Others

పుడమి తల్లిని కాపాడి.. జీవజాతులను రక్షిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మ నిషి ఎంత ఎత్తుకు ఎదిగినా ఆధారం భూమి మాత్రమే. గాలి, నీరు, అగ్ని, నేల, ఆకాశం అనే పంచభూతాల వల్లే మానవ జాతి మనుగడ సాధ్యమవుతుంది. వీటిలో ఏ ఒక్కటి లోపించినా జీవనం స్తంభించక తప్పదు. భూమి సారవంతంగా, సస్యశ్యామలంగా ఉంటేనే మానవ అభివృద్ధి నిజమవుతుంది. కానీ, అగ్రరాజ్యాల అంతులేని ఆధిపత్య దాహమే భూమండలం కాలుష్యానికి చిరునామాగా మారింది. భూమి ఉపరితలంపై ఉన్న వనరులనే కాదు, అట్టడుగున దాగి ఉన్న భూగర్భ జలాలు, ఖనిజ వనరులను పలు దేశాలు విచక్షణారహితంగా వాడేసుకుంటున్నాయి. ఈ వాడుక వల్ల భూతాపం పెరగడమే కాకుండా, రాబోయే వందేళ్ళలో ముడిచమురు నిల్వలు అంతరించిపోతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. రోజురోజుకూ పచ్చని చెట్లు తగ్గిపోవడం, కొన్ని జీవరాశులు నశించిపోవడం కారణంగా భూతాపం పెరుగుతూ వస్తుంది. నానాటికీ పెరుగుతున్న భూతాపంతో ప్రకృతి సమతుల్యత దెబ్బతిని జీవరాశి మనుగడకు ముప్పు ఏర్పడుతోంది.
పరిశ్రమలు, వాహనాలు, ఎలక్ట్రిక్ పరికరాలు వెలువరిస్తున్న ఫ్లోరోఫోర్ కార్బన్‌లు భూగ్రహాన్ని వేడెక్కిస్తున్నాయి. పలురకాల కాలుష్యాలు భూతాపాన్ని పెంచుతున్నాయి. భూతాపం పెరగడంవల్ల పర్యావరణంలో పెనుమార్పులు చోటుచేసుకోవడం ద్వారా జీవరాశుల మనుగడకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మరోవైపు వాతావరణంలో మార్పులు ఏర్పడి జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. చెట్లను విచక్షణారహితంగా నరికివేస్తున్నందున అడవులు అంతరించిపోతున్నాయి. సరైన వర్షాలు లేక కరువుకాటకాలు ఏర్పడుతున్నాయి. వర్షాలు లేని కారణంగా జల వనరులు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. అకాల వర్షాలు, విపరీతమైన వేడిమి కారణంగా గ్లోబల్ వార్మింగ్‌తో ఓజోన్ పొర దెబ్బతింటోంది.
పెరిగిపోతున్న భూతాపం, వాతావరణ కాలుష్యంతో అల్లాడుతున్న భూమాతను కాపాడుకునే దారేది? పర్యావరణ పరిరణక్ష విషయమై ప్రజల్లో అవగాహన పెంచే అవకాశమే లేదా? అంతరించిపోతున్న జీవజాతులను కాపాడుకోలేమా? ఈ ప్రశ్నలకు సమాధానమే ‘ప్రపంచ ధరిత్రి దినోత్సవం’ దీనికి బీజం 1970లో పడింది. 1969 జనవరి 28న శాంటా బార్బరా సముద్రతీరం చమురు తెట్టులతో నిండింది, సమద్రతీరమే ఆలంబనగా ఉన్న వందలాది జీవజాతులు మృత్యువాతపడ్డాయి. సుమారు నాలుగువేల పక్షుల రెక్కలు ఆ చమురు తెట్టులో చిక్కుకొని ఎగిరే దారిలేక అవి ప్రాణాలొదిలాయి. ఇలా జీవ వైవిధ్యం కొడిగట్టింది. ప్రపంచ ధరిత్రి దినోత్సవానికి ఆనాటి సంఘటన పునాదిగా మారింది. అమెరికన్ సెనేటర్ గెలార్డ్ నెల్సన్ పర్యావరణ పరిరక్షణకు అప్పుడు పిలుపునిచ్చారు. ఆ పిలుపునందుకుని అమెరికాలో 20 లక్షల మంది ఏప్రిల్ 22న ధరిత్రి దినోత్సవంలో పాల్గొన్నారు. నేల అంటే మట్టి అన్న అర్థం మాత్రం కాదు, భూమంటే 84 లక్షల జీవరాశుల సముదాయం. మొదటిసారిగా ధరిత్రి దినోత్సవం 1970 ఏప్రిల్ 22న పాటించారు.
