AADIVAVRAM - Others

డబుల్ రోల్ (విలన్స్, స్కౌన్‌డ్రల్స్ అండ్ రాస్కెల్స్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధ్యాహ్నం నాలుగు - నాలుగున్నర మధ్య హావార్డ్ తన భార్యకి ఫోన్ చేసి చెప్పాడు.
‘ఇవాళ ఆఫీస్‌లో రాత్రి దాకా పని చేయాలి. ప్రెంటిస్ కంపెనీ టి.వి. అడ్వర్టయిజ్‌మెంట్ స్పాట్ స్క్రిప్ట్‌లో చాలా లోపాలున్నాయి. దాన్ని తిరగ రాయాల్సి వస్తుంది’
‘ఐతే మీరు రాత్రికి న్యూయార్క్‌లోనే ఉండిపోతారా?’ భార్య కరోలిన్ అడిగింది.
‘గత్యంతరం లేదు’
‘హోటల్‌లో గది దొరుకుతుందా?’
‘్ఫన్ చేసి చూస్తాను. లేదా ఆఫీస్‌లో సోఫా ఎటూ ఉండనే ఉంది’
‘సరే. రేపు రాత్రి మాత్రం ఇంటికి వచ్చేయండి. పని హడావిడిలో పడి హోటల్‌కి ఫోన్ చేయడం మర్చిపోకండి’ కరోలిన్ చెప్పింది.
‘అలాగే’
హోవార్డ్ హోటల్‌కి ఫోన్ చేయలేదు. ఆఫీస్‌లోని కొత్త జూనియర్ కాపీ రైటర్ రాసిన ప్రకటనని చూసి, ఆమెని పిలిచి ప్రకటనని సాహిత్యంలా రాయకూడదని మందలించి, కొన్ని మెళకువలు నేర్పాడు. ఐదుకి ఆఫీస్ ఖాళీ అయింది. ఐదు ఐదుకి హోవార్డ్ తన ఆఫీస్ డ్రాయర్‌కి తాళం వేసి, బ్రీఫ్‌కేస్ తీసుకుని ఆఫీస్‌లోంచి బయటికి వచ్చాడు. కొద్ది దూరంలోని రెస్టారెంట్‌లో బర్గర్ తిని టేక్సీ ఎక్కి క్రిస్ట్ఫర్ స్ట్రీట్‌లోని ఓ నాలుగంతస్థుల భవనం ముందు దిగాడు. అందులోని ఓ తలుపు తెరుచుకుని లోపలికి వెళ్లాడు. కారిడార్‌లోని ఓ సన్నటి యువతి అతన్ని చూసి నవ్వుతూ పలకరించింది.
‘హలో రాయ్!’
‘హలో!’ బదులు చెప్పాడు.
‘టెడ్, బెట్టీలు పార్టీ ఇస్తున్నారు. మీరు వెళ్తున్నారా?’ ఆమె అడిగింది.
‘చూడాలి’ జవాబు చెప్పాడు.
అతను తలుపు తెరచుకుని, తన అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి, బ్రీఫ్‌కేస్‌ని చిన్న టేబుల్ మీద ఉంచాడు. స్నానం చేసి, లెవిస్ జీన్స్, టర్టిల్ నెక్ స్వెటర్ వేసుకుని టెన్నిస్ షూస్‌ని తొడుక్కున్నాడు. అతని పర్స్ విడిచిన దుస్తుల్లో ఉంది. ఐతే తొడుక్కున్న దుస్తుల్లో కూడా ఇంకో పర్స్ ఉంది. అందులో క్రెడిట్ కార్డ్స్ లేవు. కాని అతన్ని రాయ్ బేకర్‌గా నిర్ధారించే అనేక ఐడెంటిటీ కార్డులు ఆ పర్స్‌లో ఉన్నాయి.
సల్లివాన్ స్ట్రీట్‌లోని కాఫీ హౌస్ వెనుక గదిలో ఓ గంటసేపు చదరంగం ఆడుతూ గడిపాడు. మూడు ఆటల్లో రెండింటిలో గెలిచాడు. తర్వాత బార్‌లోని కొందరు మిత్రులతో కలిసి తాగుతూ, ఫుట్‌బాల్ ఆటలో ఎవరు గెలుస్తారన్న దాని మీద వారితో వాదించాడు. తర్వాత కొందరితో కలిసి టెడ్, బెట్టీ నివసించే ఈస్ట్ విలేజ్‌లోని వారి అపార్ట్‌మెంట్‌కి చేరుకున్నాడు. నేల మీద కూర్చుని వైన్ తాగుతూ ఒకరిద్దరు పాడే పాటలు విన్నాడు. పొడుగాటి జుట్టుగల జీనీ గిటార్‌ని వాయించింది. పార్టీ అయ్యాక ఇద్దరూ సమీపంలోని తమ అపార్ట్‌మెంట్ బిల్డింగ్ వైపు నడిచారు. ఆమెకి కొంచెం వైన్ ఎక్కువైందని నడకని బట్టి గ్రహించాడు.
