AADIVAVRAM - Others

గ్రామీణ జంట ‘రంగుల’ ప్రణయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమ.. ఈ రెండక్షరాల్లోని మధుర భావనలకు వర్ణాలు అద్ది ఓ ప్రేమ ప్రపంచాన్ని సృష్టించారు చిత్రకారుడు జి.కె.శ్రవణ్‌కుమార్. గ్రామీణ ప్రాంత జంట.. ఆ ప్రేమ జంట చుట్టూ పుష్పాలు, మంచు.. మేకపిల్లలు ముగ్ధ మనోహరంగా కనిపిస్తాయి. వారి ప్రేమకు వాటికి అవినాభావ సంబంధం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రేమికుడు మేకల కాపరిగా ఉన్నా, చేతిలో కర్ర ఉన్నా అతని కలల సుందరి, స్వప్నసుందరి అతిలోక సుందరిగానే దర్శనమిస్తుంది. ఆ లావణ్యం, సుకుమారం, అలంకారం, అరమోడ్పు కనులు అంతా స్వప్నజగత్తును తలపింపజేస్తుంది. ఈ ‘జెక్స్టా పొజిషన్’ పాత్రల మధ్య ప్రణయం చూపడం చిత్రకారుడి ప్రత్యేకత. ఆయిల్, ఆక్రలిక్, వాటర్‌కలర్‌ల మిక్స్‌డ్ మీడియాలో వేసిన ఆయన చిత్రాల మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఫ్రేమ్ పైభాగంలో యువ జంట ప్రేమ వ్యక్తావ్యక్తమైన భావనల ఝరి కురుస్తుండగా ఆ ఫ్రేమ్ అడుగు భాగం అంతా ‘్ధర’ కనిపిస్తుంది. శ్రవణ్‌కుమార్ తన ప్రత్యేక శైలిగా దీన్ని ఎంపిక చేసుకుని తీర్చిదిద్దుతున్నారు. ప్రేమికుడి తలకు రుమాలున్నా, చేతిలో ‘కమ్మ కత్తి’ ఉన్నా, చేతికి కడియం ఉన్నా, మెడలో తాయత్తు ఉన్నా, కోర మీసం గుచ్చుకుంటున్నా అందాల భరిణ ప్రేయసి అతని సాంగత్యాన్ని కోరుకుంటున్న వైనం ఆయా వర్ణ చిత్రాల్లో చూపరులను ఇట్టే ఆకర్షిస్తుంది. అలాగని ఆ ప్రేమికులు మిట్టమధ్యాహ్నం పూట కనిపించినట్టుగాక చీకటి - వెలుగుల మధ్య, మసక వెలుతురులో, రంగులు పరావర్తనం చెందిన చోట తళుక్కున మెరుస్తారు. చూపరులను మురిపిస్తారు. ఈ ప్రేమ జంట హావభావాలు, అనుభూతి, ఆహార్యం, తాదాత్మ్యం తనివితీరా చూడాలనిపించేలా ఆకర్షిస్తుంది. అసంఖ్యాకమైన ఈ బొమ్మలు వేసినా దాదాపు అన్నిటా వారే, వారి ఆకృతులే, వారి ప్రేమనే పరుచుకుని కనిపించడం విశేషం. వివిధ సమయాల్లో, సందర్భాల్లో ఆ ప్రేమ జంట పారవశ్యాన్ని ఫ్రేమ్‌కట్టి చూపే ప్రయత్నం చిత్రకారుడు చేశాడు. దాంతో ఆ జంట ప్రేమ చిత్రకథాలహరిగా తోస్తుంది. అజరామరమనిపిస్తుంది.
సహజంగా ప్రేమను వ్యక్తీకరించేందుకు, చిత్రకారులు వివిధ జంటలను ఎంపిక చేసుకుంటారు. ‘వైవిధ్యం’ చూపే ప్రయత్నం చేస్తారు కానీ శ్రవణ్‌కుమార్ మాత్రం తన చిత్రాల్లో ఒకే జంటను చూపుతూ వారి హావభావాల్లో వైవిధ్యాన్ని పలికించేందుకు ప్రయత్నించారు. ఇదే ఆయన విశిష్టత. వందల మార్లు అవే మొఖాలు చూస్తున్నప్పటికీ విరక్తి, విముఖత చూపరుల మనసులో తలెత్తకుండా ఉండేందుకుగాను చిత్రకారుడు తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. అసలు సిసలు చిత్రకారుడి ప్రతిభ ఇక్కడే బయటపడుతుంది. ఆ రకంగా శ్రవణ్‌కుమార్ తన ప్రతిభను చూపడంలో కృతకృత్యుడయ్యాడు.
