AADIVAVRAM - Others

నవదుర్గలకు రంగుల నైవేద్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడు పదుల వయసుగల చిత్రకారుడు సహజంగా వెనె్నల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలను, కొలనులోని కలువలను, కాకపోతే తన చుట్టూ కనిపించే పరిసరాలను బొమ్మలుగా వేస్తాడు. చిత్రకారుడు న్యాలపల్లి రాజేశ్వర్ మాత్రం నవనవోనే్మషమైన ‘నవదుర్గల’కు కాన్వాస్‌పై పవిత్ర పసుపు కుంకుమ, పత్రి పుష్పం రంగులతో నైవేద్యం సమర్పించారు. ఆశ్చర్యం!
తన వయసుకు మించిన పరిణతతో అష్టాదశ శక్తిపీఠాల ‘శక్తి’ని కాన్వాసుపై ప్రదర్శించారు. సంభ్రమాశ్చర్యం?!
అనేక ఆధ్యాత్మిక గ్రంథాలను, పురాణాలను, భక్తి సాహిత్యానే్న గాక నిష్పక్షపాతంగా పాశ్చాత్యులు రాసే పుస్తకాలు సైతం అధ్యయనం చేసి అందులోని ‘సారం’ ఆధారంగా రంగుల నీరాజనాలు పలుకుతున్నారు. జాన్ వుడ్రాఫ్ అనే పాశ్చాత్య రచయిత భారతీయ తాంత్రిక, తదితర విద్యల గూర్చి రాసిన ‘ఇంట్రడక్షన్ టు తంత్ర శాస్త్ర’ ‘ది సర్పంట్ పవర్’ అన్న ఆంగ్ల పుస్తకాల ఆధ్యయనంతో శక్తిపీఠాల్లోని తాంత్రిక మర్మాలను తెలుసుకుని వాటిని కాన్వాస్‌పై పొందుపరుస్తున్నారు, పెద్ద ‘పీఠం’ వేస్తున్నారు. విస్తుబోయేంత ఆశ్చర్యం!!
ఇదెలా సాధ్యమయిందని ఆ చిత్రకారుడిని ప్రశ్నిస్తే.. ప్రతి భారతీయ చిత్రకారుడు పాశ్చాత్య చిత్రకళపై, శైలిపై, పోకడలపై మనసు పెడతాడు.. నా సంస్కృతీ సంప్రదాయాల వైపు నేనెందుకు దృష్టి పెట్టకూడదన్న ఆలోచనతో ఇటువైపు మొగ్గానని ఆయన అంటారు.
సంస్కృతి అంటే బొట్టు.. బోనాలు, బతుకమ్మ, ఇతర ఆధ్యాత్మిక ఉత్సవాలు ఉండగా తాంత్రిక విద్యలు.. పురాణ గాథలపై ఎందుకు కుంచె కదిల్చారని ప్రశ్నిస్తే..
తెలంగాణలోని చాలామంది చిత్రకారులు ఆ రకమైన వస్తువుతో అసంఖ్యాకమైన చిత్రాలు గీశారు.. గీస్తూ వున్నారు. నేనూ అందులో తలదూర్చడం వల్ల కొత్తదనం ఏమీ ఉబికి రాదు, అందుకే కొంచెం పక్కకు జరిగి నా రంగుల ప్రయాణాన్ని ప్రారంభించానని అంటున్నారు న్యాలపల్లి రాజేశ్వర్.
సికిందరాబాద్, పికెట్‌లోని ఆయన స్టూడియోలో 3 ఇంటూ 5 అడుగుల ‘మహాదేవి’ అమ్మవారు వర్ణచిత్రాన్ని ఆయన పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆ చిత్రంలో తాంత్రిక విద్యలోని బిందువు, త్రికోణం, వసుకోణం, షట్కోణం, దశారయాగ్మ, పత్రాలు, వృత్తాత్రయం తదితర అంశాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఎంతో గంభీరంగా ‘శక్తి’ మూర్తి వివిధ ఆయుధాలు ధరించి దర్శనమిస్తుంది. ఆ రూపం, రంగుల మేళవింపు, సజీవతత్వం, ఆకర్షించే బిందువు, సింధువంతటి కరుణాత్మక చూపు... మాటలకందని భావనలు ఆ చిత్రంలో నిక్షిప్తమై కనిపిస్తాయి.
తెలంగాణలోని సిద్దిపేట సమీపాన దుబ్బాక (కేసీఆర్ చదువుకున్న పెద్ద గ్రామం) లోని ఓ చేనేత కుటుంబం నుంచి వచ్చిన న్యాలపల్లి నైపుణ్యం, వృత్తి భావన, తాదాత్మ్యత చూస్తే మనసు ‘వౌనం’లోకి జారుకుంటుంది.
