Others

మాయమైపోయినాడమ్మా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరంజీవికి సీన్ వినిపిస్తున్న బాపినీడు. సరిగ్గా నెల రోజుల క్రితం ఫిబ్రవరి 12న హైదరాబాద్‌లోని
తన నివాసంలో విజయ బాపినీడు తుది శ్వాస విడిచారు. జ్ఞాపక నివాళిగా ఈ వ్యాసం
*
బ్రిటీషు పాలనలో -సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా పదవి నిర్వహించిన లార్డు పెథిక్ లారెన్స్ మహిళోద్ధరణ ఉత్తమ నాయకుడు కూడా. మహిళాభిమానంతో భార్య పేరు పెథిక్‌ను తన పేరుకి ముందుగా చేర్చుకున్నాడు. సాధారణంగా పెళ్లయిన మహిళలు తమ పేరుకి భర్త పేరూ జోడిస్తారు. ఈ విషయంలో విజయబాపినీడు ఒకింత ప్రత్యేకం. తన పేరుకి ముందు భార్య పేరు కలిపాడు. అందుకే విజయ బాపినీడు పేరు ప్రస్తావించగానే -లార్డ్ పెథిక్ లారెన్స్ గుర్తుకొస్తాడు.
**
విజయబాపినీడు మొదట డిటెక్టివ్ కథారచయిత. తర్వాత జర్నలిస్ట్. నిర్మాతగా, దర్శకుడిగా సక్సెస్‌ఫుల్ కెరీర్ ఆయనది. శ్యాంప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై తయారైన చిత్రాలకు మాగంటి రవీంద్రనాథ్‌చౌదరి నిర్మాతైనా, నిర్మాణానికి సంబంధించిన అన్ని వ్యవహారాలూ పర్యవేక్షించింది విజయబాపినీడే. చిత్ర నిర్మాణంలో ఆయనొక మొండి మనిషి. ప్రతిసారీ వైవిధ్యం కోసం తపించేవాడు. ప్రయోగాలకు ఆరాటపడేవాడు. సినిమాని వైవిధ్యంగా ప్రమోట్ చెయ్యడానికి తహతహలాడేవాడు. సాధారణంగా ఏ నిర్మాతైనా చిత్రం విడుదలకుముందు పబ్లిసిటీ ప్రారంభించరు. కానీ సినిమా రిలీజు డేటుకు మూడునెలలు ముందే పబ్లిసిటీ మొదలెట్టేవాడు -విజయబాపినీడు. వార్తాపత్రికల్లో సీరియల్స్‌ని పాఠకులు ఎంత ఉత్కంఠగా చదువుతారో, సినిమా పబ్లిసిటీనీ అంతే ఉత్కంఠతో చూడాలని వారంవారం విభిన్నంగా, సీరియల్‌గా పబ్లిసిటీ చేసేవారాయన. నిర్మాతగా ఆయన చేసిన ఓ వినూత్న ప్రయోగం ప్రేమపూజారి. ఒకే సందేశాన్ని అందించే రెండు భాషలకు చెందిన రెండు కథా చిత్రాలను తీసుకొని ఎడిట్ చేసి రావుగోపాలరావు వ్యాఖ్యానంతో ‘ప్రేమ పూజారి’ పేరిట విడుదల చేశారు. ఈ ప్రయోగాన్ని ప్రేక్షకుడూ మెచ్చుకోకతప్పలేదు.
అనుకున్న బడ్జెట్‌కంటే తక్కువలో, షెడ్యూల్ టైమ్‌కి ముందే సినిమా పూర్తి చేయడం బాపినీడు స్టయిల్. చిరంజీవితో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించడమే కాకుండా, ఆయన అంతరంగికుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు ‘చిరంజీవి’ పేరిట మాసపత్రిక నడిపిన ఘనత ఆయనది.
