. న్యాయవాద వృత్తి వదిలేశారు. ఖద్దరు పంచె, పైన ఉత్తరీయం ధరించి చివరివరకూ అదే ఆహార్యమనుకున్నారు. 1909లో మొదటిసారి జైలుకు వెళ్లారు. 1919 సం.లో హోమ్‌రూల్ ఉద్యమంలో ప్రవేశించారు. గాంధీజీ బోధనలకు ప్రభావితుడై సహాయ నిరాకరణోద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. ఆ తర్వాత మహాత్మాగాంధీగారి నాయకత్వంలో ప్రతి ఆందోళనలో పాల్గొని అనేకసార్లు జైలుకు వెళ్లారు.
1921లో ప్రకాశంగారి అధ్యక్షతన గోదావరీ మండల కాంగ్రెస్ సభలు కాకినాడలో జరిగాయి. సాంబమూర్తిగారు సర్వ సంపూర్ణ స్వరాజ్యం కావాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గౌహతిలో జరిగిన అఖిల భారత సభలో కార్యవర్గ సభ్యుడైన సాంబమూర్తి సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని తిరిగి ప్రవేశపెట్టారు. అధినాయకులందరూ ఇది సాధ్యం కాదన్నారు. 1929 చివరివరకూ సంపూర్ణ స్వరాజ్య డిమాండను స్వీకరించలేదు. సాంబమూర్తిగారి దేశాభిమానం, త్యాగనిరతి అనేకమంది జిల్లా కాంగ్రెస్ నాయకులను ఆయనకు అనుయాయులుగా చేసింది.
1923లో ఆంధ్ర ప్రాంతంలో ప్రథమంగా అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు జరగడానికి కారణం బులుసు సాంబమూర్తిగారే. సాంబమూర్తిగారు గాంధేయవాద సిద్ధాంతాల వ్యాప్తిని, నిజమైన గాంధేయవాదులను రూపొందించడానికి 1924లో గౌతమీ సత్యాగ్రహ ఆశ్రమం రూపకల్పన చేశారు. సబర్మతీ ఆశ్రమం మాదిరిగా రెండవ గాంధేయవాద ఆశ్రమం గౌతమీ ఆశ్రమం. 1927 సంవత్సరంలో నాగపూర్ పతాక సత్యాగ్రహ దళానికి నాయకత్వం వహించారు. 1928 సంవత్సరంలో హిందూస్తానీ సేవాదళం అధ్యక్షునిగానూ, తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా పనిచేశారు. సైమన్ కమీషన్ బహిష్కరణోద్యమంలో పాల్గొన్నారు. 1929లో అఖిలభారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడుగా ఉన్నారు. అప్పుడు లాహోర్ కాంగ్రెస్ సభల సమయంలో పూర్ణ స్వరాజ్య ప్రతిపాదన జరిగింది. 1920 ఏప్రిల్ 6వ తేదీన ప్రారంభమైన ఉప్పు సత్యాగ్రహ సమయంలో తన సహచరులతో చొల్లంగి సముద్ర తీరానికి వెళ్లి ఉప్పును తయారుచేశారు. ఉప్పుమీద పన్ను ఎత్తివేసేవరకు ఆహారంలో ఉప్పు లేకుండా తింటానని శపథం చేసి ఆచరించిన ధీరోదాత్తుడు.
1935లో మద్రాసు ప్రొవిన్షియల్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సి.రాజగోపాలాచారి ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. రాజగోపాలాచారి పాలనలో సాంబమూర్తిగారు 1937 నుంచి 1942 వరకు రాష్ట్ర శాసనసభకు సభాపతిగా ఉన్నారు. రైతులకు న్యాయం జరగాలని సభాపతి ఎవరి వత్తిడులకూ లొంగకూడదని గుండె ధైర్యంతో జమీందారీ రద్దు బిల్లును ప్రవేశపెట్టారు. దీనిని అధినాయకులందరూ వ్యతిరేకించారు. ఈ పదవులకన్నా క్విట్ ఇండియా ఉద్యమమే ముఖ్యమని రాజీనామా చేశారు. 1942 ఆగస్టులో స్వాతంత్య్ర సమరం తుది ఘట్టం ప్రారంభమైంది. క్విట్ ఇండియా నినాదంతో గాంధీ, నెహ్రూ, వల్లభాయి పటేల్ వంటి నాయకులు జైలుపాలయ్యారు. ఆ సమయంలో జిల్లాలలో సత్యాగ్రహ శిబిరాలు ఏర్పాటుచేసి ప్రజలలో పోరాట పటిమను ఉధృతం చేసిన వారిలో సాంబమూర్తిగారు ప్రముఖులు.
