Others

వెలకట్టలేని జాలాది పలుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాలాది రాజారావు 1932 ఆగస్టు 9న కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ సమీపంలోని (7 కి.మీ.దూరం) దొండపాడులో అమృతమ్మ, ఇమ్మానియేలుకు ఐదో సంతానంగా జన్మించారు. 5వ ఏట గుడివాడలోని ప్రాథమిక పాఠశాలలో చేరి, తొలి గురువు వెంకట లింగం మాస్టారు వద్ద అక్షరాభ్యాసం గావించారు. 8వ తరగతి నుంచి వేమన పద్యాలు చదవడం, తిరిగి అదే పద్ధతిలో వ్రాయడం అలవాటు చేసుకున్నాడు. అప్పటినుంచి చిన్న చిన్న గేయాలు రాసి తెలుగు మాస్టార్లకు చూపించి గురువుల ప్రోత్సాహం పొందేవారు.

తెలుగు సినీ సాహిత్యంలో ఆయన వెలకట్టలేని మణిమకుటం. అణగారిన వర్గం నుంచి ఉద్భవించిన అరుంధతీ నక్షత్రం. ఆయన -జాలాది రాజారావు. తన చుట్టూవున్న వాతావరణం నుంచే రచనలకు వస్తువును వెతుక్కునేవారు. టీచరు అనుభవంతో ఆయన కలం పాటల్లోనూ పాఠాలు చెప్పేది. అందుకే ఆ పాటలే అభిమానులకు జీవిత పాఠాలయ్యాయి. గీత రచయితగా వందల పాటలు పలికించినా -జాలాది పేరుతోనే గుర్తుకొచ్చే పాట ‘మేజర్ చంద్రకాంత్’ సినిమాలోని -పుణ్యభూమి నా దేశం నమోనమామి పాట. చరిత్రాత్మక నేపథ్యాలను కళ్ళకు కడుతూ ఆ పాటను పలికించిన తీరు నిజంగా అద్భుతం.
‘పుణ్యభూమి నా దేశం నమో నమామీ/ ధన్యభూమి నా దేశం సదా స్వరామీ/ మహామహుల కన్నతల్లి నా దేశం/ మహోజ్వలిత చరితకన్న భాగ్యోదయ దేశం.. నా దేశం’ అంటూ నాలుగే పాదాల పల్లవిలో స్వరాజ్య పోరాటమెంచిన భరతజాతి ముద్దుబిడ్డల సారాంశాన్ని అందించిన కలం యోధుడు జాలాది. జాతిని జాగృతంచేసే పాట రాసిన జాలాదిని తెలుగుజాతి ఎన్నటికీ మరువదు.
చక్కటి వాడుక తెలుగు పదాలను మాలగా గుచ్చటంలో జాలాది సుప్రసిద్ధుడు. సినీ సాహితీ దిగ్గజాలైన కొసరాజు రాఘవయ్యచౌదరి, కిలాంభి వెంకట నరసింహాచార్యులు ఉరఫ్ ఆత్రేయ, శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ)లాంటి మహాకవుల సాహిత్య కోణాలను ఒడిసిపట్టి, తన పాటల్లో పదిలంగా పొందుపర్చిన కవిబ్రహ్మ జాలాది అనడం అతిశయోక్తి కాదు.
***
సినిమా కోసం జాలాది కలంనుంచి జాలువారిన మొట్టమొదటి జానపద గీతం 1976లో వచ్చిన పల్లెసీమ చిత్రంలో వినిపిస్తుంది. ‘చూరట్టకు జారతాది/ చిట్టుక్కు చిట్టుకు వాన చుక్క/ గుండెల్లో కుదిపేస్తాది/ గతుక్కు గతుక్కు ఏందో నక్కా’ అంటూ. అప్పట్లో ఈ పాట మారుమూల పల్లెల్లో మార్మోగేదంటే అబ్బురపడవల్సిన పనిలేదు. అందుక్కారణం జాలాది జాన‘పదాని’కున్న పవర్. ఆయన పాటలో జానపదాలు, మాండలికాలు ఆశువుగా దొర్లిపోతుంటాయి. చిన్న చిన్న పదాల ప్రయోగంతో సామాన్యుడికీ అర్థమయ్యేలా పాటల పాఠం చెబుతారాయన. ఎవరిదైనా మనసు గాయపరచినప్పుడు లేదా ఖైదపడినపుడు జాలాది పాట ఆ తల్లడిల్లే హృదయానికి లేపనమే అవుతుంది. మనసులో నిస్సత్తువ మాయమవుతుంది. అలాంటి ఎన్నో పాటల్లో బాగా మెచ్చదగిన పాట -‘యాతమేసి తోడిన ఏరు ఎండదు/ పొగిలి పొగిలి ఏడ్చినా పొంతనిండదు’ ఒకటి. పాట మధ్యలో ‘దేవుడి గుడిలోనైన/ పూరి గుడిసెల్లోనైన/ గాలి ఇసిరి కొడితే/ దీపముండదు ఆ దీపముండదు’ అంటూ తత్వాన్ని, జీవిత సారాన్ని మిళితం చేసి వినిపిస్తాడు. ఇలాంటి జాలాది చాలా పాటల్లో మనం మర్చిపోతున్న తెలుగు పదాలు -యాతం, ఏరు, పొంత, పూరిగుడిసె, పలుపుతాడు, కుడితి నీళ్ళు, కడుపుకోత, చీమునెత్తురు, తూము.. లాంటివి ఎన్నో ఏరుకోవచ్చు. వీటికి ప్రత్యేకంగా అర్థాలు వెతుక్కోవాల్సిన పని వుండదు. భాషతోపాటు భావం, సామాజిక స్థితిగతులు తెలుస్తాయి. 