Others

‘పద్మం’గా వికసించిన ‘రైతు నేస్తం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సేంద్రియ సాగు, ప్రకృతి వ్యవసాయం, గోఆధారిత వ్యవసాయం, దేశవాళీ విత్తనాల సంరక్షణ.. ఈ అంశాల ప్రాతిపదికగా వ్యవసాయ రంగంలో కృషిచేస్తున్న వారిని భారత ప్రభుత్వం ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘పద్మశ్రీ’ పురస్కారాలకు ఎంపిక చేసింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా వ్యవసాయ రంగానికి చెందిన 10 మందికి పైగా ప్రముఖులు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. తెలుగు రాష్ట్రాల నుండి ‘రైతునేస్తం’ వెంకటేశ్వరరావుగా కర్షక లోకానికి, వ్యవసాయ రంగానికి సుపరిచితులైన యడ్లపల్లి వెంకటేశ్వరరావుకు ఈ జాబితాలో స్థానం దక్కటం విశేషం.
‘రసాయన రహిత సేద్యం’పై దృష్టి...
పట్టణాలు, నగరాలలో యాంత్రిక జీవనం తప్పని జనారణ్యంలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుందనే ఆందోళన అధికమవుతున్న నేపథ్యంలో పెరుగుతున్న పర్యావరణ స్పృహలో భాగంగా పురుడు పోసుకుంది ‘మిద్దెతోట’ భావన. ఆరోగ్య భారతం కోసం మన ఆహారపుఅలవాట్లు, జీవనశైలిలో మార్పుకోసం జరుగుతున్న ఆరాటంలో భాగంగా చిరుధాన్యాల సాగు, వాటినే దైనందిన ఆహారంగా తీసుకోవటం గురించి పెరుగుతున్న కృషి ఇపుడు చూస్తున్నాం. ఈ మూడు అంశాలను గత కొద్దికాలంగా భారత ప్రభుత్వం గతంలోకంటే భిన్నంగా ఒక నిరంతర ప్రయత్నంగా ప్రోత్సహిస్తూ వస్తోంది. సరిగా ఈ మూడు అంశాలమీదనే రైతునేస్తం వెంకటేశ్వరరావు వ్యవసాయ పత్రికల నిర్వాహక సంస్థాపకులుగా మాత్రమే కాకుండా వ్యక్తిగత స్థాయిలో అహర్నిశలు శ్రమిస్తూ ఒక శక్తిగా ఎదిగారు. ఒక దశాబ్ద కాలంలో శక్తిగా, ఓ సంస్థగా ఎదిగి అతడే సైన్యంగా తనదైన ముద్రను తెలుగునేల మీద వేయగలిగారు. ఆ కృషి ఫలితమే పద్మశ్రీ పురస్కారం ఎంపికకు మూలమని చెప్పవచ్చు.
ముఖ్యంగా వాణిజ్య పంటలు మిర్చి, పత్తి పంటల మధ్య సాగిన బాల్యం, వాణిజ్య పంటల ఒడిదుడుకులు, విపరీతంగా పురుగు మందులు వాడే గుంటూరు రైతు కుటుంబ నేపథ్యం ఆయనది. 1990 దశకం తెరదీసిన మార్కెట్ ఆర్థిక వ్యవస్థ ప్రభావంతో పొట్టకూటికోసం, జీవన మనుగడ కోసం వ్యవసాయానికి స్వస్తిచెప్పి, హైదరాబాద్‌కు వచ్చిన లక్షలాది మంది నిరుద్యోగులలో ఒకరు వెంకటేశ్వరరావు. డిటిపి ఆపరేటర్‌గా ఉదర పోషణార్థం అవతారమెత్తిన ఆయన అంచెలంచెలుగా ప్రింటింగ్ ప్రెస్ ను ఏర్పాటు చేసుకున్నారు. సహజంగా ప్రెస్ ఉన్నవారందరికీ ఏదో ఒక పత్రిక నడపాలన్న కోరిక కలగ డం సహజం. వ్యవసాయ కుటుంబం, రైతు నేపథ్యం బలీయంగా ఉండటంతో వీరు వ్యవసాయ పత్రిక ‘రైతు నేస్తం’ ప్రారంభించి జర్నలిజంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత వస్తున్న మార్పులను గమనిస్తూ ప శునేస్తం, ప్రకృతినేస్తం పత్రికలను కూడా ప్రారంభించి కర్షక సమాజంలో తనదైన ముద్ర వేయగలిగారు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో వ్యవసాయం అనుబంధ రంగాలకు సంబంధించి ఆయా అంశాలలో రైతులలో మంచిపేరు సంపాదించుకున్న విషయ ప్రవీణులతో పుస్తకాలు తీసుకువచ్చి విజయం సాధించారు. పూదోట, కలుపు యాజమాన్యం, చేపలు-ఉపాధి, మిద్దెతోట, స్వేదవేదం రైతు నేస్తాలయ్యాయి. రైతులలో మంచి పేరు వచ్చింది.
