Others

‘స్మిత’ జీవితం.. ఓ కనువిప్పు ( ఆనాటి హృదయాల..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మిత (విజయలక్ష్మి)ని ముందు సాలగ్రామం అపర్ణ ఇంట్లో చూశాను. అపర్ణ చిన్నచిన్న వేషాలు వేస్తుండేది. విజయలక్ష్మి ఆ ఇంట్లో చిన్నపనీ, పెద్దపనీ చేస్తుండేది. సినిమాల్లో ఏవైనా వేషాలుంటే చెప్పండి’ అంటూ ప్రాధేయపడేది.
ఒకరోజు వున్నట్లుండి ఏవియం స్టూడియోలో తారసపడింది. ‘ఓ ఆడది- ఓ మగాడు’ చిత్రంకోసం నటీనటులను ఎంపిక చేస్తున్నాం. ఈశ్వరరావు సరసన కన్నడ అమ్మాయి రూపా చక్రవర్తిని సెలెక్ట్ చేసుకున్నాం. జయప్రద తమ్ముడు రాజబాబు సరసన నటించడానికి ఓ అమ్మాయి కావాలి. అందుకోసం వచ్చింది విజయలక్ష్మి. ఎట్టకేలకు సెలెక్ట్ అయ్యింది. ఆ చిత్రానికి ప్రొడక్షను వ్యవహారాలు చూసే శాస్ర్తీ పరిచయం చేశారు- అదీ సంగతి!
సినిమా షూటింగు జరుగుతుందేగాని, విజయలక్ష్మి ఆలోచనలన్నీ వేరే విధంగా వుండేవి. ఆమె మాటల్లో నన్ను ఆశ్చర్యచకితుడ్ని చేసే విషయాలేవిటంటే- నేను ఇకముందు ఇలాంటి సాఫ్ట్ కేరక్టర్సు వెయ్యను. జీనత్ అమన్‌లా.. ఏదయినా అల్ట్రామాడ్రన్ కేరక్టరయితే చేస్తాను అంది. నాకు నవ్వొచ్చింది.
ఇటువంటి చిన్న చిన్న కేరక్టర్లకే పెద్దపెద్ద రికమండేషన్స్ అవసరం అవుతున్న రోజుల్లో జీనత్ అమన్‌లా నటించాలంటే మాటలా? పగటికలలు గంటున్నావా? అన్నాను. ఆ చిత్రానికి నేను అసోసియేట్ డైరెక్టర్‌ని.
సంగీత విడుదల అయింది. స్మితకు ఓ మోస్తరు పేరొచ్చింది. సినిమా రిలీజుకి యూనిట్ అందర్నీ పిలిచి డిన్నర్ ఇచ్చింది.
ఈలోగా విజయలక్ష్మి సిల్క్‌స్మితగా అవతారం ఎత్తింది. తమిళంలో వండిచక్రం సినిమాలో సిలుక్... సిలుక్.. అంటూ మగవాళ్లని కవ్వించే వాంప్ పాత్ర. బాగా పేలింది. ఆ సినిమా వంద రోజులాడిందంటే అందుకు ప్రధానమైన కారణం సిల్కుస్మితయే! ఒక సంవత్సరంలో స్మిత స్థితిగతులు మారిపోయాయి. స్మిత కవర్ పేజీలేని సినీ మాగజిన్ లేదంటే అతిశయోక్తికాదేమో!
