AADIVAVRAM - Others

కనుమరుగైన ప్రాచీనత్వం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా గతకీర్తికీ, ప్రాచీన చరిత్రకూ నిలువుటద్దంగా నిలిచియుంది. క్రీ.పూ. శతాబ్దాల క్రితమే ఆంధ్ర రాజ్యం శాతవాహనుల ఏలుబడిలోవర్థిల్లగా, వారి అభిమాన పాత్రమైన బౌద్ధమతం, ఈప్రాంత ప్రజల ఆరాధ్యమతమై విరాజిల్లింది. ఇక్కడి ప్రాచీనమైన ప్రతి గ్రామం పేరులో, ప్రతి నిర్మాణ కౌశలంలో, ప్రతి కట్టడంలో, వస్తువుల్లో, మట్టిపాత్రల్లో, మతంతో పెన వేసుకున్న చరిత్ర పలుకుతుంది. శాతవాహన చక్రవర్తుల ఛత్రఛ్చాయల్లో బౌద్ధమతం విస్తరించి, శాంత్యహింసలు విశ్రమించిన ఈ ప్రాంతంలో, నాటి ప్రజల ఆరాధ్యాలైన స్థూపాలు, శిల్పాలు, కట్టడాలు, త్రవ్విన చోటల్లా దర్శనమిస్తూ, వెలకట్టలేని వేలసంవత్సరాల చరిత్రకు వౌన సాక్షీభూతాలుగా నిరాదరణ నీడలో మగ్గుతూ, తమ దుస్థితికి క్షోభిస్తూ, అనాసక్తులైన అధికారుల, ప్రజాప్రతినిధుల అశ్రద్ధకు, నిర్లక్ష్యానికి కృంగి కృషిస్తూ ఆయువుతీరకమునే్న అస్తమిస్తున్నాయి. నిన్నటివరకూ ఆలనా పాలనా కరువై ‘‘బుద్ధం శరణం గచ్ఛామి’ అంటూ దీనాతిదీనంగా విలపించిన నాటి ధర్మపురి, ప్రస్తుత వెల్గటూరు మండలంలోని పాషాయిగాం బౌద్ధస్థూపం, ఒక కంట్రాక్టరు నిర్లక్ష్యం కారణంగా నేలమట్టమయింది. క్రీ.పూ.6వ శతాబ్దంలో గంగా మైదాన ప్రాంతాలలో బౌద్ధమత వ్యాప్తి జరిగినా అశోకుని కాలంకన్నా ముందే దక్కనులో ప్రవేశించిన బౌద్ధమతం శాతవాహనుల హయాంలో విశేషాదరణ పొందింది. నాడు కరీంనగర్ జిల్లాలో మూడు ప్రాచీన బౌద్ధ కేంద్రాలుండేవి. వాటిలోని ధర్మపురి మండలంలోని క్రీ.పూ.200 సంవత్సరకాల సంబంధిత పాషాయిగాం బౌద్ధస్థూపానికి విశేష ప్రాధాన్యత ఉండేది. దీనికి ఆరు వృత్తాకార పలకలండేవి. వీటిపై ఒకపద్మం, ఏనుగు బొమ్మలు, స్థూపానికిరువైపులా స్థంభాకృతులు కలిగియున్న ఆస్థూపం, క్రీ.శ.రెండవ శతాబ్దానికి చెందినదిగా, ధూళికట్ట స్థూపం కన్నా ప్రాచీనమైనదిగా, జిల్లాలోని మొట్టమొదటి రాతికట్టడంగా చరిత్రకారులు రుజువు చేశారు. క్రీ.పూ. 