1978లో ‘ప్రాణం ఖరీదు’ చిత్రానికి ప్రాణం పోసిన ఈ పాటలో నివురుగప్పిన నిప్పులా తాత్వాకత కనిపిస్తుంది.
30 వసంతాల ప్రస్థానంలో జాలాది పాటకు తెలుగు సినిమా మురిసి ముగ్ధురాలైంది. జానపదం, ప్రేమ, భక్తి, వేదాంతం, వినోదం, విషాదం, విప్లవం, సందేశాత్మకం ఇలా ఒక్కటేమిటి.. సూతఫలరసంలా ఏ సన్నివేశానికైనా మేలిమిలాంటి తేటతెనుగు పాటలనందించిన సినీ సాహిత్య మణిమకుటం -జాలాది.
లేలే బాబా నిద్దుర లేవయ్యా/ ఏలే స్వామి మేలుకోవయ్య’- అని షిర్డీసాయిని స్తుతించినా (కుంతీపుత్రుడు), ఆత్మనింపుమా జీవాత్మ నింపుమా అంటూ క్రీస్తు జన్మదిన పాట రాసినా (1974లో గ్రామ్‌ఫోన్ రికార్డుకోసం) -జాలాదికే చెల్లింది. 264 సినిమాలకు దాదాపుగా 1500 పాటలు రాశారు. ఆయన రాసిన కాసిన్ని పాటలు కవ్వించేయి, నవ్వించేయి, కన్నీరు పెట్టించాయి. తన పాటలతో శ్రోతల మది తలుపుతట్టిన ఘనత జాలాది సొంతం. ఆయన రాసిన ఆణిముత్యాల్లాంటి సినిమా పాటలను రసజ్ఞులైన రెండు తెలుగు రాష్ట్రాల అశేషశ్రోతలు నేటికీ విని ఆనందిస్తున్నారు. జాలాది రాజారావు ఒక పాటల విశ్వవిద్యాలయం. తెలుగు సాహిత్యాని (సినీ)కి ఆయన చేసిన సేవలు శ్లాఘనీయం. ఈ పండిత ఘనాపాఠీలకు ఇచ్చే పద్మశ్రీలు, పద్మవిభూషణలు ఆయనకు ఎప్పుడో రావాలి. కానీ తెలుగు సాహిత్య (సినీ) కోవిధుడైన జాలాదిలాంటి బహుముఖ ప్రజ్ఞాశాలిని ఈ ప్రభుత్వాలు విస్మరించుట బాధాకరం.
**
మాయా సినిమా ప్రపంచంలో జాలాది అనేకములైన ఇడుములను ఎదురొడ్డి మొట్టమొదటిపాట 1976లో పల్లెసీమ చిత్రంకోసం రాశారు. తరువాత వెనుదిరిగి చూడలేదు. సీనియర్లు, పెద్దలు, అనుభవం కలిగిన గొప్ప కవులు శ్రీశ్రీ, దేవులపల్లి వెంకటశాస్ర్తీ, కొసరాజు, ఆరుద్ర, ఆత్రేయ, దాశరధి, సి నారాయణరెడ్డి తదితరుల ఆశీస్సులతో మంచి పాటలు రాసి పెద్దల మన్ననలు పొంది ప్రజా హృదయంలో స్థానం సంపాదించుకున్నారు. ఇన్ని పాటలు రాసి ఎన్నో అవార్డులు, ఇంకా ఎనె్నన్నో సత్కారాలు అందుకున్న జాలాదిని మాయదారి చిత్ర పరిశ్రమ మాత్రం చిన్నచూపు చూసిందనే చెప్పాలి. దీనికిగల కారణం తెలుగు సినిమా వజ్రోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించినా -జాలాదికి మాత్రం ఆహ్వానం లేకపోవడం ఇందుకు ఉదాహరణ. ‘అమ్మని మరచి ఆలితో పయనించే బిడ్డలాంటిది’ ఈ చిత్రాల పరిశ్రమ అంటూ వజ్రోత్సవ వేడుకలు టీవీలో చూస్తూ కన్నీరు పెట్టుకున్నారట జాలాది.
నవ్యాంధ్ర సింగపూర్ సిటీలో (హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్ మాదిరిగా) తెలుగుజాతి గర్వించదగ్గ సాహితీ దిగ్గజాల కవుల విగ్రహాల సరసన జాలాది ‘మూర్తి’ని కూడా నెలకొల్పినట్టయితే మన పాలకులు సముచిత స్థానం కల్పించినట్టు అవుతుంది. అదేవిధంగా సామాజిక న్యాయం కూడా చేకూరినట్టవుతుంది.

-ఎస్‌ఆర్ రావు వందవాసి