‘రైతునేస్తం’ వెంకటేశ్వరరావు పలు దేశాల్లో పర్యటించి అక్కడి వ్యవసాయ స్థితిగతులు అధ్యయనం చేశారు. బ్రిటన్, అమెరికా, శ్రీలంక తదితర దేశాలను సందర్శించారు. అమెరికా తెలుగు సంఘాలలో రైతుకు స్థానం కల్పించిన వ్యక్తిగా పేరుపొందారు. ఎన్నో సాంఘిక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉచిత వైద్యపరీక్షలు నిర్వహించడం, విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడం వంటి సేవా కార్యక్రమాలను నిర్వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన సహకార సంస్థతో ఒప్పందం చేసుకుని, అటవీ ఉత్పత్తులకు ప్రజలలో మంచి గిరాకీ వచ్చేలా కృషిచేస్తున్నారు. తేనె, జీడిపప్పు, చిరుధాన్యాలు, చిరుధాన్యాల పిండి, బిస్కట్లు, కుంకుళ్లు, పసుపు, కారం ఇలా ఎన్నో ఉత్పత్తులను నేచురల్ ప్రొడక్ట్స్ దుకాణాల ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యేలా శ్రమిస్తున్నారు.
రసాయన రహిత సాగుకు రైతులను మళ్లించాలనే లక్ష్యంగా రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతు శిక్షణ కేంద్రం ఏర్పాటుచేసి క్రమం తప్పకుండా ఇప్పటికీ దాదాపుగా 150 వారాలకు పైగా ప్రతి ఆదివారం శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. నాగర్‌కర్నూల్‌కు చెందిన లావణ్యారమణారెడ్డి, కరీంనగర్‌కు చెందిన కొక్కు అశోక్‌కుమార్‌తో భువనగిరికి చెందిన జిట్టా బాలరెడ్డి, రసాయన రహిత సేద్యానికి సంబంధాలు పలు అంశాలలో రైతులకు శిక్షకులుగా మంచిపేరు సంపాదించారు. ఇప్పటికి సుమారు 10వేల మందికి పైగా రైతులు వీటివల్ల సేంద్రియ, ప్రాకృతి సుస్థిర వ్యవసాయ పద్ధతులపై అవగాహన పెంచుకున్నారు. ఆ అవగాహనతో వారి ఆలోచనలో కొత్తమార్పు కొట్టొచ్చినట్లు కన్పిస్తుంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిద్దెతోట, పెరటితోట, ఇంటి పంట భావనను స్ఫూర్తిగా తీసుకుని ఆదిలాబాద్, సిద్ధిపేట, వరంగల్, కరీంనగర్, సూర్యాపేట, నల్గొండ, మిర్యాలగూడ, ఖమ్మం, మహబూబ్‌నగర్, వనపర్తి పట్టణాలతోపాటు హైదరాబాద్ నగరం నలువైపుల చైతన్య శిబిరాలు నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రతి పట్టణానికి, నగరంలోని ప్రతి కాలనీకి మిద్దెతోట భావనను తీసుకెళ్లి విజయం సాధించారు. ఉద్యానవన శాఖ కమిషనర్ ఎల్.వెంకటరెడ్డి, ఆయన సిబ్బంది, మిద్దెతోట నిపుణులు తుమ్మేటి రఘోత్తంరెడ్డి, రవిచంద్రలతోపాటు ప్రొఫెసర్ రావి చంద్రశేఖర్‌లను సమన్వయం చేసుకుంటూ రైతునేస్తం వెంకటేశ్వరరావు నిర్వహించిన అవగాహన తరగతుల ప్రభావం ఊహకందనిది. ఇదే రీతిలో ఈ అవగాహనలోనే సేంద్రియ సాగు విధానాలను చూపించి రైతుల ఆలోచనా సరళిలో ఓ మార్పుకు బీజం వేశారు. ప్రముఖ కవి, విశే్లషకులు, కథారచయిత తుమ్మేటి తన రోజువారీ అనుభవాలతో తీసుకొచ్చిన ‘మిద్దెతోట’ పుస్తకం అందరినీ ఆకట్టుకుంది.
