AADIVAVRAM - Others

ప్రాదేశిక జ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంగ్లీషులో domain knowledge అనే ఫదబంధం ఉంది. దీనిని ప్రస్తుతానికి ప్రాదేశిక జ్ఞానం అని అందం.
ఉదాహరణకి, మనం గణితం గురించి తెలుగులో రాస్తున్నామనుకుందాం. గణితంలో పాండిత్యం లేకుండా గణితం గురించి తెలుగులోనే కాదు, ఏ భాషలోనూ రాయలేము. ఈ సందర్భంలో గణితంలో ఉన్న జ్ఞానాన్ని ప్రాదేశిక జ్ఞానం అంటారు. ఇదే విధంగా వ్యాకరణం గురించి తెలియకుండా వ్యాకరణం గురించి రాయలేము.
ప్రస్తుతానికి మనకి ఒక విషయంలో ప్రాదేశిక జ్ఞానం ఉందనుకుందాం. ఈ జ్ఞానాన్ని వెలిబుచ్చటానికి ఒక భాష అవసరం. ఈ సందర్భంలో భాషని మాధ్యమం (medium) అంటారు. మనకున్న ప్రాదేశిక అవగాహనని ఒక భాషాపరంగా వ్యక్తపరచాలంటే ఆ భాష మీద మనకి ఆధిపత్యం ఉండాలి. లేకపోతే మన మనస్సులో ఉన్న భావం ఒకటి, బహిర్గతమయే భావం ఇంకొకటి అయి అపార్థాలకి దారితీస్తుంది.
ప్రస్తుతం సైన్సుని తెలుగులో రాయాలనే ప్రయత్నం చేస్తున్నాం కదా. ఈ ప్రయత్నం చేసేవారికి సైన్సు మీదా పట్టు ఉండాలి. భాష మీదా పట్టు ఉండాలి. కనుక సైన్సులో పదజాలం సృష్టించాలన్నా, పుస్తకాలు రాయాలన్నా ఆ పనిని తెలుగు పండితులకి పురమాయించటం శుష్క దండుగ. ఈ వాదానికి బొరుసు కూడా ఉంది. సైన్సు వచ్చిన వాళ్లంతా వారికి తెలిసిన విషయాలని ఇతరులకి అర్థం అయ్యే రీతిలో చెప్పలేరు, రాయలేరు - ఏ భాషలోనైనా సరే. పైపెచ్చు మన దేశంలో ఇంగ్లీషు వ్యామోహంలో పడ్డవారిలో కొందరు కొద్దిగానో, గొప్పగానో ఇంగ్లీషులో రాయగలరేమో కానీ తెలుగులో బొత్తిగా రాయలేరు.
సైన్సు వరకు ఎందుకు? ఉదాహరణకి అడివి బాపిరాజు రాసిన తెలుగు గురించి విచారిద్దాం. ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈయన రాసిన నారాయణరావు తెలుగు నవలల్లో ఉన్నత స్థాయి నవల. ఈయన రాసిన ‘హిమబిందు’ అనే మరో నవలని సమీక్షిస్తూ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు బాపిరాజుకి వైదిక మత విషయాలలో ప్రాదేశిక అవగాహన సరిగ్గా లేకపోవటం వల్ల జరిగిన ఒక వ్యాకరణ దోషాన్ని ఎత్తి చూపుతారు. అంటే ఈ విమర్శకుడి దృష్టిలో బాపిరాజుకి వైదిక మత విషయాలలో ప్రాదేశిక జ్ఞానం లోపించింది.
ఈ విమర్శకి ప్రేరణ కారణం ‘హిమబిందు’ నవల నాల్గవ భాగంలో, పదవ అధ్యాయంలో, బాపిరాజు వాడిన ‘జ్ఞాన యుద్ధం’ అనే సమాసం. ఆలోచించండి. జ్ఞాన యుద్ధం అంటే ఏమయి ఉంటుంది? జ్ఞానంతో చేసిన యుద్ధమా? జ్ఞానం వలన చేసిన యుద్ధమా? జ్ఞానమనే యుద్ధమా?
