Others

గద్దరన్నకు గద్దెలపైనే మోహం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాగాయకుడిగా ప్రసిద్ధి చెందిన గద్దర్ ఇపుడు కొత్త అవతారం ఎత్తారు. ఆయనకు ‘గద్దెల’(పీఠం)పై మోహం తగ్గలేదు. దాంతో ఆయన ‘సేవ్ కాన్‌స్టిట్యూషన్ ఫోరం’ అనే సంస్థను ఏర్పాటుచేశారు. దానికి కన్వీనర్‌గా ఆయనే వ్యవహరిస్తున్నారు. గత 45 సంవత్సరాలలో ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు. బాపూజీ బుర్రకథ దళం, జన నాట్యమండలి, తెలంగాణ ప్రజాఫ్రంట్... ఇలా ఎన్నో వేదికలు- పీఠాలను ఆయన ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఎక్కడా పూర్తిగా కుదురుకోలేదు. ఏడుపదుల వయసులో వర్తమానంలో తాజాగా ‘్ఫరం’ను ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. కొంతకాలంగా ‘సేవ్ కాన్‌స్టిట్యూషన్, సేవ్ డెమొక్రసీ’ అన్న ఉద్యమం చేపడతానని ప్రకటిస్తూ వచ్చారు. అందుకు వీలుగా ఓ వేదికను ఇటీవల హైదరాబాద్‌లో ప్రకటించారు.
విచిత్రమేమిటంటే బుద్ధుడు-అంబేద్కర్ ఫొటోలకు పూజ చేసి, ప్రణమిల్లి ఫోరంను ప్రకటించడం. ఈ క్రతువు ఎలా ప్రాసంగికమవుతుందో ఆయనకే తెలియాలి! పైగా బుద్ధుని ‘పంచశీల’కు చిహ్నమైన వస్త్ర పేలికలను ఒక కర్రకు కట్టుకుని చాలాకాలం నుంచి ఆయన తిరుగుతూ కనిపిస్తూ ఉన్నారు. ‘్ఫరం’ ప్రారంభ కార్యక్రమంలోనూ ఆ కర్ర... ఆ వస్త్ర చిహ్నం గద్దర్ వెంట అభిన్నంగానే కనిపించింది.
గౌతమ బుద్ధుడు రెండున్నర వేల సంవత్సరాల క్రితం వాడు. ఆయన బోధనలు పలాయన వాదాన్ని సూచిస్తాయి. అసలు బుద్ధుని బోధనలకు వర్తమానానికి ఏ రకమైన పొంతన కుదరదు. అయినప్పటికీ ఆయన బోధనలను ప్రచారం చేయడం.. అందులో గద్దర్ లాంటి సామాజిక చైతన్యం గల వ్యక్తి ప్రచారం చేయడం వింతల్లోకెల్ల వింత.
కోర్కెలు మానవుని క్లేశానికి మూలం, వాటినుంచి ముక్తిపొందేందుకు ధ్యానం చేయాలని బౌద్ధం సూచిస్తోంది. వేలాది మంది బౌద్ధ సన్యాసులు దాన్ని ఆచరణలో పెడుతున్నారు. ‘శాంతి’ని పొందేందుకు ‘దమ్మచింతన’లో మునిగి తేలుతున్నారు. ఈ మూలతత్త్వం వర్తమాన భౌతికవాద సమాజానికి ఎలా ఉపకరిస్తుంది? మనిషంటేనే కోర్కెలకు ప్రతి రూపం. ఆ కోర్కెలు తీర్చుకునే ప్రక్రియే ‘జీవితం’. ఇది సాధారణ ప్రజ ఆలోచన. బుద్ధుని బోధనలకు-వాస్తవిక జీవితానికి ఎక్కడైనా సమన్వయం కుదురుతుందా?
