Others

‘మార్చి 23’.. కొన్ని స్వప్నాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశ చరిత్రలో మార్చి 23వ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. ప్రఖ్యాత సోషలిస్టు నాయకుడు రామ్‌మనోహర్ లోహియా 1910 మార్చి 23న జన్మించారు. విప్లవవీరులైన సర్దార్ భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌లు ఉరితీయబడిన రోజు 1931 మార్చి 23. ప్రత్యేక పాకిస్తాన్ కావాలని 1940లో తీర్మానించిన రోజు మార్చి 23. పాకిస్థాన్ ఇస్లామిక్ ప్రజాస్వామ్యమని 1956లో తీర్మానం చేసి అమలులోకి తెచ్చుకున్న రోజు మార్చి 23. భగత్‌సింగ్ గురించి ప్రతి సంవత్సరం మనమంతా గుర్తుచేసుకుంటూనే ఉన్నాం. డా.రామ్‌మనోహర్ లోహియాను అప్పుడప్పుడూ తలచుకుంటాం. పాకిస్తాన్ ఏర్పాటుకు తీర్మానించిన రోజు గురించి ఈ తరానికి తెలియనే తెలియదు. ఇస్లామిక్ ప్రజాస్వామ్యం పాకిస్థాన్‌లో పడుతూ లేస్తూ సైనిక అధికారుల చేతుల్లో పడి తిరిగి ప్రజాస్వామ్యంలోకి రావడం గమనిస్తున్నాం. పాక్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడినప్పటికీ సైన్యం పాత్ర, ప్రభావం ఇప్పటికీ బలంగానే కొనసాగుతున్నాయి. సైన్యం మద్దతు, ఇస్లామిక్ ప్రజాస్వామ్యం అనే వ్యవస్థలు కలిసిపోవడంతో పాకిస్థాన్‌లో ఉగ్రవాద శిబిరాలు పెరుగుతూ వచ్చాయి. అప్ఘనిస్థాన్‌లో, పాకిస్థాన్‌లో ఉగ్రవాదం పెరగడానికి, మత్తు పదార్థాల విక్రయానికి మధ్య విడదీయలేని సంబంధం కొనసాగుతున్నది.
మహమ్మద్ అలీ జిన్నా పాకిస్థాన్ కోసం పట్టుబట్టి, చివరకు దేశ విభజనతో అనుకున్నది సాధించాడని, 1940 నుండి భారత ఉపఖండంలో నిరంతర సంఘర్షణలకు కారకుడయ్యాడని అంటారు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. జిన్నా ప్రత్యేక పాకిస్థాన్‌ను కోరడానికి గల మరో చెయ్యి కాంగ్రెస్ జాతీయ నాయకత్వానిదే. ముస్లింల ఆకాంక్షలను, అధికారంలో భాగస్వామ్యాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని గాంధీజీ ఆశించాడు. కాంగ్రెస్ నాయకత్వం దేశం మూడుముక్కలైనా సరే అని భావించడం వల్ల ఇది జరిగింది. తద్వారా ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాలు ఆయుధాల మీద, సైనిక పాటవాల మీద పెడుతున్న ఖర్చు జాతీయ ఉత్పత్తి నిష్పత్తిలో బాగా పెరిగిపోయింది. ఒక్క ఇండియా సైనిక వ్యయమే ప్రపంచంలో మూడవ దేశంగా, పాకిస్థాన్ వ్యయం ఆరవ దేశంగా మారిందంటే ప్రజల జీవన ప్రమాణాల కోసం వెచ్చించాల్సిన పెట్టుబడి, సంపద ఎంతగా సంఘర్షణల కోసం, రక్షణ పేరిట ఖర్చవుతున్నదో లెక్కలు వేస్తే కడుపు తరుక్కుపోతుంది. ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల్లో అభివృద్ధి మందగించడానికి సంపద పెట్టుబడుల వృద్ధి, సంక్షేమం అందించడానికి సంపద ఖర్చుకావడం ప్రధాన కారణం.
