AADIVAVRAM - Others

తెలంగాణ కళలకు అద్దం పడుతున్న ఆర్ట్ ఎట్ తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణా కళాకారులను ప్రోత్సహించడానికి, తెలంగాణా కళామతల్లికి తమ వంతు సేవలందించడానికి ఆర్ట్ ఎట్ తెలంగాణా ఏర్పడింది. మట్టిలో మాణిక్యాల్లా గుర్తింపునకు దూరంగా ఉన్న కళాకారులను ప్రజలకు పరిచయం చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే ఆర్ట్ ఎట్ తెలంగాణ ఉనికిలోనికి వచ్చింది. ఆర్ట్ క్యాంప్‌లు, ఎగ్జిబిషన్లు నిర్వహిస్తూ కళలను, కళాకారులను ప్రోత్సహిస్తోంది.

తెలంగాణలో కళారూపాలను, ప్రతిభను, కళాత్మక సృజనను, కళా సంప్రదాయాలను ప్రోత్సహించడానికి కొందరు కళాహృదయులు పూనుకుని స్థాపించినదే ఆర్ట్ ఎట్ తెలంగాణా. తర్వాత ఒక ట్రస్టుగా ఏర్పాటయింది. ఆర్ట్ క్యాంపులను నిర్వహించడంతోపాటు ఒక కాఫీ టేబుల్ బుక్ ప్రచురణ, వెబ్‌సైట్ ఒకటి ఏర్పాటు చేయడం, తెలంగాణా సంస్కృతి, తెలంగాణా గుర్తింపును చాటి చెప్పే కళాకారుల కళా నైపుణ్యాలను, కళారూపాలను ప్రదర్శించడానికి వివిధ ఆర్ట్ ఫెయిర్లలో పాలుపంచుకోవడం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 2014లో హైదరాబాద్‌లో నిర్వహించిన ఆర్ట్ క్యాంప్‌నకు జిహెచ్‌ఎంసి అప్పటి కమిషనర్ సోమేష్ కుమార్ లోగోను ఆవిష్కరించారు. ఈ ఆర్ట్ క్యాంప్‌నకు గొప్ప ప్రతిస్పందన లభించింది. తెలంగాణా సంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే అనేక కళారూపాలను అనేక మంది గ్రామీణ కళాకారులు ఇక్కడ ప్రదర్శించారు. గ్రామీణ కళాకారులు తమ కళారూపాలను ప్రజల్లోకి తీసుకెళ్లే గొప్ప వేదికను ఆర్ట్ ఎట్ తెలంగాణా అందజేసింది.
నవంబర్ 2015లో న్యూయార్క్‌లోని రూబిన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో భారత కాన్సుల్ జనరల్ ధ్యానేశ్వర్ మూలే ‘ది ఆర్ట్ ఎట్ తెలంగాణా’ కాఫీ టేబుల్ బుక్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనేక మంది ఆర్ట్ గ్యాలరీ యజమానులు, కళా విమర్శకులు, కళా ప్రేమికులు హాజరయ్యారు. ఈ పుస్తకం నిజానికి 2014లోనే ప్రచురించారు. హైదరాబాద్‌లో జరిగిన వరల్డ్ మెట్రో పోలీస్ కాన్ఫరెన్స్ సందర్భంగా అప్పుడు ఆవిష్కరించారు. ఆ కాన్ఫరెన్సులో ఆర్ట్ క్యాంప్‌లోని కళారూపాల ప్రదర్శన కూడా జరిగింది. ఆ తర్వాత దిల్లీలో 2015లో ఇండియా ఆర్ట్ ఫెయిర్‌లోనూ, తర్వాత అదే సంవత్సరం టోక్యోలో జరిగిన ఇండియా ఫెస్టివల్‌లోనూ ఈ పుస్తకం ఆవిష్కరించారు. న్యూయార్క్‌లో పుస్తకాన్ని ఆవిష్కరించిన భారత కాన్సులేట్ జనరల్ ధ్యానేశ్వర్ మూలే మాట్లాడుతూ తెలంగాణా కళాకారులు భారత కళా సంస్కృతులను సుసంపన్నం చేయడానికి ఎంత తోడ్పడ్డారో ఇది చాటి చెబుతుందన్నారు. ఈ సందర్భంగా ట్రస్టీల్లో ఒకరైన బి.వి.పాపారావు మాట్లాడుతూ తెలంగాణా కళా సంప్రదాయాలను ప్రోత్సహించడానికి కేవలం ప్రైవేటు నిధులతో, ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్న ట్రస్టుగా పేర్కొన్నారు. ఈ పుస్తకం ద్వారా తెలంగాణా కళా సంప్రదాయాల చరిత్ర, ఔన్నత్యం, తెలంగాణా కళాకారుల అద్వితీయ సేవల గురించి అవగాహన కలుగుతుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సౌత్ ఏషియన్ మోడరన్ అండ్ కాంటెంపరరీ ఆర్ట్‌కు చెందిన ఇంటర్నేషనల్ హెడ్ దీపాంజన క్లెయిన్, రూబిన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ బోర్డు సభ్యురాలు రసికారెడ్డి కొనియాడారు.