గతంలో కరీంనగర్ జిల్లాకు చెందిన పి.టి.రెడ్డి తాంత్రిక చిత్రరచన చేసి సంచలనం సృష్టించారు. అది ఏడు దశాబ్దాల క్రితం నాటి మాట. వర్తమానంలో ఆ సంప్రదాయానికి కొనసాగింపుగా, మరింత మెరుగుపరిచి న్యాలపల్లి కాన్వాస్‌ను కల్లోలపరుస్తున్నారు. శ్రీయంత్రం, భైరవి యంత్రం, కమలాయంత్రం, మాతంగి యంగ్రం, భగలాముఖి యంత్రం, ధూమవతి యంత్రం, చిన్నమస్త యంత్రం, కాళీ యంత్రం, తారాయంత్రం, భువనేశ్వరీ యంత్రం.. ఇలా అనేక యంత్రాలు ఆయా చిత్రాల నేపథ్యంలో కనిపిస్తాయి. వాటిలో పాజిటివ్ (సానుకూల) శక్తి ఉంటుందన్న విశ్వాసం ఉంది. దశ మహా విద్యలకు చెందిన యంత్రాలకు ప్రాశస్త్యం ఉంటుందన్న నమ్మకమూ ఉంది. ప్రతి అమ్మవారి గుడిలో ఓ శక్తి యంత్రం ఉంటుంది. ఆ సానుకూల శక్తి తమపై ప్రసరిల్లాలని ప్రజలు ఆయా గుళ్లకు వెళతారు అని న్యాలపల్లి వివరించారు.
ఆయా యంత్రాలలో అనేక ఆకారాలు, డైమెన్షన్స్ ఉంటాయి. అవి చిత్రకళ ఉన్నతీకరణకు సైతం ఉపకరిస్తాయని, వృత్తం, బిందువు, త్రికోణం లేకుండా ఏ చిత్రకారుడు తన చిత్రాన్ని పూర్తి చేయలేడన్నది ఆయన అభిప్రాయం.
శతాబ్దాలుగా, తరతరాలుగా జానపదులు అమ్మవారిని ఆరాధిస్తున్నారు. వారు గీసుకున్న గీతల్లో ఆమె ఒదిగి ఉంటుంది. ఆ ఫోక్ (జానపద) లైన్‌ను కొంత అనుసరించి తన ‘శక్తి సిరీస్’ చిత్రాలు ఉంటాయని కూడా ఆయన అంటున్నారు. ఆ శైలి సహజత్వానికి, సంప్రదాయానికి దగ్గరగా ఉంటుంది.
ఆ శైలిలో, తాదాత్మ్యంతో, అంకిత భావంతో తొలిసారి ‘కామాక్షి’ వర్ణ చిత్తరువు/ చిత్రాన్ని ఆయన రూపొందించారు. తరువాత శాంకరి అలంకార అమ్మవారిని, ఆ తర్వాత విశాలాక్షి రూపాన్ని, రేణుకాదేవి (ఏకవీరిక) రూపాన్ని చిత్రిక పట్టగా అభిమానులు ‘కళ్ల కద్దుకుని’ కొనుక్కున్నారు.
అమ్మవారు ఒక్కరే అయినా వివిధ ఆకారాల్లో వివిధ మేనిఛాయలతో, వివిధ ఆయుధాలతో, కూర్చునే పద్ధతుల్లో వ్యత్యాసం కనిపిస్తుందని, ఈ సూక్ష్మ విషయాలను జాగ్రత్తగా అధ్యయనం చేసి చిత్రిస్తానని న్యాలపల్లి చెప్పారు. వివిధ ప్రవచనాలు విని, వివిధ పుస్తకాలు అధ్యయనం చేసి, నిష్ణాతులైన వారితో మాట్లాడి తన చిత్రాల్లో సారాంశాన్ని పొందుపరుస్తానంటున్నారు. దేవీ భాగవతం, శివ పురాణం, కాళికా పురాణం లాంటి ఎన్నో పుస్తకాలు తాను అధ్యయనం చేశానని ఆయన చెబుతున్నారు.
