Others

మట్టిలో మాణిక్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల కోలాహలం ముంచెత్తిన వేళ.. ప్రజలకు మాత్రం ఓ అద్భుతాన్ని, అరుదైన ఘనతను చర్చించుకోవడానికి తీరుబడే లేదు.. ఎంతసేపూ రాజకీయాలు, సినిమాలు, సెలబ్రిటీల గురించి ముచ్చట్లే తప్ప- విశ్వవేదికపై మన జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన క్రీడాకారిణుల గురించి పట్టించుకొనే తీరిక ఎవరికీ లేదు.. గ్రామీణ నేపథ్యానికి చెందిన ఆ అమ్మాయిలు నిజంగా మట్టిలో మాణిక్యాలే. ఇటీవల ఖతార్‌లోని దోహాలో జరిగిన 23వ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో భారత్‌కు 17 పతకాలు లభించగా, అం దులో పది పతకాలను అమ్మాయిలే సాధించడం ఓ అరుదైన ఘనత. విభిన్న క్రీడల్లో మహిళలు సత్తా చాటుతున్నారనడానికి ఈ పతకాలే నిదర్శనం. ఆర్థిక స్థోమత, అధునాతన క్రీడా పరికరాలు, ఇతర వౌలిక సౌకర్యాలు లేకున్నా గ్రామీణ క్రీడాకారిణులు దాతల సాయం కోసం ఎదురుచూడకుండా స్వశక్తితో ముందుకు దూసుకుపోతున్నారు. కఠోర శ్రమ, దృఢ సంకల్పంతో వారు జాతీయ, అంతర్జాతీయ క్రీడాపోటీల్లో తమ నైపుణ్యం చాటుకుంటున్నారు. గత ఐదేళ్ల కాలంలో మారుమూల ప్రాంతాలకు చెందిన క్రీడాకారిణులు అద్భుతాలు సాధిస్తూ మన దేశానికి పతకాల పంట పండిస్తున్నారు. వచ్చే ఏడాది జరిగే సమ్మర్ ఒలింపిక్స్‌లోనూ సత్తా చాటుతామన్న ఆత్మవిశ్వాసాన్ని వీరు వ్యక్తం చేస్తున్నారు. మన క్రీడారంగానికి గర్వకారణంగా నిలుస్తున్న ఎందరో క్రీడాకారిణులు ఆర్థిక, సామాజిక నేపథ్యం గురించి తెలిస్తే ఎవరికైనా విస్మయం కలుగుతుంది.
గోమతి మరిముత్తు
తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన గోమతి మరిముత్తు ఇటీవల ఆసియా అథ్లెటిక్స్ పోటీల్లో బంగారు పతకాన్ని కైవసం చేసుకొంది. క్యాన్సర్ వ్యాధితో తన తండ్రి శాశ్వతంగా దూరమైనా, హృద్రోగంతో కోచ్ మరణించినా ఎలాంటి నిరాశకు గురికాకుండా పలు సవాళ్లను అధిగమించి అథ్లెటిక్స్‌లో ఆమె రాణిస్తోంది.
పీయూ చిత్ర
కేరళలోని పాలక్కాడ్ జిల్లా మున్రాడ్‌కు చెందిన పీయూ చిత్ర ఆర్థిక సమస్యలున్నా క్రీడలపై ఆసక్తి పెంచుకొంది. ఆమె తల్లిదండ్రులు దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. పాఠశాలలోని వ్యాయామ టీచర్ చిత్రలోని ప్రతిభను గుర్తించి ఎంతగానో ప్రోత్సహించారు. దోహాలో జరిగిన అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీలో ఆమె బంగారు పతకాన్ని సాధించింది.
స్వప్నా బర్మన్
పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్‌గిరికి చెందిన స్వప్నా బర్మన్ ‘హెట్పాథ్లాన్’ విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. ఏడు ఈవెంట్లలో ఆమె ఈ ఘనతను సాధించింది. ఇటీవల దోహాలో జరిగిన అథ్లెటిక్స్ పోటీలో రజత పతకం సాధించింది.
ఎంఆర్ పూవమ్మ
పరుగు పందెంలో ప్రతిభాశాలి అయిన పూవమ్మ దోహాలో రజత పతకం కైవసం చేసుకొంది. కర్నాటకలోని గొనికొప్పల్ గ్రామానికి చెందిన ఆమె పలు జాతీయ స్థాయి పోటీల్లోనూ సత్తా చాటుకొంది. క్రీడారంగంలో ఉత్తమ నైపుణ్యానికి ఆమెను ‘అర్జున అవార్డు’ వరించింది.
వీకే విస్మయ
కేరళలోని కన్నూర్‌కు చెం దిన వీకే విస్మయ 400 మీటర్ల నడకలో ప్రతిభను చాటుకుంటోంది. గత ఏడాది జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో బంగారు పతకం గెలిచి భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించింది. దోహాలో జరిగిన అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీలో 21 ఏళ్ల ఈ క్రీడాకారిణి రజత పతకం చేజిక్కించుకొంది.
మీరట్‌కు చెందిన అన్నూ రాణి (జావెలిన్ త్రో), ఒడిశాలోని జైపూర్ వాసి ద్యుతి చంద్ (నడక పోటీ), మహారాష్టల్రోని నాసిక్‌కు చెందిన సంజీవని జాదవ్ (నడక పోటీ), గుజరాత్‌లోని ఖరాది అంబా గిరిజన గ్రామానికి చెందిన సరితా గయక్వాడ్ (ఖోఖో) వంటి క్రీడాకారిణులు మన దేశానికి ఆశాకిరణాలుగా ఉన్నారు. ఎలాంటి సౌకర్యాలు లేని మారుమూల పల్లెలకు చెందిన ఎంతోమంది బాలికలు సమస్యలన్నింటినీ అధిగమిస్తూ పతకాల సాధనే లక్ష్యంగా నిరంతర సాధన చేస్తున్నారు. *