AADIVAVRAM - Others

పాండిత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో రాయటమన్నా, మాట్లాడటమన్నా చాలా కష్టం అనే భావం మనలో చాలామందిలో ఉంది. అందుకనే, ఎందుకొచ్చిన గొడవనీ, తేలిగ్గా ఉంటుందనీ శుభ్రంగా ఇంగ్లీషులో మాట్లాడేసుకుంటాం. ఆ ఇంగ్లీషు అయినా బాగా మాట్లాట్టం, రాయటం వచ్చా అంటే అదీ లేదు. ఏదీ, ఇంగ్లీషులో మంచి కథ కానీ, నవల కానీ రాసిన తెలుగు వాళ్లని చూపించండి. నూటికో, కోటికో ఒక వ్యక్తి ఉంటే ఉండొచ్చేమో కానీ నాకు ఇప్పటి వరకు ఎవ్వరూ తారసపడలేదు. కొత్తగా నేర్చుకుంటూన్న భాషలో పెద్ద పాండిత్యం ఉన్నట్లు భ్రమ పడి ఉగ్గుపాలతో ఒంటబట్టిన మాతృభాష రాదనుకుని మాట్లాడటానికి చిన్నతనం పడిపోతున్నాం.
ఏ భాష అయినా సరే వాడుతూన్న కొద్దీ వాడిగా తయారవుతుంది; వాడకపోతే వాడిపోతుంది. కనుక మన భాష కుంటుతూనో, మెక్కుతూనో మాట్లాడుతూ ఉంటే వాడితేరి వాడుకలోకి వస్తుంది.
‘మన భాషలో ‘వొకేబ్యులరీ లేదండీ’ అని ఒక సాకు వినిపిస్తూ ఉంటుంది. ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ, ఆధునిక అవసరాలకి సరిపోయే పద సంపద ఇంగ్లీషులో ఉన్నంతగా తెలుగులో లేకపోవచ్చు. కేవలం అనన్య (యూనిక్) పదాలు లెక్కపెట్టి బేరీజు వేస్తే ఇంగ్లీషులో షేక్స్‌పియర్ తను రాసిన నాటకాలన్నిటిలోనూ ఎన్ని అనన్య పదాలని వాడేడో దరిదాపుగా మన తిక్కన తెలుగు మహాభారతంలో అన్ని అనన్య పదాలనీ వాడేడని ఆచార్య ఆర్వీయస్ సుందరంగారు ఒకచోట అన్నారు. మనకి పదజాలం లేకపోలేదు. తిక్కన వాడిన పదజాలం, అన్నమయ్య వాడిన మాటలు వాడుక తప్పి మరుగున పడిపోయి ఉండొచ్చు. లేదా, మన ఆధునిక అవసరాలకి అవి నప్పకపోవచ్చు.
మనందరికీ అందుబాటులో ఉండే ఇంగ్లీషు నిఘంటువులలో సేకరించబడ్డ మాటలు దరిదాపు 50 వేలు ఉంటాయని సంప్రదాయికంగా ఒప్పుకుంటున్నారు. ఇదే విధమైన అంచనా ప్రకారం తెలుగు నిఘంటువులలో కూర్చబడ్డ మాటలు ఎన్నో నాకు తెలియవు. బహుశా 30వేలు దాటి ఉండొచ్చు. తత్సమాలని కలుపుకుంటే సుళువుగా ఈ సంఖ్య 50 వేలు దాటిపోతుంది. కనుక తెలుగులో పద సంపద లేకపోలేదు; వాడుక తగ్గింది. దానితో వాడి తగ్గింది. దానితో భాష వాడిపోతోంది.
ఒకటి మాత్రం నిజం. ఇంగ్లీషు హిమాలయ పర్వతాలలా ఇంకా అలా పెరుగుతూనే ఉంది. తెలుగు కూడా పెరుగుతోంది కానీ ఈ ఎదుగుదలలో తెలుగుతనం పోగొట్టుకుని ఒక కంతిరీ భాషలా - తెంగ్లీషులా - ఎదుగుతోంది. మనకి కావలసినది ఈ రకం ఎదుగుదల కాదు; తెలుగు వ్యాకరణానికి, తెలుగు నుడికారానికి తల ఒగ్గి తెలుగుతనంతో విస్తృతి చెందేది, ఆధునిక అవసరాలని తీర్చేదీ అయిన భాష కావాలి. ఉదాహరణకి తెలుగులో కర్మణి ప్రయోగం (పాసివ్ వాయిస్) లేదు; ఇంగ్లీషులోను, సంస్కృతంలోను ఉంది. కనుక మితిమీరి తెలుగులో కర్మణి వాడితే అందంగా ఉండదు. నిజమే, కానీ వైజ్ఞానిక రంగంలో పరిశోధనా పత్రాలు రాసేటప్పుడు ఇంగ్లీషులోలాగే తెలుగులో కూడా కర్మణి అవసరం వస్తూ ఉంటుంది.
