AADIVAVRAM - Others

అద్భుతం.. ‘అప్పం’ మ్యూరల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్రకళా రంగంలో ‘మ్యూరల్స్’ (ఉబ్బెత్తుగా ఉండే కుడ్య చిత్రం)కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. శిల్పం (స్కల్ప్చర్)కు ఇది దగ్గరగా ఉంటుంది. అలాగని పూర్తిగా శిల్పమని చెప్పలేం!
పేపర్‌మెష్, ప్లాస్టర్ ఆఫ్ పారిస్, పెవిరోల్‌ను ‘గుజ్జు’గా చేసి కాన్వాస్‌పై చిత్రకారుడు తాను అనుకున్న రూపానికి ఆకారం ఇస్తాడు. ఇది ‘3డి’లో, ‘ఎంబోజింగ్’గా కనిపిస్తుంది. సంతృప్తికరంగా రూపం కుదిరాక చివరగా రంగులు వేస్తారు. సాధారణంగా ఒకే క్రోమ్ రంగును వేస్తారు. ఈ ప్రక్రియ చిరకాలంగా ప్రాచుర్యంలో ఉంది. సంపన్నుల ఇళ్ళల్లో, ఐదు నక్షత్రాల హోటళ్లలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.
ముచ్చట గొల్పే ఈ ‘మ్యూరల్స్’లో చేయి తిరిగిన చిత్రకారుడు అప్పం రాఘవ. రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్‌కు చెందిన ఈయన హైదరాబాద్‌లోని కుందన్‌బాగ్‌లో ఓ ప్రవాస భారతీయుని ఇంట్లో ‘పంచభూతాలు’ అన్న శీర్షికతో ఒకే ఫ్రేమ్‌లో సూర్యుడు, చంద్రుడు, మేఘాలు, కంకులు, జలం, పూలు, అలలు, గణపతి, లక్ష్మీ సరస్వతి ఇలా అనేక ఆకారాలు ఒదిగిపోయేలా రూపొందించారు.
‘బుద్ధుడి’ బొమ్మను సైతం మ్యూరల్‌గా రూపొందించారు. త్రీడైమెన్షన్‌లో కనిపించడం ఈ ‘కళ’ ప్రత్యేకత వల్ల చూపరులను ఇట్టే ఆకర్షిస్తుంది.
లిటిల్ స్కాలర్ స్కూల్‌లో ఆయన పలక, ఆంగ్ల అక్షరాలు, గణిత సూత్రాలు, ఆటలు.. ఇట్లా విద్యార్థులకు స్ఫూర్తి కలిగించే సబ్జెక్ట్‌తో ఆకర్షణీయంగా మ్యూరల్ తీర్చిదిద్దారు. మస్కట్‌కెళ్లి తన మ్యూరల్స్ కళతో అక్కడి వారిని మంత్రముగ్ధుల్ని చేశారు.
అప్పం రాఘవేంద్ర 1992-97 సంవత్సరాల్లో హైదరాబాద్‌లోని ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో బిఎఫ్‌ఏ చేశారు. పెయింటింగ్‌లో డిగ్రీ అందుకున్నారు. అనంతరం అదే కాలేజీలో ఎం.ఎఫ్.ఏ. చేశారు. శిల్పం మొదటి రెండు సంవత్సరాల్లో మాత్రమే పరిచయం చేస్తారు. అలా పరిచయమైన ఆ ‘కళ’ అనంతరం తన మ్యూరల్స్ తయారీలో ఎంతో ఉపకరించింది. అప్పం ఈ ‘విద్య’ను స్వయంగా ఆసక్తి, అభిరుచితో తెలుసుకుని ఆచరణలో పెట్టారు.
ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని అజీజ్ అనే మ్యూరల్ చిత్రకారుడు/ శిల్పి రూపొందించిన ఆకృతులను చూసి ముగ్ధుడై అటువైపు మనసు పారేసుకున్నారు. మ్యూరల్స్ ప్రక్రియను తెలుసుకుని తన నైపుణ్యం, ప్రతిభ ఆధారంగా అటువైపు దృష్టి సారించారు.