రెండున్నర వేల ఏళ్లక్రితం బోధి వృక్షం కింద బుద్ధునికి కలిగిన ‘జ్ఞానోదయం’.. 2019 సంవత్సరంలో అది అసలు జ్ఞానమే కాదు. జననం-మరణం- తిరిగి పుట్టుక ఈ జీవన చక్రం అంచులను తాకాలని ఆయన చేసిన తపస్సు అతని వైయక్తిక అనురక్తి, ఆసక్తి, తాదాత్మ్యం కోసం ఉపకరించింది తప్ప సమాజానికి ఇసుమంత కూడా ఉపకరించలేదు. ఆ రకమైన ఘోరమైన తపస్సుచేసి జ్ఞానప్రాప్తి కోసం పాటుపడేవారు పారిశ్రామిక యుగంలో ఎందరుంటారు? ఒక రూపంలో కాకపోతే మరో రూపంలో సాధువులు-సన్యాసులు, సర్వసంఘ పరిత్యాగులు కొంత ప్రయత్నం చేస్తారేమో.. కాని డిమాండ్.. ఉత్పత్తి.. సరఫరా అనే సూత్రం రాజ్యమేలుతున్న ఈ తరుణంలో సామాన్య ప్రజల చైతన్యానికి ఆ ‘చింతన’ ఏ రకంగా ఉపయుక్తం..? ఏ విధంగానూ ప్రాసంగికం కాదు! అయినా అదే పలాయన వాదాన్ని కొత్తకొత్త రూపాల్లో ప్రచారం చేస్తే ఎవరికి లాభం చేకూరుతుంది?
సమకాలీన సమాజంపై చైతన్యవంతులైనవారు తమదైన ‘ముద్ర’ వేయడం ఆహ్వానించదగ్గ అంశం. అలా తమదైన ముద్రవేసే క్రమంలో వేల సంవత్సరాల వెనక్కి ప్రజల్ని నడిపించేందుకు లేదా అటువైపు దృష్టి సారించేందుకు పాటుపడితే ఎవరు హర్షిస్తారు? ఏ మతమైనా ఓ జీవన విధానాన్ని చాటిచెబుతుంది. ఓ క్రమపద్ధతిని సూచిస్తుంది. బౌద్ధం కూడా అదే చేసింది. దాని అనుసరించేవారు ఆధ్యాత్మిక రంగంలో కొనసాగుతున్నారు. కాని సాంఘిక జీవనంలో బౌద్ధం ఊసు కనిపించదు. సమకాలీన సమాజ పోకడలకది సరిపడదు. అందుకే ఒకప్పుడు ప్రపంచంలో పలు దేశాలకు విస్తరించిన ఆ మతం క్రమంగా ఇప్పుడు కొన్ని సమూహాలకు మాత్రమే పరిమితమైంది. వారు సైతం ఆధ్యాత్మికత కోణంలోనే ఆధారపడుతున్నారు.
మతం- ఆధ్యాత్మికతను అధిగమించి హేతుబద్ధంగా, తార్కికంగా, శాస్ర్తియ కోణంలో ఆలోచించడం సైతం అతి పురాతనమైనది. మానవ సమూహాలను ఈ ధోరణి పురోగమింపజేస్తోంది. సోక్రటీసు-ప్లాటో దీనికి వారసులుగా కనిపిస్తారు. వారి తాత్వికత, ఆలోచన, చింతన, మతవాదులపై జరిపిన పోరాటం- ధిక్కారం మానవ సమూహాలను సరికొత్త ఎత్తులకు చేర్చింది. అప్పటినుంచి ఆ ‘ఎత్తు’ను మరింత పెంచుకుంటూ పోతున్నాం. మనకు తెలియకుండా ఈ ప్రయత్నంలో అందరూ భాగస్వాములమవుతున్నాం. ఈ హేతుబద్ధ, తర్కబద్ధ ఆలోచనలను తమ సౌకర్యార్థం తొక్కిపెట్టి ఏది బుర్రకు తోస్తే ఆ ‘జెండా’ ఎత్తుకుని ఉద్యమిస్తానని ఊదరగొడితే జరిగే పరిణామమేమిటి? చైతన్యవంతులైన వ్యక్తులు చేయవలసిన పనేనా ఇది?
