AADIVAVRAM - Others

‘మనసు కాన్వాస్’పై మనోహర దృశ్యాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ మాదాపూర్‌లోని ‘శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్’ తొలి బ్యాచ్ విద్యార్థి శ్రీకాంత్ ఆనంద్. 1992 నుంచి ఐదు సంవత్సరాల పాటు ఆయన చిత్రకళా రంగంలోని వివిధ పార్శ్వాలలో అక్కడ శిక్షణ పొందారు. లైఫ్ స్టడీ, ఆబ్జెక్టివ్ డ్రాయింగ్, లైన్.. షేడింగ్ అన్నీ అధ్యయనం చేసినప్పటికీ ‘అప్లైడ్ ఆర్ట్స్’పై తన దృష్టిని కేంద్రీకరించారు. ఇందులో వ్యాపారాత్మక అంశం బలంగా ఉంటుంది. వర్తమాన సమాజంలోని టెక్నాలజీ ఆధారంగా కళా నైపుణ్యం ప్రదర్శించే వెసులుబాటు కల్పిస్తుంది. భవిష్యత్‌లలో భృతి కోసం ఉపకరిస్తుందన్న ఆలోచన మనసులో ఏదో మూలన ప్రబలంగా ఉండటంతో శ్రీకాంత్ ఆనంద్ అటువైపు మొగ్గాడు.
మరో కారణం.. తన తండ్రి మడిపగడ బలరామాచార్య స్వతహాగా చిత్రకారుడు, కవి, విశ్వకర్మ. సికిందరాబాద్ నగరంలో ప్రముఖ సాహితీవేత్తలతో కలిసి తిరిగినవాడు. ముఖ్యంగా దాశరథి రంగాచార్య, వట్టికోట ఆళ్వార్‌స్వామి, డా.సి.నారాయణరెడ్డి లాంటి ఉద్దండులతో భుజాలు కలిపి నడిచాడు. వారి పుస్తకాలకు కవర్‌పేజీ చిత్రాలను వేశాడు. వివిధ పత్రికల్లో పద్యాలు - వాటికి చిత్రాలు ప్రచురించారు. దాంతో ఆ కుటుంబానికి ఓ ప్రత్యేక స్థానం ఏర్పడింది. ఆ రోజుల్లో చిత్రలేఖనంలో అంతగా చేయి తిరిగిన వారు కనిపించక పోవడంతో ఆయన అందరివాడయ్యాడు. దాంతో ఈ ‘వారసత్వాన్ని’ కొనసాగించాలని, పత్రికల్లో బొమ్మలు వేయాలని, మడిపగడ ఇంటి పేరు నిలబెట్టాలని తండ్రి బలంగా కోరడంతో శ్రీకాంత్ ఆనంద్ బాల్యం నుంచే చిత్రలేఖన ‘అభ్యాసం’ ప్రారంభించారు. అలా గీస్తూ ఉండగా 1986లో తొలిసారి ఓ వారపత్రికలో తాను వేసిన బొమ్మ అచ్చయింది. ఆ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అనంతరం అది ‘వ్యసనం’గా మారింది. అదే లోకమైంది. అయితే ఆధునిక రీతులను అధ్యయనం చేస్తే మరింత మెరుగైన రీతిలో బొమ్మలు గీయొచ్చన్న భావనతో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (బిఎఫ్‌ఏ) కోర్సులో చేరారు.