చిత్రకారులు అనేక మంది కనిపిస్తారు కాని అందరూ మ్యూరల్స్ రూపొందించలేరు. తాను మిగతా వారికన్నా కొంత భిన్నంగా కనిపించాలనే ఉద్దేశంతో అప్పం ఈ విద్యను ఆలింగనం చేసుకున్నారు.
ప్రస్తుత ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రజల అభిరుచులు మారుతున్నాయి. అలంకరణ రీతులు మారుతున్నాయి. అందులో భాగంగానే మధ్యతరగతి వాళ్ల నుంచి సూపర్ రిచ్ వాళ్లు, వ్యాపార వాణిజ్య సంస్థల వరకు ఈ మ్యూరల్స్‌పై ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. 3-5 నక్షత్రాల హోటళ్లలో వీటిని చాలాకాలంగా అలంకృతం చేస్తున్నారు. ఆ సంస్కృతి క్రమంగా వివిధ చోట్లకు విస్తరిస్తోంది. ఆ సంప్రదాయాన్ని అనుసరించే ‘అప్పం’ అనేక చోట్ల రాధాకృష్ణుల, ప్రకృతి - పక్షులను తీర్చిదిద్దారు. ఇలా కళాప్రియుల అభిరుచి, ఆసక్తి కనుగుణంగా తీర్చిదిద్దడమే మ్యూరల్ చిత్రకారుల కర్తవ్యం. జలపాతం.. జీసస్, గోల్కొండ కోట... ఇట్లా విభిన్న సబ్జెక్టులతో ఆయన కళాప్రియులను ఆకర్షిస్తున్నారు. ఒక్కో మ్యూరల్ ఒక గది అంత ఉంటుంది. లక్షల్లో ధర పలుకుతుంది. ఇదంతా నడుస్తున్న చరిత్ర.
అలాగని, అప్పం తాను అభ్యసించిన, నేర్చుకున్న చిత్రకళను పక్కన పెట్టలేదు. ఇటీవల ఆయన విలక్షణ రీతిలో రాముడు, హనుమంతుడు, కృష్ణుడు - లక్ష్మి, పార్వతి, సరస్వతి చిత్రాల ‘సిరీస్’ వేస్తున్నారు. ఈ వర్ణచిత్రాల విశిష్టత కేవలం చిత్రకళా రంగంలోని నిపుణులకే తెలుస్తుంది. ముఖ్యంగా హనుమంతుని రూపం, నూతన కోణంలో ఆవిష్కరించారు. ఆ రంగుల మేళవింపు, ‘పోచ్చర్’.. భక్త్భివం, నేపథ్యంలో చదరంగపు గళ్లు.. అత్యంత నవీనంగా దర్శనమిస్తాయి. ముఖ్యంగా హనుమంతుని ‘మూతి’ చూడగానే అది అప్పం మార్క్ బొమ్మగా ‘సిగ్నేచర్’ చిత్రంగా కనిపిస్తుంది. ఒక్కో చిత్రకారునికి ఒక్కో సిరీస్ గొప్ప పేరును తీసుకొస్తాయి. అలా రాముడు - హనుమంతుని సిరీస్ అప్పం రాఘవకు మంచి పేరును, గుర్తింపును, గౌరవాన్ని తీసుకొచ్చాయి.
1995 సంవత్సరంలో మహబూబ్‌నగర్ జిల్లా ఆకలి చావులపై ‘స్టార్వేషన్స్’ శీర్షికన చిత్రాలు గీసి హైదరాబాద్ కళాభవన్‌లో ప్రదర్శించారు. ఆ మరుసటి సంవత్సరం గిరిజనులపై గీసిన అనేక చిత్రాలను హైదరాబాద్‌లో ప్రదర్శించారు.