రామ్‌మనోహర్ లోహియా కాంగ్రెస్ రాజకీయాల్లో ఉంటూ సోషలిస్టు ఆలోచనలు చేశాడు. ఆ తర్వాత సోషలిస్టు పార్టీని స్థాపించాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వంలో, చట్టసభల్లో, పార్టీల్లో 60 శాతం వాటా ఉండాలని కోరాడు. తన పార్టీలో వాటిని ఆచరించాడు. ఆ ఆచరణలో భాగంగానే 1967 సంవత్సరం నుండి ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలలో కాంగ్రెస్‌ను ఓడించి సోషలిస్టు పార్టీ అధికారంలోకి రావడం జరుగుతూ వచ్చింది. మండల్ కమిషన్ పేరుతో సుప్రసిద్ధుడైన బిందేశ్వరి ప్రసాద్ మండల్, లాలూప్రసాద్ యాదవ్, నితీశ్‌కుమార్, ములాయం సింగ్ యాదవ్ మొదలైనవారు లోహియా ఆలోచనా విధానం నుండి పుట్టినవారే. 1967లో రామ్‌నరేష్ యాదవ్ ముఖ్యమంత్రి కాగలిగారంటే లోహియా ఆలోచనలే కారణం. లోహియా ఆలోచనల ఫలితంగానే ఎమర్జెన్సీ తర్వాత 1977లో ఏర్పడిన జనతా పార్టీలో ప్రధాన భాగస్వామిగా ఉండిన సోషలిస్టు పార్టీ నాయకులు పట్టుబట్టిన మూలంగానే నాటి ప్రధాని మొరార్జీ దేశాయ్ బిహార్ మాజీ ముఖ్యమంత్రి, పార్లమెంట్ సభ్యుడైన బి.పి. మండల్‌ను బీసీ కమిషన్ ఛైర్మన్‌గా నియమించారు.
పాకిస్థాన్‌లో మార్చి 23వ తేదీన జాతీయ దినోత్సవం జరుపుకుంటారనే విషయం గూగుల్, వికీపీడియా వంటివి చూస్తే తప్ప తెలియలేదు. కొందరు ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు తిరిగి ఒక్కటి కావాలని ఆశిస్తూ ఉంటారు. అందులో హిందుత్వ శక్తులు కూడా ఉన్నాయి. ఈ మూడు ప్రాంతాలు మళ్లీ ఒక్క దేశంగా మారడం సాధ్యమేనా? అనే చర్చలో మార్చి 23న 1940లో పాకిస్థాన్ కావాలని చేసిన తీర్మానం వెనుక గల కారణాలని అవలోకించడం అవసరమవుతుంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల జనాభా సుమారు 27 కోట్లు, ఇండియాలో ముస్లింల జనాభా 15 కోట్లు కలిసి 42 కోట్లు. మొత్తం జనాభాలో మూడవ వంతు జనాభా అవుతుంది. రాజకీయాల్లో, న్యాయవ్యవస్థలో, అన్ని రంగాల్లో ముస్లింలు మూడింట ఒక వంతు. ఇది ఇప్పుడున్న తరం అంగీకరించడానికి సిద్ధంగా ఉంటే భవిష్యత్తులో మూడు దేశాలు కలిసి తిరిగి ఒక దేశంగా మారవచ్చు.
అయితే ఈ క్రమాన్ని అడ్డగించే శక్తులు మతాల మధ్య, ప్రాంతాల మధ్య, జాతుల మధ్య, భాషల మధ్య సంఘర్షణలను, ద్వేషాన్ని వ్యాప్తి చేస్తాయి. ద్వేషాన్ని, సంఘర్షణను రాజేసేవారు సమైక్యతను సాధించలేరు. కానీ అలా ద్వేషిస్తూనే అఖండ భారత్ గురించి పలువురు మాట్లాడడం విచిత్రమైన విషయం. ఆప్ఘనిస్థాన్‌ను కూడా కలుపుకుంటే మహాభారత కాలం నాటి గాంధార దేశం ‘ద్రౌపది తల్లిగారి ప్రాంతం) కూడా కలిసి వస్తుంది. ఇండోనేషియా, జావా, సుమిత్ర కూడా భారత సంస్కృతిక ఉపఖండంలో భాగమే అని అంటారు. ఇవన్నీ కలిస్తే ఇదొక చిన్న ఐక్యరాజ్యసమితి అవుతుంది. కామన్‌వెల్త్ దేశాల వలె, సార్క్ దేశాల వలె ఈ దేశాలు కలిస్తే కలువవచ్చు. ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ కలిసి యునైటెడ్ కింగ్‌డం వలె సమాఖ్య దేశాలు ఏర్పడవచ్చు. అప్పుడు సైనిక వ్యయం బాగా తగ్గిపోతుంది. సామరస్యం వెల్లివిరుస్తుంది. భగత్‌సింగ్ కోరిన స్వామ్యవాదం , లోహియా చెప్పిన శాంతియుత పరివర్తన సాధించనూ వచ్చు. ఇందుకు సహృదయత అవసరం. మార్చి 23వ తేదీ ఈ మూడు కోణాలను చరిత్రలో తిరిగి ప్రాధాన్యత కొనసాగించడానికి హిందూ, ముస్లింల సఖ్యతతోపాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, సిక్కు, మైనారిటీల సమైక్యత, సాధికారికత సాధించినప్పుడే సాధ్యపడుతుంది. అందుకుగాను మార్చి 23 ఒక స్ఫూర్తిదాయక దినంగా ఈ మూడింటినీ కలుపుకొని శాంతియుత పరివర్తనను, సహృదయతను అలవర్చుకున్నప్పుడు సాకారమవుతుంది.