మాతృభూమికి కృతజ్ఞతలు చెప్పాల్సిన రోజు ఇది. భూమిని పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉంచేందుకు దృఢ సంకల్పం తీసుకోవాల్సిన రోజు. మొక్కలు, జంతువులు, పక్షులు ధరిత్రిపై జీవనాన్ని పంచుకుంటున్నాయి. వాటితో సామరస్యంగా మెలగడం మన బాధ్యత. అందుకే ప్రజలందరికీ ప్రకృతి, ప్రకృతి వనరుల పరిరక్షణపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. వాతావరణ మార్పులవల్ల ధరిత్రికి పొంచి ఉన్న ప్రమాదాలు, మార్పుపై అవగాహన పెంచుకోవాల్సిన రోజు. ప్రకృతికి విరుద్ధంగా మనిషి చేస్తున్న పనుల వల్లే విపత్తులు వస్తున్నాయి. నేలతల్లి బాగుంటేనే మనం బాగుంటాం.
వాతావరణంలో కర్బన ఉద్గారాలకు చైనా అతిపెద్ద వనరుగా ఉంది. ప్రపంచ కర్బన ఉద్గారాలలో 30% చైనా వెలువరిస్తోంది. అమెరికా 15శాతం, యూరోజాన్ 9శాతం, భారత్ 7 శాతం కర్బన ఉద్గారాలను వెలువరిస్తున్నాయి. ప్రపంచ జనాభాలో 15శాతం చైనాదే కాబట్టి తలసరి పాత్ర సూచికపై చూస్తే చైనా, అమెరికావల్ల తలెత్తుతున్న సమస్య భారత్ వల్ల రాదు. 2015లో జరిగిన పారిస్ ఒప్పందంలో ప్రపంచ దేశాలు తమ కర్మాగారాలు, ఆటోమోబైల్స్ వెలువరించే కర్బన ఉద్గారాలను తగ్గించుకుంటామని అంగీకరించాయి. భూతాపాన్ని తగ్గించటానికి తన వంతు కృషిచేస్తానని చేసిన వాగ్దానం నుంచి అమెరికా వెనక్కుమళ్ళడం దురదృష్టకరం.
ఇంధన వనరుల్ని అత్యధికంగా
వాడుకుంటున్న దేశాలివి
(లక్షల కోట్ల లీటర్లు)
చైనా 20
అమెరికా 16.2
రష్యా 5.1
భారత్ 4.1
జపాన్ 3.5
కెనడా 2.4
జర్మనీ 2.3
బ్రెజిల్ 2
ద. కొరియా 2
ఫ్రాన్స్ 1
పారిశ్రామికీకరణ వల్ల పెరుగుతున్న కాలుష్యం, పర్యావరణం గురించి అజాగ్రత్తలను దృష్టిలో పెట్టుకుని ఆనాటి అమెరికన్ సెనేటర్ గెలార్డ్ నెల్సన్ ‘ఎర్త్ డే’కు రూపకల్పన చేశాడు. ఇరవయ్యో శతాబ్దంలో భూగోళ ఉపరితల ఉష్ణోగ్రతలు సగటున 0.6 డిగ్రీలు మేర పెరిగినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. అడ్డూ అదుపూ లేకుండా శిలాజ ఇంధనాలను వినియోగించడం, అడవులను నిర్మూలించడం వంటి చర్యలవల్ల గడిచిన ఏభై ఏళ్లలో భూతాపం దారుణంగా పెరిగింది. ఫలితంగా రుతువులు గతి తప్పుతున్నాయి. వర్షాకాలంలో కూడా ఎండలు భగ్గుమంటున్నాయి. అడవుల నరికివేత వల్ల వన్యప్రాణులు, కొన్నిరకాల జీవజాతులు అదృశ్యమైపోతున్నాయి. భూతాపానికి సముద్ర మట్టం పెరిగి ద్వీప దేశాలు తుడిచిపెట్టుకొని పోకుండా చర్యలు తీసుకోవాలంటూ ఇటీవల సీషెల్స్ అధ్యక్షుడు షార్ చారిత్రాత్మక పిలుపునిచ్చారు. సబ్ మెర్సిబుల్ వాహనంలో సాగర గర్భంలోకి వెళ్లి ఆయన ప్రసంగించారు.
ప్రపంచంలో ఇరవై అత్యంత కాలుష్య నగరాలలో 13 మన దేశంలోనే ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో వెల్లడించింది. ఈ వాయు కాలుష్యం వల్ల ఏటా ఆరు లక్షలకు పైగా ప్రజలు అకాల మరణాలు పొందుతున్నారు. అధిక జనాభావల్ల తలసరి కాలుష్యం తక్కువగా కనిపించినప్పటికీ, మొత్తం విడుదలైన కాలుష్య పరిణామం లెక్కిస్తే చైనా, అమెరికాల తర్వాత మూడవ స్థానంలో మనదేశమే ఉంది. పవన విద్యుత్తు, సౌరశక్తి వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల్ని వినియోగంలోకి తెచ్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది. తాజా పరిశోధనల ప్రకారం ఇతర గ్రహాలలో మనిషి జీవించే పరిస్థితులు ఏర్పడేవరకు మనిషికి భూమి ఒక్కటే ఆధారం.
