Others

వలసలకు స్వస్తి.. ఉపాధితో తృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో అశాంతికి నెలవైన ఆ ఈశాన్య రాష్ట్రం నుంచి నిత్యం వేలాది మంది యువతీ యువకులు ఉపాధి కోసం ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాలకు వలస పోతుంటారు.. ప్రాంతీయ విద్వేషంతో మహా నగరాల్లో కొందరు తమపై దాడులు చేస్తున్నా- వలస వచ్చిన వారు వౌనంగా భరిస్తారు.. జీవనోపాధి కోసం వలస బాట పట్టిన నాగాలాండ్ యువత అవమానాలకు, అవస్థలకు ఎదురీది కాలం వెళ్లదీస్తుంటారు.. సమస్యలతో సహజీవనం చేస్తున్న వీరిని ఆదుకొనేందుకు నాగాలాండ్ యువతి హెకానీ జఖాలు దీక్ష వహించి అందరి ప్రశంసలను అందుకొంటోంది. తన లక్ష్యాన్ని సాధించేందుకు ఆమె మంచి ఉద్యోగాన్ని సైతం వదులుకొంది.
నాగాలాండ్‌లోని దిమాపూర్‌కు చెందిన హెకానీ న్యాయవాద వృత్తిలో రాణించాలని కలలు గని అందుకు అనుగుణంగానే బెంగళూరు, ఢిల్లీలో ఉన్నత విద్యను పూర్తి చేసింది. తండ్రి ఆర్మీ ఉద్యోగి కావడంతో ఆమె క్రమశిక్షణతో చదువుతూ తెలివైన విద్యార్థినిగా పేరు తెచ్చుకొంది. సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఆమె తనకు దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ, శాన్ ఫ్రాన్సిస్కో (అమెరికా) విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేసింది. వాషింగ్టన్‌లో అధ్యాపక వృత్తిలోను, న్యూ యార్క్‌లోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో కొన్నాళ్లు పనిచేశాక ఢిల్లీలోని ఓ ప్రముఖ కార్పొరేట్ లా కంపెనీలో ఉద్యోగానికి ఎంపికైంది. న్యాయవాదిగా పనిచేయాలన్న చిరకాల వాంఛ నెరవేరినప్పటికీ, తన రాష్టమ్రైన నాగాలాండ్ నుంచి వేలాది మంది యువతీ యువకులు నిత్యం వలస బాట పట్టడం ఆమెను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. వృత్తిపరంగా ఓసారి ఆమె అప్పటి నాగాలాండ్ ముఖ్యమంత్రి నీఫ్యూ రియోను కలుసుకొని, తమ ప్రాంతంలో వలసల గురించి చర్చించింది. వృత్తివిద్యల్లో తగిన నైపుణ్యం లేకపోవడం, ఆర్థిక సమస్యల వల్ల నాగాలాండ్ యువత నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారని గ్రహించి, దీనికి ఉపశమనం కలిగేలా ఏదైనా చేయాలన్న సంకల్పం ఆమెలో మొదలైంది. ఆ తర్వాత ఆమె నాగాలాండ్ ముఖ్యమంత్రిని మరోసారి కలిసి, తాను ఉద్యోగానికి రాజీనామా చేసి సొంత రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోసం పనిచేస్తానని ప్రకటించింది. ఆమెకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని ముఖ్యమంత్రి భరోసా ఇవ్వడంతో హెకానీ ఇక వెనుదిరిగి చూడలేదు.