‘రండి. కాఫీ కలుపుతాను. నా సైకాలజిస్ట్ నా గురించి ఏం చెప్పాడో కూడా చెప్తాను’ ఆహ్వానించింది.
జీనీ సంభాషణని, ఆమె కాఫీని కూడా హోవార్డ్ ఎంజాయ్ చేశాడు. గంట తర్వాత అర్ధరాత్రి ఒంటిగంటకి తన అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి నిద్రపోయాడు. మర్నాడు ఉదయం నిద్ర లేచి, స్నానం చేసి తెల్ల షర్ట్, నిలుపు గీతల టై, బూడిద రంగు షార్క్‌స్కిన్ సూట్ ధరించి క్రితం రోజు విడిచిన దుస్తుల్లోని పర్స్‌ని తీసి జేబులో పెట్టుకుని ఆఫీసుకి బయలుదేరాడు.
* * *
హోవార్డ్ జీవితంలో అది అనుకోకుండా మొదలైంది. అతను లోవెల్ బుర్హామ్ అండ్ ప్రెస్కో అడ్వర్టయిజింగ్ కంపెనీలో సీనియర్ కాపీ రైటర్‌గా పనిచేసేవాడు. అందులోంచి కీత్ అండ్ వెండ్రెల్ అసోసియేట్స్ కంపెనీలోకి కాపీ చీఫ్‌గా ఉద్యోగం మారాక, పని గంటల తర్వాత కూడా ఆఫీస్‌లో ఎక్కువసేపు ఉండాల్సి వస్తోంది. పని అతన్ని ఇబ్బంది పెట్టలేదు. కానీ, అర్ధరాత్రి రైల్లో ప్రయాణించి శివార్లలో ఉన్న న్యూ హోప్‌లోని తన ఇంటికి వెళ్లడం ఇబ్బందిగా

తోచసాగింది. రాత్రి రెండున్నరకి కానీ పక్క మీదకి చేరలేడు. మళ్లీ నాలుగున్నర గంటల తర్వాత నిద్ర లేస్తే కానీ తొమ్మిది గంటలకి ఆఫీస్‌లో ఉండడు. దాంతో తక్కువ నిద్రతో బాధపడసాగాడు.
త్వరలోనే అతను రైలు ప్రయాణం చేసి ఇంటికి వెళ్లడం మానేసి, ఆఫీస్‌లో ఎక్కువ పని చేసిన రాత్రిళ్లు మిడ్‌టౌన్ హోటల్‌లో నిద్రపోసాగాడు. ఈ ఏర్పాటు వల్ల నిద్ర సమస్య సమసిపోయినా ఖర్చు పెరగసాగింది. పనె్నండు డాలర్స్ లేదా అంతకు తక్కువకి హోటల్ గదిని వెదికి పట్టుకోవడం కూడా కష్టమే. ఆ గదులు కూడా శుభ్రంగా, సౌకర్యంగా ఉండవు.
అపార్ట్‌మెంట్‌ని అద్దెకి తీసుకుంటే డబ్బు ఆదా అవుతుందనే ఆలోచన అతనికి వచ్చింది. నెలకి వంద డాలర్లకి అతనికి నచ్చిన అపార్ట్‌మెంట్ అద్దెకి దొరికింది. హోటల్ గదులకి పెట్టే ఖర్చు కన్నా అది చవక. వెతకాల్సిన పని లేకుండా అందులో పడక ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. క్రిస్ట్ఫర్ స్ట్రీట్‌లోని ఆ ఒక్క పడక గది ఫర్నిష్డ్ అపార్ట్‌మెంట్ ప్రకటన చూశాక ఫోన్ చేస్తే, రాత్రి ఎనిమిదికి రమ్మని చెప్పారు.
‘మీ పేరు?’ అడిగారు.
‘బేకర్. రాయ్ బేకర్’ హోవార్డ్ జోర్డన్ చెప్పాడు.
అతను అబద్ధం ఆడడానికి కారణం, ఒకవేళ ఏ కారణంగానైనా తను వెళ్లకపోతే, ఆ ఇంటి యజమాని మళ్లీ తన కోసం ఫోన్ చేస్తే, ఆ తప్పు పేరే అడుగుతాడు. ఆఫీస్‌లో ఎవరు రిసీవర్ ఎత్తినా, ఆ పేరు గలవారు లేరని చెప్తారని అతని ఉద్దేశం.
తను అద్దెకి తీసుకునే పక్షంలో అసలు పేరు చెప్పాలని, తన తరఫున మిత్రుడు ఫోన్ చేశాడని చెప్పాలని అనుకున్నాడు.
* * *
సౌత్ విలేజ్‌లోని ఆ ఇంటి యజమాని జోర్డాన్ కోసం వేచి ఉన్నాడు. తలుపు తెరవగానే చెప్పాడు.