ఈ పుస్తకానికి సంపాదకత్వం వహించిన ట్రస్టీ బి.నరసింగరావు మాట్లాడుతూ 152 మంది కళాకారులను ఈ పుస్తకంలో పరిచయం చేశామని అన్నారు. ప్రముఖ ఆర్టిస్టు ఏలే లక్ష్మణ్ స్పాన్సర్లకు ధన్యవాదాలు తెలిపారు.
ఆర్ట్ ఎట్ తెలంగాణ కేవలం కళాభిరుచి, కళాభినివేశం ఉన్న కొందరు వ్యక్తులు కలిసి ఏర్పాటు చేసిన ట్రస్టు మాత్రమే. న్యూఢిల్లీలో నిర్వహించిన చిత్రకళా ప్రదర్శన గురించి తప్పకుండా చెప్పుకోవాలి. తెలంగాణ ప్రాంతానికి చెందిన పేరు ప్రఖ్యాతులు గడించిన కళాకారులతో పాటు వర్ధమాన కళాకారులను నలభై మందిని అక్కడికి ఆహ్వానించి వారి కళాకృతులను అక్కడ ప్రదర్శించారు. తెలంగాణకు చెందిన ఘనమైన కళా వారసత్వాన్ని జాతీయ స్థాయిలో పరిచయం చేయడానికి తీసుకున్న చొరవ వల్ల దేశ రాజధాని నగరంలో తెలంగాణ కళల గొప్పదనం చాటి చెప్పినట్లయింది. ఆ ప్రదర్శన పేరు ఆర్ట్ ఎట్ తెలంగాణ.
తెలంగాణ వారసత్వ సంపదను పరిరక్షించడానికి, ముఖ్యంగా కాకతీయ వారసత్వాన్ని కాపాడ్డానికి ‘కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్’ పేరుతో ఒక సంస్థను స్థాపించి సేవలందిస్తున్న రిటైర్డ్ ఐఎఎస్ అధికారి బి.వి.పాపారావుతో నా పరిచయం కొత్త ఆలోచనలకు, కొత్త ప్రయత్నాలకు పునాదులు వేసింది. మా ఆలోచనలను ప్రముఖ న్యాయవాది ఎస్.నిరంజనరెడ్డితో పంచుకున్నాం. నిరంజనరెడ్డి తెలంగాణలో చెరువులపై పరిశోధన చేస్తున్నారు. ఈ క్రమంలో నిర్వహించిన ఆర్ట్ క్యాంపులలో క్రియాశీలక పాత్ర నిర్వహించిన ప్రముఖ ఆర్టిస్టు లక్ష్మణ్ ఏలేతో మా ఆలోచనలను పంచుకున్నాం. ఈ మేధోమధనంలో పుట్టిందే ఆర్ట్ ఎట్ తెలంగాణ ట్రస్టు ఏర్పరచాలన్న నిర్ణయం. లక్ష్మణ్ ఏలే తెలంగాణలో పరిచయం అవసరం లేని ఆర్టిస్టు. తెలంగాణ జానపద కళలపై పరిశోధన చేస్తున్నారు. ఫిలిం, ఫొటోగ్రఫీ, ఆర్ట్ సర్కిళ్లలో తనదైన ముద్రవేసిన ప్రముఖుడు. దళిత, బహుజన, విప్లవ ఉద్యమాలకు చెందిన పలువురు ప్రముఖుల రచనల ముఖ చిత్రాలను అలంకరించింది ఆయన చేతిలోని కళయే.
మనం ముందే చెప్పుకున్నట్లు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే ఆర్ట్ ఎట్ తెలంగాణ ట్రస్టు 2012లోనే ఏర్పాటయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ ట్రస్టుకు ఏ విధంగానూ, ఏ రూపంలోనూ సంబంధం లేదు. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఏ సంస్థతోనూ ట్రస్ట్‌కు ఆర్థిక సంబంధాలు కూడా లేవు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు ఆశించి చేయడం లేదు. ఇది పూర్తిగా లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ.
