AADIVAVRAM - Others

నగర నిర్మాణాలే రంగుల చిత్తరువులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలుగు వందల సంవత్సరాల హైదరాబాద్ నగరంలో ఇప్పటికీ అనేక నిర్మాణాలు చోటు చేసుకున్నాయి. చార్మినార్ కట్టడంతో ప్రారంభమైన నగర అందాలు తాజాగా ‘మెట్రో రైలు’ కట్టడాలతో సరికొత్త శోభను సంతరించుకుంది. ఈ ‘దక్కన్ చరిత్ర’ను ముఖ్యంగా వర్తమాన పరిణామాలను చిత్రకళలో రికార్డు చేస్తున్న చిత్రకారుడు మారేడు రాము. గ్రామీణ ప్రాంతానికి చెందిన రాము హైదరాబాద్ ల్యాండ్ స్కేప్స్‌తో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఒకప్పుడు నవాబుల నగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ ఇప్పుడు ‘మోస్ట్ హాపెనింగ్ సిటీ’గా దేశంలోనే గాక ప్రపంచంలోనే పరిగణింపబడుతోంది. దాన్ని రంగుల్లో.. రేఖల్లో కాన్వాసుపై రాము చిత్రిస్తున్నారు. ఎటు చూసినా కనిపించే హోర్డింగ్‌లు, వాటిపైగల ప్రకటనలను అందులోని విభిన్నతను చిత్రకారుడు కుంచెతో తనదైన భాష్యం చెబుతున్నారు. చిత్రకళా రంగంలో ఇదొక కొత్త వొరవడి, కొత్తందం. ఈ మెట్రో వాతావరణాన్ని, బాహ్య రూపాన్ని, అందులో దాగిన సొగసును తన దృష్టి కోణం రాము చిత్రిక పడుతున్నారు. మనం రోజూ చూసే వాటిని ఒక ఫ్రేమ్‌లో బంధించి దానికో రూపం ఇస్తే అది ఉత్తేజపూరితంగా కనిపిస్తుంది. చిత్రకారునిగా రాము చేస్తున్నది అదే.
నగరీకరణతో ప్రకృతి ధ్వంసం కావడం తెలిసిందే! అలా ధ్వంసమైతే పక్షుల పరిస్థితి ఎలా ఉంటుంది?... ఈ అంశంపై ఆయన అనేక చిత్రాలు గీశారు. ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం వేసిన పిల్లర్లపై ఇనుప చువ్వల మధ్య ఓ పక్షి తన గూడు కట్టుకుని గుడ్లు పెట్టినట్టు గీసిన చిత్రం కొంత కలవరపరుస్తుంది. ఆకాశ హర్మ్యాలు రావడం, ఎక్కడ చూసినా నిర్మాణ పనులు జోరుగా సాగడం, ఆ పక్కనే వివిధ సంస్థల వాణిజ్య ప్రకటనలు, పోస్టర్లు, హోర్డింగ్‌లు ఇదంతా గజిబిజిగా దర్శనమిస్తుంది. అందులోనూ ఓ ‘రిథమ్’ ఉందన్న భావన, దాని వ్యక్తీకరణ రాము చిత్రాల్లో కనిపిస్తోంది.
పక్షులు, పురాతన కట్టడాలు, నిర్మాణ పరిసరాలు, బహుళ జాతి కంపెనీల ప్రకటనలు, మెట్రో పిల్లర్లు, కాంక్రీట్ అరణ్యంలో పక్షుల అగమ్య గోచర చూపులు, స్ర్తి శరీరాన్ని సరుకుల అమ్మకానికి కాన్వాసుగా వాడుకుంటున్న వ్యాపార ధోరణిని రాము తన రంగుల కాన్వాస్‌పై చూపిస్తారు. నగర నేపథ్యంలోని యువ చిత్రకారుడు దక్కన్ కనెక్షన్ పేర, అర్బన్ టెర్రేన్ పేర వర్ణచిత్రాలు గీసి వీక్షకుల్ని అబ్బుర పరుస్తున్నారు.
