AADIVAVRAM - Others

పెద్దాడి గోడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పటికే సెల్‌ఫోన్ చాలాసేపట్నించి మోగుతోంది. ‘హలో..’ అంటూ శ్యామల ఓ క్షణం వాచ్‌కేసి చూసి ‘ఈ రోజు వీలు కాదురా.. వీలుంటే రేపు వస్తానేం..’ ఫోన్ పెట్టేసింది చిందరవందరగా ఉన్న ఇంటివైపు తేరిపార చూస్తూ. ఇల్లంతా సర్దుకోడానికి ఈ రోజంతా పట్టేలా ఉంది డ్యూటీ ఏం చేస్తాం ఇంక.
అమ్మ కడుపున పుట్టింది మొదలు డ్యూటీ డ్యూటీ.. డ్యూటీ.. ఇంక బ్యూటీ కోసం ఏం చేస్తాను నా మొహం అంటూ చింపిరి చింపిరిగా చిక్కుముడి జుట్టు సవరించుకుంటూ అనుకుంది బ్యూటీషియన్ శ్యామల. ఇంటింటికి వెళ్లి బ్యూటీస్‌ని తయారుచేస్తుంటుంది ఫేషియల్స్, వేక్సింగ్ గట్రా చేస్తూ. అదే ఆమెకి ఉపాధి.
తను వయసులో ఉన్నప్పుడే భర్త చనిపోయాడు. పాప ప్రశాంతి, బాబు ప్రశాంత్ అప్పటికి చిన్నచిన్న పిల్లలు.. వీళ్లు కాక నా భర్త, నాకప్పగించిన మరొక బాధ్యత మరిది కిషోర్‌బాబు. తెలిసిన వాళ్లు, తెలియని వాళ్లు తనకి ముగ్గురు పిల్లలనుకునేవారు - తనని ఎవరన్నా అడిగితే కూడా తను అలా తలూపేసేదాన్ని. నా నోట ఎప్పుడూ తనని పెద్దాడా అన్న మాట తప్ప పేరొచ్చేది కాదు.. ఎవరికన్నా చెప్పాల్సి వస్తే కూడా మా పెద్దాడు అనే వచ్చేది. మావారి నుంచి అలా అలవాటయి పోయింది నాకు. నా పెళ్లైన కొద్ది నెలలకే మామగారు, ఏడాదికే మా అత్తగారు కాలం చేశారు.
అందుకని నాన్నైనా, అన్నైనా తనే అయిన మా ఆయన వాణ్ణి నాకు పెద్దాణ్ని చేసేశారు. వాడు కూడా ననె్నప్పుడు అమ్మా అనే పిలిచేవాడు. మా అమ్మావాళ్లు, ఇరుగుపొరుగు వాణ్ణి అదిలిస్తుంటే వదిన అంటం అలవాటైంది మా పెద్దాడికి, సారీ కిషోర్‌బాబుకి.
శ్యామల వంటింట్లోకి వెళ్లింది ఇల్లంతా సగం పడ్డా సర్ది, అలా చేస్తూ పోతే వంట ఎప్పటికి అవాలి. పిల్లలు అసలే ఆకలి మీదుంటారు - కొంప కొల్లేరు చేస్తారు. కొల్లేరు సరస్సు వాకిట్లో వున్నట్టే మాకు, అందుకే మాటు నోటమ్మట ఆమాటే వస్తుంటుంది. మా పాపని చదివిస్తున్నాను - బాబు కరెంటు పనులు, ప్లంబింగ్ పనులు చేస్తుంటాడు. వాడి సంపాదన, నాది కలిసి ఇల్లు నడుస్తోంది స్వతంత్రంగా ఎంతైనా మాది బిలో యావరేజ్ కుటుంబం. అందులోనే పిల్ల పెళ్లిక్కూడా కూడబెట్టాలి మరి.
పెద్దాడికి బ్యాంకులో ఉద్యోగం వచ్చింది - పెళ్లి కూడా చేసేశాను. నా భర్త నాకప్పగించిన వాడి బాధ్యత తీరింది. ఇక వాడి సంసారం వాడిది. మొన్నటిదాకా హైద్రాబాదులో చేస్తుండేవాడు. ఈ మధ్యనే మేనేజర్ ప్రమోషన్ మీద పూనెకి బదిలీ చేశారు. వాడి వరకు వాడి పరిస్థితి బాగానే ఉంది. వాడు, భార్య శ్రావ్య, బాబు, పాప. బ్యాంకులో లోను పెట్టి ఫ్లాట్ ఒకటి తీసుకున్నా వదినా, పిల్లలిద్దర్ని దగ్గర కానె్వంట్‌లో చేర్పించాము. శ్రావ్యే వెళ్లి దింపి, సాయంత్రం తీసుకొస్తుంటుంది. నా వరకు నాకు బ్యాంకు వారిచ్చిన కారు ఉంది. అందులో వెళ్లి వస్తుంటాను. నా జీవితం.. నీ ప్రసాదం.. వదినా అంటూ మనసు విప్పి మాట్లాడాడు, పెద్దాడు పూనె వెళ్లాక మొదటిసారి. పోనే్ల వాడైనా కాస్త సుఖంగా వున్నాడనుకుంది శ్యామల తృప్తిగా.