‘్ధర్మయుద్ధం’ అనే పదబంధం ఉంది. ధర్మాన్ని నిలబెట్టటానికి చేసిన యుద్ధమా? యుద్ధ నియమాలని పాటిస్తూ చేసిన యుద్ధమా? ‘యుద్ధం చెయ్యటం నా ధర్మం’ అన్న నమ్మికతో చేసిన యుద్ధమా? ‘్ధర్మయుద్ధం’ అనే పదబంధం మనకి అలవాటయినది. ‘మహాభారత యుద్ధం ధర్మయుద్ధమా కాదా?’ వంటి ప్రయోగాలు మనకి పరిచితాలే. కనుక ధర్మయుద్ధం అంటే ఏమిటని తికమక పడం.
కానీ ‘జ్ఞానయుద్ధం’ అన్నది మనకి పరిచయం లేని పద బంధం. అందువల్ల హిమబిందులో జ్ఞానయుద్ధం అన్న పదబంధం అర్థవంతంగా లేదని ఈ విమర్శకుడు అభిప్రాయపడ్డాడు. విమర్శకుని మాటలలోనే:
‘జ్ఞాన యుద్ధమనగానేమి? తత్పురుషయా? కర్మధారయమా? ద్విగువా? బహువ్రీహియా? ద్వంద్వమా? అవ్యయరుూభావమా? అలుక్సమాసమా...
‘ద్విపద, బహుపద, ద్విపద సమాహార, బహుపద సమాహార భేదములతోనున్న ద్వంద సమాసము కాదు.
‘సామాన్య, సమాహార, సంఖ్యోదయ, తద్దితార్థ భేదములతోనున్న ద్విగు సమాసము కాదు.
‘బహువ్రీహి సమాసమనుకొందమా? ద్వితీయాది సప్తమీ విభక్తి పర్యంతమైన ద్విపద బహువ్రీహి కాజాలదు.
‘క్రియా విశేష బహువ్రీహి కాదు. బహుపద బహువ్రీహి కానీ, సంఖ్యోభయపద బహువ్రీహి గాని, సంఖ్యోత్తరపద బహువ్రీహి కాని, సహపూర్వపద బహువ్రీహి కాని, వ్యతిహార లక్షణ బహువ్రీహి గాని, దిగంతరాల లక్షణ బహువ్రీహి గాని.. ఉపమాన పూర్వపద బహువ్రీహి గాని కాజాలదు.
‘తత్పురుష అనుకొందమా? జ్ఞానము యుద్ధమునకు అనే విగ్రహము కుదరదు, కావున ఇది ప్రథమా తత్పురుష కాజాలదు. జ్ఞానమును దాటిన యుద్ధమునకు అనే విగ్రహ వాక్యం కూడా నప్పదు కనుక ద్వితీయా తత్పురుష కాజాలదు. జ్ఞానము చేత యుద్ధము అని అన్వయం చెప్పుకుని ఇది తృతీయా తత్పురుష అని సరిపెట్టుకోవచ్చు. ఇదే విధంగా చతుర్థాది సప్తమీ తత్పురుష వరకూ ఇది కాజాలదు.
‘దీనియందు విశేషణమే లేదు కాబట్టి, విశేషణ పూర్వపద, లేక విశేషణోత్తర పద, లేక విశేషణోభయపద కర్మధారయ సమాసం కాదు. ఉపమానము కా కాబట్టి ఉపమాన పూర్వపద, లేక ఉపమానోత్తరపద కర్మధారయము కాదు.’
ఇలా విశే్లషణ చేసి ‘తృతీయా తత్పురుష అని సద్దుకుందామా అంటే, జ్ఞానము చేత యుద్ధం’ అనగానేమి?.. జ్ఞానమనగానేమియో తెలిసిన వారట్లనరాదు.’
ఇదీ విమర్శకుడి కోణం. Intellectual dispute అని కాని dogmatic dispute అని కాని భాపిరాజుగారి భావము అయి ఉండవచ్చు. ఆయన అసలు మనోభావం ఏమిటో మనకి తెలియదు.
ఈ ఉదాహరణని ఎందుకు ఎత్తి చూపించానంటే ఏ విషయం రాసేటప్పుడైనా సరే రాయబోయే అంశం మీదా, వాడదలుచుకున్న మాధ్యమం మీద రచయితకి అధికారం ఉండాలి. ఇటువంటి అధికారం లేకుండా నిఘంటువులు నిర్మించినా, సందర్భశుద్ధి లేకుండా క్రొంగొత్త పద ప్రయోగాలని పుంఖానుపుంఖాలుగా పాఠకుల మీదకి గుప్పించినా అది శుష్క ప్రయోగమే అవుతుంది.

- వేమూరి వేంకటేశ్వరరావు ప్లెజన్‌టన్, కేలిఫోర్నియా