ఏలూరు పక్కనున్న చాటపర్రులో 1936 సెప్టెంబర్ 22న జన్మించాడు బాపినీడు. పూర్తి పేరు గుత్తా బాపినీడు చౌదరి. పెళ్లయిన తర్వాత భార్య పేరు ముందు పెట్టుకుని -విజయ బాపినీడుగా రచనలు చేశారు. ‘ఆంధ్రపత్రికలోనో, ప్రభలోనో నా తొలి కథ అచ్చయ్యింది. దాంతో రచయితనైపోయాననే ఫీలింగ్ కలిగింది. రాసిన తొలి డిటెక్టివ్ నవల -చీర విడిచిన వీర వనిత’ అంటూ బాపినీడు గుర్తు చేసుకునేవాడు. బాలమిత్రలోనూ ఆయనవి కొన్ని కథలు అచ్చయ్యాయి. బిఏ పూర్తికాగానే జిల్లా బోర్డులో క్లర్క్‌గా చేరాడు. 1968లో చెన్నయ్ వచ్చిన తర్వాత ‘రాధిక’, ‘రమణి’ పేర్లతో శృంగార పత్రికలూ నడిపారు. ఆ రోజుల్లో ఉన్న సెక్స్ పత్రికలు ఆయన పత్రికల దెబ్బకు మూతబడ్డాయి. తర్వాత చెన్నైలోని వడపళిలో ఇల్లుకట్టుకుని, తెలుగులో ‘బొమ్మరిల్లు’, హిందీలో ‘గుడియా’, మరాఠీలో ‘గుల్‌మెహర్’, తమిళంలో ‘బొమ్మైవీడు’ పేర్లతో పిల్లల మాసపత్రికలు నడిపారు. అలాగే ఆ రోజుల్లో రీడర్స్ డైజస్ట్ వారు పాకెట్ సైజులో రెండు బుక్స్ ఇచ్చేవారు. అది బాపినీడుని ఆకట్టుకుంది. దాంతో ఐదు పుస్తకాల కానె్సప్ట్‌తో విజయ మాసపత్రిక తెచ్చారు.
రెగ్యులర్‌గా పత్రికలు పాటించే సంప్రదాయాల జోలికెళ్లకుండా భిన్నంగా ఆలోచిస్తూ ఫ్రీ హ్యాండ్‌తో పని చేయడంవల్ల ‘విజయ’ క్లిక్కయ్యింది. అదీకాకుండా కుటుంబ సభ్యులంతా ఒకేసారి కలిసి చదువుకునే పత్రిక అంటూ చేసిన పబ్లిసిటీ మరింత ప్లస్సయ్యింది. అలాగే ‘నీలిమ’ పేరిట మరో పత్రికా తెచ్చారు. విజయ పత్రికలో సినిమాల రివ్యూలు బాగా పాపులరయ్యాయి. ఎలాంటి పక్షపాత ధోరణీ లేకుండా రివ్యూలు ఉండేవి. ‘మేమిచ్చే గ్రేడింగ్స్ చూసి.. కోట్లుపెట్టి సినిమాలు తీస్తుంటే, వీడేంటి ఇలా రాస్తున్నాడు అని కామెంట్స్ చేసేవారు. కానీ ఏ ఒక్కరోజూ ఏ ఒక్కరూ ఆ విషయాన్ని నా ఎదురుగా అనలేదు’ అని చెప్పేవారు బాపినీడు.
తరువాత -మిత్రుడు మాగంటి రవీంద్రనాథ్‌చౌదరితో కలిసి శ్యాంప్రసాద్ ఆర్ట్ సంస్థ నెలకొల్పారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఈ సంస్థ నుంచి ‘యవ్వనం కాటేసింది’ చిత్రం వచ్చింది. అటు బొమ్మరిల్లు, ఇటు విజయ పత్రికలు సక్సెస్ కావడంతో వాటి పేర్లతోనూ సినిమాలు తీశారు. ముఖ్యంగా 1974లో విడుదలైన ‘బొమ్మరిల్లు’ చిత్రం ఆ టైంలో విడుదలైన కొన్ని భారీ వర్ణ చిత్రాలకంటే అధికంగా వసూలుచేసి ఘన విజయం సాధించింది. సినిమా విజయానికి కలర్, సినిమాస్కోప్, తారాబలం ప్రధానంకాదని ఆ సినిమా నిరూపించింది.