స్వార్థానికి దేశభక్తి, హిందుత్వం, ఇస్లాం జాతీయత, సంస్కృతి, భాష, అస్థిత్వం వంటి పేర్లు, తాత్వికతలను జోడించి రూపం మార్చినప్పుడు అవి సంఘర్షణను ముందుకు తెస్తాయి. ఒకప్పుడు విభజనకు గురైన రెండు జర్మన్ దేశాలు మళ్లీ ఒకే దేశంగా అవతరించడం తెలిసిందే. సోవియట్ యూనియన్ 13 దేశాలుగా విడిపోయింది. సమైక్యతకు, సహృదయతకు, సంఘర్షణకు, ఆధిపత్య వాదాలు ఎలాంటి పరిష్కారాలను తెస్తాయో ఈ రెండు ఉదాహరణలు చాలు. బానిసలుగా తీసుకురాబడిన నల్లవారు ఇవాళ అమెరికాలో 11-13 శాతంగా అన్ని రంగాల్లో సాధికారికతతో పయనిస్తున్నారు. అందువల్ల మినీ ఐక్యరాజ్యసమితిలా భారత ఉపఖండం ఎదగవచ్చు. చైనాతో కూడా కలిసి ఎదగనూ వచ్చు. టిబెట్‌ను కొంతకాలం ఇండియా, చైనాల మధ్య వైరుధ్యానికి కేంద్ర బిందువుగా చేసిన దశ ఇప్పుడు అంతరించి చైనాలో టిబెట్ అంతర్భాగమైపోయింది. అన్ని దేశాలు కలిసి ఐక్యరాజ్యసమితి ఏర్పడినప్పుడు కొన్ని దేశాలతో కలిపి మినీ ఐక్యరాజ్యసమితిలా అనేక దేశాల ప్రాంతాలు కలిసి ఫెడరల్ ఆసియా దేశాల యూనియన్, యూరప్ యూనియన్ వలె సాధ్యం కావడం కష్టమేమీ కాదు. యూరప్ యూనియన్ బాలారిష్టాలను ఎదుర్కొంటోంది. ఇది సహజం.
కాలక్రమంలో నల్లవారు, తెల్లవారు సర్దుకొని అమెరికా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నట్టు సాగుతారు. ఇండియాలో మెజారిటీ జనాభా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు. అందువల్ల లోహియా ఆకాంక్ష, మహమ్మద్ ఆలీ జిన్నా ఆకాంక్ష, భగత్‌సింగ్ ఆకాంక్ష మూడు కలిసి వారి అభివృద్ధి సంక్షేమం సాధించడంలోనే ఇమిడి ఉన్నది. బీసీ, ఎస్సీ, ఎస్టీల మైనారిటీల సాధికారికత ఏమేరకు వాస్తవ రూపంలోకి వస్తుందో ఆమేరకు ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, చైనా తదితర దేశాల మధ్య ఫెడరల్ స్ఫూర్తి రావాలి. ప్రతి ప్రాంతం అభివృద్ధిలో, సంక్షేమంలో, అధికారంలో వాటా పొందగలిగినప్పుడు అదే భగత్‌సింగ్‌కు, లోహియాకు, మార్చి 23వ తేదీ ప్రాధాన్యతకు నివాళిగా నిలుస్తుంది.

-బీఎస్ రాములు 83319 66987