AADIVAVRAM - Others

బహుముఖీన రంగుల భావాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్‌కు చెందిన అన్నారపు నరేందర్ గీసిన బొమ్మలు విలక్షణమైనవి, విశిష్టమైనవి. నైరూప్యంలో రూపం, రేఖల్లో జీవన వ్యథను క్యూబిజం ఛాయల్లో చిక్కగా చిత్రితమవుతాయి. ఒకే చిత్రంలో బహు చిత్రాలు (మల్టిపుల్ ఇమేజెస్) దర్శనమయ్యేలా బొమ్మలు గీయడం ఆయన ప్రత్యేకత. ఈ శైలిని అనుసరించే ఇతరులెవరూ మనకు కనిపించరంటే అతిశయోక్తి కాదు. తన వర్ణచిత్రాల్లో క్యూబిజంతోపాటు ‘జామెట్రికల్ ఫాం’ ఉంటుందని ఆయన గర్వంగా చెప్పుకుంటారు.
ఈ వినూత్న శైలినే తనదైన బాణీగా మలచుకొని జీవితంలోని సరదాలు, దుఃఖం, బాధ, వివిధ భావాలను ఆయన రంగుల్లో - రేఖల్లో వ్యక్తం చేస్తూ ‘వాస్తవికత’కు కొత్త నిర్వచనం చెబుతున్నారు.
సంగీతం.. చిత్రలేఖనం (పెయింటింగ్) మధ్య అవినాభావ సంబంధముందని అన్నారపు నరేందర్ విశ్వసిస్తున్నారు. అందుకే ఆయన అనేక సంగీత పరికరాలతో సంగీతం వాయిస్తున్న వ్యక్తుల బొమ్మలను తనదైన బహుముఖీన చిత్రశైలిలో సృజించారు. పాటల్లోని భావాలు రస రమ్యత వర్ణచిత్రాల్లో పలికించడం సాధ్యమేనని ఆయన తనదైన రీతిలో ప్రయోగం చేసి చూపారు. ఈ పార్శ్వం చిత్రలేఖనంలో ఓ కొత్త వొరవడి, విశిష్ట వైఖరి. చిత్రకళలో తాను ‘గోల్డెన్ రూల్’ పద్ధతిని అనుసరిస్తానని, ఆ రకంగా పికాసో క్యూబిజం ఛాయలు కొంతవరకు కనిపిస్తాయని ఆయన వినమ్రంగా వివరించారు.
నరేందర్ వాడే రంగుల్లో కొంత వెచ్చదనంతోపాటు ఆత్మీయ గుబాళింపు పరిమళిస్తుంది. ఆయన రేఖల్లో సంగీతంలోని రిథమ్ స్పష్టంగా ధ్వనిస్తుంది. ముఖ్యంగా సంగీత పరికరాలతో కూడిన బొమ్మల్లో ఈ విషయం ప్రత్యేకంగా ద్యోతకమవుతుంది. అలాగే బొమ్మల్లో సంకీర్ణమైన ‘కూర్పు’ స్పష్టంగా కనిపిస్తుంది.
జీవితంలోని వివిధ పార్శ్వాలను కోణాలను కాన్వాసుపై ప్రతిఫలింప జేయడంలో ఆయన కృతకృత్యులయ్యారు. బాధనే జీవితంలో ఎన్నింటినో బోధిస్తుందన్న కానె్సప్ట్‌ను నరేందర్ విశ్వసించి, ఆ విశ్వాసంతో తన బాధను ప్రపంచ బాధగా రంగుల్లో - రేఖల్లో నైరూప్య రూపంలో ఆయన చెబుతున్నారు.
అలాంటి చిత్రకారుడు నరేందర్ ఆదిలాబాద్‌లో 1965లో పుట్టి పెరిగారు. అక్కడే పాఠశాల విద్య కొనసాగింది. బాల్యంలో గణేశ్ చతుర్థి సందర్భంగా మట్టితో గణపతి ప్రతిమను చేయడం, పూజించడంతో కళాపిపాస ప్రారంభమైంది. తండ్రి రామ్ నారాయణ్ టీచర్ కావడంతో కొన్ని బొమ్మలు గీసేవాడు. వాటిని పరిశీలిస్తూ తానూ అనుకరించడం, అలాగే పాఠశాలలో డ్రాయింగ్ టీచర్ తన బొమ్మలను చూసి ప్రోత్సహించడం, తోటి మిత్రులు మురిపెంతో తన బొమ్మలను చూడటంతో తాను చిత్రకారుడిని కావాలన్న కోర్కె బలపడిందని నరేందర్ చెప్పారు. హైస్కూల్ చదువుతున్నప్పుడే తన మిత్రుని కోర్కె మేరకు వేంకటేశ్వర స్వామి దేవుని చిత్రపటం గీయడం.. దాన్ని అందరూ ప్రశంసించడం, అద్భుతంగా వచ్చిందని కీర్తించడంతో తన మార్గమేమిటో తన కళ్ల ముందు కనిపించింది.