‘మిస్టర్ మేకర్. మొదట అంతస్థులోని వెనక అపార్ట్‌మెంట్. మీకు ఎలాంటి డిస్ట్రబెన్స్ ఉండదు రండి. చూపిస్తాను’
చిన్నదే అయినా హోవార్డ్‌కి అది నచ్చింది. ఆ విషయం చెప్పగానే ఇంటి యజమాని మర్నాటికల్లా రెంటల్ అగ్రిమెంట్ సిద్ధం చేస్తానన్నాడు. ఒకవేళ తను ఆ అపార్ట్‌మెంట్‌ని లీజ్ పీరియడ్ దాకా కొనసాగించకపోతే, తప్పు పేరే ఉండడం మంచిదని హోవార్డ్ భావించాడు.
మర్నాడు సంతకం చేశాక ఇంటాయన కోరాడు.
‘నూట ఎనభై డాలర్లు ఇవ్వాలి. ఓ నెల అడ్వాన్స్. మిగతాది సెక్యూరిటీ డిపాజిట్’
హోవార్డ్ చెక్ బుక్ కోసం బ్రీఫ్‌కేస్‌ని తెరిచాడు. కానీ దాని మీద రాయ్ బేకర్ అని సంతకం చేస్తే తన బేంక్ వారు దాన్ని తిరస్కరిస్తారు అని గుర్తొచ్చి నగదు చెల్లించాడు.
ఆ రోజు లంచ్ సమయాన్ని పక్క మీద పరిచే దుప్పట్లు, అక్కడ ఉంచేందుకు బట్టలు, వాటిని తీసుకెళ్లడానికి ఓ సూట్‌కేస్‌ని కొంటూ గడిపాడు.
‘మీ ఇనీషియల్స్ ఏమిటి?’ సూట్‌కేస్ సేల్స్‌మేన్ అడిగాడు.
‘దేనికి?’ హోవార్డ్ ప్రశ్నించాడు.
‘సూట్‌కేస్ మీద అతికించడానికి’
‘హెచ్ జె’ అని ఉంటే ఇంటి యజమాని ప్రశ్నించచ్చని రాయ్ బేకర్ ఇనీషియల్స్ ఆర్. బి అని చెప్పాడు. ఆ రాత్రి తన భార్య కరోలిన్‌కి ఫోన్ చేసి చెప్పాడు.
‘పని వత్తిడి. రాత్రికి హోటల్లో ఉంటాను’
అపార్ట్‌మెంట్‌కి సూట్‌కేస్‌తో వెళ్లి బట్టలని అలమరాలో, టూత్ బ్రష్, రేజర్లని బాత్‌రూంలో ఉంచి, కొన్న దుప్పట్లు పక్క మీద పరిచి పడుకున్నాడు.
ఆ సమయానికి రాయ్ బేకర్ కేవలం ఓ రెంటల్ అగ్రిమెంట్ మీద సంతకం, ఓ సూట్‌కేస్ మీద రెండు ఇనీషియల్స్ మాత్రమే.
క్రమేపీ రాయ్ బేకర్ అనే వ్యక్తికి ఎముకలు, మాంసం ఏర్పడసాగాయి. హోవార్డ్ చుట్టుపక్కల బార్స్, కాఫీ హౌస్‌లలోని మనుషుల దుస్తులకి, తను ధరించే వాటికిగల వ్యత్యాసాన్ని గ్రహించాడు. అవన్నీ మధ్యతరగతి వారు ధరించేవి. దాంతో ఆ ప్రాంతంలో నివసించే రాయ్ బేకర్‌కి సరిపడే అలాంటి దుస్తులనే కొన్నాడు. డెనిమ్ పేంట్, కేన్వాస్ షూస్, దళసరి స్వెట్టర్లు.. తను ధరించే మూడు గుండీల సూట్ బదులు ఆ కొత్త దుస్తులని ధరించగానే హోవార్డ్ రాయ్ బేకర్‌గా మారాడు. రెండు నెలల తర్వాత రాయ్ బేకర్ ఓ వ్యక్తిగా మారాడు.
అతని తోటి అద్దెకి ఉన్నవాళ్లు కానీ, చుట్టుపక్కల వాళ్లు కాని పలకరిస్తే యాంత్రికంగా తనని రాయ్ బేకర్‌గా పరిచయం చేసుకోసాగాడు. కారణం తన అసలు పేరు ఇదని, తను ఇంకొక పేరుతో అక్కడ నివసిస్తున్నాడని చెప్పడం అతనికి ఇష్టం లేదు. రాయ్ బేకర్‌గా ఉండడం వల్ల తను ఓ ఆసక్తికరమైన పాత్రని పోషించవచ్చని హోవార్డ్ భావించాడు. హోవార్డ్ అంటే మేడిసన్ అవెన్యూలోని పెద్ద అడ్వర్టయిజ్‌మెంట్ కంపెనీలో అధిక ఆదాయంగల కాపీ చీఫ్. తను నివసించే సౌత్ విలేజ్ ప్రాంతంలోని జానపద గాయకులు, కళాకారులు, చిన్న నటీనటులని చిన్నచూపు చూసే వ్యక్తి. కానీ రాయ్ బేకర్ వారిలోని ఓ మనిషి. రాయ్‌ని హోవార్డ్ ఎలా కావాలంటే అలా మలచగలడు. రాయ్‌కి క్రమంగా ఓ జీవితకథ ఏర్పడసాగింది.