ఢిల్లీలో తాను ఉండగా నాగాలాండ్ యువతీ యువకులు చిన్న చిన్న పనులు చేస్తూ ఎన్నో ఇబ్బందులు పడడం చూశానని హెకానీ గుర్తు చేస్తుంటారు. టిఫిన్ పార్లర్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్‌లో కొద్దిపాటి జీతానికి ఈశాన్య రాష్ట్రాల వారు పనిచేస్తుంటారని, వారికి వృత్తి నైపుణ్యం లేకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని ఆమె అంటారు. పల్లెప్రాంతాల నుంచి వలస పోయేవారు నగరాల్లో నానా పాట్లు పడుతుంటారని ఆమె గ్రహించింది. విద్య, సాంకేతిక నైపుణ్యం, ఆర్థిక స్థోమత లేకపోవడంతో యువతకు వలసలే శరణ్యమని, ఈ దుస్థితిని నివారించేందుకు వారి జీవనోపాధిని మెరుగుపరచాలని ‘యూత్‌నెట్’ పేరిట 2006 ఫిబ్రవరిలో ఓ స్వచ్ఛంద సంస్థను మిత్రుల సహకారంతో ఆమె ప్రారంభించింది. నిరుద్యోగ యువతకు స్థానికంగా ఉపాధి కల్పించేందుకు వృత్తిపనుల్లో శిక్షణ అవసరం అని భావించి అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో స్వయం ఉపాధి పథకాలకు ఆమె వ్యూహరచన చేసింది. మంచి ఉద్యోగాల కోసం ఆరాటపడే యువతీ యువకుల్లో నమ్మకం కలిగించేందుకు తొలినాళ్లలో ఆమె చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇతర ప్రాంతాలకు వలస పోకుండా స్థానికంగా ఉపాధి చూపేలా భరోసా ఇవ్వడంతో యువతలో ‘యూత్‌నెట్’ పట్ల ఆసక్తి కలిగింది. వివిధ వృత్తుల్లో శిక్షణ ఇస్తూ నైపుణ్యం పెంచడం, ఉపాధి అవకాశాల పట్ల అవగాహన కలిగించడం, యువతను ఉత్పత్తిదారులుగా తీర్చిదిద్దడం వంటి అంశాలు హెకానీకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. నిరుద్యోగ యువతకు అయిదేళ్ల వృత్తిశిక్షణ, ఉపాధి కార్యక్రమాన్ని 2013లో ఆమె ప్రారంభించింది. ఇందులో శిక్షణ పొందిన వారు గత ఏడాది నాటికి వివిధ సంస్థలలో ఉపాధి పొందారు. కొందరు స్వయం ఉపాధి పథకాల పట్ల మొగ్గు చూపారు.
దేశంలోని మిగతా ప్రాంతాల మాదరి నాగాలాండ్‌లో ఇంకా ఇంటర్నెట్, మెరుగైన విద్యుత్ సరఫరా, ఇతర ప్రాథమిక వనరులు పూర్తి స్థాయిలో లేవు. ఈ నేపథ్యంలో సేంద్రియ సాగు, ప్యాకేజింగ్, ఆహార ఉత్పత్తులు, రవాణా, చేతివృత్తుల్లో వేలాదిమంది యువతీ యువకులకు ‘యూత్‌నెట్’ ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నారు. ‘మేడిన్ నాగాలాండ్’ నినాదాన్ని నిజం చేసేందుకు ఆమె ప్రారంభించిన ఉపాధి కార్యక్రమాల్లో ఇంతవరకూ దాదాపు 30వేల మంది యువతీ యువకులు ఉత్పత్తిదారులుగా మారారు. మేఘాలయ తదితర ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలను అమలు చేసి, వలసలను నివారించాలన్నదే తన ధ్యేయమని హెకానీ చెబుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఈశాన్య రాష్ట్రాల ప్రతిభను చాటి చెప్పేందుకు కృషి చేస్తున్నామని, తమ ప్రాంత యువతలోనూ ఇప్పుడు ఇలాంటి చైతన్యం కనిపిస్తోందని ఆమె అంటున్నారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలని చాలామంది కలలు కంటారని, అయితే వారికి సరైన దిశానిర్దేశం చేసినపుడే అవి సాకారం అవుతాయని ఆమె చెబుతున్నారు. ఈశాన్య రాష్ట్రాలు దేశానికి స్ఫూర్తి కావాలని ఆకాంక్షిస్తున్న హెకానీ తన సేవలకు గుర్తింపుగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి ఉన్నత పురస్కారాన్ని అందుకున్నారు. *