అందుకే 2012 సంవత్సరంలో హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఏర్పాటు చేసిన అఖిల భారత చిత్రకళా ప్రదర్శనలో ఈ ‘ప్రేమ జంట’ బొమ్మకు బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఆ చిత్ర శైలిని, వస్తువును, రంగుల రసజ్ఞతను ఇంకా కొనసాగిస్తున్నారు. అదే అతని సిగ్నేచర్‌గా మారింది.
ఆధునిక దేవాలయంగా పిలిచే నాగార్జున సాగర్ ఎడమకాలువను ఆనుకుని ఉన్న బరాకత్‌గూడెంలో జి.కె. శ్రవణ్‌కుమార్ 1972లో జన్మించారు. ప్రస్తుతం ఈ గ్రామం సూర్యాపేట జిల్లాలో ఉంది. ప్రాథమిక పాఠశాల రోజుల నుంచే అందంగా అక్షరాలు రాయడం, బొమ్మలు గీయడం అలవాటైంది. తన తండ్రి కాంతయ్య వేసే బొమ్మలు, రాసే ‘రాత’ ఎంతో బాగుండటం కారణంగా వాటిలో కొన్నింటిని పెన్సిల్‌తో అనుకరించేవాడినని, ఆ రోజుల్లో అదే గొప్ప ‘ఆర్ట్’గా భావించేవాడినని శ్రవణ్‌కుమార్ గతాన్ని గుర్తు చేసుకున్నారు. బరాకత్‌గూడెంలోని జీవితం తన మనసుపై బలమైన ముద్ర వేసిందని అందులోంచి పుట్టుకొచ్చిందే ఈ ‘ప్రేమ జంట’ అంటారాయన.
1987 సంవత్సరంలో నల్లగొండ పట్టణంలో ఇంటర్మీడియెట్ చదువుతున్న సమయంలో ‘సైన్‌బోర్డు ఆర్టిస్టు’గా పని చేశానని, ఐటిఐ చదువుతున్నప్పుడు కూడా ఆ సైన్ బోర్డు ఆర్టిస్టు పని కొనసాగించానని చెబుతూ ఆ సందర్భంలో ఆ పట్టణంలోని ప్రముఖ చిత్రకారుడు, బొంబాయిలోని జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చదివి, అద్భుతమైన ప్రొటేట్స్ వేసే రామచంద్రం సార్ పరిచయం కావడం తన జీవితంలో గొప్ప మలుపుగా భావిస్తున్నారు. చిత్రకళ పట్ల తనకున్న ఆసక్తిని, అనురక్తిని, అభినివేశాన్ని పసిగట్టి చిత్రకారుడు రామచంద్రం ఎన్నో విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారని, చిత్రకళపై ప్రాథమిక అవగాహనను అందించి డ్రాయింగ్‌లో లోయర్, హయ్యర్ పరీక్షలు రాసేలా ప్రోత్సహించాడు. ఉచితంగా శిక్షణ ఇచ్చాడు. అలా జిల్లా స్థాయి పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో పాసయ్యానని శ్రవణ్ చెప్పారు. ఈ సమయంలో గ్రామీణ జీవితంపై అనేక బొమ్మలు గీశానని, డ్రాయింగ్స్ వేశానని ఈ కళలో మరింతగా రాణించేందుకు హైదరాబాద్‌లోని జె.ఎన్.టి.యు.లోని ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చేరమని రామచంద్రం సార్ సలహా మేరకు 1989లో ప్రవేశ పరీక్ష రాసి, 1990లో తరగతులకు హాజరయ్యానని, ఇది తన జీవితంలో మరో మలుపు అని శ్రవణ్ పేర్కొన్నారు. బి.ఎఫ్.