ప్రాథమికంగా సమకాలీన సమాజ డైనమిక్స్ పట్ల సరైన అంచనా, అవగాహన లేకుండా ఏ రకమైన కార్యాచరణ చేపట్టినా అది నిరర్థకమే అవుతుంది. బుద్ధుని కాలపు ‘పంచశీల’ను, మడతపెట్టే 5జి స్మార్ట్ఫోన్ సేవలు అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీ శాసిస్తున్న సందర్భానికి ఏమైన లంకె కుదురుతుందా? ఈ రెండున్నర వేల సంవత్సరాలలో మానవ మేధస్సు వికసన గూర్చిన అంచనాలేకపోతే ఏయే డైనమిక్స్ సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాయో తెలుసుకోకపోతే, ఏ భావజాలం విస్తృతమై ప్రజల నీరాజనాలు అందుకుంటుందో పసిగట్టకపోతే ఏ రకమైన ‘దర్శనాన్ని’ ప్రజలముందు పెడతారు? ఇంకా ఎంత కాలం విఫలమైన ఉటోపియన్ ధోరణిని అనుసరిస్తారు? ఆ వైఖరి ఏ సముదాయానికి ఉపకరిస్తుంది?
మనిషి జరామరణాలపై, క్లేశంపై, వేదనపై బుద్ధుని అవగాహనతో 21వ శతాబ్దంలో ఆలోచించడం నేరం! అసలు మనిషిని అర్థం చేసుకోవడంలో, వాస్తవ దృష్టికోణంతో పరిశీలించి మానవ పురోగమనానికి, పురోభివృద్ధికి, ఎదుగుదలకు అవరమైన సారాన్ని సోక్రటీసు- ప్లాటో వంటి ఆలోచనాపరులు అందించారు.. అందిస్తూనే ఉన్నారు. ప్రజాస్వామ్య భావన, పాలనా విధానం, పన్నులు, పాలకుల సహిష్ణుత తదితర అంశాలపై చర్చ అనాదిగా జరుగుతూ ఉంది. ఆ చర్చల సారాంశం ఆచరణలోకి వస్తోంది. దాని ఫలితాలను మానవాళి అనుభవిస్తోంది. ఈ కీలకమైన విశే్లషణకు దూరం జరిగి, మరో కోణంలో, మాయదారి కోణంలో ఆలోచిస్తూ విలువైన కాలాన్ని లుప్తం చేయడం భావ్యమా?
180 సంవత్సరాల క్రితం కారల్ మార్క్స్ చేసిన విశే్లషణలతో, సిద్ధాంతాలతో ప్రభావితమై ఆ ‘మూస’లోనే ముందుకు సాగడం లేదా కొంచెం అటు-ఇటుగా కదిలి ఆలోచించడం కాలం చెల్లిన వ్యవహారమని ఎప్పటికి గ్రహిస్తారో? గద్దర్, ఆయన మిత్ర బృందం అంతా మార్క్స్ భావజాలం ప్రభావంతో, బుద్ధుని పలాయన వాదంతో కదం తొక్కితే మిగిలేది కాలయాపన. హళ్ళికి హళ్ళి.. సున్నకు సున్నా మాత్రమే? ప్రపంచంలో ప్రతీది పరివర్తన చెందుతుంది. అది సహజ లక్షణం, గుణం. ఈ లక్షణాన్ని పట్టించుకోకుండా పిడివాదంతో వ్యవహరిస్తే ఒరిగేది శూన్యం. గద్దర్ ‘గద్దెల’పై గాక గరీబుల జ్ఞానదారులను రహదారులుగా మార్చే ప్రక్రియపై, 5జి (ఐదవ తరం) టెక్నాలజీతో ప్రపంచాన్ని ప్రభావితం చేయనున్న అంశంపై అవగాహనను- ఆలోచనలను పెంచితే సమకాలీన జ్ఞానంతో పేదలు సాధికారతతో జీవించే అవకాశముంటుంది. అంతే తప్ప రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ఉద్యమిస్తే అది చీకట్లో రాయి విసరడమే తప్ప లక్ష్యంపై గురిపెట్టినట్టవదు.

-వుప్పల నరసింహం 99857 81799