2వ శతాబ్దపు ‘‘నాగసింపీయకాయ, జమజో, రాగబ్రహ్మ లేఖలు’’ స్థూపంవద్ద లభ్యమైనాయి. శాత వాహనుల తొలి రాజధానియైన కోటిలింగాలకు మూడు కిలోమీటర్ల దూరంలో పాషాయిగాం గుట్టపై ‘‘చెన్నపూస’’ అనే ఆచార్యుడు, బౌద్ధ స్థూపాన్ని నిర్మించినట్లు, సుప్రసిద్ధ బౌద్ధాచార్యుడు ‘‘దిగ్నాగుడు’’ ఈప్రాంతం వారేనని, చైనా యాత్రికుడు ‘‘హ్యూన్‌త్సాంగ్ 7వ శతాబ్దం’’లో, తన గ్రంథంలో పేర్కొన్నారని, రాష్ట్ర పురావస్తుశాఖ దివంగత డైరక్టర్ డాక్టర్ వి.వి.కృష్ణశాస్ర్తీ, శాతవాహన కళోత్సవాల సందర్భంగా, 2002 జనవరి 21న, కరీంనగర్‌లో ప్రధాన ప్రాసంగికునిగా ప్రకటించడాన్ని బట్టి, పాషాయిగాం బౌద్ధస్థూప ప్రాధాన్యత స్పష్టమవుతుంది. ఇంతటి ప్రాచీన చారిత్రాధారమైన బౌద్ధస్థూపం, రాష్ట్ర రహదారి రోడు నిర్మాణంలో, కంట్రాక్టరయిన ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ నిర్లక్ష్యానికి, అనవసరంగా, అకారణంగా బలియై 1999 డిసెంబర్ 25వ తేదీన నేలకూల్చబడింది. ఆతర్వాత ముక్కలైన ఆస్థూప ఫలకలను చేర్చి, జిల్లా కేంద్ర పురావస్తు శాఖ మ్యూజియంలో భద్రపరచి, తిరిగి స్థాపించడం జరిగింది. తత్ఫలితంగా పాషాయిగాంకు చెందిన బౌద్ధస్థూపం కనుమరుగై, ఈప్రాంతం చరిత్ర పుటల్లోంచి తొలగించబడి, ప్రాచీనత్వాన్ని కోల్పోయింది. అలాగే జూలపెల్లి మండలంలో క్రీ.పూ. 2వ శతాబ్దికి చెందిన, హుసేనియావాగు - చిన్నవాగుల సంగమ స్థానంలో47 శిల్పాలంకృత పలకలచే శోభితమై, ఐదు పడగల ముచిలింద నాగము, బోధివృక్షం, మహాభినిష్క్రమణం చెక్కబడిన ధూళికట్ట స్థూపం విశేష ప్రాధాన్యతను కలిగి ఉంది. కాలచక్ర నిర్వహణకై, ధూళికట్టనుండి అపురూప స్థూప పలకాలను అమరావతికి ఇటీవలికాలంలో తరలించారు. స్థూపాలు, ప్రాచీన కట్టడాలు, బౌద్ధ స్థూపాలు, ఆరామాలు, శిల్పీకరించిన అపురూప కళాకృతులు, ఈనాటి వారికి ప్రధానంగా చరిత్ర అంటే గౌరవంలేని పాలక, అధికార వర్గాలకు తెలియక పోవచ్చుగాని, వాటి ప్రాశస్త్యానికి వేల సంవత్సరాల వెలకట్టలేని చారిత్రిక నేపథ్యం ఉందన్న యదార్థాన్ని విస్మరించరాదు. ఒకవైపు ప్రాచీనమైన బౌద్ధ వ్యాప్తికి సంబంధించిన ఇక్కడి చరిత్ర మరుగున పడుతుండగా, మరోవైపు ప్రాచీనత్వానికి ఆనవాళ్ళయిన అపురూపాలను కనుమరుగు చేస్తుంటే, వాటి ఆత్మఘోష వినిపిస్తుంటే, పురాతత్వ విభాగం, తల దించుకోవాల్సిన దుస్థితి. గొప్పలు చెప్పుకోవడం కాదు. గొప్పలు నిలబెట్టుకోవడమే గొప్పతనం.

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494