భూతాపానికి కళ్ళెం వేస్తే లక్షల కోట్ల రూపాయలు ఆదా అవుతాయి. భూతాపంవల్ల వర్షపాతం ‘సహజ మార్పుల’ దశదాటి ‘ఆకస్మిక మార్పుల’ దశకు చేరుతుంది. పెరుగుతున్న భూతాపం వ్యవసాయానికి పెనుశాపంగా పరిణమిస్తుంది. మంచు కరిగి సముద్రమట్టం పెరుగుతోంది. జీవ వైవిధ్యం నశిస్తుంది. అకాల వర్షాల వల్ల పంట నష్టం జరుగుతుంది. భూతాపం వల్ల పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వ్యవసాయంలో నీటి అవసరాన్ని పెంచడమేగాక, జల వనరుల లభ్యతను తగ్గిస్తాయి. ఉష్ణోగ్రతలో 2.5 డిగ్రీల పెరుగుదల కారణంగా వరి, గోధుమల ఉత్పత్తి 30% తగ్గుతుందని నవీన్ సింగ్ వంటి నిపుణులు 2011లోనే తమ పరిశోధనలో తెలిపారు.
ప్రతి సంవత్సరం చాలా దేశాలు ధరిత్రి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఉత్తరార్ధ గోళంలో వసంత ఋతువురాగా, దక్షిణార్ద్ర గోళంలో శరద్రుతువు వస్తుంది. భూమి ప్రాధాన్యతను తెల్సుకోవాలనే ఉద్దేశంతోనే ధరిత్రి దినాన్ని ఆచరించాలని నిర్ణయించారు. 2020 నాటికి భారత్‌లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోతాయని ప్రపంచ బ్యాంక్ నివేదిక హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మనం చేయాల్సిన తక్షణ కర్తవ్యాలు:
1) ప్రతి ఒక్కరూ విధిగా ఒక మొక్కను నాటాలి.
2) షాపింగ్‌కు వెళ్లినపుడు గుడ్డ సంచులను
తీసుకుని వెళ్ళాలి.
3) శాకాహారికి మారటం
4) చిన్న చిన్న దూరాలకు సైకిల్ తొక్కడం
ప్రతి రోజూ ధరిత్ర దినంగానే భావించాలి. చెట్లను నాటుదాం- భూమిని చల్లగా ఉంచుదాం. ప్రతి సంవత్సరం ధరిత్రీ దినోత్సవం ఒక నినాదాన్ని ఇస్తుంది. 2019 సంవత్సరంలో ఇచ్చిన థీం ‘ప్రొటెక్ట్ అవర్ స్పైసీస్’ అంటే భూమిపైన ఉండే సమస్త జీవజాతులను కాపాడాలి. నిజానికి నేడు అనేక జీవజాతులు మనిషి స్వార్థం వల్ల నశించిపోతున్నాయి. పులులు, సింహాలు, వివిధరకాల పక్షులు, జంతువుల్ని మనం కాపాడుకోవాలి లేకుంటే భావితరాలకు వాటి గురించే తెలియదు. అందుకే వన్యప్రాణులను రక్షించాలి. డైనోసార్స్ లాంటి సముద్ర జీవాలను కాపాడాలని ఈ ధరిత్రి దినోత్సవం పిలుపునిస్తోంది. జలం నుంచి జీవం వరకూ అన్నీ మనిషికి ప్రకృతిని ప్రసాదిస్తాయి. నిజానికి ప్రకృతి నుంచి మనిషి తీసుకోవడం లేదు- దోచుకుంటున్నాడు. ధరిత్రి దినాన్ని 2009 నుంచి ఐక్యరాజ్యసమితి ‘ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్‌డే’గా మార్చింది. కొన్ని దేశాల్లో ధరిత్రి దినోత్సవాన్ని వారం రోజులపాటు జరుపుకుంటారు. మొత్తం 192 దేశాలు ‘ఎర్త్‌డే’లో భాగమవుతున్నాయి. ప్లాస్టిక్ వాడకపోవడమే మంచిది. ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టాలి. నీటి వృథాను అరికట్టాలి. వీలైనన్ని మొక్కలు నాటాలి. తొమ్మిదో దశకం నుంచి ప్రపంచవ్యాప్తంగా సుమారు 12.9 కోట్ల హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ భూములు కనుమరుగయ్యాయి. భూమీద 66.3కోట్ల మందికి పరిశుభ్రమైన నీరు అందుబాటులో లేక అలమటిస్తున్నారు. అందుకే అడవితల్లిని భూతాపం నుంచి రక్షించేందుకు ప్రతిజ్ఞ చేద్దాం.
(రేపు ‘ప్రపంచ ధరిత్రి దినం’)

-కె.రామ్మోహన్‌రావు