AADIVAVRAM - Others

అక్షరబ్రహ్మలుగా గిరిజనులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొండ శిఖరాల్లో నివసించే గిరిజనుల బతుకులు మార్చేందుకు ప్రభుత్వం ‘అక్షర బ్రహ్మ’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. పార్వతీపురం ఐటిడిఏ పీవో లక్ష్మిషా పీవోగా బాధ్యతలు చేపట్టిన తరువాత అంతరించిపోతున్న సవర భాష, సంస్కృతిని పరిరక్షించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ విధంగా విజయనగరం జిల్లాలోని కురుపాం, గుమ్మలక్ష్మిపురం, జియ్యమ్మవలస మండలాల్లోని సవరలు నివసించే గ్రామాల్లో సుమారు 174 పాఠశాలల్లో సవర భాషలో పాఠాలు బోధిస్తున్నారు. ఈ విధంగా గత ఏడాది నుంచి దాదాపు 5వేల మంది విద్యార్ధులు సవర భాషను నేర్చుకునేందుకు ఆసక్తి కనబరిచారు. గిరిజనులను మూఢ విశ్వాసాల నుంచి విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం ‘అక్షర బ్రహ్మ’ కార్యక్రమానికి నడుం బిగించింది. దాదాపు పదేళ్ల క్రితం అప్పటి ఒడిశా ముఖ్యమంత్రి గిరిధర్ గొమాంగో సవర భాషను ప్రోత్సహించేందుకు పాఠశాలలను తెరచినప్పటికీ సవర భాషలో పాఠాలను బోధించే ఉపాధ్యాయులు కొరవడటంతో దానిని మరుగునపెట్టారు. తిరిగి ఐటిడిఏ పీవో లక్ష్మిషా వచ్చిన తరువాత సవర భాష, సంస్కృతిపై దృష్టిసారించడంతో ఈ భాషకు ఊపిరిపోశారు. గిరిజనులకు ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు సవర భాషలో బోధన చేయగా, ఈ విద్యా సంవత్సరం నుంచి ఐదో తరగతి వరకు సవర భాషలో బోధన చేసేందుకు చర్యలు తీసుకున్నారు.
ముందు తరాలకు సవర భాష
గిరిజనులకు సవర భాషతోపాటు తెలుగు, ఇంగ్లీషు భాషలలో బోధన చేస్తున్నారు. ఇందుకోసం ‘ముందు తరాలకు సవర భాష’ అనే పుస్తకాన్ని రూపొందించారు. ఈ పుస్తకంలో సవర సంస్కృతి, ఆచార వ్యవహారాలు, గిరిజనుల కట్టుబాట్లు, వైద్యం, లిపి, సవరల పంచాంగం వంటి అంశాలను పొందుపరిచారు. మనకు 27 నక్షత్రాలు ఉన్నట్టే సవరలకు 36 నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాల పొందికను అనుసరించి వారు వ్యవసాయం మొదలు పెడతారు.
అక్షర బ్రహ్మ ఆలయం.. విజయనగరం జిల్లాలోని గుమ్మలక్ష్మిపురం మండలం కన్నయగూడలో అక్షర బ్రహ్మ ఆలయాన్ని గిరిజనులు నిర్మించారు. ఈ ఆలయాన్ని పాఠశాలగా మార్చుకున్నారు. ఇక్కడ గిరిజనులు నేర్చుకునే సవర భాష లిపిని గోడలపై పొందుపరిచారు. ఈ గ్రామంలో గిరిజనులు తాము పండించే పంటలో కొంత భాగాన్ని సవర భాష నేర్పించే అధ్యాపకులకు పరిహారంగా ఇస్తున్నారు. ఈ అక్షర బ్రహ్మ ఆలయాన్ని అక్కడ గిరిజనులే శ్రమదానం చేయగా, ఐటిడిఏ పీవో లక్ష్మిషా మరో రూ.2 లక్షలు వెచ్చించి అందంగా తీర్చిదిద్దారు.
