AADIVAVRAM - Others

‘తోట’లో విరిసిన వనె్నల సుమాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్ అనగానే చిత్రకళ గుర్తొస్తుంది. అయితే ఆ సంప్రదాయ చిత్రకళ ఇప్పుడు క్రమంగా తెరమరుగవుతోంది. కానీ ఈ నేలపై చిత్రకళ గుబాళిస్తూనే ఉంది. ఆదివాసీ (ట్రైబల్) చిత్రకళతో ప్రభావితమైన నిర్మల్ పెయింటింగ్, బొమ్మలు ఇతర కళాత్మక రూపాలకు కాలం చెల్లిందని భావిస్తున్న తరుణంలో ఆ కళకు.. చిత్రకళకు వర్తమాన చిత్రకళ శైలిని, సబ్జెక్ట్‌ను జోడించి ఓ కొత్త అందాన్ని చిత్రకారుడు తోట లక్ష్మినారాయణ అద్దుతున్నారు. ఆ రకంగా నిర్మల్ చిత్రకళ ఇంకా సజీవంగా ఉన్న భావన చిత్ర కళాప్రియులకు కలుగుతోంది. ఇది గొప్ప కొనసాగింపుగానే భావించాలి. అంతేగాక వర్తమాన చిత్రకళా రంగంలో ఓ వినూత్న వెలుగు చూసినట్టయింది.
ఆదివాసీల ప్రభావం ఎక్కువ ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో ఆధునిక చిత్రకళ గూర్చి చర్చించే వారెవరుంటారన్న భావన చాలామందిలో కలుగుతుంది. మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఆ మారుమూల ప్రాంతంలో రంగుల రహస్యాలు తెలిసిన వారెవరుంటారు? అన్న అనుమానంతో కూడిన ప్రశ్న కొందరిని తొలుస్తుంది.
విచిత్రమేమిటంటే... తోట లక్ష్మినారాయణ బావ గంభీరరావు నిర్మల్‌లో డ్రాయింగ్ టీచర్‌గా 1985 ప్రాంతంలో పని చేసేవాడు. ఆయన కర్నాటకలోని గుల్బర్గాలో డ్రాయింగ్‌లో డిప్లొమా చేసి నిర్మల్‌లో డ్రాయింగ్ టీచర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన దగ్గర చిత్రకారులకు చెందిన ‘గ్రేట్ మాస్టర్స్’ అన్న పుస్తకాలున్నాయి. ఎందరో చిత్రకారులకు ఆరాధ్యులైన పికాసో, వాన్‌గాగ్ తదితర చిత్రకారుల చిత్రాలు, వారి పనితీరు, అధిరోహించిన నూతన శిఖరాల గూర్చిన సమాచార ఆ పుస్తకాల్లో ఉంది.
చిత్రకళపై అభిరుచి ఉన్న వారెవరికైనా స్ఫూర్తినిచ్చే ఆ పుస్తకాల దొంతర, గ్రంథాలయం సహజంగానే తోట లక్ష్మినారాయణను ఆకర్షించింది. కుతూహలంతో బాటు ఉత్సాహాన్ని కలిగించాయి. అప్పటికి లక్ష్మినారాయణ హైస్కూల్ విద్యార్థి మాత్రమే. నిర్మల్ హైస్కూల్‌కు రాక ముందు ఆయన కుటుంబం భైంసాలో ఉండేది. ఆ చిన్న పట్టణంలోనే ప్రాథమిక విద్య నభ్యసించాడు. అక్కడి సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో అన్ని సబ్జెక్టులతోపాటు డ్రాయింగ్ క్లాసు ఉండేది. దిగంబర్ అనే మాస్టారు నేర్పించేవాడు. ఆ బోధన.. బొమ్మలు లక్ష్మినారాయణను ఆకర్షించి అటువైపు లాగాయి. అంతేగాక తన నానమ్మ రవికెలపై ఎంబ్రాయిడరీ చేయడం, నెమలి బొమ్మలు అందంగా తీర్చిదిద్దడం గమనించి తదేకంగా ఆ బొమ్మలు, పని విధానంపై మనసు నిలపడం వల్ల రంగుల పట్ల, చిత్రాలపట్ల, ఆకృతుల పట్ల, కళ పట్ల తెలియకుండానే మక్కువ ఏర్పడింది.
