Others

నోటి దుర్వాసన పోయేదిలా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరితోనైనా మీరు మాట్లాడితే వారు మీ నించి దూరంగా జరగడానికి ప్రయత్నిస్తారా? మీరు మాట్లాడుతూ వుంటే ముక్కుని చేతితోగాని గుడ్డతోగాని కప్పుకునే ప్రయత్నం చేస్తారా? అలాంటి సందర్భాలు మీకు ఎదురౌతున్నాయి అంటే మీరు నోటి దుర్వాసనతో బాధపడుతున్నట్లే. అదేంటి మన నోటి వాసన మనకు తెలీదా, ఎదుటివారి స్పందన చూస్తే కానీ మనకి అర్థం కాదా? నాకు వాసనలా ఏం అనిపించట్లేదే? అన్న సందేహాలు చాలామంది పేషెంట్స్‌కి వస్తూ ఉంటాయి. సిగరెట్ తాగేవారికి ఆ పొగాకు వాసన పెద్ద చికాకును కలిగించదు, అదే పక్కనే తాగకుండా ఉండేవారికి చాలా చికాకుగా ఉంటుంది. మద్యం సేవించిన తరువాత వారు మాట్లాడితే వచ్చే దుర్వాసన తాగని వారికి చాలా స్పష్టంగా తెలుస్తుంది, సేవించినవారికి తెలీదు. కాకి పిల్ల కాకికి ముద్దు, మన శరీరం ఎలా వున్నా మనకి ముద్దు, మన నించి వచ్చే వాసన మనకెప్పుడూ దుర్వాసనలా అనిపించదు. ఎదుటివారికే తెలుస్తుంది.
దుర్వాసన శరీరంనించి వస్తుందా లేక నోటి నించి వస్తుందా అన్నది మనం ముందు నిర్థారణ చేసుకోవాలి. ఒక మనిషి ఓ గదిలోకి రాగానే అక్కడ ఉన్నవారు ముక్కుని చేయితోగాని, గుడ్డతో కాని కప్పుకున్నారనుకోండి, ఇంక మీరు కుర్చీలో కూర్చోగానే మీ పక్కన కూర్చున్నవారు లేచి వెళ్లిపోయేరనుకోండి- అప్పుడు ఆ దుర్వాసన శరీరం నుంచి వస్తుందని అర్థం. అలా కాకుండా మీరు మాట్లాడినప్పుడు ఇలాంటి చేదు అనుభూతులు ఎదురైతే అది నోటి దుర్వాసన వల్ల అని అర్థం.
నోటి దుర్వాసన కారణాలు
ఆహారం: మనం తినే కొన్ని పదార్థాలు అనగా ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఇంకా చాలా ఘాటైన కారాలు / మసాలాలు మనం నమిలేప్పుడు మన నోటిలోని ఉమ్ము నీరుతో కలిసి ఓ జిగురులా తయారై మన పళ్లకి అతుక్కుంటుంది. దీనివల్ల దుర్వాసన కలగవచ్చు. అంతేకాదు, ఈ పదార్థాలు కడుపులో జీర్ణం అయ్యాక మన రక్తంలో కలిసి మన ఊపిరితిత్తులకి చేరడంవల్ల మన శ్వాసలో దుర్వాసన కలగవచ్చు. అందరిలో ఇలా జరగదు కానీ దుర్వాసన ఉన్నవారు పైచెప్పిన పదార్థాలు ఎక్కువ తీసుకుంటున్నట్లయితే వాటిని మొత్తానికే మానివేయాల్సి వుంటుంది.
పొగాకు / మద్యం: వీటివల్ల కలిగే దుర్వాసన పోవాలంటే వీటిని తాగడం, సేవించడం ఆపివేయాలి. దుర్వాసనతో బాధపడుతున్నవారు వారికేమైనా దురలవాట్లు ఉంటే (సిగరెట్ / మద్యం/ తంబాకు/ గుట్కా) వాటిని ఆపివేయడం మంచిది.
అశుభ్రమైన పళ్లు: సరిగా పళ్లు తోమనివారు, తిన్న తరువాత పుక్కిలించనివారు, దంత వైద్యుణ్ణి ఎప్పుడు కలవనివారి పళ్లమీద ఇంకా చిగురులో పండ్లపాచి పేరుకుపోయి ఉంటుంది. ఇది విపరీతమైన దుర్వాసనకు కారణం. ఎగుడు దిగుడు పళ్లు ఉన్నవారికి పండ్లు తోమడం కష్టంగా ఉంటుంది. ఈ ఎగుడుదిగుడు పళ్లమధ్య తిన్న ఆహారం ఇరుక్కొని పాచిగా తయారై దుర్వాసనకు కారణం అవుతుంది. జ్ఞానదంతాలు సరిగా బయటకు రానివారిలో టూత్‌బ్రష్ అంత లోపలివరకు పోలేకపోవడంవల్ల తినే ఆహారం ఆ జ్ఞానదంతాల మీద మరియు వెనక అలాగే ఉండిపోయి దుర్వాసన కలిగిస్తుంది. టూత్‌బ్రష్ లోపలివరకు పోనివాళ్లలో ఇంక జ్ఞానదంతాల దగ్గర ఆహారం పేరుకుపోతున్నవారిలో అవి సరిగ్గా బయటికి రానివారిలో వాటిని తీసేయడం ఉత్తమం. ఎగుడు దిగుడు పళ్లు ఉన్నవారికి వైర్ల ద్వారా వాటిని తిన్నగా చెయ్యాల్సి వుంటుంది. ఏడాదికి ఒకసారి దంత వైద్యుణ్ణి కలిసి పంటి క్లీనింగ్ చేయించుకోవడం తప్పనిసరి. సరైన పద్ధతిలో పళ్లు తోమాల్సి ఉంటుంది. పుక్కిలించే మందులు ఆహారం తిన్నాక తప్పనిసరిగా వాడాల్సి వుంటుంది. సరిగ్గా పళ్లు తోమలేని వికలాంగులకి మరియు మానసిక వైకల్యం వున్నవారికి విద్యుత్ సహాయంతో నడిచే టూత్‌బ్రష్‌తో పళ్లు తప్పనిసరిగా తోమేలా చూడాలి.
పుచ్చుపళ్లు, చిగుర్ల సంక్రమణ: పుచ్చిన పళ్లలో క్రిములు ఉండడం వల్ల అవి దుర్వాసనకు దారితీసే అవకాశం వుంది. ఈ పళ్లలోంచి పుచ్చు తీసేసి ఆ రంధ్రాన్ని సిమెంట్ ద్వారా నింపించుకోవాలి. పుచ్చు లోతుగా ఉంటే వాటికి రూట్‌కెనాల్ చేసి కృత్రిమ పన్ను తొడగాల్సి వుంటుంది. చిగుర్లలో ఇన్‌ఫెక్షన్ ఉన్నా లేక చీము కారుతున్నా అది దుర్వాసన కలిగిస్తుంది. దానికి సరైన చికిత్స చేయాల్సి వుంటుంది.
లాలాజలం తక్కువగా ఉన్నవారిలో దుర్వాసన వచ్చే ప్రమాదం వుంది. లాలాజలం తక్కువ అవ్వడానికిగల కారణం ఏంటో కనిపెట్టి దానికి చికిత్స చేయవలసి వుంది (కొన్ని వారాల ముందు దీని గురించి వివరించా).
కొన్ని శారీరక జబ్బులవల్ల కూడా దుర్వాసన కలిగే ప్రమాదం వుంది.