రాయ్ చిత్రకారుడు. తన భార్య విషాద మరణం తర్వాత వొంటరిగా ఓ కమర్షియల్ ఆర్ట్ స్టూడియోలో పని చేస్తున్నాడు. భార్య విషాద మరణం హోవార్డ్‌కి రహస్యంగా ఉన్న కోరిక. కరోలిన్ మరణం తనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని హోవార్డ్‌కి తెలుసు. అందుకని దాన్ని రాయ్ బేకర్ కథలోకి చొప్పించాడు. హోవార్డ్‌కి బొమ్మలు గీయాలనే కోరిక ఉండేది. కానీ కరోలిన్‌తో పెళ్లయ్యాక అధిక ఆదాయం కోసం కాపీ రైటింగ్‌కి మారాడు.
వారాలు గడిచేకొద్దీ రాయ్ బేకర్ ఉనికి విస్తారం అవసాగింది. ఆ పేరుతో బేంక్ అకౌంట్ తెరిచాడు. ఓ బుక్ క్లబ్‌లో చేరడంతో అనేక మెయిలింగ్ లిస్ట్‌ల లోకి అతని పేరు, అతని అడ్రస్ చేరింది. ఆ ఏరియా సెనేటర్ నించి తను ఎన్నికైనప్పటి నించి ఆ నియోజకవర్గానికి తను చేసిన వివిధ అభివృద్ధి పనులని వివరిస్తూ రాయ్ బేకర్‌కి ఉత్తరం కూడా వచ్చింది. త్వరలోనే అతను ఆఫీస్‌లోంచి ఐదుకే బయటికి వచ్చినా, రైల్వేస్టేషన్‌కి బదులు క్రిస్ట్ఫర్ స్ట్రీట్‌లోని అపార్ట్‌మెంట్‌కి రాత్రిళ్లు గడపటానికి వెళ్లసాగాడు.
ఆసక్తికరంగా అతను అపార్ట్‌మెంట్ అద్దెకి తీసుకున్నప్పటి నించీ, ఆలస్యంగా పని చేయడం తగ్గిపోయింది. బహుశా తను కరోలిన్ దగ్గరికి వెళ్లడాన్ని అవాయిడ్ చేయడానికి రాత్రిళ్లు ఆలస్యంగా పని కల్పించుకునేవాడు అని అతనికి అనిపించింది. మరో చోటికి వెళ్లి పడుకునేందుకు ఇప్పుడు అవకాశం ఉండడంతో సాయంత్రం ఐదు తర్వాత ఆఫీస్‌లో పని చేయాల్సిన అవసరం కూడా తగ్గిపోయింది. వారంలో ఒక రాత్రి మాత్రమే, అదీ అరుదుగా ఐదు తర్వాత పని చేస్తున్నాడు.
ఒకోసారి అపార్ట్‌మెంట్‌లో వొంటరిగా గడుపుతూ ఆ ఏకాంతాన్ని ఎంజాయ్ చేస్తాడు.
ఒకోసారి మిత్రులతో బార్లలో గడుపుతూ, కళల గురించి చర్చిస్తూ ఎంజాయ్ చేస్తాడు.
ఒకోసారి ఈ రెండు ప్రయోజనాలని కలుపుతూ, తన అపార్ట్‌మెంట్‌కి అంగీకరించే యువతిని తీసుకొస్తూంటాడు.
అపార్ట్‌మెంట్ తీసుకున్నాక, ఆఫీస్‌లో అతని పనితనం కూడా మెరుగైంది. అతని ఆలోచనల్లో చాలా కొత్తదనం ఉంటోంది అని బాస్ మెచ్చుకున్నాడు. తక్కువ సమయంలో ఎక్కువ నాణ్యత గల పని చేస్తున్నాడు. అతని కుటంబ జీవితం కొద్దిగా తగ్గినా మెరుగైంది.
విడాకులు? దాని గురించి ఆలోచించాడు. జీవితాంతం రాయ్ బేకర్‌గా ఉండడంలోని ఆనందం గురించి ఆలోచించాడు. కానీ అది ఆర్థికంగా నష్టదాయకం. కరోలిన్ తన కారుని, ఇంటిని, తన జీతంలో సగ భాగాన్ని కోరుతుంది. రాయ్ బేకర్‌కి మిగిలిన సగం జీతం ఎక్కువే అయినా కరోలిన్‌ని వెంటనే విడాకులు కోరదల్చుకోలేదు.