ఈ ‘శక్తి సిరీస్’కు ముందు న్యాలపల్లి ‘రాధాకృష్ణ’ సిరీస్‌ను వేశారు. ఇది సైతం భక్తి భావమే. అందులో ఎన్నో ఆధునిక పోకడలను, వ్యక్తీకరణలను ఆయన ప్రవేశపెట్టారు. అందులో తనదైన ప్రత్యేక శైలి, రంగుల పోహళింపు, ముఖ్యంగా నీలిరంగు నిర్మలత్వంతో పొంగిన వైనం ఇట్టే ఆకర్షిస్తుంది. నాజూకుతనం, సౌకుమార్యం కట్టలు తెంచుకున్న వైనం దర్శనమిస్తుంది. ఈ సిరీస్‌లో ఆయన విశ్వరూపం ప్రదర్శించారు. ‘గోపికా వస్త్రాపరణం’ లాంటి బొమ్మలు అందుకు ఉదాహరణ.
అలాగే శివపార్వతి బొమ్మలను సైతం అంతే తాదాత్మ్యతతో చిత్రించారు. ముఖ్యంగా అర్ధనారీశ్వరి చిత్రాన్ని తనదైన శైలిలో రూపొందించారు.
అలాగే కామధేను, ఐరావతం, షోడసిని అక్రలిక్ రంగుల్లో కాన్వాసుపై కళాత్మకంగా చిత్రించారు. వీక్షకుల్ని ‘ట్రాన్స్’లోకి తీసుకెళతారు.
2010 సంవత్సరం తన కెరీర్ ప్రారంభం రోజుల్లో రాజేశ్వర్ ‘సౌందర్య’ అనే సిరీస్ చిత్రాలను గీశారు. ఇందులో రాజేశ్వర్ పూర్తి భిన్నంగా దర్శనమిస్తారు. స్ర్తి సౌందర్యం, అలంకరణ, ఆకృతి, హావభావాలు, ఆహార్యం, మరో లోకపు మార్మిక సౌందర్యపు అడుగుజాడలు, సున్నితత్వం, సొగసు, సహజ ఆకర్షణ, మోహం.. మాయ, విరహం, కలువలు.. వికారం లేని చూపులు, లేత రంగుల్లో సూర్యోదయమంత స్వచ్ఛంగా ఆహ్లాదంగా కాన్వాస్‌పై ఆవిష్కరించారు. సౌందర్యోపాసన, శరీర ఛాయకు వాడిన రంగులు, చెవులకు వేసుకున్న లోలాకుల ద్వయం.. త్రయం.. అదో కొత్త లోకాన్ని సృష్టించాడు. కామిగాని వాడు మోక్షగామి కాడన్న చందంగా న్యాలపల్లి రాజేశ్వర్ తొలి నాళ్లలో స్ర్తిని, ప్రకృతిని ప్రేమించి, ఆరాధించి, అందులో లీనమై అదే ధ్యానమై గడిపాడు. అనంతరం ఆ సబ్జెక్ట్ రూపాంతరమే ‘అమ్మవారి’ విశ్వరూపం. శక్తిపీఠాలలోని వైవిధ్యం, దశ మహా విద్యలను, సప్తమాత్రికలను, యంత్రాలను, రంగులతో రంగరించి కళాత్మకంగా కొత్త తరాల ముందుకు తీసుకొస్తున్నారు.
దీని వెనుక సాధన, అభ్యాసం, ఏకాగ్రత, అధ్యయనం, అనురక్తి, అభినివేశం అన్నీ సమపాళ్లలో కనిపిస్తాయి.
మైసూరులోని లలితకళ మహాసంస్థాన్ నుంచి దూరవిద్య ద్వారా న్యాలపల్లి 2009-11 సంవత్సరాల్లో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పట్టా పొందారు. వెనువెంటనే అదే సంస్థ నుంచి మాస్టర్ ఆఫ్ విజువల్ ఆర్ట్ (ఎంవిఏ) పూర్తి చేశారు. తనదైన ‘లైన్’ ఏర్పరచుకునేందు కాయన ఎంతో శ్రమ పడ్డారు. స్ట్రగుల్ చేశారు.
1977 జూన్ 27న దుబ్బాకలో జన్మించిన న్యాలపల్లి హైదరాబాద్, ముంబై, బెంగుళూరులో తన చిత్రాలను ప్రదర్శించారు. కొత్త ఢిల్లీలోని కేంద్ర లలిత కళా అకాడెమీలోనూ ఆయన చిత్రాల ప్రదర్శన జరిగింది. వివిధ నగరాలలో జరిగిన గ్రూప్ షోలలోనూ ఆయన పాల్గొన్నారు. అవార్డులూ అందుకున్నారు. వినమ్రంగా తన రంగుల విద్వత్‌ను ప్రపంచానికి అందిస్తున్నారు. అద్వితీయ ఎత్తులను అధిరోహిస్తున్నారు.

-వుప్పల నరసింహం 99857 81799