AADIVAVRAM - Others

ఇంగ్లీషు మాటలే దిక్కు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాష సజీవమైన పాత్రల నోటి వెంట పలికించాలని రచయితలకి ఉంటుంది. నేను ఇంతవరకు రాసిన కథలలో ఎక్కడా నాటు భాష వాడవలసిన అవసరం రాలేదు. కానీ అశ్లీలం (బూతు) లేకపోయనంత మాత్రాన భాష సాధుసమ్మతం అవాలని లేదు కదా.
అప్పుడప్పుడు ఫలానా మాట భయపడకుండా వాడొచ్చా, రాయొచ్చా అని అనుమానం వస్తూ వుంటుంది నాకు. ఈ మధ్య ‘్భయం’ అనే కథ రాసేను. అందులో అలాస్కాలో బయట ఎంత చలిగా ఉందో చెప్పటానికి ‘ముందు జాగ్రత్త పడకపోతే కాలకృత్యాలు తీర్చుకుందుకి కూర్చున్న కుర్చీ పీటకి ముడ్డి అతుక్కుపోయే ప్రమాదం ఉంది’ అని రాసేను. అది చదివి, నా కంటె వయస్సులో బాగా చిన్నవాడైన ఒక విద్యార్థి, ‘నన్ను మరీ విక్టోరియన్ అనుకోకుండా ‘ఈ’ మాట తీసేసి దీనికి బదులు ఇంగ్లీషు మాటో సంస్కృతం మాటో వాడండి’ అంటూ ఒక సలహా ఇచ్చేడు. శరీరంలో ఒక భాగం (అదీ జననాంగం కాదు) పేరు తెలుగులో వాడితే ఒక కుర్రాడు అలా అభ్యంతరం చెప్పేసరికి చకితుణ్ణయేను. ‘మూతి, ముడ్డి’ తెలుగు మాటలు. వీటిని వాడటానికి ఎందుకు అభ్యంతరం చెప్మా అని మధనపడి నాకు తెలిసిన ఇద్దరు రచయితలని సంప్రదించటానికి పిలిచేను. ఒకాయన - ఆయన ధోరణి ఆయనది - నా గొడవ పట్టించుకోకుండా మరొక విషయం ఏదో మాట్లాడుతూ, ‘మన వాళ్లకి ముడ్డి బద్దకం అండీ’ అన్నాడు. నా ఉల్లము ఝల్లున పొంగింది. రెండవ రచయిత, నా అలాస్కా కథలోని వాక్యాన్ని తీసుకుని.. ‘.. నా ఆసనం ఆ ఆసనానికి అతుక్కుపోయే ప్రమాదం ఉంది’ అని మార్చమని సలహా ఇచ్చేడు. ఒక ఓటు ఇటు, ఒక ఓటు అటు పడేసరికి ఇది ఎటూ తేలకుండా తుని తగవులా తేలింది. ఆ మధ్య బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్‌గారు మహాభారత ప్రవచనం చెబుతూ ‘అపానం’ అంటే ‘కింది భాగం’ అని చెప్పేసరికి ‘అపాన వాయువు’ అనే ప్రయోగం గుర్తుకి వచ్చింది. కనుక నా ‘్భయం’ కథలోని వాక్యాన్ని ‘ముందుగా జాగ్రత్త పడకపోతే కాలకృత్యాలు తీర్చుకుందుకి కూర్చున్న కుర్చీపీటకి అపానం అతుక్కుపోయే ప్రమాదం ఉంది’ అని రాస్తే ప్రాస కూడా కుదురుతుంది కదా అనిపించింది.
నా పరిశోధన పూర్తి అయింది. ఇక మూత్రపిండాల గురించి రాయటమే తరువాయి. ఉచ్చని ఉచ్చ అనాలా? మూత్రం అనాలా? యూరిన్ అనాలా? ఏది సాధు సమ్మతంగా ఉంటుంది? ఏది అందరికీ సులభంగా అర్థం అవుతుంది? ‘ఇక్కడ ఉచ్చలు పోయరాదు’ అనే ఫలకం చాలచోట్ల కనిపిస్తుంది కనుక ‘ఉచ్చ అన్న మాట వాడెయ్యండి’ అని ధైర్యం చెప్పేడు - శీర్షాసనం భంగిమలో ఉన్న ఇందాకటి రెండవ రచయిత. చేతిలో సుత్తి ఉన్నవాడికి అన్నీ మేకులలాగే కనిపిస్తాయిట. అలా, ఆసనాల భంగిమలో ఉన్న ఈయనకి అన్నీ ‘ఆసనాలు’లాగే కనిపిస్తాయి కాబోలు! ఈ తిరకాసు సలహా వినగానే ‘ఎమితిని సెపితివి కపితము, ఉమెతపువు తిని సెపితివా?’ అన్న పద్యం జ్ఞాపకం వచ్చింది. చెప్పటం తేలికే, తరువాత చివాట్లు నేను తినాలి కదా!
