Others

విజయానికి నాన్నే స్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవమాసాలు మోసి, పురిటి నొప్పులు భరించి, శిశువుకు జన్మనిచ్చేది అమ్మ అయితే- ఆ బిడ్డ జీవితాన్ని అన్ని విధాలా తీర్చిదిద్దేవాడే నాన్న. ప్రేమకు చిరునామాగా ఉంటూ, అనురాగాన్ని, ఆప్యాయతను జోడిస్తూ బిడ్డ భవిష్యత్‌కు పునాదులు వేస్తూ, బిడ్డ జీవితానికి తోడునీడగా ఉంటూ, నిత్యం తన బిడ్డ కోసం పరితపించేవాడే తండ్రి. పిల్లల జీవితంలో తండ్రి పాత్ర అమోఘం. ఇంతటి మహోన్నతమైన తండ్రి పాత్రను ప్రపంచానికి పరిచయం చేయాలని మొదటిసారిగా వాషింగ్టన్‌లో ఓ యువతి చొరవ చూపింది. తన చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో తండ్రే అన్నీ అయి ఆరుగురు కూతుళ్లను పెంచి పెద్దచేశాడు. అందుకే తన తండ్రి పుట్టిన రోజును ‘తండ్రుల దినోత్సవం’గా ఆమె జరిపింది. 1966లో అధికారికంగా ‘అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం’ పాటించడం ప్రారంభమైంది.
మార్గదర్శి...
పిల్లల జీవితంలో ఎన్నో ఆశలు, లక్ష్యాలు, గమ్యాలు.. వాటి కోసం ఉరుకులు, పరుగులు.. జీవితంలో అనుకున్నది సాధించే క్రమంలో వారికి నాన్నే సరైన మార్గదర్శి. లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరాక ఆ విజయానికి నాన్నే స్ఫూర్తి. మనిషిగా మనందరి ఉనికిలో నాన్న ఉంటాడు. నాన్న తన పిల్లల దగ్గర ఎలాంటి హోదాతో ప్రవర్తించడు. ప్రపంచం దృష్టిలో ఎంత గొప్ప పేరున్న వ్యక్తయినా.. ఇంటికి వచ్చాక బిడ్డల ముందు అతను కేవలం నాన్నే. ప్రేమకి తల్లి మారుపేరయితే, నాన్న నిండైన బాధ్యతకు మరో రూపం. నీకు నేనున్నానని నిండుమనసుతో చెప్పగల, జీవితాలను నిలబెట్టగల ఏకైక వ్యక్తి నాన్న. మన కళ్లముందు సమాజంలో కనబడుతున్న ఎంతోమంది, ఎన్నో విజయాల వెనుక నాన్న కృషి ఎంతగానో ఉంటుంది.
నిజమైన స్నేహితుడు..
కనిపెంచిన మమతానురాగాల రక్ష అమ్మదయితే, భవిష్యత్తుకు బాటలు పరిచి గమ్యాన్ని చేర్చే స్ఫూర్తిప్రదాత నాన్న. అమ్మ జోల పాటతో నిద్రపుచ్చితే.. నాన్న చెప్పే నీతిపాఠం వ్యక్తిత్వ నిర్మాణానికి పునాది వేస్తుంది. అమ్మ ఒడి గుడి అయితే, నాన్న భుజాలు లోకాన్ని చూపే బడి. అమ్మ కన్నబిడ్డ కడుపు చూస్తే, నాన్న ఆ బిడ్డ భవిష్యత్తును చూస్తాడు. ఎప్పుడూ పిల్లల గురించే తపించే తండ్రి తన కలలను, ఆశలను, అభిప్రాయాలను వారితో పంచుకుంటున్నాడు. ఒక స్నేహితుడిలా వారితో మెలుగుతున్నాడు.
