Others

సంసారసాగరాన్ని దాటే సులభోపాయం( సాంఖ్యయోగం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకనాడు కర్దమమహాముని మహావిష్ణువు చేత ప్రేరేపించబడి స్వాయంభువ మనువు కుమార్తె అయిన దేవహూతిని వివాహం చేసుకొన్నాడు. ఆ దేవహూతి పతిసేవాపరాయణురాలై ఎంతో కాలం కర్ధమ మునికి సేవలు చేసింది. ఆమె నియమ నిష్టలను, ఆమె అంతరంగాన్ని అవలోకించిన కర్దమముని ఎంతో సంతోషించి తనకు మహావిష్ణువు అప్పజెప్పిన కార్యాన్ని చేయడానికి సంసిద్ధపడి తన భార్య దేవహూతిదగ్గరకు వచ్చాడు.
తన భర్త అంతరంగాన్ని తెలుసుకొన్న దేవహూతి ఎంతో సంతోషంతో ఆయన్ను ఆహ్వానించింది. కర్దమ ముని దేవహూతి కోసం ఒక ప్రత్యేకమైన విమానాన్ని సృజియించాడు. ఆ విమానంలో ఊహించలేని సౌఖ్యాలను పొందడానికి వీలును ఏర్పాటుచేశాడు. దానినిచూసిన దేవహూతి తన భర్త శక్తిని తెలుసుకొని ఆశ్చర్యానందాలను పొందింది. వారిద్దరూ కలసి సృష్టికార్యాన్ని చేయడానికి సంకల్పించుకున్నారు. బిందు సరోవరంలో దేవహూతిని స్నానం చేయమని కర్దముడు చెప్పాడు. ఆమె అక్కడికి వెళ్లగానే చాలామంది ముతె్తైదులు వచ్చి ఆ దేవహూతికి నలుగు పెట్టి అభ్యంగన స్నానం చేయంచి అంగరాగాలతో, లేపనాలతో అందంగా అలంకరించారు. దేవహూతి కోసం సృష్టించిన ఆ విశేషసౌఖ్యాలున్న విమానంలో దేవహూతిని కూర్చొనపెట్టుకుని భూమండలమంతా తిరిగి చూపించి తన నిజనివాసానికి తన భార్యను తీసుకొని వచ్చాడు. ఆ తరువాత వారిద్దరూ ఏకాంతంలో చాలాకాలం గడిపారు.
కర్దమ ముని దేవహూతికి తొమ్మండుగురు కన్యలు జన్మించారు. వారిని ఎంతో అల్లారుముద్దుగా పెంచసాగారు.
మరికొన్నాళ్లు గడిచాయి. తాను పెళ్లి చేసుకోవడానికి ముందుగా పెట్టిన షరతు ప్రకారం కర్దముడు దేవహూతిని వదిలి సన్యాసాశ్రమంలోకి వెళ్లదలిచాడు. ఆ సంగతిని తెలుసుకున్న పతివ్రత దేవహూతి అమితంగా దుఃఖించింది. కర్దమమునిలో ఇలా మాట్లాడింది. ‘‘ప్రియా! మీరు సంసారంలో ఉండికూడా విరక్తులై అనునిత్యం ఆ దేవదేవుని స్మరణలోనే కాలం గడిపారు. కానీ నాకు అది చేతనవడంలేదు. నేను పుత్రుడిని కనాలనే వాంఛ ను కలిగి ఉన్నాను. అంతేకాదు మనకుపుట్టిన ఈ తొమ్మండుగురు కన్యలకు మంచి వరులను తెచ్చి మనిద్దరమూ కలసి కన్యాదానం చేయాలని కూడా నాకుంది. దానితోపాటే నాకు ఈమోహ ప్రపంచంనుంచి బయట పడాలని కూడా ఉంది. ఈసంసార సాగరాన్ని దాటే తరుణోపాయం చూపండి. అని వేడుకుంది.
ఆమె మాటలకు సంతోషించిన కర్దముడు దేవహూతి నీవు ఇంతగా చింతించనవసరం లేదు. నీవు దానాలతోను సత్కర్మలతోను కాలం గడుపుతుండు. కొద్దికాలంలోనే నీకోరిక నెరవేరుతుంది. మనిద్దరమూ సంతోషించే పుత్రుడు అనతికాలంలోనే మనకు పుట్టబోతున్నాడు. ఆ పుత్రుడు మరెవరో కాదు. అఖిల లోకాలకు ఆధారభూతమైన మహావిష్ణువే కపిలునిగా నీ గర్భాన ఉదయించబోతున్నాడు. అతడే నీకు ఈ సంసార సాగరాన్ని దాటడానికి సులభోపాయాన్ని ఉపదేశిస్తాడు అని వరం ఇచ్చాడు. భర్తమాటలతో దేవహూతి ఎంతో ఆనందించింది. కొద్దికాలంలోనే వారికోరిక తీరేట్లుగా ఒక శుభమూహూర్తంలో దేవహూతి గర్భం దాల్చింది. తొమ్మిదినెలలు నిండిన తరువాత పండంటి బిడ్డను ఆమె ప్రసవించింది. ఆ పసికందును చూడడానికి బ్రహ్మాది దేవతలు దిగి వచ్చారు. వారంతా ఆ పసికందుగా ఉన్న మహావిష్ణువును చూచి ప్రస్తుతించారు. వారంతా కర్దమ దేవహూతులను కొనియాడారు. మీ పూర్వ జన్మ పుణ్యం వల్లే మీకు ఆ దేవాదిదేవుడు పుట్టాడని మెచ్చుకున్నారు. బ్రహ్మదేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించి ‘అమ్మా దేవహూతి నీ పూర్వ పుణ్యం వల్ల మహావిష్ణువే నీకు బిడ్డడిగా పుట్టాడు. ఇతడే కపిలుడుగా పేరెన్నిక కంటాడు. ఈ కపిలుడే నీకు పరతత్వాన్ని బోధిస్తాడు. సంసారంలో ఉంటూ కూడా ఆ దేవదేవుని పాదపద్మాలను దర్శించే సులభోపాయాన్ని నీకు వివరిస్తాడు. అమ్మా అనంతర కాలంలో కపిలుడు బోధించిన బోధనే కపిలగీతగా, సాంఖ్యయోగంగా విఖ్యాతి చెందుతుంది’ అని చెప్పాడు. దేవహూతి ఆనందానికి అవధులులేకుండా పోయాయి. కర్దమదేవహూతులు తమ పుణ్యఫలాన్ని చూసుకొని సంతోషించారు.

- ఎస్. రేఖ