AADIVAVRAM - Others

హిమగిరుల్లో తెలుగు వంటల ఘుమఘుమలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వాదశ జోతిర్లింగాల్లో 11వదైన కేధార్‌నాథ్ జోతిర్లింగం మహిమాన్విత క్షేత్రంగా అనాదిగా విలసిల్లుతోంది. కురుక్షేత్ర సంగ్రామంలో స్వవంశీయులైన కౌరవులను హతమార్చినందుకు పాప విమోచనం కోసం సముద్ర మట్టానికి 3,584 అడుగుల ఎత్తులో హిమాలయ పర్వత శ్రేణుల్లో వెలసిన కేధార్‌నాథ్‌ను దర్శించుకోవాలని భగవంతుని సూచనల మేరకు ఇక్కడికి వచ్చి తరించినట్లు స్థలపురాణం చెబుతోంది. వెయ్యి సంవత్సరాల క్రితం జగద్గురువుగా అవతరించి దేశ పర్యటనలు చేసిన ఆదిశంకరాచార్యుడు కేధార్‌నాథుని దివ్యమందిరం సమీపంలో అమరత్వం పొందగా, అక్కడే సమాధిగావించబడింది. కేదారీశ్వరుడి సన్నిదికి వచ్చే భక్తులు ఆదిశంకరాచార్యుడి సమాధిని కూడా దర్శించుకోవడం విశేషం. ఉత్తరఖండ్ రాష్ట్రంలోని రుషికేష్ నుండి సుమారు 200 కిలోమీటర్లకుపైగా వాహన ప్రయాణం ద్వారా చార్‌ధామ్ యాత్ర చెయ్యాల్సి ఉంటుంది. సోన్‌ప్రయాగ్, గౌరిఖుండ్ వరకు వెళ్లే యాత్రీకులు కాలినడకన దాదాపు 15 కిలోమీటర్లు వెళితేకానీ జ్యోతిర్లింగ దర్శనం చేసుకోలేరు. డోలీలు, గుర్రాలపై వెళ్లే వారితో పాటు యువకులు కాలి నడకన వెళ్లడం ఇక్కడ కనిపిస్తోంది. ఎముకలు కొరికే చలితో పాటు మంచు దుప్పట్లు కప్పుకున్న హిమాలయ పర్వత శ్రేణుల్లో ఎంతో ఆహ్లాదతను పొందుతూ భక్తులు శివనామ స్మరణ చేస్తూ ముందుకు సాగుతారు. మందాకిని నది సోయగాలు, చలి గాలులు, వివిద రాష్ట్రాల నుండి వచ్చే భక్తులు మాట్లాడుకునే భాషలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఎంతో ప్రాచూర్యం పొందిన భోళేనాథ్ భవ్య మందిరం చెంత ఒక్కటంటే ఒక్క అన్నదాన క్షేత్రం ఏర్పాటు కాకపోవడం భక్తులను కొంత మేరకు ఇబ్బందికి గురి చేస్తోందని చెప్పవచ్చు.
అన్నం పరబ్రహ్మ స్వరూపం
దేవానామమృతం నృణామృషీణాం చాన్న మోషదీ:
దైత్యరక్ష: పిశాచాదేర్దత్తం మద్య మిషాదిచ:
బ్రహ్మ దేవుడు దేవతలకు అమృతము, మానవులు, రుషులకు అన్నము, ఫలమూలములు, పశువులకు తృణపత్రములు, దైత్య రాక్షస, పిశాచాదులకు మదు, మాంసాదులను సృష్టించినట్లు ప్రశస్తి.