మన భాష విస్తృతిని పెంచాలంటే వాడుకని పెంచాలి. వాడుక పెరగాలంటే క్లిష్టమైన భావాలని, సరికొత్త విషయాలని తెలుగులో వ్యక్తపరచటానికి సదుపాయంగా మన పదజాలం పెరగాలి. అలాగని టోకు బేరంలా, పెద్దఎత్తున, ఇంగ్లీషులోని మాటలని తెలుగులోకి దింపేసుకుంటే అవి మన నుడికారానికి నప్పవు. కనుక మన సంప్రదాయాలకి, మన వ్యాకరణానికి అనుకూలపడేలా ఈ పదజాలాన్ని సమకూర్చుకోవాలి. ఈ పని ఎవరు చేస్తారు? మనమే ప్రయోగాత్మకంగా చేసి చూడాలి. మాయాబజారు సినిమాలో ఘటోత్కచుడు చెప్పినట్లు మాటలు మనం పుట్టించకపోతే మరెక్కడ నుండి పుట్టుకొస్తాయి?
కొత్త మాటలు సృష్టిద్దామన్న ప్రతిపాదనని నేను ఎప్పుడు ప్రవేశపెట్టినా దానికి అభ్యంతరం చెప్పేవాళ్లే ఎక్కువ మంది కనిపిస్తున్నారు తప్ప సమర్థించేవారు చాలా తక్కువ. ఈ అభ్యంతరం చెప్పేవారికి కారణాలు లేకపోలేదు. వాటిల్లో కొన్ని-
1.ఇంగ్లీషులో ఈ మాటలు ఉండగా మళ్లా కొత్తవి తయారుచేసుకోవటం ఎందుకు?
సమాధానం: పొరుగువాడు పిల్లల్ని కంటున్నాడు కదా అని మనం కనటం మానేస్తున్నామా?
2.ఈ కొత్త మాటలు ఎవరు తయారుచేస్తారు? ఈ కార్యక్రమానికి ఒక కమిటీని వేసి ఒక ప్రామాణికమైన నిఘంటువుని చేయించండి. అప్పుడు చూద్దాం.
సమాధానం: భాష వాడుకకి కమిటీలు అక్కరలేదు. మన అవసరానికి అనుకూలంగా ఒక ఇంగ్లీషు మాటకి సరి అయిన తెలుగు మాట లేదని తెలియగానే అదే సందర్భంలో ఇంగ్లీషు రాని తెలుగు వ్యక్తి ఏమి చేస్తాడని ఆలోచించండి. అప్పుడు తెలుగు మాట మీ బుర్రకే తడుతుంది. మీ బుర్రకి తట్టిన మాట అందరూ సమ్మతిస్తారా అని ఆవేదన పడకండి; అలాగని మీ మాట మీద విపరీతంగా మమకారం పెంచేసుకోకండి. ప్రయోగించి చూడండి. అది పలకకపోతే మరో సందర్భంలో మరో మాట స్ఫురిస్తుంది. తగిన మాట ఏదీ స్ఫురించకపోతే ఇంగ్లీషు మాట ఉండనే ఉంది.
మరొక విషయం. ఎప్పుడూ ఇంగ్లీషు మాటలనే ఎరువు తెచ్చుకుని వాడాలని నియమం ఏముంది? మనకి అనేక భాషలతో సంపర్కం ఉంది కనుక అన్నింటిని సమదృష్టితో చూసి నాలుగు భాషల నుండీ స్వీకరిస్తే భాష మరీ ఇంగ్లీషు వాసన వెయ్యకుండా ఉంటుంది. ఆలోచించండి. ప్రయత్నించండి.

- వేమూరి వేంకటేశ్వరరావు ప్లెజన్‌టన్, కేలిఫోర్నియా