ఓ రాత్రి వెస్ట్ థర్డ్ స్ట్రీట్‌లోని ఓ నైట్ క్లబ్‌లోంచి బయటికి వచ్చిన కరోలిన్ మరొకతనితో కలిసి తాగి తూలుతూ నడుస్తూంటే, ఆ మగ వ్యక్తి ఆమె తన స్వంత మనిషి అన్నట్లుగా ఆమె నడుం చుట్టూ చేయి వేయడం చూశాడు. అతనికి కలిగిన మొదటి స్పందన ఆశ్చర్యం. ఓ మగాడికి ఆమె ఆకర్షణీయంగా ఎలా కనిపిస్తోందనే ఆశ్చర్యం. తను ఇదివరకటిలా ఆఫీస్ నించి ఇంటికి రావడం తగ్గినా గతంలోలా కరోలిన్ తనని అందుకు కారణాలు గుచ్చిగుచ్చి ఎందుకు అడగడం లేదో అర్థమైంది. ఆమె క్రెడిట్ కార్డ్స్ బిల్స్‌ని చెల్లించే బేంక్‌తను. టెన్ బెస్ట్ డ్రెస్డ్ ఉమన్ జాబితాలో చేరే లాంటి దుస్తుల్ని కొన్నా వాటిని తనతో బయటికి వచ్చేప్పుడు కాక, ఎవరితో బయటికి వెళ్లేప్పుడు ధరిస్తుందో అర్థమైంది. తన నించి కావలసినంత తీసుకుని ఆమె తనకేమీ ఇవ్వడం లేదన్న ఆలోచన కూడా కలిగింది. ఆమె మీద తనకి ద్వేషం ఉందని, అది ఇప్పుడు పెరిగిందని అతనికి అర్థమైంది. దాని గురించి ఏదైనా చేయాలని కూడా అనుకున్నాడు.
ఏం చేయాలి? డిటెక్టివ్‌ని నియమించి సాక్ష్యాలు సేకరించాలా? అక్రమ సంబంధం ఆరోపణతో విడాకులు తీసుకోవాలా? కానీ అది ఆమె నేరానికి సరిపడే శిక్ష కాదని భావించాడు. అది రాయ్ బేకర్ లాంటి ఏ సాధారణ భర్తయినా చేసే సహజమైన పనే. తను హోవార్డ్. తను ఏదైనా అసహజమైంది చేయాలనుకున్నాడు. జరిగేది తనకి తెలియనట్లుగా రాజీపడి జీవించడం రాయ్ బేకర్ లాంటి వారికి ఇష్టమేమో కానీ తనకి ఇష్టం లేదనుకున్నాడు. ఆ రోజు నించి హోవార్డ్‌ని పాత రొటీన్‌లోకి తీసుకెళ్లాడు.
ఆఫీస్‌లో లేటుగా పని చేసినప్పుడు హోటల్లో గది తీసుకుని, అక్కడ పడుకున్నట్లుగా పక్క బట్టలని నలిపేసి, వెనక మెట్ల మీంచి హోటల్లోంచి బయటికి వెళ్లి ఓ టేక్సీ తీసుకుని అపార్ట్‌మెంట్‌కి చేరుకుని లోపలికి వెళ్లి బట్టలు మార్చుకుని, రాయ్ బేకర్‌గా మారి పడుకునేవాడు.
మరోసారి కరోలిన్ అతనికి కనిపించింది. ఈసారి ఆమెని అనుసరించాడు. అతను క్లెమెంట్ అనే జానపద కళాకారుడని, కరోలిన్ అతని అపార్ట్‌మెంట్ అద్దెని చెల్లిస్తోందని గ్రహించాడు.
‘వెల్స్ అనే వ్యక్తి నించి క్లెమెంట్ కరోలిన్‌ని

సంపాదించాడు. ఆమె భర్త కనెక్ట్‌కట్‌లోనో, న్యూయార్క్‌లోనో ఎక్కడో పెద్ద జీతగాడు. క్లెమెంట్ కాకపోతే మరొకరు. ఆమె ఎవరో ఒకరు లేకుండా ఉండలేదు’ ఆ క్లబ్‌లోని ఒకరు చెప్పారు.
అంటే ఈమె కొంతకాలంగా ఈ వ్యవహారం నడుపుతోందన్నమాట! ఇలాంటివి ఆఖరుగా తెలిసేది భర్తకి అన్నది తన విషయంలో నిజమైందని అనుకున్నాడు.
