Others

ఆత్మబంధువు (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ సంబంధాలు, వాటిలోని భావోద్వేగాలే ఇతివృత్తంగా పిఎస్ రామకృష్ణారావు 1962లో తెరకెక్కించిన చిత్రం -ఆత్మబంధువు. మనిషికి మనిషి ఆత్మబంధువుగా మారడానికి రక్తసంబంధంతో పనిలేదని రుజువుచేసే కథ ఇది. సొంత బిడ్డలు స్వార్థంతో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి వెళ్లిపోతే, నౌకర్లైన భార్యాభర్తలే యజమానికి ఆత్మబంధువులై, చెల్లాచెదురైన కుటుంబాన్ని ఒకటి చేసే కథ ఇది. ఓ ఇంటి యజమాని ఎస్‌విఆర్. భార్య కన్నాంబ. వారికి ఇద్దరు కొడుకులు వల్లం నరసింహారావు, ఏడిద నాగేశ్వరరావు. కుమార్తె గిరిజ. ఆ ఇంట్లో పనివాళ్ళు ఎన్టీఆర్ -సావిత్రి. స్వార్థపరులైన కొడుకులు రెక్కలొచ్చిన తరువాత తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి వెళ్లిపోతారు. ఈ పరిణామానికి తల్లిదండ్రులు కలతచెంది బెంగపడితే, వారికి అండగా నిలుస్తారు నౌకరు దంపతులు ఎన్టీఆర్ -సావిత్రి. నౌకర్లు ఎదుర్కొంటున్న సూటిపోటి మాటలను భరించలేని యజమాని ఎస్‌విఆర్, ఎన్టీఆర్-సావిత్రిని ప్రయోజకులుగా మారాలనే తలంపుతో బయటకు పంపేస్తాడు. కూతురికి నచ్చిన సంబంధం తప్పిపోడం, కొడుకులు స్వార్థంతో విడిచి వెళ్లడం, ఆత్మబంధువులాంటి ఎన్టీఆర్-సావిత్రిని పంపేశానన్న బాధతో వారినే తలంచుకుంటూ మరణిస్తాడు ఎస్వీఆర్. బయటికొచ్చిన ఎన్టీఆర్ ఒక ఫ్యాక్టరీ యజమానిని కాపాడి, అతని ఫ్యాక్టరీలో కొలువు సంపాదించి ప్రయోజకుడవుతాడు. తాను ఎదిగిన విషయాన్ని పాత యజమాని ఎస్వీఆర్‌కు చెప్పడానికి ఇంటికి వచ్చి అతను మరణించిన సంగతి తెలుసుకుంటాడు. ఆ సన్నివేశంలో ఎన్టీఆర్ కన్నాంబ కాళ్ళపైబడినప్పుడు ఇద్దరి నటన అత్యద్భుతం. ప్రేక్షకుల గుండెలను పిండేస్తుంది. అలాగే ఎస్వీఆర్ మరణించే ముందు ఎన్టీఆర్‌ను కృష్ణుడిగా ఊహిస్తూ ‘ఎవరో ఏ ఊరో’ అన్న గీతానికి ఎస్‌విఆర్ అభినయం అనితరసాధ్యం. ఎన్టీఆర్, సావిత్రి ఎన్నో కష్టాల కోర్చి ఇంటి సమస్యలు చక్కబెట్టి అందర్నీ కలుపుతారు. హాస్యంకోసం రేలంగి, పద్మనాభం, సూర్యాకాంతం ఉండటంతో సీరియస్ కథాగమనంలో కొంత ఉపశమనం ఉంటుంది. చిత్రానికి మామ మహాదేవన్ సంగీతం పెద్ద అండగా నిలిచింది. చిత్రకథను అంతర్లీనంగా చెప్పిన ‘అనగనగా ఒక రాజు’, ‘చదువురాని వాడవని’, ‘చీరగట్టి సింగారించి’ వంటి గీతాలు నేటికీ ప్రేక్షక హృదయాలలో మారుమ్రోగుతున్నాయి. ఎస్వీఆర్, ఎన్టీఆర్, కన్నాంబ, సావిత్రి తమ అభినయపాటవంతో, మహదేవన్ సంగీతంతోనూ ఘంటసాల- సుశీల గాన వైభవంతో అలరారిన చిత్రానికి తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ నీరాజనం పలుకుతారు. ఆత్మబంధువు -ఈ తరం చూడాల్సిన గొప్ప చిత్రం.

-వివి రాజేంద్ర, తిరుపతి