Others

చాతుర్మాస వ్రతారంభం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘‘మహా ఏకాదశి’’యని, ‘‘ప్రథమైకాదాశి’’యని వ్రతోత్సవ చంద్రిక పేర్కొంటున్నది. చాతుర్మస్య దీక్షా దినాల ఏకాదశులలో మొదటిది కావడం చేత ‘‘తొలి ఏకాదశి’’గా నామాంతరం గలదియైనది. ప్రథమైకాదశి అను సంస్కృత నామాన్ని బట్టి, తెలుగువారు తొలి ఏకాదశిగా వ్యవహరిస్తున్నారు. ఉత్తరాయణం కంటె దక్షిణాయనంలో పండువలు, పబ్బాలు అధికం. దక్షిణాయనంలో ఆరోగ్య పరిరక్షణా నియమాలు ఎక్కువగా పాటించాల్సిన అవసరం ఉన్నందు వల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు అధికంగా పాటించాలని నిర్దేశించారు. అందుకే తొలి ఏకాదశి దినం, తర్వాత వచ్చే పండుగలకు, పబ్బాలకు బోణీ లాంటిది.
తొలి ఏకాదశి గురించి బ్రహ్మవైవర్త పురాణంలో వివరింప బడింది. ప్రాయకంగా నిష్ఠాపరులకు, సనాతన సాంప్రదాయాచరణాసుక్తులకు ఉపవాసదినం. ఈ నాటి నుండి నాలుగు మాసాల పాటు అనుదినం పురాణ పఠనం చేస్తారు. ముఖ్యంగా విష్ణువుకు అన్ని ఏకాదశులలోకి అత్యంత ప్రీతి పాత్రమైనదిగా భావించ బడుతున్నది. ఈదినంతో ప్రారంభించి, మహా విష్ణువు నాలుగు నెలలపాటు క్షీరసముద్రంలో శేషశాయియై శయనించి, కార్తీక శుద్ధ ఏకాదశినాడు మేలుకొంటారని పురాణాలు చెపుతున్నాయి. అందులకే దీనికి ‘‘దేవశయని ఏకాదశి’’యని, ‘‘శయనైకాదశి’’యని, గదాధర పద్ధతి ప్రకారం ‘‘హరిశయన ఏకాదశి’’యని పేర్లుకూడా ఉన్నాయి. ఈ రోజు మొదలు విష్ణుమూర్తి నాలుగు మాసాల పాటు పాతాళ లోకంలో బలి చక్రవర్తి ద్వారం వద్ద ఉండి, కార్తీక శుద్ధ ఏకాదశి నాడు తిరిగి వస్తారని మరో పౌరాణిక కథనం.
ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, చాతుర్మాస్య వ్రతకల్పం ప్రారంభించాలని శ్రీకృష్ణుడు, యుధిష్ఠిరునికి శయనైకాదశి ప్రత్యేకతను వివరించినట్లు బ్రహ్మవైవర్తన పురాణాధారం. మాంధాత మహారాజు తన రాజ్యంలో నెలకొన్న తీవ్ర కరువుబారి నుండి కాపాడుకునేందుకు ఆంగీరస మహాముని సూచనపై దేవ శయనైకాదశి వ్రతాన్ని ఆచరించి, తక్షణ ఫలితం పొందినట్లు పురాణం స్పష్టం చేస్తున్నది. వైష్ణవాలయాలలో ఈ దినంనాడు విష్ణుశయన వ్రతాచరణ గావిస్తారు. విగ్రహాలను ఆభరణాలతో అలంకరించి, పూజించడం ఆచారం. బ్రహ్మ వైవర్త పురాణాధారంగా, చాతుర్మాస దీక్షను ఆషాఢ శుద్ధ ఏకాదశితో ప్రారంభించి, శయనింప చేసిన విష్ణుమూర్తికి పూజలు, చాతుర్మాస్య వ్రతం మొదలుకొని ఏకాదశి, ద్వాదశి, అమావాస్య, అష్టమి, కర్కాటక సంక్రాంతి మున్నగు పర్వదినాలలో ఉపవాస దీక్షలో ఉంటూ, అనుదినం పురాణ పఠనం గావిస్తూ, కార్తీక శుక్ల ఏకాదశికి వ్రతం పూర్తి చేస్తారు. పిప్పల వృక్ష ప్రదక్షిణలు, దేవాలయాలలో దీపారాధనలు ఈచాతుర్మాస్యాలలో ప్రధానాలు.
చాతుర్మాస్య దీక్షాపరులు సరస్వతి దేవిని కూడా పూజించడం కొన్ని చోట్ల ఆచారంగా ఉంది. వైష్ణవాలయాలలో తొలి ఏకాదశి నాటి రాత్రి విష్ణు శయన వ్రతాలు చేయడం సంప్రదాయం. విష్ణు విగ్రహాన్ని ఆభరణాదులతో అలంకరించి, జాజి పువ్వుల చేత అర్చించి, పవళింపు సేవ చేస్తారు. కీర్తనలు పాడుతారు. సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులు ఉపవాస దీక్షలో ఉండక పోయినా, చాతుర్మాసాలలో వచ్చే నాలుగు ఏకాదశులైనా ఉపవాసం చేయడం పుణ్యప్రదం.

- సంగనభట్ల రామకిష్టయ్య