AADIVAVRAM - Others

‘బందిఖానా రామదాసు’ పై భిన్న కథనాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాద్రి రామదాసుగా పరమ భాగవోత్తమ కీర్తనాచార్య వాగ్గేయకార శిరోమణి, కంచెర్ల గోపన్న ‘బందిఖానా రామదాసు’గా తెలుగునాట సుపరిచితులైన శ్రీరామ భక్తవరేణ్యుడు. నాటి గోలకొండ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఏడవ కుతుబ్‌షాహీ రాజు, సుల్తాన్ అబుల్ హసన్ కుతుబ్ షా, తానీషాగా సుప్రసిద్ధులు. 1672 ఏప్రిల్ 23న గోల్కొండ సింహాసనాన్ని అధిష్ఠించిన అబుల్ హసన్, 15 సంవత్సరాల నాలుగు నెలల ఇరవై ఏడు రోజులు గోల్కొండ రాజ్యాన్ని జనరంజకంగా పరిపాలించిన చరిత్ర వుంది.
నాటి గోల్కొండ రాజ్యం హనుమకొండలో పింగళి దానయ్య రెవిన్యూ అధికారి. ఆయన కుమారులు అక్కన్న మాదన్నలు బతుకు బాట వెతుక్కుంటూ హైదరాబాద్ చేరారు. అన్నదమ్ములిద్దరు నీతి నిజాయితీ, పాలకుల పట్ల విధేయత కారణంగా 1672 నాటికి మజ్మువదారు, పేషారు అత్యున్నత పదవులు వరించాయి. 1674 నాటికి మాదన్న ప్రధాని కాగా, ‘సూర్యప్రకాశరావు’ అనే బిరుదు, గజాశ్వాలు, ఛత్రచామరాలు, ఖడ్గం వంటి అధికార లాంఛనాలతో తానీషా ఆదరాభిమానాలు పొందగలిగారు. తదనంతర కాలంలో రామదాసుగా పేరు ప్రఖ్యాతి గడించిన కంచర్ల గోపన్న, అక్కన్న మాదన్నల మేనల్లుడు. నేలకొండపల్లిలోని లింగన, కామమ్మల పుత్రుడైన గోపన్న జన్మతః శ్రీరామ భక్తి తత్పరుడు కావటంతో గోల్కొండకు వెళ్లి భద్రాద్రి తాలూకా తహస్సీలుదారుగా తానీషా ఫరమానా పొంది విధులు నిర్వర్తించేవారు. 1672 నుండి 1687 వరకు రాజ్యాన్ని పాలించిన తానీషా సమకాలికుడైన భక్త రామదాసు, గోల్కొండ కోటలో 12 సంవత్సరాలు బందిఖానాలో ఉన్నట్టు చరిత్ర స్పష్టం చేస్తోంది. గోలకొండ రాజ్యాన్ని కబళించడానికి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కుట్రలు కుతంఅతాలు అక్కన్న మాదన్నలు బతికి వున్నంత కాలం సాధ్యం కాదని మతోన్మాదం, రాజకీయ కుట్రలు రెచ్చగొట్టి మొఘలులు 1686 మార్చి 16న సోదరులిద్దరినీ సబాంధవంతంగా చంపించారు. రామదాసు బందిఖానా కథనం మరొక విధంగా ఉంది.