గ్రామీణ భైంసాలో పశువులు, పంట పొలాలు ఎక్కువ. దాంతో తన తోటి మిత్రులతో ఆట పాటలు ఎక్కువ కొనసాగాయి. గిల్లీదండ, దొంగాట లాంటి ఆటలెన్నో ఆడాడు. అలాగే పాత టైరుకు కర్ర సాయంతో ‘పయ్య’ ఆట ఆడటం, గోళీలాడటం నిత్యకృత్యం. బర్రెలపై, ఎద్దులపై ఎక్కి తిరగడం ఓ సరదా. విచిత్రమేమిటంటే అనంతరం లక్ష్మినారాయణ వర్ణచిత్రాల్లో ఇవన్నీ దర్శనమిచ్చాయి. బాల్య స్మృతులన్నీ కాన్వాసుపైకి తర్జుమా అయ్యాయి. అలా రంగుల ‘పుంగిరి’ పూయడానికి ఎంతో ‘స్ట్రగుల్’ చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా తన తండ్రి ఈ ‘లైన్’ ఆర్థిక భద్రతకు ఉపకరించదని, అందుకే అటువైపు వెళ్లరాదని ఆంక్షలు పెట్టడం, వ్యతిరేకించడం, ఇంట్లో ఘర్షణ జరగడం.. తన మనసు మాత్రం ఆ రంగుల ప్రపంచం వైపు లాగుతూ ఉండగా అనేక డ్రాయింగ్స్ వేస్తూ, ట్రైబల్ ఆర్ట్‌ను అనుకరిస్తూ బొమ్మలు గీస్తూ తన ‘దాహం’ తీర్చుకోసాగాడు.
ఆదిలాబాద్‌లో ‘కళాశ్రమా’న్ని ప్రముఖ వ్యక్తి రవీంద్రశర్మ నిర్వహించేవారు. గ్రామీణ వృత్తుల పునరుజ్జీవనాని కాయన విశేష కృషి చేశారు. బరోడాలో మాస్టర్స్ చదివి, ఆదివాసీ, గ్రామీణ కళల పట్ల అపార ప్రేమతో ఆదిలాబాద్ కేంద్రంగా వివిధ చేతివృత్తుల వారికి నూతన జవస్వతాలు అందించాలని తీవ్ర ప్రయత్నం - ప్రయోగం చేశారు. చిత్రకళ పట్ల కూడా ఆయన ఎంతో ఆదరణ చూపేవారు. అదో అలాంటి పెద్ద మనిషి (గురూజీ) తన బావ గంభీరరావు హైదరాబాద్‌లోని ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో లక్ష్మినారాయణను చేర్పించమని నచ్చజెప్పినా లక్ష్మినారాయణ తండ్రి అంగీకరించలేదు.
దాంతో నిర్మల్‌లోనే నక్కాశి చిత్రకారులతో కలివిడిగా తిరుగుతూ, వారి పిల్లలతో ఆడుతూ సొంతంగా సాధన చేయసాగాడు. ‘పోట్రేట్స్’ తనదైన శైలిలో వేయడం ప్రారంభించాడు. మార్గదర్శనం చేసేందుకు తన బావ ఉండనే ఉన్నారు. చిత్రకారులపై ఉన్న పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో పి.టి.రెడ్డి, ఎం.ఎఫ్.హుస్సేన్ తదితర చిత్ర ప్రముఖుల చిత్రాలు, వివరాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. అంతేగాక నక్కాశీ చిత్రకళ సజీవంగా, ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో, వాతావరణంలో లక్ష్మినారాయణ వందలాది.. వేలాది డ్రాయింగ్స్ కాగితంపై పెన్సిల్‌తో గీశారు. తనకు తాను నేర్చుకునే, బోధించుకునే పద్ధతిలో సాధనను తీవ్రం చేశాడు. ఈ క్రమంలోనే ఇంటర్ పూర్తయింది. డిగ్రీ మధ్యలోనే మానేశారు. చిత్రకళకు, డ్రాయింగ్‌కు మరింత దగ్గరయ్యారు.