మనుషులు భుజించెడు ఆహారంలో గల సారం రసమై, రక్తమై, మాంసమై, మేథస్సు మొదలగు సప్త్ధాతువులుగా పరిణమించి, దీనియొక్క సూక్ష్మాంశం మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారంగా మారుతాయన్న ఉవాచ. మనశ్శాంతి, నిర్మలత్వం, కారుణ్యహృదయం, వైరాగ్యాంతఃకరణం కలగాలంటే పరిశుద్ధమైన ఆహారాన్ని ప్రతి వ్యక్తి భుజించాల్సి ఉంటుంది. భుక్తితో శక్తి, శక్తివుంటేనే భక్తి తీరుతుందన్నది నిర్వివాదాంశం. హిమాలయ పర్వతాల్లో వెలసిన కేధార్‌నాథుడిని దర్శించుకునే వారు ఆకలితో అలమటించడం కూడా పరిపాటి. పరమేశ్వరుడిని నమ్ముకుని క్లిష్టతరమైన పాదయాత్రతో బయలుదేరే భక్తులకు పట్టెడన్నం పెట్టడంలో కలిగే సంతృప్తికి మించి మరేమి లభించదు.
అన్నదానం గొప్పది...
గోదానం, భూదానం, వస్తద్రానం, అన్నదానం, విద్యాదానం, కనకాది దానాల్లోకెల్ల ఏది గొప్పది అంటే ఎవరైనా అన్నదానం గొప్పదని చెప్పేస్తారు. ఇక చాలు..వద్దూ..తృప్తి చెందాను అని చెప్పడానికి కడుపు నిండా భోజనం మినహా మరేమి ఉండదు. అన్నదానం తాను చేయకపోయినా చేసే వారిని చూపించినా పుణ్యం లభిస్తుందన్న నానుడి ఒకటుంది. మహాభారత యుద్ధంలో వీరమరణం పొందిన కర్ణుడికి గొప్పదాన గుణం ఉంది. అందుకే దానకర్ణుడిగా చరిత్రలో మిగిలిపోయాడు. అలాంటి కర్ణుడు స్వర్గానికి చేరుకున్నాక సకల భోగాలు కలిగాయి. ఎన్నో రకాల వంటకాలను రోజు తింటున్నా ఏదో వెలతిగా ఉండేదట. ఈ విషయమై కర్ణుడు ఇంద్రుడిని సంప్రదించి తృప్తిగా భోజనం చేసినట్లు ఎందుకు కలుగడం లేదని ప్రశ్నిస్తే, గొప్ప దానకర్ణుడవైన నీవు ఎప్పుడైనా అన్నదానం చేసావా అని ఎదురు ప్రశ్నించాడు. అప్పుడు కర్ణుడు ఆలోచించి లేదని సమాధానం ఇవ్వగా, పోనీ అన్నదానం చేసే వారిని ఎవరినైనా చూపించావా ఇంద్రుడు అడిగాడట. ఒక బీద బ్రాహ్మణుడు వచ్చి అన్నం పెట్టించు అని అడగ్గా ఏదో ధ్యాసలో ఉండి నాకు అవకాశం లేదుకానీ, ఆ ఇంటికి వెళ్లు అని చూపించాను అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు ఇంద్రుడు నీవు చూపించిన వేలిని నోట్లో పెట్టుకో అని చెప్పగా కర్ణుడు నోట్లో వేలిని పెట్టుకుని గుటక వేయగా కడుపు నిండిపోయి ఎనలేని తృప్తి కలిగిందట. కర్ణుడి కథనం ద్వారా అన్నదానం యొక్క ప్రాశస్త్యం ఏమిటో స్పష్టమవుతోంది. ఇంతటి గొప్పతనం కలిగిన అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్దిపేటకు చెందిన పలువురు ఒక ట్రస్టును ఏర్పాటు చేసుకుని కేధార్‌నాథ్‌లో తొలి ప్రయత్నంగా ఈ యేడాది ప్రారంభించి కొద్ది రోజుల పాటు విజయవంతంగా ముందుకు సాగారు.