తెలంగాణ గొంతును ప్రకటించే, తెలంగాణ గుర్తింపును చాటిచెప్పే, తెలంగాణ ఆకాంక్షలను ప్రతిబింబించే, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రాతినిధ్యం వహించే ప్రతి కళారూపానికి ట్రస్టు సమాన ప్రాధాన్యం ఇస్తుంది. ట్రస్ట్ ప్రదర్శనల్లో లేదా ప్రచురణల్లో తెలంగాణ ఆర్ట్ లేదా తెలంగాణ కళ అనే పదాలను వాడే ప్రయత్నమేమీ చేయదు. ఈ పదాలు ట్రస్ట్ సొంతమేమీ కాదు. ఇవి ట్రస్టు ఏర్పడటానికి ముందు నుంచి ఉన్నాయి. తెలంగాణ కళను, కళా చరిత్రను వివరించడానికి పలువురు ప్రముఖులు పలుమార్లు ఈ పదాలను వాడి ఉన్నారు. మీడియాలోను, పుస్తకాల్లోనూ, కేటలాగుల్లోనూ ఈ పదాలు తరచు కనపడేవే.
చారిత్రకంగా, సాంస్కృతికంగా చూస్తే తెలంగాణ విశిష్టమైనది. ఇక్కడి చరిత్ర క్రీ.పూ.500 సంవత్సరాల పాతది. క్రీ.శ. మొదటి శతాబ్దానికి చెందిన గాథాసప్తసతి హాలుడి కాలంలో రాసిన పుస్తకం, తెలంగాణ కళా వారసత్వాల చరిత్రలో ఇది ముఖ్యమైనది. కోటిలింగాల, కొండాపూర్ వంటి పట్టణాలు శాతవాహనుల కాలంలో ప్రగతి వికాసాల ఉచ్ఛస్థాయిని అందుకున్న పట్టణాలు. కాకతీయులు నిర్మించిన రామప్ప గుడి శిలలతో సంగీతాన్ని పలికించిన అద్భుతం. నాగార్జున కొండలోని బౌద్ధ ఆరామాలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కళారూపాలు. గుడులలోను, రాజుల మహళ్లలోను అసంఖ్యాక కుడ్య చిత్రాలున్నాయి. కాకిపడగలు, తోలుబొమ్మలాటలు వంటి జానపద కళారూపాలు తెలంగాణ సంస్కృతిని సుసంపన్నం చేశాయి. దక్కన్‌కు చెందిన సూక్ష్మ చిత్రకళ తెలంగాణ కళావైభవానికి నిదర్శనం.
దేవస్కర్, పి.టి.రెడ్డి, సయ్యద్ అహ్మద్, సయ్యద్ బిన్ మొహమ్మద్, కుమరిల స్వామి, కె.రాజయ్య, కొండపల్లి శేషగిరిరావు, బద్రీనారాయణ, వాసుదేవ్ కపత్రాల్ వంటి చిత్రకారులు, ఉస్మాన్ సిద్దిఖీ వంటి శిల్పుల కళాకృతులు అమూల్యమైనవి.
యాభయ్యేళ్ల క్రితం ప్రముఖ చిత్రకారులు లక్ష్మాగౌడ్, సూర్యప్రకాష్, గౌరీశంకర్, వైకుంఠం, దేవరాజ్, డి.ఎల్.ఎన్. రెడ్డి, దరోజ్, రవీందర్‌రెడ్డి, చింతల జగదీష్, కవిత, నరేంద్ర రాయ్ వంటి వారి కళాకృతులు ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసలు పొందాయి. ఆ తర్వాతి తరానికి చెందిన తమ కళాప్రతిభను చాటి చెబుతూ తెలంగాణ కళా వైభవానికి నిదర్శనంగా నిలబడ్డారు. వర్ధమాన కళాకారులు తెలంగాణ కళల ఔన్నత్యాన్ని ప్రపంచ వేదికలపై పరిచయం చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు.
తెలంగాణ స్వయంసమృద్ధమైన, కళాసంపన్నమైన విశిష్ట భూభాగం. భౌగోళికంగా, చారిత్రకంగా, కళా సంప్రదాయల పరంగా తెలంగాణ తనదైన ప్రత్యేకత కలిగి ఉంది. పరిపూర్ణమైన కళకు తెలంగాణ పెట్టింది పేరు. చిత్రకళ, శిల్పకళ వంటి అనేక కళా రూపాలతో వర్థిల్లుతున్న కళల కాణాచి. వీటన్నింటితో తెలంగాణ సంస్కృతి ఇతర సంస్కృతులన్నింటికన్నా మిన్నగా ప్రకాశిస్తోంది.

-బి.నరసింగరావు ఫిల్మ్ మేకర్ 9908010404, 9989238200