ప్రతి రోజూ ఉద్యోగం లేదా వృత్తిపై ఉదయాన్నే బయటకువెళ్ళే నాన్న- ఇంటి బాధ్యతలను మోస్తూ తన సంపాదనంతా కుటుంబానికే వెచ్చిస్తాడు. పిల్లల భవిష్యత్తుకోసం, వారి ఉన్నతి కోసం నిరంతరం తపనపడే తండ్రి- అన్నీ తానై తోడూనీడగా ఉంటాడు. నాన్నకు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేక స్థానముంటుంది. నాన్న అనురాగానికి, ఆప్యాయతలకు ప్రతీక మాత్రమే కాదు మార్గదర్శిగా ఉంటూ పిల్లల బంగారు భవితకు బాటలు వేయడానికి నిరంతరం తపన పడుతుంటాడు.
ఓ ఆత్మవిశ్వాసం...
నాన్నంటే ఓ ధైర్యం. నాన్నంటే ఓ బాధ్యత. నాన్నంటే ఓ ఆత్మవిశ్వాసం.. చిటికెన వేలు పట్టుకుని నడక నేర్పిన నాన్న. చూపుడు వేలుతో ప్రపంచాన్ని పరిచయం చేసే మార్గదర్శి. ప్రతి బిడ్డకు మలిదైవమే. బిడ్డలతో హద్దుల్లేని అనుబంధం తండ్రిది. పిల్లల కోసం ఏదైనా చేస్తాననే అనంత ప్రేమ నాన్న గుండెలో దాగి ఉంటుంది. చిన్నప్పటి నుంచి నాన్ననే చూస్తూ, అనుసరిస్తూ పెరిగిన పిల్లలు. నాన్న స్థిరపడిన రంగంలోకి రావాలనుకోవడం సహజం.
పెరిగిన బాధ్యత...
మారుతున్న కాలంతోటు అన్నిటా పెరుగుతున్న పోటీతత్వం తండ్రి బాధ్యతను మరింతగా పెంచుతోంది. పిల్లలను మంచి పౌరులుగా తీర్చాలనే తపన ప్రతి తండ్రిలో కనిపిస్తోంది. కొందరు తండ్రులు డబ్బు ఖర్చు పెట్టడంతోనే పిల్లల పట్ల తమ బాధ్యత తీరిపోయినట్టు వ్యవహరిస్తారు. అలాంటి తండ్రులు కొన్ని విషయాలు విధిగా తెలుసుకోవాలి. పిల్లలను ప్రయోజకుల్ని చేయాలన్న తపన నిరంతరం వారిలో ఉండాలి. పిల్లలపై అతి కఠినంగా, అతి గారాబంగా ప్రవర్తించడం మంచిది కాదు. పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. పిల్లలకు భరోసాగా ఉండాలి. పిల్లల ముందు మద్యం తాగడం, పొగ తాగడం చేయకూడదు. పిల్లలకు మార్గదర్శిగా, స్నేహితుడిగా ఉండాలి. పిల్లలతో కలివిడిగా ఉండడం, వారితో మాట్లాడుతుండడం, వారి సందేహాలను నివృత్తి చేయడం వంటివి చేయాలి. ఏది మంచి? ఏది చెడు? అన్న విషయాలను పిల్లలకు తెలియజేయాలి.
ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ ప్రతి రోజూ పిల్లలతో కనీసం కొంత సేపయినా ఆప్యాయంగా గడపాలి. వారితో చదువుకు సంబంధించిన విషయాలు మాట్లాడి సమస్యలు తెలుసుకోవాలి. మార్కులు తక్కువ వచ్చినప్పుడు పిల్లలను కోప్పడడం, కొట్టడం చేయరాదు. ఇతర పిల్లలతో పోలుస్తూ తమ పిల్లలను తక్కువచేసి మాట్లాడరాదు. అది వారి మనసులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వారంలో ఏదైనా ఒకరోజు కుటుంబమంతా కలిసి సంతోషంగా గడపాలి. పిల్లలను పార్కులకు, విహార యాత్రలకు తీసుకెళ్లాలి. దీనివల్ల కుటుంబ ప్రేమానుబంధాలు బలపడతాయి.
(నేడు ఫాదర్స్ డే)

-డా. అట్ల శ్రీనివాస్‌రెడ్డి