‘మానవ సేవయే మాధవ సేవ’ అన్న లక్ష్యంతో సిద్దిపేటకు చెందిన కేధార్‌నాథ్ అన్నదాన సేవా సమితి తొలి ప్రయత్నాన్ని విజయవంతంగా ముగించుకుంది. గత పది సంవత్సరాలుగా మంచుకొండల్లో సాహసోపేతమైన యాత్రను నిర్వహించే అమర్‌నాథ్ యాత్రీకులకు దక్షిణాది వంటలను వండి వడ్డిస్తూ దేశవ్యాప్తంగా కీర్తినార్జించిన సిద్దిపేట వాసులు మరో అడుగు ముందుకు వేసారని చెప్పవచ్చు. అమర్‌నాథ్‌లో పర్యాటకులకు వివిధ రాష్ట్రాలకు చెందిన అన్నదాన శిబిరాలు సేవలు అందిస్తుండగా చార్‌ధామ్ యాత్రీకులకు ఏమాత్రం అన్నదాన శిబిరాలు లేకపోవడంతో ఎన్నో ప్రయాసలకు ఓర్చుకోవాల్సి వస్తోంది. నాలుగు సంవత్సరాల క్రితం సిద్దిపేటకు చెందిన చీకోటి మధుసూధన్ నేతృత్వంలో పలువురు సభ్యులు ఓ ట్రావెల్ బస్సులో చార్‌ధామ్ యాత్రకు వెళ్లారు. ట్రావెల్స్‌లో తమ వంట సిబ్బందిని వెంట తీసుకువెళ్లి భోజన వసతిని సమకూర్చుకున్నారు. మిగిలిన ప్రయాణీకులు మాత్రం భోజనాల కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న దుస్థితిని చీకోటి మధసూదన్ గుర్తించాడు. అమర్‌నాథ్ మాదిరిగానే ఇక్కడ కూడా అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించుకున్నారు. ప్రతి రోజు వేలాది మంది భక్తులు తరలివచ్చే కేధార్‌నాథ్‌లో ఉచిత అన్నదాన శిబిరం ఏర్పాటు చేయడం సాధ్యమవుతుందా లేదా అని తర్జన భర్జన పడ్డారు. ఎట్టకేలకు ఈ యేడాది మధుసూదన్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా 31 మంది సభ్యులతో కేదార్‌నాథ్ అన్నదాన సేవా సమితి సిద్దిపేట పేరుతో కమిటీని ఏర్పాటు చేసారు. ప్రతి సంవత్సరం అక్షయ తృతియ రోజున ప్రారంభమయ్యే చార్‌ధామ్ యాత్ర దీపావళి పర్వదినంతో ముగియడం ఆనవాయితీగా వస్తోంది. మే 9వ తేదీన ప్రారంభమైన చార్‌ధామ్ యాత్ర రోజునే కేదారీశ్వరుడి సన్నిధిలో అన్నదాన శిబిరాన్ని ప్రారంభించారు. మే 6వ తేదీన సిద్దిపేట నుండి ఓ ట్రక్కులో వివిధ రకాల వంట సరకులు, వంట పాత్రలను తరలించారు. నిర్ణయించుకున్నట్లుగానే కేధార్‌నాథ్ లంగర్ కమిటీ జలంధర్ వారి సహకారంతో యాత్ర ప్రారంభం రోజున అన్నదాన శిబిరాన్ని సోన్‌ప్రయాగ్ వద్ద ఆరంభించారు. మే 9 నుండి జూన్ 1వ తేదీ వరకు లక్షలాది మంది భక్తులకు ఘుమ ఘుమలాడే తెలుగు వంటలను ఉచితంగా వడ్డించారు. 20 రోజుల్లోనే సుమారుగా రూ.40 నుంచి 50 లక్షల వరకు వెచ్చించి అన్నదానం నిర్వహించగా, నిధుల లేమికారణంగా అర్ధాంతరంగా శిబిరాన్ని మూసి వేసారు. తొలి ప్రయత్నానికి భక్తుల నుంచి మంచి స్పందన రావడంతో పాటుగా విజయవంతం కావడంపై ట్రస్ట్ అధ్యక్షులు మధుసూదన్‌తో పాటు కాశీనాథ్, శ్రీనివాస్, రాములు, ప్రధాన కార్యదర్శి రత్నాకర్, కోశాధికారి శరభయ్య తదితరులు సంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చే యేడాది మరిన్ని సేవలు అందిస్తామన్న భరోసా కలిగిందన్నారు. ప్రతి రోజు తెల్లవారు జామున 4 గంటలకు ప్రారంభమయ్యే సేవలు రాత్రి 12 గంటల వరకు నిర్విరామంగా కొనసాగించారు. 