హోవార్డ్ మిడ్ టౌన్ హోటల్లో గది అద్దెకి తీసుకుని రహస్యంగా అపార్ట్‌మెంట్‌కి వెళ్లి రాయ్ బేకర్‌గా జీవితాన్ని గడుపుతున్నాడు. తన భార్య మీద తనకి ఏర్పడ్డ ద్వేషం తగ్గిపోతుందని ఎదురుచూశాడు. కానీ అది రోజురోజుకీ పెరగడం గమనించాడు. రచయిత అయ్యే బదులు తనని ప్రకటన రచయితగా మార్చింది. రాయ్ బేకర్ మనస్తత్వంగల తనని హోవార్డ్ జోర్డన్‌లా జీవించేలా చేసింది. కరోలిన్ రాని ఓ రాత్రి కాపు కాచి హోవార్డ్ హడ్సన్ స్ట్రీట్‌లోని క్లెమెంట్ పాటలు పాడే బార్‌కి వెళ్లి అతను మాట్లాడేది విన్నాడు. అతన్ని టెనె్నస్సే మాండలీకం అనుకరణకి తేలిక. ఆ సాయంత్రం భార్యకి ఫోన్ చేసి చెప్పాడు.
‘ఈ రాత్రి మనం కలవాలి’
‘క్లెమెంట్?’
అనుకరణ విజయవంతమైంది.
‘మా ఇంట్లో కాదు. 193 క్రిస్ట్ఫర్ స్ట్రీట్. అపార్ట్‌మెంట్ 1-డి. ఏడున్నరకి’
‘ఏదైనా ఇబ్బందా?’
‘చెప్పిన టైంకి రా’ లైన్ కట్ చేశాడు.
ఆ రోజు గురువారం.
ఐదు నిమిషాల తర్వాత అతని ఫోన్ మోగింది.
‘హోవార్డ్? ఈ రాత్రి మీరు ఇంటికి వస్తున్నారా? లేదా?’ కరోలిన్ ప్రశ్నించింది.
‘నాకు తెలీదు. చాలా పని ఉంది. కానీ ఇంటి నించి దూరంగా ఉండడం నాకు నచ్చడం లేదు. పోనీ పని మానేసి...’
‘వద్దు’ దాదాపుగా అరిచింది.
‘అంటే నీ కెరీర్ మనకి ముఖ్యం’ ఈసారి సరళంగా చెప్పింది.
ఆ రాత్రి ఆమెకిగల పని గురించి హోవార్డ్‌కి తెలుసు.
‘నాకు తలనొప్పిగా ఉంది. మీరు రాత్రి హోటల్లోనే ఉండి పోండి’
‘సరే. రేపు వీకెండ్ కదా. రేపు వస్తాను’ ఒప్పుకున్నాడు.
ఆమె లైన్ కట్ చేశాక హోవార్డ్ హోటల్‌కి ఫోన్ చేసి రాత్రి పదకొండున్నరకి రూం బుక్ చేశాడు. ఆఫీస్ నించి ఐదున్నరకి బయటికి వస్తూ బిల్డింగ్‌లోని రిజిస్టర్‌లో సంతకం చేశాడు. ఓ రెస్టారెంట్‌లో త్వరగా భోజనం ముగించి మళ్లీ ఆరుకి తన ఆఫీస్ గదిలోకి రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్లాడు.
పావు తక్కువ ఏడింటికి మళ్లీ ఆఫీస్ బిల్డింగ్‌లోంచి బయటికి వెళ్లాడు. కానీ ఈసారి రిజిస్టర్‌లో సంతకం చేయలేదు. టేక్సీలో తన అపార్ట్‌మెంట్‌కి ఏడు పదికి చేరుకున్నాడు. సరిగ్గా ఏడున్నరకి తలుపు మీద ఎవరో కొట్టిన శబ్దం వినిపించింది. తలుపు తెరిచిన తన వంకే గుడ్లప్పగించి చూసిన భార్యని లోపలికి లాగాడు. ఆమె అయోమయంగా ఉండిపోయింది.
‘నిన్ను చంపేస్తున్నాను కరోలిన్’ చెప్పాడు.
కత్తితో ఆమెని పొడిచి చంపాడు. ఆమె అరుపులు అతన్ని బాధించలేదు. మరణించే మహిళ అరుపులని ఏ న్యూయార్క్ వాసీ పట్టించుకోడని అతనికి తెలుసు.
రాయ్ బేకర్‌కి సంబంధించని అన్ని దుస్తులని, కరోలిన్ హేండ్ బేగ్‌ని తీసుకుని అపార్ట్‌మెంట్ నించి బయటికి వచ్చాడు. ఓ పబ్లిక్ ఫోన్ బూత్ నిచి ఎయిర్‌పోర్ట్‌కి ఫోన్ చేసి ఓ రిజర్వేషన్ చేయించాడు. అక్కడ నించి టేక్సీలో మళ్లీ ఆఫీస్ బిల్డింగ్ ముందు దిగి రిజిస్టర్‌లో సంతకం చేయకుండా లోపలికి వెళ్లిపోయాడు.