ఏఐలో పెయింటింగ్ కోర్సులో తీవ్రమైన సాధన ఉండేదని, పోట్రేట్స్ ఎక్కువగా వేసేవాడననీ, గురువయ్య సార్ లాండ్ స్కేప్స్ నేర్పించారని, గౌరీశంకర్ సార్ ప్రింట్ మేకింగ్ నేర్పించారని అలా ఎందరో ప్రముఖుల శిక్షణలో చిత్రకళ గూర్చి కొన్ని మెళకువలు తెలుసుకునే అవకాశం లభించిందనీ, డ్రాయింగ్స్ - పెయింటింగ్ సాధనలో తిరిగి పశువుల కొట్టం, ఎద్దులు, మేకలు తదితరమైనవి వేసి సహచరులకన్నా భిన్నంగా బొమ్మలు వేసేవాడినని ఆయన చెప్పారు. అలాగే ఆ కోర్సులో అంతర్భాగంగా వివిధ మోడల్స్ (బిచ్చగాళ్లు, లంబాడీలు, ముసలివాళ్లు, అనాధలు) బొమ్మలు గీశానని ఆ విధంగా తన సృజనశక్తి విప్పారిందని చెప్పారు. 1996లో బిఎఫ్‌ఏ పూర్తయ్యాక సినిమా రంగంపై గల మోజుతో సినిమా పబ్లిసిటీ రంగంలోకి శ్రవణ్ అడుగు పెట్టాడు. అమీర్‌పేటలో స్టూడియో ఏర్పాటు చేసి కొన్ని సినిమాలకు పని చేశాక సినిమా పబ్లిసిటీలోకి ‘డిజిటల్ ప్రక్రియ’ ప్రవేశించడంతో కాస్త వెనక్కి తగ్గి సినిమాలకు, కొన్ని షార్ట్ ఫిలిమ్స్‌కు స్టోరీ బోర్డు రూపకల్పన చేసే పని చేపట్టాడు. అయితే అది నిరంతరం కొనసాగే పని కాదు కాబట్టి తాను చదివిన ‘పెయింటింగ్’ పనిని 2008 సంవత్సరం నుంచి సీరియస్‌గా చేపట్టారు. అక్కడ ప్రారంభమైనదే ఈ లవ్‌కపుల్.. శీర్షికన వేసే బొమ్మలు. తొలిసారి వేసిన ఆ బొమ్మలు, గంగిరెద్దుల బొమ్మలు కలిపి ఐకాన్ ఆర్ట్ గ్యాలరీలో మొదటిసారి ‘సోలో షో’ను ఏర్పాటు చేశారు. ఆ ప్రదర్శన మంచి గుర్తింపును తీసుకురావడంతో మరుసటి సంవత్సరం అంటే 2013 తాజ్ దక్కన్ ఆర్ట్ గ్యాలరీలో మరో ‘సోలో షో’ను ఏర్పాటు చేశారు. ఈసారి మరికొన్ని కొత్త బొమ్మలు కలిపి ప్రదర్శించడంతో చిత్రకళా విమర్శకుల, అభిమానుల, మీడియా దృష్టిని ఆకర్షించారు. ఆర్ట్ సర్కిల్‌లో జి.కె.శ్రవణ్ పేరు పరిచయమైంది. సరికొత్త శైలి - వస్తువుతో, రంగుల సరాగాల స్ట్రోక్స్‌తో తనదైన చిత్రకళా సంతకాన్ని కాన్వాస్‌పై చేశారు. అలాంటి ఓ ప్రదర్శనల్లో తన ప్రేమ జంట పెయింటింగ్‌ను ఇష్టపడి స్థానికత, సహజత్వం ఉట్టి పడుతోందని గుర్తించి ఓ మాస పత్రిక వారు తీసుకుని కవర్ పేజీగా ఆ చిత్రాన్ని వేసుకుని చిత్రకారుడి గౌరవాన్ని పెంచారు. వివిధ పత్రికల్లోనూ ఆయన బొమ్మలు ప్రచురితమయ్యాయి. ప్రతి సంవత్సరం ఆయా ప్రముఖ నగరాలలో జరిగే గ్రూప్ షోలలో తప్పనిసరిగా శ్రవణ్ బొమ్మలు కనిపిస్తాయి. తాజాగా తైవాన్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మకమైన చిత్రకళ ప్రదర్శనలో ఆయన బొమ్మ ఎందరినో ఆకట్టుకుంది. అలా సూర్యాపేట జిల్లాలోని బరాకత్ గూడెం నుంచి భాగ్యనగరానికి చేరుకుని చిత్రకళా రంగంలో వెలుగు జిలుగుల వనె్నలను కాన్వాసుపై తర్జుమా చేస్తూ ఆ బొమ్మల సొగసు చూడతరమా?.. అనిపించేలా వీక్షకుల మనసులు దోచుకుంటూ శ్రవణ్ పలువురి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. చిత్రకారుడికి ఇంతకన్నా కావలసిందే ముంటుంది?

జి.కె.శ్రవణ్‌కుమార్ 93466 43046

-వుప్పల నరసింహం 99857 81799