సాధారణంగా గిరిజనులకు ఏదేని సమస్య ఎదురైనా, జ్వరం వచ్చిన ఆసుపత్రులకు వెళ్లకుండా అక్కడ ఉండే భూతవైద్యుని ఆశ్రయించడం పరిపాటి. ఆ భూతవైద్యుడు ఏది చెబితే అలా చేస్తూ మూఢ నమ్మకాలతో జీవనం గడుపుతున్నారు. ఆయా గ్రామాల్లో భూతాలు తిరుగుతున్నాయని భయపెట్టిన భూతవైద్యులు ఉన్నారు. అలా మెంటాడ మండలంలో ఓ గిరిజన గ్రామంలో భూతాలు తిరుగుతున్నాయని భయపెట్టగా అక్కడ గిరిజనులు ఏకంగా ఆ గ్రామం ఖాళీ చేసి మరో ప్రాంతానికి వెళ్లిపోయిన సంఘటనలు ఉన్నాయి. అలా అక్కడ భూత వైద్యుడు చెప్పిందే వేదం. ఏదేని జంతువును బలిఇస్తే నీ రోగం తగ్గిపోతుంది అని చెబితే ఆ రకంగానే జంతువులకు బలి ఇస్తుంటారు. ఊరికి అరిష్టం పట్టిందనో.. లేక అమ్మవారికి కోపం వచ్చిందనో ఇలా గిరిజనులను భయపెడుతూ భూతవైద్యులు కాలం గడుపుతున్నారు. గిరిజనులలో నిరక్షరాస్యత, పేదరికం, అనారోగ్యం వంటి కారణాలను వారు ఆసరాగా చేసుకొని భూతవైద్యులు తమ పొట్ట గడుపుకుంటున్నారు. వర్షాలు ఆలస్యంగా కురిసినా, వర్షం కురవకపోయినా, గ్రామాల్లో ఎవరికైనా ఒంట్లో బాగోలేకపోయినా వారు ముందుగా చేసే పూజ జంతుబలి. ఆ విధమైన మూఢ నమ్మకాలతో బతుకుతున్నారు. అటువంటి మూఢ విశ్వాసాల నుంచి దూరంచేసి వారిలో చైతన్యం కలిగించేందుకు ఈ అక్షర బ్రహ్మ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతోంది. అక్షర బ్రహ్మ ఆలయానికి వచ్చిన వారు పూలు, పత్రాలతో రావడం గమనార్హం.
సవర భాషను బతికించాలి.. ఐటీడీఏ పీవో లక్ష్మిషా
సవర ఆదిమ గిరిజన భాష. వీరు కొండ ప్రాంతాల్లోని మారుమూల గ్రామాల్లో ఉంటారు. వీరికి, ఇతర గిరిజనులకు వ్యత్యాసం ఉంది. వీరు ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి ఉంటారు. నిరక్షరాస్యులుగా కాలం గడుపుతున్నారు. వీరి ఆచార, వ్యవహారాలు ఇతరుల కంటే భిన్నంగా ఉంటాయి. వారి సంస్కృతిని పరిరక్షించాలంటే వారి భాషను పరిరక్షించాల్సి అవసరం ఎంతైనా ఉంది. వారి భాషను పరిరక్షించేందుకు ‘ముందు తరాలకు సవర భాష’ అనే పుస్తకాన్ని రూపొందించాము. దీనిని జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్ చేతుల మీదుగా ఆవిష్కరించాము. ఈ పుస్తకంలో వారి లిపి ఉంటుంది. ఆయా పాఠశాలల్లో విద్యా వాలంటీర్లను నియమించి సవర భాషను బోధిస్తున్నాము. ఆ విధంగా వారిలో చైతన్యం కలిగించేందుకు చర్యలు తీసుకుంటున్నాము.

- బొండా రామకృష్ణ 9440332244