నాగర్‌కర్నూలు దగ్గరలోని పెద్దపల్లి అనే చిన్న గ్రామం నుంచి చిత్రకళపై ప్రేమతో, అభిమానంతో, ఆశతో కలలు కంటూ రాము హైదరాబాద్‌కు రెండు దశాబ్దాల క్రితం వచ్చారు. అప్పుడే మాదాపూర్ ప్రాంతం వేగంగా విస్తరిస్తోంది. నిర్మాణ పనులు జోరు మీదున్నాయి. ఒకప్పటి పచ్చిక బయళ్లు, నీటికుంటలు, గుట్టలు కనుమరుగవుతున్నాయి. పక్షుల - పశువుల సందడి క్రమంగా ఆ ప్రాంతంలో తగ్గుతోంది. తన తండ్రి తాపీమేస్ర్తిగా పని చేస్తుండటంతో ఆ వాతావరణాన్ని మరింత దగ్గరగా పరిశీలించేందుకు వీలు చిక్కింది. తాను పెద్దపల్లి నుంచి వచ్చి తండ్రి దగ్గర ఉన్నది చిత్రకళలో మెళకువలు తెలుసుకుని చిత్రకారుడిగా స్థిరపడాలని. ఆ క్రమంలోనే సృష్టి ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకులతో పరిచయం ఏర్పడింది. అక్కడ వివిధ చిత్రకారుల చిత్రాల ప్రదర్శనను తిలకించసాగాడు. వాటి అంతుచిక్కలేదు. తాను గ్రామంలో, ముఖ్యంగా నాగర్‌కర్నూలులో సైన్‌బోర్డు చిత్రకారుడిగా వేసిన చిత్రాలకు, సృష్టి గ్యాలరీలోని చిత్రాలకు పోలికే లేదు. తన ఆసక్తిని, ఆకాంక్షను, తన లక్ష్యాన్ని ఆ గ్యాలరీ నిర్వాహకుల ముందుపరచగా వారు దగ్గరలోని శ్రీ వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కళాశాల గూర్చి, అందులో చిత్రకళ కోర్సు గురించి చెప్పారు.
ఆ ప్రాంతంలోనే తాను తండ్రితో కలిసి ఉండటం, అక్కడే గ్యాలరీ ఉండటం, సమీపంలో చిత్రకళ నేర్పే కళాశాల ఉండటం అన్నీ కలిసొచ్చాయని రాము ఎగిరి గంతేసి 2004 సంవత్సరంలో ఆ కళాశాలలో చేరాడు. అదో కొత్త ప్రపంచం, కొత్త రంగుల భాష, కొత్త వాతావరణం, కొత్త వ్యక్తీకరణ, కొత్త సహచరులు.. కుదురుకోవడానికి కొంత సమయం పట్టింది. పెయింటింగ్‌పై పట్టు సాధించేందుకు 2004 నుంచి 2008 వరకు అక్కడ ప్రయత్నం చేశాడు. క్రమంగా చిత్రకళ చేతికి చిక్కుతున్నట్టనిపించింది. అ సమయం నుంచే తన పరిసరాలను, జరుగుతున్న నిర్మాణాలను, కాంక్రీట్ పనులను, హోర్డింగ్‌లను, వాటిపై ప్రకటనలను అధ్యయనం చేయసాగారు. వాటినే తన కాగితంపై, కాన్వాసుపై దింపి సాధన చేశాడు. తన కాగితంపై, కాన్వాసుపై దింపి సాధన చేశాడు. ఆ లైన్, ఆ రంగుల పొందిక, వ్యక్తీకరణ, ఫ్రేమ్ అంత పరిపక్వతగా లేనప్పటికీ, తినగ తినగ వేము తీయనుండు అన్న చందంగా ఆ అపరిపక్వతను పరిపక్వతగా మార్చుకునేందుకు కష్టపడ్డాడు. కేవలం సాధనే కాదు సరైన మార్గదర్శనం అవసరమని భావించి బి.ఎఫ్.ఏ. పూర్తయిన వెంటనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎం.ఎఫ్.ఏ. కోర్సులో 2008 సంవత్సరంలో చేరాడు. అక్కడ హేమాహేమీలైన బోధకులున్నారు. లక్ష్మాగౌడ్, డి.ఎల్.ఎన్. రెడ్డి, వైశాలిఘోష్, శ్యాంసుందర్‌ల సూచనల సలహాలు, బోధన మార్గదర్శనం ఎంతో ఉపయోగపడ్డాయి. ‘నీ మనసులో ఏది బలంగా ఉందో, నీ మూలాలు ఎక్కడున్నాయో ఆ అంశంపైనే బొమ్మలు చిత్రించు.. ఇతరులు చెప్పింది, చేసేది అనుసరించకు’ అన్న ఫ్యాకల్టీ గురువుల మాట మనసులో నాటుకోగా తన గ్రామీణ వ్యవసాయ నేపథ్యం, వర్తమానంలో తానుంటున్న చోట నగరీకరణ కోసం ఆ వ్యవసాయం ధ్వంసమవుతున్న తీరును, ప్రకృతి వికృతమవుతున్న వైనాన్ని చిత్రిక పట్టాలని తీర్మానించుకుని పని చేయడం ప్రారంభించానని రాము చెప్పారు.