తెలుగు నాట పల్లెపల్లెలో భద్రాద్రి రామదాసు కీర్తనలు తాళపత్రాలలోనివి, దేవార్చన గృహ పీఠాలలో ఒకప్పుడు ఆరాధ్యనీయంగా పదిలపరచుకొనేవారు. రామదాసు చరిత్ర తాళపత్రాలలో ఒక విధంగాను, ముద్రితమైనవి మరొక రకంగా వ్యాప్తిలో వున్నాయి. రామదాసు కీర్తనలు కథానుసారంగా కాకున్నా రాయబడి వున్నాయి. ఈ ప్రతులే విశేషంగా ప్రచారం పొందుతున్నాయి. రెండవ విధా నం ప్రకారం ప్రధానంగా రామదాసు బందిఖానా వివరం కథాసంధానంగా, గేయచరిత్ర సందర్భానుసార కీర్తనలను జతపరుస్తూ, ఇతర శతక భక్తి పద్యాలు చేర్చి హరికథా ఫక్కీలో కూర్పబడింది. దీనిని వరద రామదాసు 1574లో కంచి నుంచి భద్రాద్రికి వచ్చి భద్రాదీశ్వరుని అన్ని కైంకర్యాలతో సేవించిన ఒక భక్తుడు స్వయంగా రచించాడు. తానీషా గోపన్నకు ఇచ్చిన ఫర్మానా ప్రకారం ఈయన కైంకర్య సేవలు కొనసాగించినట్టు తెలుస్తోంది. వరద రామదాసు రచించిన చరిత్ర ఆధారంగా ‘హరిభజన సింగరిదాసు’ మరొక సంగ్రహ సంకలనం చేశారు. కావ్య వ్యాకరణతీర్థులు పంచాగ్నుల ఆదినారాయణ శాస్ర్తీ మరొక చరిత్ర పరిష్కృతం చేశారు. కబీరుదాసు తారక మంత్రం ఉపదేశించటం, భద్రాద్రి సీతారాముల కల్యాణ సందర్భంలో గోపన్న అశ్వారూఢుడై పేరంటాండ్రు, పెద్ద బ్రాహ్మణులను ఆహ్వానించటం, గోపన్న కుమారుడు ప్రమాదవశాత్తు సంతర్పణ సందర్భంలో వేడి గంజి గంగాళంలో పడి మరణించటం, శ్రీరామ భగవదనుగ్రహంతో పునర్జీవి కావటం, బందీగా జైలులో తేలుకుట్టినా, తొలుత తమ్మల దమ్మక్క అంతకు పూర్వం కట్టించిన చిన్న మండపాన్ని సర్కారు ద్రవ్యమని ఎంచక వ్యయపరిచినా, తానీషా ఖైదులో బంధించినా, జీవితాంతం ఏ కష్టం వచ్చినా నిష్కామ కర్మఫలంగా అనుభవించటమే, గోపన్న జీవిత చరిత్రగా వెలుగు చూసింది. ఈ గేయ చరిత్రలో సందర్భానుసారంగా ఆయన రాసిన కీర్తనలు చేర్చిన, అపారమైన భక్తి విశ్వాస తత్పరత స్పష్టమవుతోంది. జగద్రక్షకుడైన శ్రీరామచంద్రున్ని- బందిఖానాలో వుండగా ప్రార్థించటం, వేడుకోవటం, శారీరక శిక్షలు భరించలేక నిందించటం బందిఖానా కీర్తనలలో ఆవిష్కృతమైంది. బందిఖానా లేఖకులు పావుసేరు బియ్యం, పావుసేరు ఉప్పు కలిపి జైలులో బత్తెం ఇవ్వటం, గోపన్న చేతులకు గిట్టికోలలు వేసి కొట్టడం, స్తంభానికి కట్టి కొరడాలతో కొట్టడం, కత్తులపై నడిపించటం, సంకెళ్లు వేసి నిండు వేసవిలో ఇసుక తినె్నలపై నిలబెట్టడం, రాజద్రోహిగా వీపు మీద ఉక్కు గుండెత్తి వీధులలో తిప్పటం, ఖైదులో తేలు కుట్టడం, విషం తాగి మరణించటానికి గినె్న సిద్ధం చేసుకోవటం కీర్తనలలో ‘బందిఖానా రామదాసు’ అనుభవించిన నరక కఠోర శిక్షలు ప్రస్తావించబడ్డాయి. భద్రాచలం తాలూకా కిస్తీ, రామదాసు వ్యయం చేసిన ఆరు లక్షల వరహాలు సర్కారు పైకం లోటు విషయం గోల్కొండ నుంచి అక్కన మంత్రి ముందుగా కబురు చేసినట్టు ఉంది. గోపన్నను ఎట్టకేలకు శ్రీరామ లక్ష్మణులు సేవక వేషాలతో తానీషా అంతఃపురానికి వచ్చి పైకాన్ని చెల్లించి రసీదు తీసుకొని గోపన్నను విడిపించటం వివరించబడింది. భద్రాద్రిని, ఆరు లక్షల వరహాలను మాన్యంగా తానీషా రామదాసుకు ఇవ్వటం, భద్రాద్రి చేరటం వివరించటంతో కథ సుఖాంతమైంది. భక్త రామదాసుకు దర్శనం ఇవ్వక, మీరు తానీషాకు ఎందుకు దర్శనం ఇచ్చారని సీతాదేవి, శ్రీరామచంద్రుని ప్రశ్నించిన కథనం, తానీషా, రామదాసుల పూర్వజన్మ వృత్తాంతాలున్నాయి. పుష్పక విమాన రథంపై పరమ పదం చేరిన వైనం వరద రామదాసు, సింగరి దాసు, శతాధిక సంవత్సరాల క్రితం నాటి పంచాగ్నుల వారి కథనాలు స్పష్టం చేస్తున్నాయి. పరమ భక్తాగ్రేసరుడైన రామదాసు నిష్కామ కర్మమైన తారక మంత్రోపాసనతో జీవితాంతం తరించిన దివ్య సంకీర్తనామూర్తి అనటంలో సందేహం లేదు.