‘అమ్మా! బాబాయిని అడుగమ్మా చెల్లి పెళ్లి గురించి, సర్దుబాటు చేస్తాడేమో..’ అంటూ చిన్నా మొదలెట్టాడు. వాడికిప్పుడిప్పుడే కాస్త కష్టసుఖాలు, బరువు బాధ్యతలు తెలిసి వస్తున్నాయి. పెళ్లనుకున్నాక పెద్దాడ్ని కదిలేస్తారా.. వాడికి మాత్రం బరువు బాధ్యత తెలియనిదా.. సర్దిచెప్తు దాటేస్తుంది. శ్యామల అభిజాచ్యంతో కూడిన అతిశయంతో ఎంచేతంటే పెద్దాడొక్కడే కాదుకదా ఇప్పుడు, వాడికి ఒక కుటుంబం ఉంది. ఆర్థికంగా వత్తిళ్లు వుంటయ్ కదా.. అనుకుంది శ్యామల స్వగతంలో.
అక్కడ శ్రావ్య కూడా కిషోర్‌బాబుకి అలాగే సర్ది చెప్తూంటుంది. సమయం దొరికినప్పుడల్లా కిషోర్‌బాబు శ్రావ్యతో ప్రశాంతి మనకి కూడా పెద్దకూతురే. దాని పెళ్లీ పేరంటం మనమే నిలబడి చేయాలి, అన్నా వదినల బాధ్యత అమ్మానాన్నలై మనమే నిర్వర్తించాలి - వదినకి మనం తప్ప వేరెవరున్నారు చెప్పు ఆర్ద్రం అయిపోతుంటాడు. అలాగే.. అలాగే చేద్దాం లెండి.. మై హూఁనా.. అంటూ వెన్నుతడ్తుండేది శ్రావ్య.
బ్యాంకు ఆఫీసు పనులతో బిజీగా వుంటూ కిషోర్ వదిన వాళ్ల మంచిచెడ్డలు, డబ్బు దస్కం అన్నీ శ్రావ్యకి అప్పగించేశాడు తను. అయితే ఫస్ట్ తారీఖు రాగానే జీతం అకౌంట్‌లో డ్రాచేసి శ్రావ్యకు ఇస్తూ, వదినకు ముందుగా పంపించు. అక్కడ పిల్లలతో వదిన ఏం అవస్థ పడ్తుందో ఏమిటో.. అయినా వదినకు ఎన్నోసార్లు చెప్పాను తన పేర అకౌంట్ ఏర్పాటు చేస్తాను.. అందులోకి మనీ ట్రాన్స్‌ఫర్ పెడ్తాను నీకు ఇబ్బంది ఉండదు అంటే సుతరాము తను ఒప్పుకోదు సరికదా.. ఏంట్రా పెద్దాడా.. ఏదో నా బాకీ వసూలు చేసుకున్నట్లు.. అవన్నీ ఏం వద్దు, నీకు తీరిక దొరికినప్పుడే పంపించు.. డబ్బుకి అవసరం నెలంతా వుంటూనే వుంటుంది.
ఎప్పుడో పండక్కో, పబ్బానికో అన్నట్లు హైద్రాబాద్‌లో వుండగా పెద్దాడు, పెళ్లాం, పిల్లలు వచ్చి వెళ్తుండేవారు. పూనెకి వెళ్లిన తరువాత ఎప్పుడన్నా పొద్దుపొద్దున్నో.. రాత్రి పది దాటిన తరువాతో ఫోన్లో మాట్లాడ్తుంటాడు. బహుశా అలసిపోయుంటాడు ఏమో ఒకటే ఆవలింతలు, నిద్ర ముంచుకొస్తోంది వదినా మళ్లీ చేస్తానేం అని పెట్టేసేవాడు. సెలవులొస్తే శ్రావ్య, పిల్లలు ఏవో షాపింగ్‌లకని, ఔటింగ్‌లని తిప్పేస్తుంటారు వదినా - మీతో ప్రశాంతంగా మాట్లాడ్డానికే కుదరట్లేదు అంటుంటాడు - అంతే మరి సంసారం సాగరం అన్నారు కదా!!