1945లో కాంగ్రెస్ అగ్రనాయకులు విడుదలయ్యారు. స్వాతంత్రోద్యమాన్ని అణచివేయడంకన్నా స్వాతంత్య్రం ఇచ్చి మిత్రదేశంగా ఉండాలనుకుంది బ్రిటన్. రెండు సంవత్సరాల్లో పూర్తి స్వాతంత్య్రం ఇవ్వాలనుకుంది. 1946 సెప్టెంబర్ రెండవ తేదీన నెహ్రూ ఆధ్వర్యంలో తొలి జాతీయ ప్రభుత్వం ఏర్పాటయింది. ఆ సంవత్సరంలో బ్రిటీష్ ప్రభుత్వం వివిధ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరిపి ప్రభుత్వాలు ఏర్పాటుచేసింది. స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న ప్రధాన నాయకులు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్టమ్రంత్రులు అయ్యారు. నిష్కామచిత్తంతో, నిస్వార్థంతో త్యాగమే ఊపిరిగా జీవించి సాంబమూర్తి వంటి కాంగ్రెస్ నాయకులు వెనక్కి తప్పుకోవలసి వచ్చింది. నిస్సహాయత, నిర్వేదం ఉన్నప్పటికీ సంపూర్ణ స్వాతంత్య్రం వచ్చిందన్న తృప్తి మిగిలింది. తన రెండవ జీవిత లక్ష్యం ఆంధ్ర రాష్ట్ర సాధనమీద దృష్టి కేంద్రీకరించారు.
తెలుగు రాష్ట్ర ఏర్పాటుకు రాజాజీ సుముఖత చూపలేదు. నెహ్రూకి ఇష్టంలేదు. అయినప్పటికీ గాంధేయవాది పొట్టి శ్రీరాములు 1952 అక్టోబర్ 19వ తేదీన ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్నారు. సాంబమూర్తిగారు మద్దతునిస్తూ తగిన వేదిక దొరక్కపోవడంవలన చెన్నై మైలాపూరులో వున్న తన ఇంటికి ఆహ్వానించి దానినే వేదికగా చేసుకోమన్నారు. సన్నిహిత నిరీక్షణలతో, సరైన సలహాలతో శ్రీరాములుగారి దీక్ష నిర్విఘ్నంగా సాగడానికి తోడ్పడ్డారు. ఎప్పటికప్పుడు శ్రీరాములుకు వైద్యులను అందుబాటులో ఉంచి తగిన చర్యలు తీసుకున్నారు. చివరికి అమరజీవి బలిదానం తప్పలేదు. ఇంతటి పవిత్ర కార్యం జరిగిన ఆ ఇంటిని అమరజీవి స్మారక భవనంగా వదిలి కాకినాడకు వెళ్లిపోయారు.
1953లో కర్నూలు రాజధానిగా ప్రత్యేక మదరాసు లేని ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. శ్రీరాములుగారు మదరాసుతో కూడిన ఆంధ్ర రాష్ట్రానికి చేసిన బలిదానం అపహాస్యం పాలయినట్లయింది.
స్వాతంత్య్ర పోరాటంలో వున్నపుడు ఆయనను ఎవరైనా సహాయం అడిగితే తన దగ్గర లేకపోయినా ఎవరినైనా అడిగి సహాయం చేసేవారు. గాంధీ నిధికి అభిమానులు ఇచ్చిన డబ్బులను చూడనైనా చూడకుండా అక్కడ పెట్టమని, ఎవరికైనా సహాయం కావాలంటే లెక్కలేకుండా ఇచ్చేసేవారు. ఈ మహాదాత న్యాయవాద వృత్తి వదిలి, రాష్ట్రం కోసం సొంత ఇల్లు వదిలిన బులుసు సాంబమూర్తిగారి భార్య మరణించడంతో దుర్భర మానసిక వ్యధతో ఒంటరివారయ్యారు. ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. మద్రాసులో ఉండడం అనవసరం అని కొత్త జీవితం గడపడానికి కాకినాడ చేరారు.
అక్కడ ఆయన సహాయం పొందినవారే ఆయనను తప్పించుకు తిరిగారు. కాకినాడ పౌరులు ఆయనను మరిచిపోయారు. చివరి రోజులలో ఆయన విరాగిగా మారిపోయారు. శివాలయాలచుట్టూ తిరిగేవారు. ఇదేమిటని అడిగితే ‘నేను శివదీక్షాపరుడను, శివరాత్రిరోజున పుట్టాను, సాంబు అని పేరు పెట్టారు. నుదుట విభూతి అలంకారమయంది. అదే నా ఆస్తి. ఆదిభిక్షువు భక్తుడిని. నేనిలా మారడంలో తప్పేముంది’ అనేవారుట.
పేదరికంలో వున్న సాంబమూర్తి పరిస్థితి తెలుసుకున్న నాటి కేంద్ర హోంశాఖా మంత్రి గోవింద్ వల్లభ్ పంత్ మాత్రమే ఆర్థిక సహాయం చేశారు. మానసిక వ్యథతో, పేదరికాలతో 1958 ఫిబ్రవరి 3న సాంబమూర్తి కాకినాడలో మరణించారు. మహర్షి, స్వాతంత్య్ర పోరాట యోధుడు, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు రథసారధి పొందిన గౌరవ సత్కారం ఇది. ఈ స్థితి వీరి ఒక్కరికే కాదు, స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న ఎంతోమంది నిస్వార్థుల పరిస్థితి చివరిరోజుల్లో ఇలాగే జరిగింది. కనీసం ఏడాదికోసారి వారి జన్మదినం రోజునైనా వారి దేశ సేవల్ని తలపునకు తెచ్చుకోగలిగితే వారికిచ్చే గౌరవం అంతకన్నా ఏమీ వుండదు.

- దామరాజు నాగలక్ష్మి