కాన్వాస్, కాగితంపై బ్రష్‌లు, పెన్సిల్‌తో వర్ణ చిత్రాలు గీయడంతోపాటు సమాంతరమైన మరో సృజన ప్రక్రియ ఇందులో ఉంది. అదే.. లిథో, లినో, వుడ్‌కట్, కోలోగ్రాఫ్.. సాహిత్యంలో కవిత్వం, పద్య కవిత్వం, వచనం, విమర్శ ప్రక్రియలు ఉన్న చందంగా చిత్రలేఖన లోకంలో ఈ ప్రక్రియలు చిరకాలంగా ప్రాచుర్యంలో ఉన్నాయి. శ్రీకాంత్ ఆనంద్ మనసు కాన్వాస్, ఆయిల్ పెయింట్, ఆక్రలిక్ పెయింట్‌కన్నా ‘కోలోగ్రఫీ’ వైపు మళ్లింది. ఈ ‘ప్రింట్ మేకింగ్’లో కింగ్‌గా ప్రతిభను కనబరచాలని తీర్మానించుకున్నారు. హాండ్‌మేడ్ పేపర్‌ను నానేసి ఆరబెట్టాక ముందే అట్టలతో తయారుచేసుకున్న ‘మదర్ బోర్డు’ తీసుకెళ్లి రోలర్‌పై రంగులద్ది దాన్ని తిప్పడం వల్ల మదర్ బోర్డులోని ‘చిత్రం’ పేపర్‌పై ప్రింటవుతుంది. ఇదీ ప్రక్రియ. అయితే చెప్పుకున్నంత సులువు మాత్రం కాదు. ఎంతో నేర్పు, నైపుణ్యం, ఓపిక ఒద్దిక ఉంటేనే ‘ప్రింట్’ బయటకొస్తుంది.
ఈ ప్రక్రియలో ఆయన ఎక్కువగా భక్తి భావ చిత్రాలను ప్రింట్ తీశారు. వినాయకుడు, శివుడు, అమ్మవారు, పూరి జగన్నాథ్ తదితర చిత్రాలను తయారుచేశారు. చూడ్డానికి వినూత్నంగా కనిపించే ఈ చిత్రాలను ఆయన వివిధ ప్రదర్శనల్లో ప్రదర్శించారు. కొన్నింటికి బహుమతులను సైతం అందుకున్నారు. ఇందులో ‘ఇంటాగ్లో’ అనే పద్ధతిలో తీసిన చిత్రాలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ శైలిలో డ్రీమ్స్ (స్వప్నాలు), టెర్రరిజం, మహిళ, సినిమా లాంటి సబ్జెక్టులతో తన పనితనాన్ని, ప్రత్యేకతను పదిమంది ముందుకు తీసుకొచ్చారు.
‘కోలోగ్రఫీ’లో చిత్రరచన ప్రింట్లను ప్రదర్శించే అతి కొద్దిమంది చిత్రకారుల్లో శ్రీకాంత్ ఆనంద్ ఒకరు కావడం గర్వకారణం. ఆర్ట్ కలెక్టర్స్, కొనుగోలుదారులు వీటి పట్ల ఎక్కువ ఆసక్తి కనబరచక పోయినా ఆత్మ సంతృప్తి కోసం చిత్రకారుడిగా తన నైపుణ్యంపై, ఆ ప్రక్రియపై ఉన్న ప్రేమానురాగాల వల్ల దీర్ఘకాలంగా దానికే సమయం కేటాయిస్తున్నారు.
తన తండ్రి పేర ‘బలరామ్ ఆర్ట్స్ అకాడెమీ’ని ఏర్పాటు చేసి చిత్రకారులకు తోడ్పాటు అందిస్తున్నారు. వేసవి కాలంలో వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన ఇంట్లో పిల్లలకు ‘సమ్మర్ క్యాంపులు’ నిర్వహిస్తున్నారు.
కొసమెరుపు ఏమిటంటే.. వివిధ పర్వదినాల, జాతీయ ఉత్సవాల సందర్భంగా ఉర్దూ, హిందీ, తెలుగు, ఇంగ్లీషు పత్రికల్లో ఆయన వేసిన భావచిత్రాలు ప్రచురితం కావడం. ఆ రకంగా తన తండ్రి బలరామాచార్య పేరును శ్రీకాంత్ ఆనంద్ సార్థకం చేస్తున్నారు.

శ్రీకాంత్ ఆనంద్ 63042 99044

-వుప్పల నరసింహం 9985781799