దాంతో ఇంటర్మీడియెట్ విద్య తరువాత 1983లో హైదరాబాద్‌లోని జె.ఎన్.టి.యు. లోని బి.ఎఫ్.ఏ.లో చేరారు. అదొక విస్తృత ప్రపంచం, విశాల వేదిక. కొండపల్లి శేషగిరిరావు లాంటి హేమాహేమీలైన అధ్యాపక మృందం అనుభవం, ఆలోచనలు కొత్త లోకానికి తలుపులు తెరిచాయి. అక్కడ అనాటమీ, కలర్‌స్కీం, డ్రాయింగ్, పెయింటింగ్, పిక్టోరియల్ ఫాం, జామెట్రికల్ ఫాం, కంపోజిషన్, పర్‌స్పెక్టివ్ ఇట్లా అనేక అంశాల అధ్యయనం - అభ్యాసం ఐదు సంవత్సరాల పాటు కొనసాగింది. శిల్పకళ ప్రాథమిక పాఠాలు సైతం బోధించారు. ఆ శిక్షణ, పాఠాలు, అభ్యాసం, అవగాహన, సహచరుల

సాంగత్యం తన చిత్రకళకు గట్టి పునాదిని వేశాయి.
తనకు వశపడిన ఈ రంగుల మార్మిక విద్యను, రేఖల శిఖరాల సౌందర్యాన్ని వీలైనంత ఎక్కువ మంది దరి చేర్చాలన్న ఉద్దేశంతో నరేందర్ ‘డ్రాయింగ్ ట్యూటర్’గా అనేక కుటుంబాల వద్దకు చేరాడు. ఆసక్తి గల అనేక మంది పిల్లలకు పెద్దలకు చిత్రకళ చైతన్యాన్ని బట్వాడా చేశారు. మాజీ ముఖ్యమంత్రి, నటుడు ఎన్టీ రామారావు కుటుంబంలోని పిల్లలకు సైతం ఆయన డ్రాయింగ్ ట్యూటర్‌గా పాఠాలు చెప్పారు. ఐ.ఎ.ఎస్. ఐ.పి.ఎస్ ల కుటుంబాలలో చిత్రకళపై ఆసక్తిగల పిల్లలకు, పెద్దలకు రంగుల భాషను నేర్పించారు. అలా పిల్లలకు పాఠాలు చెబుతూనే ఇంట్లో తన కాన్వాసులపై చిత్రాలు గీయడం ఆపలేదు. సమాంతరంగా రెండూ కొనసాగాయి.
ప్రత్యేక తెలంగాణ మలిదశ ఉద్యమం జోరు మీదున్న సందర్భంగా ఆర్ట్స్ కాలేజీ వద్ద జరిగిన రణరంగాన్ని ఆయన చిత్రిక పట్టారు. ఈ చిత్రానికే జాతీయ అవార్డు లభించింది. అలాగే తన బాల్యస్మృతుల నుంచి బతుకమ్మను బయటకు తీసి చిత్రించారు. ఇట్లా తెలంగాణ పోరాటం - సాంస్కృతికత చైతన్య రూపం రంగుల్లో చూపారు. ఆనాడు ప్రముఖుల ప్రశంసలందుకున్నారు.
అనంతరం తన నైపుణ్యాన్ని, కౌశలాన్ని, శైలిని మరింత మెరుగుపరచు కోవాల్సిన అవసరముందని గ్రహించి నరేందర్ మైసూర్‌లోని అల్లమ ప్రభు లలితకళా అకాడెమీ నుంచి ఎంఎఫ్‌ఏ చేశారు. 2012 - 2014 సంవత్సరం వరకు కొనసాగిన ఈ కోర్సులో ఆధునిక చిత్రకళ, చిత్రకళ చరిత్రతో పాటు శైలిని అభివృద్ధి చేసుకునేందుకు అవసరమైన మెలకువలను బోధించారని ఆయన చెప్పారు. ప్రస్తుతం తాను వేస్తున్న బొమ్మల శైలి ఆ కోర్సు పర్యవసానమేనని ఆయన అభిప్రాయం.