విపరీతమైన తేన్పులు: దీనిని దిఉ్గ అంటారు. కడుపులోని ద్రవ్యాలు గొంతులోంచి నోటి వరకు రావడం వల్ల గొంతు మంట, దుర్వాసన కలగవచ్చు. తీవ్రంగా ఉన్నవారు ఇన్‌డోస్కోపీ చేయించుకోవడం మంచిది.
మధుమేహం: ఇది విపరీతంగా ఉన్నవారికి నోటి దుర్వాసన ఉంటుంది. దీనిని నియంత్రించుకోవడం మంచిది.
మూత్రపిండాల జబ్బు: ఇవి సరిగ్గా పనిచేయనపుడు మూత్రం ద్వారా పోవాల్సిన రసాయనాలు శరీరంలోనే ఉండిపోయి, రక్తంలో మోతాదుకి మించి ఎక్కువవడం వల్ల శ్వాసలో దుర్వాసన కలిగే ప్రమాదం వుంది. దీనికి తగ్గ చికిత్స తీసుకుంటే మంచిది.
టాన్సిల్స్, సైనస్ ఇన్‌ఫెక్షన్‌వల్ల కూడా దుర్వాసన కలగవచ్చు.
ఒకసారి ఓ ముప్ఫై ఏళ్ల ఆవిడ నా దగ్గరికి వచ్చి నోటి దుర్వాసనతో బాధపడుతున్నానని చెప్పింది. నేను అంతా పరీక్ష చేసిన తరువాత నాకు దుర్వాసన ఉన్నట్లు అనిపించలేదు. అదే చెప్పా. దానికి ఆవిడ లేదు, నాకు దుర్వాసన వుందని వాపోయింది. మా జూనియర్ డాక్టర్‌ని పరీక్షించమన్నా. ఆమె లేదని చెప్పింది. అప్పుడా బాధితురాలిని అడిగా, మీకు ఉందని ఎందుకనిపిస్తున్నది, ఎవరైనా చెప్పారా అని. దానికి ఆవిడ ఏడుస్తూ ‘‘నా భర్త నన్ను ఏడాదిగా దగ్గరికి రానివ్వడంలేదు. నాకు విపరీతమైన నోటి దుర్వాసన ఉందనీ అంటాడు’’ అని చెప్పింది. ఇంకెవరైనా చెప్పారా అని అడిగితే లేదని జవాబిచ్చింది. అతను (ఆమె భర్త) మిమ్మల్ని ఇష్టపడకో లేక వేరే ఏ ఇతర కారణంవల్లో మిమ్మల్ని దూరం పెట్టడానికి ఈ సాకు వెతుక్కున్నాడు. మీకు ఏ నోటి దుర్వాసన లేదని చెప్పా. ఎవరో ఒకరు అన్నారని దాన్ని నిజమని నమ్మకండి. పదిమంది అంటే అప్పుడు వైద్యుణ్ణి కలిసి నిజమో కాదో నిర్థారించుకోండి. అస్సలు నమ్మనివారు, గుడ్డిగా నమ్మేవారు ఆనందపడినట్లు చరిత్రలో లేదు.
*

ఫాఠకులకు సూచన
‘‘మీ సమస్యలకు, సందేహాలకు సమాధానాలు’’ పొందాలనుకుంటే ప్రశ్నలు ఈ చిరునామాకు క్లుప్తంగా పంపండి. వాటిని భూమికలో ప్రచురించడం జరుగుతుంది.
మీ ప్రశ్నలను ‘‘మీ సందేహాలు- నా సమాధానాలు’’ అనే శీర్షికకు పంపాలి.
చిరునామా : డా శ్రీరంగం రమేష్, ఫేస్ క్లీనిక్,
1-3-15, కలాసిగూడ,
సికింద్రాబాద్-500003

-డాక్టర్ రమేష్ శ్రీరంగం సెల్ నెం: 92995 59615 faceclinics@gmail.com