ఆ తరువాతి సంవత్సరం ‘ఐవ్యూ’ పేర మరిన్ని వినూత్న వర్ణ చిత్రాలను ప్రదర్శించారు. ఇవి కొంత నైరూప్య భావనలకు దగ్గరగా కనిపిస్తాయి. రంగులతో ప్రతిభను ప్రదర్శించేవిగా ఇవి ఉన్నాయి. 2000 సంవత్సరంలో ‘ఎక్స్‌ప్రెషన్స్’, 2002 సంవత్సరంలో ‘వుమెన్’ శీర్షికను అప్పం తన చిత్రాలను ప్రదర్శించారు. 2004 సంవత్సరంలో ‘ఏకదంత’ శీర్షికన గణపతిని వివిధ రూపాల్లో చిత్రించి ప్రదర్శించారు. ఇలా ఓ దశాబ్ద కాలంలో అప్పం తన విశ్వరూపాన్ని వివిధ కోణాల్లో చూపించారు. వైవిధ్యభరితమైన సబ్జెక్టు తీసుకుని ప్రతి సంవత్సరం ఓ ప్రదర్శన నిర్వహించడం అంత సులువు కాదు. కాని అప్పం అంకిత భావంతో చిత్రకళనే నమ్ముకుని అదే ధ్యాస, శ్వాసగా తన జీవితాన్ని సాగించాడు. అలాగే తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ, ప్రజా జీవనాన్ని కాన్వాసుపైకి తర్జుమా చేశాడు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో చాలామంది ప్రముఖుల ప్రశంసలు, మన్ననలు అందుకున్నారు. ఆశీర్వాదం పొందారు. అరుదైన చిత్రకారుడిగా అభినందనలు పొందారు.
దీనికంతటికి బీజం, ప్రేరణ తన తండ్రి అప్పం భద్రయ్య. తన తండ్రి అమన్‌గల్‌లో గణపతి విగ్రహాన్ని తయారుచేయడాన్ని చూసి మిగతా వారిలా తానూ ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆ ప్రావీణ్యం నైపుణ్యం అబ్బురపరిచింది. తన తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని రాఘవ బాల్యం నుంచే బొమ్మలు గీయడం ప్రారంభించారు. అనంతరం యాదగిరి అనే తెలుగు పండిట్ వేసే బొమ్మలు, చిత్రాలు మరింత ఆసక్తిని గొల్పాయి. తాను వేసిన చిత్రాలను ఆ ‘సార్’కు చూపగా కొన్ని సవరణలు చెబితే సవరించుకుంటూ అభ్యాసం చేశారు. చిత్రకళలోని మెళకువలు ఆయన దగ్గరే ఎక్కువగా నేర్చుకున్నాడు. ఆ సారే హైదరాబాద్‌లోని ఫైన్ ఆర్ట్స్ కాలేజీ గూర్చి చెప్పారు. తన ఇంటర్ చదువు అనంతరం ఆ ‘సారు’ మార్గదర్శనంలో ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో 1992లో చేరాడు. అనంతరం తనదైన ధోరణిలో చరిత్రను సృష్టించారు. ఓ పేద చేనేత కుటుంబం నుంచి, వెనుకబడిన కరువు ప్రాంతమైన అమన్‌గల్ నుంచి వచ్చి చిత్రకళారంగంలో ఎన్నో ఎత్తులను అధిరోహించడం అంత చిన్న విషయమేమీ కాదు. స్వయంకృషితో, సృజనతో, సత్తా ప్రదర్శిస్తూ దేశ విదేశీ కళాప్రియులను ఆయన ఆకర్షిస్తూ ఉన్నారు. ‘ఆన్‌లైన్’లో చిత్ర ప్రదర్శనలు పెడుతున్నారు. అంతర్జాతీయ స్థాయి గుర్తింపును ఆ రకంగా సాధించారు.

-వుప్పల నరసింహం 99857 81799