ఈ బహుముఖ (మల్టిపుల్ ఇమేజెస్) శైలిలో తెలంగాణ ప్రాంతంలో జరిగే బోనాల ఉత్సవం సందర్భంగా శివసత్తుల, పోతరాజుల నృత్యాన్ని చిత్రిక పట్టారు. ఒకే రూపంలో అనేక రూపాలు కనిపించే ఈ శైలిలో ఎంపిక చేసుకున్న ‘వస్తువు’ను బహు భావనల్లో బలంగా వ్యక్తం చేసేందుకు ఉపకరించింది. శక్తిమంతంగా చూపేందుకు వీలు కలిగింది. శివసత్తులే కాదు భక్తురాళ్ల పారవశ్యాన్ని ఎంతో పదిలంగా ఆయన తన చిత్రాల్లో పొందుపరిచారు. ఇదే శైలిలో స్వాతంత్య్ర సమరయోధుల చిత్తరువులను గీసి వీక్షకుల్లో స్ఫూర్తిని నింపారు. ముఖ్యంగా భగత్‌సింగ్ సుభాష్ చంద్రబోస్ లాంటి వీరుల అమరత్వాన్ని అద్భుత బహుముఖీన పద్ధతిలో పొందుపరిచారు.
ఆక్రలిక్ రంగుల్లో మహిళలు అధికంగా కనిపించే అంగళ్ల (సంత) దృశ్యాలను ఆయన చిత్రీకరించారు. ఈ దృశ్యాలు తన తొలి రోజుల్లో గీసినా ఎంతో పరిపక్వత కనిపిస్తోంది. చేయి తిరిగిన చిత్రకారుడి చిత్ర రచనా శైలి అందులో కనిపిస్తోంది. మురికివాడలు, అక్కడి పిల్లలు, గుడిసెలు వాస్తవిక దృష్టితో కాన్వాసుపైకి ఎక్కించారు.
2011 సంవత్సరంలో ‘కళాసాగర్’ శీర్షికన తన 54 బొమ్మలతో నరేందర్ నగరంలోని సాలార్‌జంగ్ మ్యూజియంలో సోలో చిత్ర ప్రదర్శన నిర్వహించారు. ప్రముఖ న్యాయమూర్తులు, నగర ప్రముఖులు ప్రదర్శన ప్రారంభోత్సవంలో పాల్గొని చిత్రకారుడి ప్రతిభను కొనియాడారు. స్ర్తి యుక్త వయసు నుంచి వృద్ధాప్యం వరకు ఎదుర్కొనే వివిధ దశలను ఒకే ఫ్రేమ్‌లో చూపిన వర్ణచిత్రం ఆ రోజుల్లో చిత్రకారునికి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ మరుసటి సంవత్సరం కర్నాటక చిత్రకళా పరిషత్‌లో మరో ప్రదర్శన (బెంగుళూరులో) నిర్వహించారు. 1987 నుంచి వివిధ నగరాల్లో గ్రూపు షోలలో ఆయన పాల్గొంటున్నారు. 2017 సంవత్సరం జైపూర్‌లో జరిగిన ఇండియన్ ఆర్ట్ ఫెస్టివల్‌లో ఆయన చిత్రానికి మంచి గుర్తింపు లభించింది.
హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ, శిల్పారామం, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ (చిత్రమయి) ఏర్పాటు చేసిన ఆర్ట్ క్యాంపుల్లోనూ పాల్గొని ఆయన ప్రశంసలందుకున్నారు.
హైదరాబాద్‌లో నివసిస్తున్న అన్నారపు నరేందర్ రంగుల హేళకు పిదా అయిన వారిలో ఎందరో ప్రముఖులున్నారు. వారిలో సినీనటి జయసుధ ఒకరు. ఆమె తన ఆర్ట్ కలెక్షన్‌లో ఈ చిత్రకారుడి చిత్రాన్ని చేర్చారు.

అన్నారపు నరేందర్ 90300 72287

-వుప్పల నరసింహం 9985781799