రాత్రి పదకొండున్నరకి ఆఫీస్‌లోంచి బయటికి వెళ్తూ, రిజిస్టర్‌లో సంతకం చేసి హోటల్‌కి వెళ్లాడు. అతను అనుకున్న దానికన్నా హాయిగా నిద్రపట్టింది.
మర్నాడు ఉదయం ఆఫీస్‌కి వెళ్లాక అతను కోరితే అతని ఆఫీస్ సెక్రటరీ న్యూహోప్‌లోని వారింటికి మూడుసార్లు ఫోన్ చేసింది. ఎవరూ బదులు పలకలేదు. ఎప్పుడూ ఇంటికి వెళ్లే రైలెక్కి ఇంటికి వెళ్ళాడు. ఇంటి డోర్ బెల్‌ని కొన్నిసార్లు కొట్టి తాళం చెవితో తలుపు తెరుచుకుని లోపలికి వెళ్లి కరోలిన్ పేరుని అనేకసార్లు పిలిచాడు. ఫ్రిజ్‌లోంచి ఓ బీర్‌ని తీసుకుని తాగాడు. అరగంట తర్వాత పక్కింటి వాళ్లకి ఫోన్ చేసి తన భార్య గురించి అడిగాడు. తెలీదని జవాబు వచ్చింది. మరో మూడు గంటల తర్వాత పోలీసులకి ఫోన్ చేసి కరోలిన్ కనపడటం లేదని ఫిర్యాదు చేశాడు.
శనివారం రాత్రి న్యూయార్క్ పోలీసులు కరోలిన్ శవాన్ని కనుగొన్నాక, ఆమె వేలిముద్రలని వెదికితే, వాళ్ల డేటా బేటాలో అవి మేచ్ అయ్యాయి. పెళ్లికి మునుపు కరోలిన్ సివిల్ సర్వీస్ ఉద్యోగి కాబట్టి అప్పట్లో తీసుకున్న వేలిముద్రలు డేటా బేంక్‌లో ఉన్నాయి. న్యూహోప్ చిరునామాకి కనుక్కునేందుకు వారికి కొంత సమయం పట్టింది. ఆదివారం ఓ స్థానిక పోలీస్ ఆఫీసర్ వారి ఇంటికి వచ్చాడు.
‘నేను మీకు చెప్పడం ఇష్టంలేక చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను. మీ భార్య కనపడటం లేదని మాకు ఫోన్ చేశాక, మీ ఇరుగు పొరుగుతో మాట్లాడాను. ఆమెకి రహస్య ప్రియులు ఉన్నారన్న సంగతి మా దృష్టికి వచ్చింది. న్యూయార్క్‌లో అనేక మంది మగాళ్లని ఆమె కలిసేది’
‘నిజంగా?’ హోవార్డ్ ఆశ్చర్యం నటిస్తూ అడిగాడు.
‘రాయ్ బేకర్ ఎవరో మీకు తెలుసా?’
‘తెలీదు’
‘మీ భార్యకి ఇటీవల అతనితో పరిచయమైనట్లుంది. అతనే ఆమెని చంపాడని మా అనుమానం’
హోవార్డ్ మొహంలో భార్య అనుకూలవతి కాదన్న బాధ, ఆమె మరణించిందన్న బాధ సరైన పాళ్లలో కనిపించింది. ఆమె శవాన్ని చూసినప్పుడు బాగా ఏడ్చే అతన్ని వాళ్లు సముదాయించారు.
‘రాయ్ బేకర్ పల్లెటూరి మనిషి. బాధ్యతలేని చిత్రకారుడు. కరోలిన్‌ని చంపాక ఓ విమానంలో టిక్కెట్ బుక్ చేశాడు. కానీ వెళ్లి దాన్ని తీసుకోలేదు. ఇది అనుకోకుండా జరిగినట్లుంది. బట్టల్ని తీసుకెళ్లలేదు. బేంక్ అకౌంట్ నించి డబ్బు డ్రా చేయలేదు. బహుశా మేము అతన్ని కనుక్కుంటామని భయపడి ఉంటాడు. బహుశా అతను ఇంకో పేరుతో పారిపోయి ఉంటాడు. కాని అతన్ని మేం కచ్చితంగా పట్టుకుంటాం. అతను ఎక్కడ గడిపినా, సంవత్సరం తర్వాత తిరిగి న్యూయార్క్‌కి వెనక్కి వస్తాడు’ వాళ్లు చెప్పారు.
న్యూయార్క్ పోలీసులు రొటీన్‌గా హోవార్డ్ ఎలిబీని చెక్ చేశారు. శాండ్‌విచ్ తినడానికి అరగంటసేపు ఐదున్నరకి బయటికి వెళ్లాడు తప్ప, రాత్రి పదకొండున్నర దాకా ఆఫీస్‌లోనే గడిపాడని, తర్వాత ఆఫీస్‌లో లేట్‌గా పని చేసినప్పుడు అతను గడిపే హోటల్లోనే గడిపాడని వాళ్లు నిర్ధారణ చేసుకున్నారు.
