AADIVAVRAM - Others

చిత్రకళే సర్వస్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళలకు కాణాచిగా వున్న తెలంగాణలో చిత్రకళ వేలరేకుల పుష్పంగా వికసిస్తోంది. వివిధ సామాజిక వర్గాల నుంచి వస్తోన్న చిత్రకారులు తమ నేపథ్యంలో, దృక్కోణంలో చిత్రాలు గీస్తూ ఉండటంతో ఈ వైవిధ్యం విప్పారుతోంది. కొత్త సబ్జెక్ట్‌తో పాటు కొత్త శైలి ఉబికివస్తోంది. ఈ విస్తృత విశాల వైవిధ్యమే తెలంగాణ చిత్రకళను సుసంపన్నం చేస్తోంది.
అందులో భాగంగానే దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన గోనె లింగరాజు చిత్రకళపై తనదైన ‘ముద్ర’ను వేస్తున్నారు. వర్ణచిత్రాలు - డ్రాయింగ్స్ వేయడమేగాక చిత్రకళలో ఆయన లోతైన పరిశోధనలు చేయడం ముదావహం. 2010-11 సంవత్సరంలో ఆయన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి ‘ఆర్ట్ గ్యాలరీలు - దళిత చిత్రకారులు’ అన్న అంశంపై ఎం.్ఫల్ చేశారు. ఆ తర్వాత దళిత సామాజిక వర్గంలో సాలెలున్నారని, వారిని ‘నేతకాని’ అంటారని, వారి చేతిలో అపురూపమైన ‘కళ’ తరతరాలుగా పరిమళిస్తోందని తెలుసుకుని ఆ వస్తక్రళ - టెక్చర్‌పై అదే విశ్వవిద్యాలయం నుంచి ఆయన పిహెచ్.డి. పూర్తి చేశారు. కళల పట్ల ముఖ్యంగా చిత్రకళ పట్ల ఆయనకు గల అంకిత భావమేమిటో ఇది నిరూపిస్తోంది.
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం తుమ్మల పెన్‌పహాడ్ గ్రామానికి చెందిన గోనె లింగరాజుకు చిత్రకళ ఒక ‘వరం’లా అబ్బిందని ఫైన్ ఆర్ట్స్ కళాశాల పెయింటింగ్ ప్రొఫెసర్ స్టాన్లీ సురేశ్ కొనియాడారు. మరి కొంతమంది చిత్రకళా ప్రముఖులు సైతం ఇలాంటి అభిప్రాయానే్న వ్యక్తం చేశారు. ఆయన తన తల్లిపై వేసిన డ్రాయింగ్స్, తాను పుట్టి పెరిగిన ప్రాంతంలో జరిగిన ఉద్యమాలపై వేసిన వర్ణచిత్రాలు వెలకట్టలేనివి. అన్నం ఉడికిందా లేదా అని చూసేందుకు ఓ మెతుకు పట్టి చూసినట్టు లింగరాజు తన చుట్టూ ఉన్న పరిసరాలపై గీసిన అసంఖ్యాక డ్రాయింగ్స్, పొట్రేట్స్‌ను చూస్తే ఆయన ‘సత్తా’ ఏమిటో స్పష్టమవుతుంది.
తన రంగులు - రేఖలు - విన్యాసాలతో ప్రతిభను చాటుతున్న నైపుణ్యం వెనుక పాతికేళ్ల పరిశ్రమ దాగుంది. పరిపరి విధాల వేదన గూడు కట్టుకుంది. చిత్రకళపై వ్యామోహంతో ఆకలిని, అగచాట్లను ఎన్నింటినో అవలీలగా ఎదుర్కొన్నారు. కళపై తీవ్ర తపన ఉండటం కారణంగానే ఆయన ఓ మాలపల్లె నుంచి ఢిల్లీ వరకు ప్రయాణించారు. తనలాంటి ‘పిచ్చివాళ్లు’ దళితుల్లోనూ ఎందరో ఉన్నారని శోధించి వాస్తవాలను వెలికితీసి ప్రపంచం ముందు పెట్టారు. వంద సంవత్సరాల క్రితమే కుమరిల స్వామి అనే తెలంగాణ దళిత బిడ్డ భాగ్యరెడ్డి వర్మ, రావి నారాయణరెడ్డి లాంటి ఉదండులైన ఉద్యమకారులతో కలిసి తన చిత్రకళతో ప్రపంచాన్ని ఆకర్షించాడని ఆధారాలతో అందరి ముందుపరిచారు.
లింగరాజు పూనుకోకపోతే చిత్రకళలోని ఈ పార్శ్వం ఈ తరానికి దొరికేది కాదేమో? అలాగే సికిందరాబాద్ నగరానికి చెందిన దళిత చిత్రకారుడు కె.హెచ్.హరా చిత్రకళా రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన అపురూప చిత్రకారుడని లింగరాజు ఈ లోకానికి చాటి చెప్పాడు. ఇలా అనేక ఆసక్తికర, అపురూప అంశాలను వెలికితీసిన గోనె బాల్యం మాలపల్లెలో ప్రారంభమైంది. పశువుల చుట్టూ తిరిగింది. ఇంటి నుంచి పాఠశాలకెళ్లే దారిలోగల గ్రామ దేవతల గుళ్లపైగల రంగురంగుల బొమ్మలు - దేవతల ఆకారాలు, జంతువుల చిత్రాలు ఆకర్షించాయి. ముత్యాలమ్మ, పోశమ్మల చిత్రాలు, బొమ్మలు ప్రేరణనిచ్చాయి. తనకు తెలియకుండానే, బుర్రలో ఆ రంగులు - రేఖలు ముద్ర పడ్డాయి. భువనగిరిలో సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో ఉంటూ ఆరవ తరగతి చదువుతుండగా డ్రాయింగ్ టీచర్ తన నోట్‌పుస్తకాల్లో వేసిన బొమ్మలు చూసి ప్రశంసించాడు. ఆయన నోటి నుంచి తొలిసారి ‘ఫైన్ ఆర్ట్’ అనే మాట విన్నాడు.