విశేషమేవిటంటే! బొద్దుగాముద్దుగా అమాయకంగా వుండే స్మితకి ఇష్టమైన వ్యక్తి ఎవరో తెలుసా?... మదర్ థెరెస్సా. ఈ మాట చెప్పినపుడు పదిమందీ నవ్వుకున్నారు. ఈవిడగారు చేస్తున్న వేషాలకూ ఈవిడగారి ఆలోచనలకూ ఏమైనా పొంతన వుందా? అంటూ మూతులు కొరుక్కున్నారు. స్మితలో చిత్రమైన గుణం ఏవిటంటే తను చేయాలనుకున్న పని ఎంతటివారి ముందైనా నిర్భయంగా చేసేస్తుంది. తమిళ సినిమాలో నటిస్తుండగా కురచైన దుస్తులు వేసుకుంది. కాలుమీద కాలువేసుకొని కూర్చుంది. ఇంతలో శివాజీ గణేశన్ వచ్చారు. అందరూ లేచి నిలబడ్డారు. స్మిత నిలబడలేదు. కాలుమీద కాలుకూడా తియ్యలేదు. యూనిట్ అంతా గుప్పుమంది. శివాజీ సార్ ఎదురుగా కాలుమీద కాలేసుకొని కూర్చోడానికి ఎన్ని గుండెలు? ముందు ‘సారీ’ చెప్పు అన్నారు. నేను చెప్పనుగాక చెప్పను. అవసరమైతే సినిమా నుంచి తప్పుకుంటాను! అని నిర్భయంగా చెప్పింది.
బాలూమహేంద్ర సినిమాకోసం కమల్‌తో ఓ పాట వుంది. అదే ఆ సినిమాలో హైలైట్... ఆ పాటకోసం కంపెనీవాళ్ళు ఒక డ్రస్సు కుట్టించారు. కమల్ డ్రస్సుతో ఏమాత్రం మేచ్ కాలేదు. ఈరోజుకి షూటింగ్ కేన్సిల్ చేసుకుంటే రేపు నా డ్రెస్‌తో వస్తాను అంది. అందరూ ఆశ్చర్యపోయారు. చేసేది లేక షూటింగుకి పేకప్ చెప్పారు. మరుసటిరోజు తను డిజైన్ చేసిన డ్రస్‌తో వచ్చింది. యూనిట్ షాక్ తింది. అంత బాగుందా డ్రెస్.. అంతే బాగా కమల్‌తో పోటీపడుతూ డేన్సుకూడా చేసింది. స్మిత చేసే పనులన్నీ ఇలాగే వుండేవి.
స్మిత ప్రొడక్షను మొదలుపెట్టింది. యూనిట్ అందరికీ స్మిత ఇంట్లోనే భోజనాలు. ఖర్చు తడిసిమోపెడయ్యింది. అయినా, చలించలేదు. ఖర్చుకు వెనకాడకుండా మూడు సినిమాలూ నిర్మించి రిలీజ్ చేసింది. తన బ్యాంకు బేలన్సు ఖాళీ అయిపోయింది. తను ప్రాణప్రదంగా ప్రేమించిన రాధాకృష్ణ అప్పులు చూపించాడు. పెళ్ళికోసం ఆరాటపడింది. మళ్ళీ నేను ఫామ్‌లోకి వస్తాను- ఇంతకు పదింతలు సంపాదిస్తాను. అంది. ఏమైందో.. ఏమో ఆత్మహత్యలు చేసుకున్న నటీమణుల జాబితాలో చేరిపోయింది. ఆత్మహత్య చేసుకోబోయే ముందు స్మిత (విజయ ఇంట్లో పిలిచే పేరు) రాసిన నోట్ ఆధారంగా పోలీసులూ కేసు కొట్టిపారేశారు. పనిమనిషి స్థాయినించి సూపర్ హీరోయిన్ స్థాయివరకూ ఎదిగిన స్మిత.. చేతికి ఎముకలేకుండా దానధర్మాలు చేసిన స్మిత చరిత్ర హీనంగా నిలిచిపోయి ‘డర్టీ పిక్చర్’లాంటి చిత్రానికి కథావస్తువుగా మిగిలిపోయింది. ఏదిఏమైనా ఫిలిం ఇండస్ట్రీలో స్మిత జీవితం ఓ కనువిప్పు!

-ఇమంది రామారావు 9010133844