Others

మోదీ మంత్రివర్గంలో మామూలోడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరేంద్ర దామోదరదాస్ మోదీ అనే నేను..’ అంటూ రెండో పర్యా యం భారత ప్రధానిగా మోదీ పదవీ ప్రమాణ స్వీకారం చేసి దేశ రాజకీయ చరిత్రలో నూతనాధ్యాయానికి నాంది పలికారు. తన మంత్రివర్గంలో ఎవరికి చోటు దొరికింది? ఎవరిని తప్పించారు? అనే చర్చకు ఎటువంటి అవకాశం లేకుండా మోదీ తనదైన శైలిలో ఒక కొత్త ప్రయోగం చేసి జాతికి చూపారు. ఇలాంటివి చేయడానికి ధైర్యం, తెగువ మాత్రమే సరిపోవు. హృదయ వైశాల్యం కూడా వుండాలి. ఈ విషయం ముచ్చటించుకునేముందు ఒక వ్యక్తిని గురించి మాట్లాడుకుందాం.
ప్రజల భాషలో చెప్పాలంటే ఆయన ఒక మామూలోడు, సాదాసీదా సామాన్యుడు. నిజం చెప్పాలి అంటే సామాన్యులలో ఆయన అతి సామాన్యుడు. గతంలో రెండుసార్లు ఒడిశా శాసనసభకు ఎన్నికయినా ఆయన రూపం మారలేదు. భాష మారలేదు. జీవన విధానం మారలేదు. అదే పూరిల్లు. అవే దుస్తులు. కుర్తా పైజామా లేదా ధోవతి. అవీ రెండు జతలే. ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా ఒక చేతి సంచీ మాత్రమే ఆయన లగేజీ. ఎక్కడికి వెళ్ళాలన్నా సైకిల్ మీదనే సవారీ. తెల్లటి బవిరి గడ్డం, చింపిరి జుట్టు. సమాజసేవ కోసం ఆయన పెళ్లి చేసుకోలేదు. ఏడాది క్రితం కన్నతల్లి కూడా మరణించడంతో ఆ పూరి గుడిసెలో ఒంటరి జీవనం. కానీ ఆయన ఒంటరి మాత్రం కాదు. చుట్టూ సామాన్య జనం. జనం మధ్యనే ఆయన శ్వాస. జనం కోసమే ఆయన ధ్యాస.
అందరూ ఆయనను ‘సారంగి’ అని పిలుస్తారు. పూర్తి పేరు ప్రతాప్‌చంద్ర సారంగి. ఆయన ఇప్పుడూ సామాన్యుడే. కానీ మోదీ పుణ్యమాని వున్నట్టుండి ‘అసామాన్యుడి’గా మారిపోయాడు. తాజాగా జరిగిన కేంద్ర మంత్రివర్గ కూర్పులో ప్రధాని సారంగిని తన మంత్రి మండలిలోకి తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఢిల్లీలోని రాష్టప్రతి భవన్ వద్ద బహిరంగ వేదికపై రాష్టప్రతి కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇతర ఆహూతుల సమక్షంలో సారంగి కేంద్రమంత్రిగా పదవీ ప్రమాణం స్వీకరించే సమయంలో చప్పట్లే చప్పట్లు. సైకిల్‌పై తిరిగే ఓ సామాన్యుడు ఇప్పుడు కేంద్రంలో ఒక గౌరవనీయ మంత్రి.
ఈ విధంగా సారంగీ పేరు మరోమారు దేశమంతటా మారుమోగిపోయింది. ‘మరోమారు’ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే ప్రతాప్‌చంద్ర సారంగి అంత అనామకుడేమీ కాదు. ఇప్పటికే సారంగి రెండుమార్లు- 2004లో మొదటిసారి, 2009లో రెండోసారి ఒడిసా శాసనసభకు ఎన్నికయ్యారు. మొదటి నుంచీ ఆర్‌ఎస్‌ఎస్ మూలాలు కలిగిన సారంగి భజరంగ్‌దళ్ కార్యకర్త. అతి సామాన్య జీవనం గడిపే సారంగిని అక్కడి ప్రజలు ఎంతో ఆప్యాయంగా ‘ఒడిశా మోదీ’ అని పిల్చుకుంటారు. శాసనసభ్యుడిగా లభించే పింఛను ఆయన జీవనాధారం. అయితే- అది సారంగి జీవితానికి కాదు, ఆయన్ను నమ్ముకుని జీవిస్తున్న సామాన్యులకు. వేరే ఖర్చులంటూ లేని సారంగి చేసే సమాజ సేవకు ఆ పింఛను డబ్బులు ఉపయోగపడుతున్నాయి.
మరో విషయం ఏమిటంటే ఈ ‘ఒడిశా మోదీ’ గురించి ‘భారత్ మోదీ’కి కూడా బాగా తెలుసు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఎప్పుడు ఒడిశా పర్యటనకు వచ్చినా ఆయన మరచిపోకుండా చేసే పని ప్రతాప్‌చంద్ర సారంగిని కలవడం. ఆ విధంగా సారంగి పేరు అందరికీ తెలిసింది. ప్రధానమంత్రి మోదీకి సారంగి అత్యంత సన్నిహితుడు అని నలుగురికీ తెలుసు. అయినా నలుగురితో నెరిపే ఆయన సంబంధ బాంధవ్యాలలో ఎలాంటి తేడా లేదు. ఆప్యాయతతో కూడిన అదే పలకరింపు. అదే వేష ధారణ. అదే జీవన శైలి. అదే సైకిలు. అదే పూరి గుడిసె. 2009లో బీజేపీ అభ్యర్థిగా సారంగి నామినేషన్ వేయాలి. సైకిల్‌పై వెడుతుంటే నామినేషన్ పత్రాలు ఎక్కడో జారి పడిపోయాయి. చేసేది లేక సారంగి ఇండిపెండెంటు అభ్యర్థిగా పోటీచేశారు. అయినా జనం ఆయన్ని గెలిపించారు. 2014లో పార్టీ ఆయనకు పార్లమెంటుకు పోటీ చేయడానికి అవకాశం కల్పించింది. దురదృష్టం ఏమిటంటే- ఆ ఎన్నికల్లో ఆయన నెగ్గలేదు. ఈసారి మళ్ళీ బీజేపీ ఆయన సేవలను గుర్తించి మరోమారు టిక్కెట్టు ఇచ్చింది. కోటీశ్వరుడైన ప్రత్యర్థిపై గెలుపొందారు. ఆ విధంగా ఎంపీగా లోక్‌సభలో అడుగుపెట్టే మహత్తర అవకాశం లభించింది. అయితే విధి లిఖితం మరోలా వుంది. కేవలం సభ్యుడిగా కాకుండా మంత్రిగా పార్లమెంటులో కాలుమోపే సువర్ణావకాశాన్ని ప్రధాని మోదీ ఆ సామాన్యుడికి కల్పించారు.

-భండారు శ్రీనివాసరావు 98491 30595