తన ఇంట్లో చిత్రకారులు లేరు... అక్షర జ్ఞానం కూడా అంతంతే! తాత చెన్నయ్య మాత్రం చాలా మందిలా మగ్గం నేసేది. దాన్ని కళగా పరిగణించే పరిస్థితి అప్పట్లో ఇసుమంత కూడా లేదు. మొత్తం మీద భువనగిరి పాఠశాల తన జీవితాన్ని మలుపు తిప్పింది. అక్కడి డ్రాయింగ్ టీచర్ తనను ‘ఆర్ట్ ఎడ్యుకేషన్’ వైపు నడిపించాడు. ఖాళీ సమయాల్లో ఆ సార్ దగ్గరికెళ్లి మెలకువలు తెలుసుకోవడం.. ఆయన ప్రోత్సహించడం.. వివిధ పోటీలకు పేరు పంపించడం.. బహుమతులు రావడం అంతా చకచకా జరిగిపోయింది. దాంతో హైదరాబాద్‌లోని ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చదవాలన్న ‘కల’ రంగులద్దుకోసాగింది. అయితే అందుకు అవసరమైన విద్యార్హత లేకపోవడంతో సూర్యాపేటలో బ్యానర్లు, బోర్డులు రాసే పనిలో మునిగిపోయాడు. ఎట్టకేలకు 1995లో పదవ తరగతి పాసైతే.. అప్పుడు సైతం విద్యార్హత సరిపోలేదు. నిరుత్సాహంతో జనగామ వెళ్లి ఇంటర్ చేరాడు. అయినా ‘ఆర్ట్’పై మోహం తగ్గలేదు. అవసరమైన విద్యార్హత సాధించేందుకు పరిశ్రమించసాగాడు. ఫలితం దక్కలేదు. సమయం వృథా కానీయవద్దని సూర్యాపేటలో ‘రాజు ఆర్ట్స్’ అన్న షాపు తెరిచారు. అనంతరం హైదరాబాద్ చేరుకుని స్క్రీన్ ప్రింటింగ్, సైన్ బోర్డులు రాసే దుకాణంలో పనికి కుదురుకున్నాడు. మొత్తం మీద ఇంటర్ పాసయ్యాక, డిగ్రీలో చేరి స్కాలర్‌షిప్‌తో పాటు పని చేయగా వచ్చే డబ్బుతో జీవనం గడుపుతూ 1999లో జెఎన్‌టియు లోని ‘ఫైన్ ఆర్ట్స్’ కళాశాలలో చేరాడు. ఆరవ తరగతి నుంచి తనను తొలిచేస్తున్న ‘కల’ అనేక సంవత్సరాల అనంతరం అలా సాకారమైంది.
1998 - 2002 సంవత్సరాల కాలంలో బిఎఫ్‌ఏ చదివి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. 2003-05 సంవత్సరాలలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి ఎంఎఫ్‌ఏ ను పూర్తి చేశారు.
అనంతరం అనేక చిత్రాలు - డ్రాయింగ్స్ గీయడమే గాక చిత్రకళపై అనేక వ్యాసాలను ప్రచురించారు. నక్కాశీ చిత్రకళ, చిత్రకారులపై తెలంగాణ ఉద్యమ ముద్ర లాంటి వ్యాసాలను వివిధ పత్రికలలో రాశారు.
2008 సంవత్సరంలో నిర్మితమైన ‘బతుకమ్మ’ చలనచిత్రం కోసం తెలంగాణ సాయుధ పోరాటం అంశంపై వర్ణచిత్రాలను గీశారు. అనంతరం ‘జైబోలో తెలంగాణ’ చలనచిత్రం కోసం కూడా మరికొన్ని మేలైన తెలంగాణ బొమ్మలను గీసిచ్చారు. 2004 సంవత్సరం నుంచి ఆయన అనేక రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి ఆర్ట్స్ క్యాంపుల్లో పాల్గొని తన చిత్రాలతో పలువురిని ఆకర్షించారు. అనేక గ్రూపు చిత్రకళా ప్రదర్శనల్లో పాల్గొనడమే గాక 2014 సంవత్సరంలో సోలో చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. అందులో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చిత్రాలను ప్రదర్శించారు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లాంటి వివిధ సంస్థల్లో లింగరాజు వర్ణచిత్రాలు శాశ్వత ప్రదర్శనకు నోచుకున్నాయి.
కొసమెరుపు ఏమిటంటే ఆయన చిత్రకళనే పెళ్లి చేసుకున్నారు... అంటే ‘నవిత’ అనే చిత్రకారిణినే పెళ్లి చేసుకుని చిత్రకళకు ద్విగుణీకృతమైన సేవలందిస్తున్నారు.

-వుప్పల నరసింహం 9985781799