ఈ సమయంలోనే కంప్యూటర్ విప్లవం వెలుగు చూసింది. ఓ కొత్త మాధ్యమం తొంగి చూసింది. అదే ‘ఆన్‌లైన్’ లక్ష్మినారాయణ తాను గీసిన బొమ్మలను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టాడు. పూణెకు చెందిన ‘ఆర్ట్‌హబ్ గ్యాలరీ’ వాళ్లు తొలి పెయింటిగ్‌ను కొనుగోలు చేశారు. అదో నూతన అనుభూతి. తొలి విజయం. తానేమిటో తనకు తెలిసొచ్చిన సందర్భం. తాను కలలుకన్న ప్రపంచం.. రంగుల ప్రపంచం సాకారమయ్యే సూచనలు స్పష్టంగా కనిపించాయి. నిర్మల్ లాంటి పట్టణంలో ఉంటూ ప్రపంచంతో సంబంధాలు నెరిపే సౌలభ్యం కల్పించిన కంప్యూటర్‌కు ఆయన మనసులోనే జోహార్లు పలికారు.
హాండ్‌మేడ్ పేపర్‌పై ఆక్రిలిక్ రంగులతో తన చుట్టూ ఉన్న దృశ్యాలు, గతంలో తాను అనుభవించిన జీవితం.. అన్నీ కలిసి రంగుల వర్షం కురిపించాయి. కాన్వాసులన్నీ ఇంద్రధనస్సులై మెరిశాయి. కాన్వాసు లభ్యం కాకపోతే బక్రాన్ (దర్జీ దగ్గర లభ్యమవుతుంది) పై వేసి కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. అంతేగాక తమ ప్రాంతంలో రొట్టెలు చేసే ‘మట్టి పెంక’పై రంగులు అద్ది నక్కాశి కళకు కొత్త రూపం తీసుకొచ్చారు. పేపర్ మెష్‌తో బొమ్మలు రూపొందించి రంగులు అద్దాడు. నూతనోత్తేజంతో కొత్తకొత్త ప్రయోగాలతో చిత్రకళకు కొత్త పరిమళాలను అద్దారు.
ఈ క్రమంలోనే హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ‘దాయిరా ఆర్ట్ గ్యాలరీ’తో సంపర్కం ఏర్పడటం తన బొమ్మలకు ఆర్డర్ ఇవ్వడం చకచకా జరిగిపోయింది. చివరికి వారి ఆస్థాన చిత్రకారుడిగా కొంతకాలం పని చేశారు. దాంతో తిరిగి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. తన సాధన, అనుభవం, అధ్యయనం, సృజన తనను నూతన ఎత్తులకు తీసుకెళ్లింది. ‘హిందూ’ లాంటి పత్రికలు తన చిత్రకళపై ప్రశంసలు కురిపించాయి. చిత్రకళా విమర్శకులు ఆదివాసీ చిత్రకళకు ఆధునిక రూపం లక్ష్మినారాయణ వర్ణ చిత్రాలని కితాబునిచ్చారు.
వర్తమానంలో ఆయన జానపదుల నేపథ్యంలో ఎద్దులు (బుల్స్), బర్రెలు, కోళ్లు, పక్షులు, ఆడపిల్లలు.. ఇట్లా అనేక బొమ్మలు గీస్తున్నారు. ‘డప్లివాలా’లను చిత్రిస్తున్నారు. రంగురంగుల పెద్ద టెంట్, దాని కింద బర్రెలు ఎద్దులు, వాటిపక్కన ట్రాన్సిస్టర్, ఆ ఫ్రేమ్‌లోనే ఇతర జంతువులు - పక్షులు, చిలకలు.. ఆడపిల్లలు కనిపించేలా.. అలాగే నీళ్లు చేపలు, కొంగలు, పువ్వులు.. మొత్తం ఓ ‘కొలాజ్’లా చూపే పెద్దపెద్ద కాన్వాసులపై తెలంగాణ సంస్కృతిని - సంప్రదాయాన్ని తోట లక్ష్మినారాయణ రంగుల్లో చిత్రిక పడుతున్నారు. చిత్రకళలో ఓ కొత్త పార్శ్వాన్ని ఆవిష్కరిస్తున్నారు.

-వుప్పల నరసింహం 99857 81799