అలా తనదైన ప్రత్యేక శైలితో ప్రారంభమైన చిత్రకళా సృజన ప్రయాణంలో 2010 సంవత్సరంలో తన తొలి సోలో చిత్ర ప్రదర్శనను కళాభవన్‌లోని ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేశారు. ‘ది ఎసెన్షియల్ ఎలిమెంట్’ శీర్షికతో పంచభూతాలపై గీసిన ఆ చిత్రాలు అవి. నీటి ఆవశ్యకత, పర్యావరణ పరిరక్షణ గూర్చి కొత్త తరహాలో అవి రూపుదిద్దుకోవడంతో ఎందరినో ఆకర్షించాయి. నీటి సరఫరా చేసే పైపుల మధ్యన కనిపించే ‘వాల్వ్’లను రియలిస్టిక్‌గా ఆయన చూపారు.
2012 సంవత్సరంలో బెంగుళూరులోని కర్నాటక చిత్రకళా పరిషత్ హాలులో ‘అర్బన్ డ్రీమ్స్’ పేర తన సరికొత్త చిత్రాలను సోలో షోగా పెట్టారు. ఇందులో పెరుగుతున్న నగరీకరణను ‘టాప్ యాంగిల్’లో చూపారు. ఎగురుతున్న పక్షుల దృష్టి కోణంలో పట్టణాల - నగరాల విస్తరణ, కాంక్రీటు మయం ఎలా అవుతున్నదో చిత్రించారు. ఇదో వినూత్న ప్రయోగం. నిగూఢంగా ఎన్నో విషయాలు అందులో దాగున్నాయి.
2016 సంవత్సరం పూణెలో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను ‘దక్కన్ కనెక్షన్’ పేర నిర్వహించారు. ఇందులో వాణిజ్య ప్రకటనల పెడ ధోరణులు, స్ర్తి అంగాంగ ప్రదర్శనలతో సరకుల అమ్మకపు ప్రకటనలపై ‘్ఫకస్’ పెట్టి రాము బొమ్మలు గీశారు.
మారేడు రాము గీసిన వర్ణ చిత్రాల్లో ప్రముఖమైనది ‘త్రీ ఆపిల్స్’ శీర్షికతో గీసిన చిత్రం. అందులో న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంత ప్రతిపాదనకు ఉపయోగపడిన ఆపిల్ ఒకటి కాగా, రెండవది ఆపిల్ కంప్యూటర్ ఉత్పత్తుల చిహ్నం, మూడవది సృష్టి ఆదిలో ఆదాము - ఈవ్ కొరికినట్టు చెప్పుకునే ఆపిల్ పండు.. దీన్ని సైతం టాప్ యాంగిల్‌లో చూపి తనదైన సృజన శక్తిని చిత్రకారుడు వెల్లడించారు.
ఈ రకమైన విశిష్ట, విశేష చిత్ర రచనను రానున్న రోజుల్లో చాలామంది అర్థం చేసుకుని అభినందిస్తారని ప్రముఖ చిత్రకారుడు పద్మశ్రీ జగదీశ్ మిట్టల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ అభినందించారు. బెంగుళూరుకు చెందిన చిత్రకారుడు యూసుఫ్ అరక్కల్ సైతం రామును ఆశీర్వదించారు. కలకత్తాకు చెందిన సుహాస్ రాయ్ ఓ లేఖ రాస్తూ ఓ రోజు నువ్వు మంచి చిత్రకారునిగా గుర్తింపు పొందుతావు అని అభినందిస్తూ.. ఆశీర్వదించారు. అదే ఇప్పుడు నిజమైంది!

మారేడు రాము 80748 14128

-వుప్పల నరసింహం 99857 81799