వదినకి ఫోన్ చేశావా? ఏంటి సంగతులు? అంటూ శ్రావ్యకి మటుకు ఎప్పటికప్పుడు కుశల ప్రశ్నలు అడుగుతుండేవాడు రాత్రి భోజనాల్లోగానీ, పడుకునే ముందుగానీ. శ్రావ్య ఏ మాత్రం విసుగుదల చూపించకుండా కిషోర్‌కి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్‌డేట్ చేస్తుండేది.
కాలచక్రపు ఇరుసుల్లో పడి కొన్ని సంవత్సరాలు నలిగిపోయాయి - వాటి వయసు మూడు ఉగాదులు - అక్కడ ఇక్కడ రెండు కుటుంబాల్లో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి.
శ్యామల ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోవడం మొదలెట్టి చాలాకాలమైంది. ఏదో వీధి చివర వున్న ఆచార్లగారి నాటు వైద్యం చేయించుకుంటోంది - విషయం ఆఖరికి పిల్లలకి కూడా పొక్కనివ్వలేదు. మునుపటిలా ఇంట్లో పని చెయ్యలేకపోతోంది - డ్యూటీ క్కూడా సరిగా వెళ్లకపోవడం గమనిస్తూ ఉంది ప్రశాంతి. ప్రశాంత్, ప్రశాంతికి అమ్మని చూస్తుంటే అశాంతితో దిగాలు పడిపోతున్నారు.
అస్తమానం మన కష్టాలు, కలతలు పెద్దాడికి తెలియచెప్పమాకండి; చీటికిమాటికి పూనె నించి యింటిల్లిపాది రావాలంటే వీలవుద్ది, వీలు కాదు.. అనే అమ్మ ఉన్నట్టుండి ప్రశాంత్‌ని కేకేసి ‘బాబు ప్రశాంత్.. పెద్దాడిని వున్న పళంగా రమ్మని ఫోన్ చేసి చెప్పు.. ఏ మాత్రం ఆల్యోం చేయమాకు - వాణ్ణి అర్జంటుగా నేను చూడాలి.. అంటూంటే దగ్గుతెర ముంచుకొచ్చింది, శ్యామలకి. పెదవుల వరకు వచ్చిన రక్తపు చారికలు కొంగుతో దాచేసింది పిల్లల కంటపడకుండా.
భళ్లున తెల్లారింది ఆ రాత్రి... ప్రశాంత్, ప్రశాంతిల పాలిటి నిశిరాత్రి.. తెల్లారేటప్పటికల్లా పెద్దాడు రెక్కలు కట్టుకు వాలిపోయాడు ఫ్లైట్‌లో.
అప్పటికే శ్యామల జీవితం కాస్తా.. తెల్లారేపోయింది - శ్యామల తల దగ్గర వెలిగే దీపం ఆ పచ్చి నిజాన్ని తేటతెల్లం చేస్తోంది. ఆ స్థితిలో అచేతనంగా పడి వున్న వదిన పార్థివ దేహాన్ని చూడగానే పెద్దాడు అమ్మా అంటూ భోరున ఏడుస్తూ కుప్పకూలిపోయాడు.
పెద్దాడు తరువాత అమ్మకి జరిపించాల్సిన తంతు జరిపించాడు. అంతే.. అమ్మలేని ఆ ఇంట్లో ఉండలేక విలవిలలాడిపోయాడు - అమ్మ జ్ఞాపకాలు దొంతరలు దొంతరలుగా గతంలోకి తనని తీసుకెళ్తున్నయ్, తనని అస్థిమితం చేస్తున్నయ్ - పెద్దాడు పిల్లలిద్దర్ని తీసుకుని పూనె ఫ్లైటెక్కేశాడు.
ప్రశాంత్ రెండు మూడు రోజులకి అమ్మ తనకప్పగించిన కవరు.. బాబు చేతికి అందించాడు. కవరు చించి ఉత్తరము చూశాడు పెద్దాడు. వదిన పెద్దాడా.. అంటూ మొదలెట్టింది. నిన్ను కళ్ళారా చూసి.. నీ చేతుల మీదుగా పోవాలని నా కడసారి కోరిక - అది తీరకనే పోతానేమో.. ఇదే నీకు సెలవు..
