Others

‘పసుపు బోర్డు’ కల సాకారం ఎప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పసుపు, ఎర్రజొన్నల పంటలకు మద్దతు ధర ఇవ్వాలంటూ నిజామాబాద్ రైతులు చేస్తున్న ఆందోళన సర్వత్రా చర్చనీయాంశమైంది. నిజామాబాద్ జిల్లాలో దేశంలోనే అత్యధికంగా పసుపు పండిస్తున్నారు. తమిళనాడు, ఒడిశా, కేరళ, మహారాష్టల్ల్రోనూ దీన్ని కొంత పండిస్తున్నారు. దేశీయ అవసరాలకు, ఎగుమతులకు 55 లక్షల బస్తాల పసుపు సరిపోతుందని అంచనా. కానీ ఇపుడు 70 లక్షల బస్తాల వరకు ఉత్పత్తి అవుతోంది. పసుపుపంటను అవసరానికి మించి వేస్తున్నారు. ఎర్రజొన్నలను చిరుధాన్యాలుగా వివిధ రూపాలలో ఆహారంగా వినియోగించుకోవడం తెలిసిందే. ప్రొటీన్లు, శక్తినిచ్చే సూక్ష్మపోషకాలను ఇవ్వడంలో ఎర్రజొన్నలు కీలక పాత్ర వహిస్తున్నాయి. ఎర్రజొన్న పంటను కూడా నిజామాబాద్ ప్రాంతంలో అత్యధికంగా సాగుచేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పసుపు, ఎర్రజొన్న రైతులు ఆందోళనలకు దిగుతూ తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచినా ఫలితం దక్కడం లేదు. ఈ పంటలను కనీస మద్దతుధర పరిధిలోకి తీసుకురాకపోవడం, దళారుల చేతుల్లో రైతులు మోసపోయి గిట్టుబాటు ధరకు నోచుకోక పోవడం, కొన్నిసార్లు అధిక వర్షపాతం కారణంగా పంట నష్టపోవడం, ఎలాంటి నష్టపరిహారం లేకపోవడం వంటి అనేక సమస్యలు ఎదురుకావడంతో రైతులు తరచూ ఆందోళన బాట పడుతున్నారు. పసుపువాణిజ్య పంట కావడంతో అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని మద్దతు ధర కల్పించాలంటే పసుపుబోర్డును ఏర్పాటు చేయాలని నేతలు తప్పించుకొంటున్నారు. ప్రజాప్రతినిధులు రైతు సమస్యలపై చట్టసభల్లో తగిన రీతిలో ప్రశ్నించకపోవడంతో రాజకీయాలు రాజుకొంటున్నాయి. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ప్రాంతంలోని 176 మంది రైతులు ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో మూకుమ్మడిగా నామినేషన్లు దాఖలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్‌లో వెంటనే పసుపుబోర్డు ఏర్పాటు చేయాలని రైతులు చిరకాలంగా కోరుతున్నారు. పారిశ్రామికవేత్తలకు తగిన ప్రోత్సాహకాలు ఇచ్చి పసుపుపంటను కొనుగోలు చేసేలా ప్రభుత్వం కృషిచేయాలి. పసుపును ఎగుమతి చేయడానికి ప్రత్యేక బ్రాండ్‌ను సృష్టించాలి. మద్దతు ధరకు పంటను వ్యాపారులు కొనుగోలు చేసేలా పాలకులు కృషిచేయాలి. పసుపును శుద్ధిచేసే పరిశ్రమలకు రాయితీలు ఇచ్చి విదేశాలకు ఎగుమతి అయ్యేలా చూడాలి. పసుపుసాగు పర్యవేక్షణకు ప్రత్యేక విభాగం ఏర్పాటుచేయాలి. ఒకవేళ ధర పడిపోతే ఈ విభాగం ద్వారా కొనుగోలు చేయాలి. దీని కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలి. రైతులకు నాణ్యమైన విత్తనాలను రాయితీ ధరలకు సరఫరా చేయాలి. ఇందుకోసం బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించాలి. పసుపుకొమ్ములు ఉడకపెట్టాక ఆరబెట్టడానికి సిమెంటు కల్లాలు ఏర్పాటు చేయాలి. పంటను నిల్వచేయడానికి గోదాములను నిర్మించాలి. సమీకృత మార్కెట్ వ్యవస్థ అయిన ఈ నామ్‌లోకి పసుపు, ఎర్రజొన్నలను చేర్చి ఆన్‌లైన్ అమ్మకాలు జరిగేలా చూడాలి. గిట్టుబాటు ధర లేదన్న సాకుతో వ్యాపారులు తక్కువ ధరకు పంటను కొనుగోలు చేయడాన్ని నివారించాలి. దళారులు, వ్యాపారులు చేస్తున్న మోసాలకు రైతులు బలైపోతున్నారు. పసుపుధర క్వింటాలుకు రూ. 15వేలుగా, ఎర్రజొన్నలు క్వింటాలుకు రూ. 4వేలు ఉండేలా మద్దతు ధరలను ప్రకటించాలి. తాజాగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పసుపుబోర్డుపై ఎలాంటి ప్రస్తావన లేకపోవడం రైతులను మరింతగా కుంగదీసింది. రాజకీయాలకతీతంగా పసుపు, ఎర్రజొన్న రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించి, సమస్యలను శాస్ర్తియంగా అధ్యయనం చేసి గిట్టుబాటు ధరలను అందించాలి. పసుపు, ఎర్రజొన్న పండే ప్రాంతాలను ‘పంట కాలనీలు’గా (క్రాప్ కాలనీ) గుర్తించవలసిన అవసరం ఉంది. వ్యవసాయ రంగాన్ని ప్రక్షాళన చేసి రైతుకు ఆర్థిక భద్రతతోపాటు సామాజిక భద్రతను కల్పించాలి. వ్యవసాయ రంగంలో కొత్తమార్పులను స్వాగతించాలి.

-సంపతి రమేష్ మహారాజ్ 99595 56367