Others

నదీ జలాల వినియోగంతో ‘నవ భారత్’ సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరి నదీ జలాల సద్వినియోగానికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేపట్టిన సాగునీటి పథకాలకు నిధులు మంజూరు చేసే విషయమై కేంద్ర ప్రభుత్వం నీళ్లు నములుతోంది. ఈ వైఖరి కారణంగా రాష్ట్ర విభజన జరిగి అయిదేళ్లు పూర్తయినప్పటికీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు సాధించిన ప్రగతి దేశ సౌభాగ్యంలో అంతర్భాగమని కేంద్ర ప్రభుత్వంలోని నిర్వాహకులు గుర్తించకుండా కేవలం ఇటీవలి సార్వత్రిక ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించడం దారుణం. విభజన చట్టం ప్రసాదించిన హామీలను తుంగలోకి తొక్కినా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తమకున్న ఆర్థిక వనరులను అత్యంత వ్యయప్రయాసలతో కూడగట్టుకొని, ప్రజాదరణ పొందుతున్న వైఖరికి ఢిల్లీ పెద్దలు ఇబ్బందిపడుతున్నారు. అయితే ఎలాంటి ఔదార్యం, ప్రోత్సాహం చూపడం లేదు.
జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ విజయంతో కేంద్ర ప్రభుత్వాధినేతల కప్పదాటు వైఖరి ఇప్పటికే స్పష్టమైంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ హోదా ప్రసాదించబడిన పోలవరం ప్రాజెక్టు జూన్ 2021 నాటికి పూర్తవుతుందని జగన్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. భూసేకరణ, పునరావాసం తదితర సౌకర్యాలు, హెడ్‌వర్క్స్, పవర్‌హౌస్, కాల్వల తవ్వకం ప్రాజెక్టు భారీ నిర్మాణంలో భాగంగా దశాబ్దాల తరబడి కొనసాగుతుండటంతో పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం ప్రస్తుతం రూ. 60 వేల కోట్లకు చేరింది. ప్రతి ఏటా పెరుగుతున్న ధరవరలు నిర్మాణ వ్యయాన్ని తడిసి మోపెడు చేసే స్థితిగతులు నెలకొని వుండటం సహజం. రాష్ట్ర ప్రభుత్వం జాతీయ హోదా రాకముందు పోలవరానికి రూ. 5,135.87 కోట్లు ఖర్చుపెట్టింది. రాజకీయ మిత్రధర్మానికి కట్టుబడి తెలుగుదేశం పార్టీ అధినేత, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు 29సార్లు ఢిల్లీవెళ్లి మొత్తుకొన్నా ఖర్చుపెట్టిన వ్యయంలో కొంతైనా విదపలేదు. మెచ్చుకోలు ప్రశంసలతో కాసు విదల్చకుండా కాలక్షేపం చేయటం పట్ల కేంద్ర వైఖరికి తెలంగాణ ప్రభుత్వం కూడా అసహనంగానే వుంది. అయినా పెద్దన్నల పెత్తనంపై ముఖ్యమంత్రులు ఆచితూచి సరిపెట్టుకొంటున్నారు.
బహుళార్థసాధకంగా పోలవరం, కాళేశ్వరం జాతీయ స్థాయి సుసంపన్నతలో భాగస్వామ్యం వహించే భారీ ఇరిగేషన్ పథకాలు. ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాలు పునర్నిర్మాణానికి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. కాంగ్రెస్, బిజెపిలను తిప్పికొట్టిన రాష్ట్రాలుగా ఎపీ, తెలంగాణలు గుర్తింపుపొందాయి. కేంద్ర నాయకత్వం ఉదారంగా వ్యవహరించక పోవటానికి కారణం కేవలం రాజకీయం అనే భావన రెండు రాష్ట్రాల్లో స్పష్టమవుతోంది.
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో కేంద్ర ప్రభుత్వం భారత్ నిర్మాణ్ పథకం మార్గదర్శక సూత్రాలలో భాగంగా ఈ రెండింటికే కాకుండా, దుమ్ముగూడెం ఎన్.ఎస్.టైల్ పాండ్, దేవాదుల ఎత్తిపోతల పథకం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, కాంతానపల్లి సుజల స్రవంతి, శ్రీపాదసాగర్ ఎల్లంపల్లి ఎత్తిపోతల వంటి పథకాలన్నింటికీ జాతీయ హోదా డిమాండ్ చేసారు. ‘్భరత్ నిర్మాణ్’ లక్ష్యంలో నాటి కేంద్ర విద్యుత్, వ్యవసాయం, తాగునీరు, గృహనిర్మాణం ఇతర గ్రామీణ వౌలిక ప్రగతిని నిర్దేశించింది. అందులో భాగంగా 2012నాటికి 2.5 కోట్ల ఎకరాలలో సుస్థిర వ్యవసాయ ప్రగతి దేశం సాధించటం నాటి ఆశయం. కృష్ణా, గోదావరీ జలాల సద్వినియోగంలో ప్రస్తుత తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా వ్యవహరిస్తూ ఇతర రాష్ట్రాలను సైతం జలసంధానంతో సస్యశ్యామలం చేసే అవకాశాలున్నాయి. తమిళనాడు, కర్నాటక, ఒడిశా, మహారాష్ట్ర ప్రాంతాల్లో జల సంక్షోభం తీవ్రంగానే ఉంది. తెలుగు రాష్ట్రాల అంతర్గత అవసరాలు, అంతర్రాష్ట్ర జల సంపద సద్వినియోగం విషయాలపై కేంద్రం ఇకనైనా దృష్టిసారించాలి. నవ భారత నిర్మాణం లక్ష్యంగా ఆలోచిస్తున్న ప్రధాని మోదీ నాయకత్వం ఇకముందైనా దక్షిణాది జన సౌభాగ్యం, జాతీయ సిరిసంపదల సాధకంగా ప్రభుత్వాలను ఆదుకోవాలి. మహానది-గోదావరి- పెన్నా నదుల అనుసంధాన ప్రక్రియను తెరపైకి తెచ్చి కేంద్ర ప్రభుత్వం గతంలో స్పష్టత, పారదర్శకత లోపించిన ప్రకటనలతో, ‘నీళ్లు మీవయితే నిధులు ఇచ్చేది లేదని’ తెలుగు రాష్ట్రాలను బెదిరించిన దాఖలాలున్నాయి. ఆరు రాష్ట్రాల ఆశాదీపం గోదావరి నదీ జల సంపదను జనజీవన సౌభాగ్యానికి వినియోగించుకోవాలి. అదే నవభారత నిర్మాణ లక్ష్యం.

-జయసూర్య 94406 64610