గోల్కొండ సుల్తాన్ అబుల్ హసన్ ఖుతుబ్‌షా (తానీషా) కాలంలో సమకాలికంగా పనె్నండు సంవత్సరాలు గోల్కొండ కోటలో బందిఖానాలో కంచర్ల గోపన్న బంధించబడటం ఒక చారిత్రక వాస్తవం. ఆ వృత్తాంత కాలంలోనే తానీషా 15 ఏళ్లు పాలనలో వున్నాడు. అక్కన్న, మాదన్న మేనమామలు మహామంత్రులుగా ఉన్నారు. భక్త రామదాసు కూడా ఆ శతాబ్దిలో జీవించిన భాగవతోత్తముడే. మహాత్ములు, మహనీయులైన మహాపురుషుల జీవిత గాథలు చారిత్రక దృష్టితో పరిశీలించక పోవటం తెలుగువారి దౌర్భాగ్యం. కేవలం భక్తి భావన అభినివేశంతో చిత్రవిచిత్ర కథలు సృష్టించబడుతుంటాయి. కంచర్ల గోపన్నగా రామదాసు జీవించిన కుతుబ్ షా గోలకొండ కోటలో 12 ఏళ్లు బందీగా వున్న వివరాలు చారిత్రక పరంగా, బహిర్గతం కావలసి ఉంది. ప్రస్తుతం గోల్కొండ కోట 500 సంవత్సరాల పూర్వ వైభవ చరిత్రను ప్రస్తావించుకొన్న తెలంగాణ ప్రభుత్వం కంచర్ల గోపన్న యధార్థ జీవన కథనంపై దృష్టి సారించాలి. సుల్తాన్‌ల తరువాత మన దేశాన్ని పాలించిన ఆంగ్ల ప్రభుత్వం సేకరించిన అక్కన్న మాదన్నల ఉత్తరాల రికార్డుల చారిత్రక వాస్తవాలు ‘లెటర్స్ టు పోర్ట్ సెంట్ జార్జి’ అన్న పేరుగల గ్రంథంలో పదిలపరచబడి ఎక్కడో వున్నాయి. ఆ కాలంలో గోల్కొండలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి ప్రతినిధిగా ఉన్న వీరరాఘవుడు అను గుమాస్తా రాసిన ఉత్తరాలవి. కొన్ని అంశాలు ప్రముఖ చరిత్రకారులు కొమర్రాజు లక్ష్మణరావుగారి విజ్ఞాన సర్వస్వంలో వున్నాయి. 1682లో మాదన్న కుమారుడు మల్లప్ప వివాహ సందర్భంలో మద్రాస్ ఆంగ్లేయాధికారులు వీసెడు బంగారు గొలుసులు కానుకగా పంపిన విశేషాల వంటివి ఎన్నో ఉన్నాయి. 12 ఏళ్లు బందీగా వున్న రామదాసు ప్రస్తావన లేదా? భక్త రామదాసు జీవితాంత సంఘటనలపై భిన్న చారిత్రక అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆంగ్లేయ చరిత్రకారులలో, తురుష్క చరిత్రకారులలో కొందరు రామదాసు బందిఖానాలోనే మరణించినట్లు తమ రచనలలో ధృవీకరించారు. బందిఖానాలో పైకం చెల్లించనందున విడుదల కాక అందే మృతి చెందాడనే కథనాలను చదివింప చేసుకొని విన్నామని, ఉ.వే.శ్రీ విద్యారణ్య పంచానన విక్కిరాల రామచంద్రాచార్యులు సెలవిచ్చినట్టు రామదాసు చరిత్రలో వుంది. తానీషా కుమార్తె విడిపించెనని కొందరు రాశారట. ఏది ఏమైనా భక్త రామదాసు జీవితంపై సమగ్ర చారిత్రక పరిశోధన ప్రభుత్వ కర్తవ్యం.

-జయసూర్య సెల్- 9440664610