వైద్య శాస్త్రం గురించి రాసేటప్పుడు ఒక ఉచ్చతో పని తెములుతుందా? ఒకటికి వెళతాం. రెంటికి వెళతాం. ఒకటిని ధైర్యంగా ఉచ్చ అన్నప్పుడు రెంటిని ధైర్యంగా ఏమనాలి? తెలుగులో అయితే విశేషణం రూపంలో ‘పీతి కుక్క, పీతి గద్ద’ అనే ప్రయోగాలు వాడినంత తేలికగా నామవాచకం రూపంలో ‘ప’కి గుడి, య కింద య కి కొమ్ము’ని వాడటానికి మొహమాటం వేస్తోంది. ఇంగ్లీషులో అయితే గమ్మున జ్ఞాపకం వచ్చే మాటలు ‘స్టూల్, ఫీసీస్’. ఇనే్నళ్లు ముడ్డి కిందకి వచ్చినా సురేంద్రుడు చెప్పేవరకు ‘స్టూల్’ అన్న మాట ఇంగ్లీషులోకి ఎలా వచ్చిందో నాకు తెలియలేదు. నేను అలాస్కాలో కూర్చుందుకి వాడిన కుర్చీపీటని ఇంగ్లీషులో ‘స్టూల్’ అంటారు కదా. అశుద్ధాన్ని తెలుగులో చెప్పటానికి నోరు రాక మనం బాధ పడుతూన్నట్లే ఇంగ్లీషు వాడికి కూడా ‘్ఫసీస్’ అనటానికి నోరు రాలేదుట. అందుకని ‘అది’ కుర్చీలాంటి ఆసనం మీద కూర్చుని చేసే పని బాపతు కనుక ‘దానిని’ - మరేమిటనుకున్నారు - ‘కుర్చీ’ అన్నాడుట. ఆహా - అదేలెండి, ఇంగ్లీషులో సమానార్థకమైన ‘స్టూల్’ అన్నాడుట.
ఏడాదికొకసారి ‘స్టూల్ సేంపిల్’ పంపమని మా డాక్టరు అడుగుతూ ఉంటాడు. కాని ‘స్టూల్’ అన్న మాటంటే మా రాణికి అసహ్యం. అందుకని ‘కుర్చీని బాత్‌రూంలో కౌంటర్ మీద వదిలేశారు, అసహ్యంగా. అ మెయిల్ చేసేసి ఆ చేతులు రెండూ సోప్‌తో వాష్ చేసుకొండి’ అంటూ గదమాయించింది. కుర్చీని కౌంటరు మీద ఉంచటం ఏమిటి? కుర్చీని టపా ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటే అసలు విషయం అర్థం అయింది.
‘కుర్చీ’ అంటే మా రాణీకి ఎంత అసహ్యమో మా పెద్దమ్మాయి పుట్టినప్పుడు అర్థం అయింది. పిల్లలు పృష్ఠ భాగాన్ని శుభ్రంగా ఉంచినంతసేపూ మూతి దగ్గర ముద్దొస్తారు. అంతవరకు పిల్లదానితో ఆడేసుకుని డయపరు పాడవగానే, ‘పిల్ల దొడ్డికి వెళ్లింది, కడుగుతావా?’ అని ఒక అరుపు అరిచి థీసిస్ రాసుకునే పనిలో నిమగ్నం అయిపోయినట్లు నటించేవాడిని.
‘ఏమిటా నాటు భాష? నాకసలే అసహ్యం. కొంచెం ఇంగ్లీషులో బవెల్ మూవ్మెంట్ అందురూ’ అని బ్రతిమిలాడింది.
నగలు అడగలేదు. చీరలు అడగలేదు. మడులూ, మాన్యాలు అడగలేదు. ఇంగ్లీషులో మాట మాట్లాడమది. ఇంగ్లీషులో అన్నా, తెలుగులో అన్నా, తమిళంలో అన్నా అవన్నీ చచ్చినట్లు తనే కడగాలి కదా.
మూడ్రోజులు పోయేసరికి ‘బవెల్ మూవ్మెంట్’ అన్న పేరు వినేసరికి వాంతి చేసుకున్నంత పని చేసింది. కడిగేసి కూతురిని ముద్దులాడేసేది.
మరీ వివరంగా ‘బవెల్ మూవ్మెంట్’ అని ఇంగ్లీషులో అన్నా బాగులేదని పొడి అక్షరాలతో దానికి ‘బి.ఎం.’ అని పేరు పెట్టేం.
మా పిల్లలకి నోరు తిరగక దానిని ‘బీమా’ అని పిలిచేవారు.
ఇప్పుడు భోజనాల వేళప్పుడు ‘ఇన్సురెన్స్’ వ్యవహారాలు మాట్లాడవలసి వస్తే ఇంగ్లీషులోనే మాట్లాడుకోవాలి.
తెలుగు పతనానికి ఇదండి కారణం!
తెలుగుని ఒక ఆధునిక భాషగా పునరుద్ధరించారంటే తెలుగులో మాటలన్నిటిని తీసేసి వాటి స్థానాలలో ఇంగ్లీషు మాటలు జొప్పించాలి. ఆ పని నా చేతులతో నేను చెయ్యలేను. అందుకని మధ్యేమార్గంగా మూత్రపిండాలకి మూపీలు అని కొత్త పేరు పెట్టేను.

- వేమూరి వేంకటేశ్వరరావు ప్లెజన్‌టన్, కేలిఫోర్నియా