కళ్లనీళ్లు ఆగట్లేదు పెద్దాడికి- చైర్‌కి ఉన్న టవల్‌తో కళ్లు వత్తుకుంటూ, అలికేసినట్లుగా ఉన్న అక్షరాల్ని గొంతులోనే గుణించుకుంటూ చదవటం మొదలెట్టాడు; ప్రశాంతి పెళ్లికని నేను ఇనే్నళ్లుగా కూడబెట్టిన డబ్బు తాలూకు బాండు పేపర్లు జతపరిచాను. నేను జీవించి వున్న వరకు నిన్ను ఇబ్బంది పరచకూడదని నా శక్తి కొలది ఇంటి బాధ్యతలు నిర్వర్తించాను - మరోలా అనుకోకు, ఇకపై ప్రశాంతికి, ప్రశాంత్‌కి తండ్రి, తల్లి, గురువు, దైవం అన్నీ నువ్వేరా పెద్దాడా - నాకు నీపై విశ్వాసం ఉంది. నువ్వు నా పాలు తాగి పెరగకపోయినా మమతానురాగాలు పంచి పెంచాను. అందుకే నా తదనంతరం నీకివ్వడానికి నావద్ద ఆస్తుల్లేకపోయినా బాధ్యతలు నీపై భారం వేస్తున్నాను. మరోలా అనుకోవు; నువ్వు నా పెద్దాడివి-
జలజలా కారుతున్న కన్నీటిని ప్రశాంత్ గమనిస్తూనే ఉన్నాడు.
తను బాబాయిని ఇన్నాళ్లుగా ఒక స్వార్థపరుడిగానే భావించాడు - పశ్చాత్తాపంతో తలవంచుకుని కన్నీరౌతున్న ప్రశాంత్‌ని పెద్దాడు ఓదారుస్తున్నాడు. ఓదారుస్తున్న పెద్దాడిలో శ్రావ్య మీద కోపం ఎగసెగసి వస్తోంది.
మంచులా కనిపిస్తూ శ్రావ్య తన గుండెల్లో మంటలే రేపింది వదిన విషయంలో - ఇకపై శ్రావ్యకి ఆ ఛాన్స్ ఇవ్వను - నా బాధ్యతల్ని నేనే స్వయంగా చూసుకుంటాను అమ్మ స్ఫూర్తిగా - అమ్మ అభ్యర్థనని ఆజ్ఞగా శిరసావహించి నా గుండె మంటను చల్లార్చుకుంటాను.
తన బ్యాంకుకి దగ్గరలో ప్రశాంత్, ప్రశాంతిలకు 2బికె అద్దెకు ఈసి అందులో దించాడు పెద్దాడు. తను మునుపటిలా బ్యాంకుకే అంకితమైపోక, పెందలాడే తెముల్చుకుని, పిల్లలతో పొద్దుపోయేవరకు గడిపి తనింటికి వెళ్లేవాడు - పెద్దాడ్ని కదపటానికి శ్రావ్యకి ధైర్యం చాలట్లేదు. కారణం భగ్గుమంటున్న అగ్నిపర్వతంలా వున్నాడు శ్రావ్యకి.. ఈ మంచు ఆ మండే జ్వాలల్ని ఆర్పలేవు.
పెద్దాడు తన పూచీకత్తు మీద ప్రశాంత్‌కి బ్యాంకు లోన్ మంజూరు చేయించి ఎలక్ట్రికల్ షాప్‌కి ఓనర్ని చేశాడు. తన బ్యాంకులోనే పని చేస్తున్న యంగ్ క్రికెటర్, డైరెక్ట్ రిక్రూట్ అకౌంట్స్ ఆఫీసర్ సుభాష్‌తో ప్రశాంత్‌కి సంబంధం ఖాయం చేశాడు - ప్రశాంతి తనతో విదేశాలు కూడా చూడగలదు. ఎందుకంటే క్రికెట్ మ్యాచ్‌ల మీద వరల్డ్ టూర్ చేస్తుంటాడు సుభాష్...
వావ్... వదిన వుండగా.. తను ఈ ఇంట్రెస్ట్ చూపించి వుంటే.. ఎంతగా ఎంతగా... సంతోషించి ఉండేదో తలచుకుంటుంటే గుండెలు ద్రవిస్తున్నయ్.. కళ్లు కన్నీటి ధారలతో స్రవిస్తున్నయ్...
గుండె మంటలార్పే సన్నీళ్లు కన్నీళ్లు.. వుండమన్న వుండవమ్మ శాన్నాళ్లు పోయినోళ్లందరూ మంచోళ్లు.. వున్నోళ్లు పోయినోళ్ల తీపిగురుతులు...
పాడుతా తీయగా సల్లగా.. పసిపాపలా నిదురపో హాయిగా.. అంటూ అమ్మ జోల పాడినట్లై.. ఇప్పుడు పెద్దాడికి కళ్ల మీద కునుకుపడ్డది - మనసూ కుదుటపడ్డది...
ఇప్పుడు శ్రావ్య తప్పొప్పుకుని.. ప్రశాంత్‌ని, ప్రశాంతిని మంచులా దగ్గరకు తీసుకుని అక్కున చేర్చుకుంది.

-ఆచార్య క్రిష్ణోదయ 74168 88505