చిరంజీవితో పరిచయం
వాహిని స్టూడియోలో ‘బొట్టు కాటుక’ చిత్రం షూటింగ్ జరుగుతోంది. సినిమాలో నూతనప్రసాద్ గెటప్ కొంచెం భిన్నంగా కనిపించాలని రెండు కనుబొమ్మలు కలిసి ఉండేలా మేకప్ చేయించారట బాపినీడు. ఆ స్టూడియోలోనే చిరంజీవి సినిమా షూటింగ్ కూడా ఉంది. ఆయన మరో ఆర్టిస్టు మేకప్ రూమ్‌లో ఉన్నారు. నూతనప్రసాద్‌ని కలుద్దామని బాపినీడు మేకప్ రూమ్‌కి వెళ్తే, చిరంజీవి పక్కనున్న ఆర్టిస్టు పలకరించాడట. ఆ క్షణంలో బాపినీడును చూసి చిరంజీవి ఒక్క క్షణం ఆశ్చర్యపోయారట. ఆయన ఎందుకు ఆశ్చర్యపోతున్నారో ఈయనకు అర్ధంకాలేదు. కాసేపటికి ఆయనే పలకరిస్తూ ‘ఓహో మీకు కనుబొమలు కలిసి ఉంటాయా? అందుకే నూతనప్రసాద్‌కి ఆ గెటప్ పెట్టారా’ అన్నారట. అలా చిరంజీవితో తొలి పరిచయమైంది. తర్వాత ఇద్దరూ సన్నిహితులయ్యారు. చిరంజీతో బాపినీడు నిర్మించిన తొలి చిత్రం 1982 ఏప్రిల్ 24న వచ్చిన ‘పట్నంవచ్చిన పతివ్రతలు’.
రాశీ మూవీస్ నరసింహారావు నిర్మించిన ‘మహారాజు’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు బాపినీడు. చిరంజీవి హీరోగా మగమహారాజు చిత్రాన్ని బాపినీడు బ్యానర్‌లోనే నిర్మించారు.కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, రాజేంద్రప్రసాద్, సుమన్, రాజశేఖర్ ఆయా చిత్రాల్లో హీరోగా నటించారు. చిరు కాంబినేషన్‌లో 1988లో వచ్చిన ఖైదీ నెం 786 చిత్రం మంచి విజయం సాధించింది. ఆ చిత్రం శత దినోత్సవాన్ని ఉదయం, సాయంత్రం నిర్వహించటం కూడా వైవిధ్యమైన ఘట్టం.
బాపినీడు దర్శకత్వంలో చిరంజీవి నటించిన మరో చిత్రం -గ్యాంగ్ లీడర్. ఈ చిత్రానికి మొదట అనుకున్న పేరు -అరేఓ సాంబా. హిందీలో సంచలన విజయం సాధించిన షోలే చిత్రంలో విలన్ గబ్బర్‌సింగ్ మేనరిజం డైలాగ్ ఇది. అది బాగా పాపులరవ్వటంతో, టైటిల్ బాగుంటుందని అనుకున్నారు. మరో విశేషమేమిటంటే గ్యాంగ్‌లీడర్‌ను మొదట నాగబాబు హీరోగా తీద్దామనుకున్నార్ట. చిరంజీవి కథ ఓకే చేయడంతో టైటిల్ మారి గ్యాంగ్‌లీడర్‌గా వచ్చింది. ఆ రోజుల్లో చిరంజీవితో తిరిగేవారంతా ఆయన్ని బాస్ అని పిలిచేవారు. అయితే బాపినీడు నిర్మించే చిత్రానికి బిగ్‌బాస్ పేరుపెట్టడానికి ఆయన అంగీకరించలేదట. ఎంతో నచ్చచెప్పిన తర్వాత అయిష్టంగానే అంగీకరించారు. మా యిద్దరి కలయికతో వచ్చిన చివరి చిత్రమదే.
చిరంజీవి పేరిట పత్రిక
ఒక హీరో పేరుతో పత్రికను తెలుగులో ప్రారంభించడం ఆ రోజుల్లో విశేషంగా చెప్పుకోవాలి. చిరంజీవి పేరుతో వచ్చిన ఈ పత్రిక ఎంత పాపులరైందంటే అందరితోపాటు చిరంజీవి కూడా ఆసక్తిగా ఎదురుచూసేవారు. అదీ విజయబాపినీడంటే.
దాదాపు నాలుగు దశాబ్దాలపాటు తెలుగు చిత్ర పరిశ్రమలో బిజీబిజీగా గడిపేసిన బాపినీడు -చివరి దశలో అన్నింటికీ దూరంగావుంటూ ప్రశాంత జీవితం గడిపారు. 2009లో చిరంజీవి ఇంటికెళ్లినపుడు పాత విషయాలు చాలాసేపు మాట్లాడుకున్నారు. ‘మళ్లీ సినిమా ప్రారంభించండి’ అని చిరంజీవి అనగానే ‘మీరు చేస్తానంటే చెప్పండి, సినిమా తీస్తా’ అనేసి నవ్వుకున్నారు. ఆ తరువాత ఆ నవ్వు చిత్ర పరిశ్రమ నుంచి మాయమైంది.

-కె శ్రీనివాస రావు