తొలి రోజుల్లో రూపొందించిన వీడియోల స్థానంలో దేశంలోనే తొలిసారిగా సేంద్రియ సాగుకు సంబంధించి యాప్‌ను అభివృద్ధి చేసి ‘శభాష్’ అన్పించారు. రైతునేస్తం అంశాలను యూ ట్యూబ్ చానల్‌లో చూస్తున్నవారి సంఖ్య రెండు లక్షలకు దాటడం వీరి నిబద్ధతకు నిదర్శనం. గత సంవత్సర కాలంగా చిరుధాన్యాలతోనే ఆహారం-ఆరోగ్యం అంటున్న కర్నాటకకు చెందిన డా.ఖాదర్‌వలితో రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘మిద్దెతోట’కు మించిన రీతిలో అన్నట్లు అవగాహన చైతన్య శిబిరాలు నిర్వహిస్తూ ఓ నిశ్శబ్ద విప్లవానికి బాటలువేసింది. రైతునేస్తం ఫౌండేషన్ రైతులతో చిరుధాన్యాల సాగుకు సంబంధించి మార్కెటింగ్ అంశంలో అవగాహన ఒప్పందం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
సేంద్రియ సాగుకు సంబంధించి ధ్రువీకరణ పత్రం ఇచ్చే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సేంద్రీయ ధృవీకరణ సంస్థతో శిక్షణా తరగతులకు సంబంధించి అవగాహన ఒప్పందం చేసుకున్నారు. సేంద్రియ ఉత్పత్తుల అమ్మకాలు ప్రోత్సహించేందుకు రిటైల్ దుకాణాలు కూడా ప్రారంభించారు. వీటన్నింటికి మించి తన రైతునేస్తం పత్రిక వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం వ్యవసాయం, అనుబంధ రంగాలలో విశేష సేవలందించిన పాత్రికేయులు, రైతులు, శాస్తవ్రేత్తలు, విస్తరణ అధికారులను గత 12 సంవత్సరాలుగా ఘనంగా ‘పద్మశ్రీ ఐ.వి.సుబ్బారావు రైతునేస్తం’ పురస్కారాలతో సత్కరిస్తుండటం విశేషం. గత 2 సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో ముప్పవరపు ఫౌం డేషన్ భాగస్వామ్యం అందుకోవడం విశేషం. ఒక ప్రభుత్వమో, మరొక కార్పొరేట్ సంస్థనో వేరొక స్వచ్ఛంద సంస్థనో చేయవల్సిన పనులన్నింటినీ ఒక వ్యక్తిగా వెంకటేశ్వరరావు నిర్వహిస్తుండడం ప్రశంసనీయం. ఈ కృషి మరింత శాస్త్ర విజ్ఞానపు వెలుగులు సంతరించుకుని లక్ష్యసాధన దిశగా రైతును రారాజు చేసేవరకు కొనసాగాల్సి ఉంది.
(ఈనెల 11న ‘రైతునేస్తం’ వెంకటేశ్వరరావు ఢిల్లీలో ‘పద్మశ్రీ’
పురస్కారం అందుకోనున్న సందర్భంగా..)

-వలేటి గోపీచంద్ 94412 76770