4 గంటల నుండి 7 గంటల వరకు టీ, కాఫీ, పాలు, తోస్ బిస్కట్లు అందజేసారు. 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇడ్లీ, వడ, పూరీ, ఉప్మా, పొంగల్, పోహ, మధ్యాహ్న భోజనంలో అన్నం, ఆవకాయ పచ్చడి, పప్పు, కుర్మ, సాంబారు, పెరుగు, పాపడ్‌తో పాటు రోజుకు ఒకరకమైన హల్వా, జిలేబి, గులాబ్‌జాం, కేసరి, పాయసం, బెల్లం, చక్కెరతో తయారు చేసిన పరమాన్నం తదితర స్వీటు పదార్థాలను అందజేసారు. సాయంత్రం బాదాం పాలను భక్తులకు పంపిణీ చేసి మెప్పుపొందారు. మందాకిని నదీమ తల్లి ఒడ్డున ఏర్పాటు చేసిన అన్నదాన శిబిరానికి ఎలాంటి త్రాగునీటి కొరత లేకుండా మోటార్ల ద్వారా నీటిని సమకూర్చుకుని ప్యూరీఫైర్ ద్వారా స్వచ్ఛమైన నీటిని భక్తులకు అందించారు. కరెంటు కొరతను అధిగమించడానికి మూడు జనరేటర్లను సైతం ఏర్పాటు చేసి విద్యుత్ కాంతులను నెలకొల్పారు. తెలుగు వంటలను వండటానికి సిద్దిపేట నుండి ఆరుగురు వ్యక్తులను తీసుకువెళ్లారు. వేలాదిగా తరలివచ్చే భక్తులకు సేవలందించడానికి ఉత్తరాఖండ్ ప్రాంతానికి చెందిన 80 మంది సిబ్బందిని నియమించి మొట్టమొదటి సారిగా కేదార్‌నాథ్‌లో అన్నదాన శిబిరాన్ని సఫలీకృతం కావించడం గమనార్హం. కేధార్‌నాథ్ అన్నదాన సేవా ట్రస్ట్- సిద్దిపేట మునుముందు మరింత పేరు సంపాదించుకునేందుకు సృష్టికి లయకారకుడైన భోళాశంకరుడు అనుగ్రహించాలని కోరుకుందాం.

దాతల సహకారంతో అన్నదాన విస్తరణ
భక్తులు, మిత్రులు, దాతలు, ప్రధానంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రోత్సాహంతో సాహసోపేతంగా ప్రారంభించి, మధ్యంతరంగానే నిలిపివేసిన కేదార్‌నాథ్ అన్నదాన శిబిరాన్ని రానున్న సంవత్సరాల్లో మరింత విస్తరింపజేయడానికి కృషి చేస్తామని అధ్యక్షుడు చీకోటి మధుసూదన్ పేర్కొన్నాడు. అమర్‌నాథ్‌లో చేపట్టిన శిబిరం స్ఫూర్తితోనే ప్రారంభించినప్పటికీ అక్కడికీ ఇక్కడికీ చాలా తేడా ఉందన్నారు. అమర్‌నాథ్‌లో చాలా శిబిరాలు ఉంటాయని, కేదార్‌నాథ్‌లో మాత్రం సిద్దిపేట శిబిరం ఒక్కటే అయ్యేసరికి సరకులు, ఖజానా ఖాళీ కావడంతో మధ్యంతరంగా ముగించాల్సి రావడం బాధాకరంగా ఉందన్నారు. వచ్చే సంవత్సరం రెండు నెలలు, మరుసటి యేడాది నాలుగు నెలలు, ఆ మరుసటి సంవత్సరం ఆరు నెలల కాలం చార్‌ధామ్ యాత్ర పూర్తయ్యే వరకు విస్తరించేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నట్లు ధీమా వ్యక్తం చేయడం గమనార్హం. ఇంతటి మహోన్నత కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం లభించడం పరమేశ్వరుడి కటాక్షం, పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ముందుకు సాగుతామన్నారు.

- తమ్మలి మురళీధర్, 9989507333