కొద్ది వారాల క్రితం హోవార్డ్ న్యూ హోప్‌లోని తన ఇంటిని మంచి రేటుకి అమ్మేశాడు. న్యూయార్క్‌కి మారి తన ఎలిబీ హోటల్లోనే ఉంటూ, సౌత్ విలేజ్‌లో అమ్మకానికి ఉన్న అపార్ట్‌మెంట్ కోసం దినపత్రికలు చూడసాగాడు. టేక్సీలో ఓ రోజు కొరాషియో స్ట్రీట్‌లోని మూడు గదుల అపార్ట్‌మెంట్‌ని చూశాడు కానీ తనని అంతా రాయ్ బేకర్‌గా గుర్తు పడతారని, ఆ పేరుతో అరెస్ట్ అయితే ఇంతే సంగతులు అనుకున్నాడు.
మరో రెండు వారాలు హోటల్లోనే ఉండి, రాయ్ బేకర్ జీవితాన్ని తను మళ్లీ ఎలా గడపాలా అని ఆలోచించసాగాడు. ఈస్ట్‌సైడ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ని ఎక్కువ ధరకి అద్దెకి తీసుకున్నాడు. కానీ అక్కడి జీవితం అతనికి ఆనందంగా లేదు. మిడ్ టౌన్ నైట్ క్లబ్స్‌లోకి వచ్చే వాళ్లు సౌత్ విలేజ్ పబ్స్‌కి వచ్చే వాళ్లలాంటి వాళ్లు కాదు. వాళ్లతో సంభాషణ అతనికి నచ్చలేదు.
ఇటీవల అతను ఆఫీస్‌లో రాత్రి చాలాసేపు పని చేస్తున్నాడు. ప్రకటనల విషయంలో అతను చేసే తప్పులని కింది వాళ్లే దిద్దుతున్నారు. దేని మీదా దృష్టిని కేంద్రీకరించలేక పోతున్నాడు.
క్రమంగా అతనికి తనని తను ఏం చేసుకున్నాడో అర్థం అవసాగింది. రాయ్ బేకర్ జీవితం అతనికి ఆనందంగా ఉంది. క్రిస్ట్ఫర్ స్ట్రీట్ అపార్ట్‌మెంట్, కొత్త ఐడెంటిటీ, ఆ కొత్త ప్రపంచంలోని కొత్త మిత్రులు, వారి మాటలు, పద్ధతులు - ఆ ప్రపంచం అతనికి జీవించదగ్గ ప్రపంచంగా కనిపిస్తోంది. రెండు పేర్లతో ఐడెంటిటీని కాపాడుకోవడం, అందుకోసం ఆడిన అబద్ధాలు అతనికి ఎక్సయిటింగ్‌గా ఉండేవి. హోవార్డ్ కంటే, రాయ్ బేకర్‌గా నటించడమే అతనికి ఆనందాన్ని ఇచ్చేది. ఆ కారణంగా అతనికి కరోలిన్ నించి విడాకులు తీసుకున్నా బానే ఉండేది. కానీ ఆమెని చంపాడు. ఆమెతోపాటు రాయ్ బేకర్‌ని కూడా చంపేశాడు.
హోవార్డ్ అప్పుడప్పుడు రాయ్ బేకర్ దుస్తులని ధరించి నేల మీద కూర్చుని, కేలిఫోర్నియా వైన్‌ని జగ్‌లోంచే తాగుతూంటాడు. కాఫీ హౌస్ వెనక గదిలో చదరంగం ఆడాలని, కళ లేక మతం మీద వాదనతో విలేజ్ బార్‌లోని సాటి వారితో మాట్లాడాలని, లేదా ఓ ఇంట్లో జరిగే పార్టీలో గిటార్‌ని వినాలని అనిపిస్తుంది.
రాయ్ బేకర్‌లా డ్రెస్ వేసుకుని, రాయ్ తాగే వైన్ తాగుతూ స్టీరియోలో గిటార్ వింటున్నా అతనికి తృప్తి కలగలేదు. తను హోవార్డ్ జోర్డాన్ లానే జీవించాలి. కరోలిన్ ఉన్నా, లేకపోయినా పెళ్లయినా, వొంటరివాడైనా అతనికి ఒక విషయం స్పష్టంగా తెలుసు. తను హోవార్డ్‌గా జీవించడంలో ఎంత మాత్రం తృప్తిలేదు.
చివరికి ఓ రోజు రాయ్ బేకర్ పేరుతో హోవార్డ్ ఓ సింగిల్ బెడ్‌రూం అపార్ట్‌మెంట్‌ని అద్దెకి తీసుకుని అందులోకి మారాడు!

(ఎల్ బ్లాక్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి