Others

కష్టం విలువ తెలియకపోతే దుఃఖమే మిగిలేది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓసారి ఓ ఫనె్నండేళ్ళ పిల్లాడ్ని వాళ్లమ్మ తీసుకొచ్చింది. స్కూల్‌లో తన స్నేహితులతో జరిగిన కొట్లాటలో అతని ముందు పన్ను సగం విరిగింది. ‘‘ఎంత ఖర్చయినా పర్వాలేదు, మంచి చికిత్స చెయ్యండని’’ కోరింది. ఆ పిల్లవాడికి రూట్ కెనాల్ చేసి చాలా ఖరీదైన కృత్రిమ పన్నుని తొడిగాం. వారం కాకుండానే మళ్లీ ఆ పిల్లవాడ్ని పట్టుకొని ఆ తల్లి వచ్చింది. మళ్లీ స్కూల్‌లో జరిగిన కొట్లాటలో పెట్టిన పన్ను, ఇంక తన అసలు సగంపన్ను పూర్తిగా విరిగిపోయాయని చెప్పి బాధపడింది. ‘‘ఏంటమ్మా నేను చేసిన వైద్యం వృధా అయిపోయింది. అంత కష్టపడి మేం చేసినపుడు నువ్వు కాస్త బాధ్యతగా వుండాలి కదా’’ అని బాధపడుతూ నేనన్నదానికి ఆ పిల్లవాడు ‘‘ఏం ఫర్వాలేదు, మళ్లీ పెట్టండి, ఎంత డబ్బైనా మా అమ్మా నాన్న ఇచ్చేస్తారు’’ అని చాలా పొగరుగా సమాధానం ఇచ్చాడు. తిరిగి అక్కడ పన్ను పెట్టాలంటే ముందు అయిన ఖర్చుకంటే మూడింతలు ఎక్కువ అవుతుందని చెప్పా. దానికి వాళ్ళమ్మ కంగారుపడి ‘‘అంత మేం పెట్టుకోలేం డాక్టర్’’ అంది. నేనా పిల్లాడి వంక చూసా. వాళ్ళమ్మ అలా అనేసరికి ఆ పిల్లవాడు సిగ్గుతో తలదించుకున్నాడు. ఇక్కడ వచ్చిన సమస్యల్లా ఆ పిల్లవాడికి చేసిన చికిత్స విలువ తెలీకపోవడమే. ఆ ఖరీదైన కృత్రిమ పన్ను కొనడానికి కావాల్సిన డబ్బు సంపాదించడానికి ఆ తల్లిదండ్రులు పడే కష్టం ఈ పిల్లవాడికి తెలీదు. అలా తెలీనివ్వకుండా పెంచుతున్నారు.
మరోసారి ఓ బాధితుడికి ఆపరేషన్ చేసి జ్ఞానదంతం తీసాం. తీసిన తరువాత తను పాటించాల్సిన నియమాలు చెపుతూ పొగాకు కాల్చకూడదని చెప్పా. దానికి అతను ‘‘నేను చాలా ఖరీదైన విదేశీ సిగరెట్లు తాగుతా. దానివల్ల ఏం కాదు డాక్టర్’’ అని సమాధానం ఇచ్చాడు. రెండు రోజుల తరువాత పన్ను తీసిన చోట విపరీతమైన నొప్పితో వచ్చాడు. ‘‘నువ్వు కాల్చే సిగిరెట్టు విదేశీదని, చాలా ఖరీదైనదని నీ శరీరానికి తెలీదేమో, అందుకే పొరపాట్లో నీకు నొప్పి వచ్చేలా చేసింది’’ అని వెటకారంగా అన్నా. జరిగే చికిత్స మీద, పాటించాల్సిన నియమాలమీద గౌరవం లేకపోతే ఇలానే జరుగుతుంది.
కొంతమంది పేషెంట్లు ఆపరేషన్ తరువాత ఓ వారం విశ్రాంతి తీసుకోమంటే, చాలా ఖరీదైన మందులు ఇవ్వండి, రెండు రోజుల్లో ఉద్యోగానికి వెళ్లిపోయేలా చూడండి అని జవాబిస్తారు. అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మందులు ఇన్‌ఫెక్షన్ కలగకుండా, నొప్పి రాకుండా మాత్రమే చేస్తాయి. మానడం మన శరీరం మీద ఆధారపడి ఉంటుంది. దానికి కావాల్సిన సమయం దానికివ్వడం మంచిది. ఈ విషయాన్ని గౌరవిస్తే చాలా మంచిది.
కొంతమంది డబ్బుంది కదా అని వారిలో వారు లోపాలు వెతుక్కొని అవసరం ఉన్నా లేకపోయినా చికిత్స చేయించుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్లు తరచూ తగులుతుంటారు. నిజంగా కష్టపడి సంపాదించే వారికి అవసరమైతే తప్ప చికిత్స చేయించుకోవాలనే తపన తీరిక రెండూ ఉండవు. అలా కాదని చేయించుకునే వారు తరువాత పడే బాధల గురించి తెలుసుకోవాలంటే చరిత్ర పుస్తకాలు తిరగేయండి. మీకే తెలుస్తుంది.
మొబైల్ ఫోన్ మాట్లాడుతూ బండి నడిపిస్తాం, తాగి నడిపించినా మాకేం కాదు, ఖరీదైన కార్లు ఉంటే ఎంత వేగంగా వెళ్లినా ఏం కాదనుకునేవారు రోజు పత్రికలు చదవండి, మీకే తెలుస్తుంది. వాటివల్ల ఎంతమంది వారి ప్రాణాలనీ, జీవితాలని కోల్పోయేరో. ప్రభుత్వం పెట్టిన నిబంధనలను గౌరవించనివారికి ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి. మనకి జరగనంతవరకు మనకేం కాదనే అనిపిస్తుంది. జరిగాక బాధపడటం మాత్రమే మిగులుతుంది.
వేరు వేరు కోణాల్లో నేను చెప్పే విషయం ఒక్కటే. ‘‘ఒకదాని విలువ తెలియనివారు దానిని ఎన్నడు గౌరవించలేరు’’- అది ఏదైనా కావచ్చు, మనిషైనా లేక పరిస్థితులైనా. విలువ తెలీకపోవడం ఓ సమస్య, గౌరవించకపోవడం దానివల్ల వచ్చే ఓ జబ్బు. చికిత్స విలువ తెలీనివాడు, ఆ చికిత్సని, వైద్యుడిని తను చెప్పే నియమాలనీ ఎన్నడూ గౌరవించడు. గౌరవం లేని వైద్యం వైద్యుడికో భారం.
రైలు ప్రయాణంలో, బస్సు ప్రయాణంలో, ఏదైనా పార్టీలో ఎవరైనా ఓ డాక్టర్ పరిచయం అయితే ‘‘మాకు ఈ బాధ ఉంది. ఏం చెయ్యమంటారు. ఫలానా డాక్టర్ ఈ చికిత్స సూచించేడు, మంచిదే అంటారా’’ అని వారి కాలక్షేపానికి అడిగేవారు చాలామంది. నిజానికి వాళ్లు ఆ డాక్టర్ చెప్పేది పట్టించుకోరు, పాటించరు. ఏదో అడగాలని అడుగుతారు. చెప్పేది పాటించనపుడు అడగడం సబబు కాదు. అది ఆ వైద్యుడిని అగౌరవపరచినట్లే అవుతుంది. ఇటువంటి కాలక్షేపం మంచిది కాదు.
చాలామంది తల్లిదండ్రులు తరచూ అంటుంటారు. ‘‘మేం పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదని’’. నేను దానితో ఏకీభవించను. కష్టం తెలీకపోతే దాని విలువ తెలీదు. విలువ తెలీకపోతే దాన్ని ఎన్నటికీ గౌరవించలేం. ‘‘పిల్లల్ని కష్టపడేలా పెంచండి, దుఃఖపడేలా కాదు’’. ఇది యధార్థం, ఇదే పరమార్థం.
***
పాఠకులకు సూచన
‘‘మీ సమస్యలకు, సందేహాలకు సమాధానాలు’’ పొందాలనుకుంటే ప్రశ్నలు ఈ చిరునామాకు క్లుప్తంగా పంపండి. వాటిని భూమికలో ప్రచురించడం జరుగుతుంది.
మీ ప్రశ్నలను ‘‘మీ సందేహాలు- నా సమాధానాలు’’
అనే శీర్షికకు పంపాలి.
చిరునామా : డా శ్రీరంగం రమేష్, ఫేస్ క్లీనిక్,
1-3-15, కలాసిగూడ,
సికింద్రాబాద్-500003

-డాక్టర్ రమేష్ శ్రీరంగం సెల్ నెం: 92995 59615 faceclinics@gmail.com