AADIVAVRAM - Others

ఆడర్.. ఆడర్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎగిసిపడే కెరటానికి ఆకాశపుటంచులు తాకాలని ఆరాటం - ఎస్వీ హృదయానికి ఆనందపు టంచులు చూడాలని ఉబలాటం -
వయసుకి ఊహలొచ్చి.. రెక్కలిచ్చి పరువంలో పరవశిస్తున్నాయ్-
ఏదో కావాలి.. ఏదో పొందాలి.. ఇదే ‘ఎద’ గొడవ-
అందం అరవిందమై విరిసింది పూల పాన్పుపై.. మకరంద మరందం మాధుర్యమై రసప్లావితమైంది అధరామృతం-
పారే ఏటి సాక్షిగా.. రివ్వున గగనానికి ఎగిసే గువ్వల గుంపుగా.. కోరిక ఎస్వీలో బుసలుకొడ్తోంది సౌందర్యని సమీపించడానికి-
ముందుకు ఉరకబోయిన ఎస్వీ ఎందుకో వెనుతిరిగాడు!! ప్రకృతి స్తంభించింది!! అది చూసిన సౌందర్యలా-
తను అచ్చు ఆర్.ఎస్.బ్రదర్స్ యాడ్‌లో రకుల్ ప్రీత్‌సింగ్‌లా చీర కట్టు, బొట్టుతో ముస్తామై ఎదురుచూస్తోంది తన రాకకై. వెనె్నల వెలుగుల్లో సౌందర్య పాలరాతి బొమ్మలా పాలగ్లాసుతో, పూవులు రాల్చే నవ్వుల్తో.. ఆకాశంలో విరిసి మెరిసి మురిసే తారలకే గట్టి పోటీ ఇస్తోంది.
పెళ్లైంది - ప్రేమ విందుకు వేళయ్యింది. బోట్‌హౌస్‌లో హనీమూన్. పున్నమి వెనె్నట్లో.. సమీర సరాగాల్లో సాఫీగా సాగుతున్న నదీ తరంగాల వైపు అదే పనిగా చూస్తూండిపోయాడు ఎస్వీ - గతం కళ్లకు కట్టినట్లైంది..
నెలరోజుల సెలవుపై ఎస్వీ యు.ఎస్. నుంచి ఇండియా వచ్చాడు. నాన్నగారు ఉన్నపళంగా బయల్దేరి రమ్మని ఆర్డర్ వేస్తే, నాన్నగారు తనకి పెట్టిన పేరు షణ్ముఖ శర్మ. తను పెట్టుకున్న షార్ట్ఫాం ‘ఎస్వీ’ వాడుకలోకి వచ్చేసింది. నాన్నగారు అర్జంటుగా ఎందుకు రమ్మన్నారో తెలియదు, అడిగే సాహసం తను చేయలేదు సరికదా అడిగినా చెప్పరు-
ఏం కారణం తెలియపరిస్తే గాని దొరగారు ఫ్లైటెక్కారా అంటూ కోప్పడ్తారు. నాన్నగారి వైఖరి మొదట్నుంచి అంతే. అందుకేనేమో జస్టిస్‌గా మంచి గుర్తింపు, గౌరవం వగైరాలెక్కువయ్యాయేమో.. ఇంట్లో వాళ్లతో కూడా అదే వైఖరి కంటిన్యూ అయింది. అమ్మ, నానమ్మ కూడా సాహసించరు నాన్నని అడ్డుకోవడానికి.
అన్నయ్య ఒకటీ రెండుసార్లు ప్రయత్నించి విఫలుడైనాడు. పైపెచ్చు ‘నన్ను ప్రశ్నించేంత పెద్దాడివయ్యావా పెద్దాడా..’ అంటూ గాండ్రించాడు పులిలా గుడ్లురిమి. అయితే వాద ప్రతివాదాలకి తావివ్వని ఏ నిర్ణయం చేసినా అందులో నిబద్ధత, ప్రయోజనం తప్పనిసరిగా ఉండి ఉంటుంది. అందుకే నాన్నగారి ఈ వైఖరి కంటిన్యూ అవుతూనే ఉంది. అన్నయ్యకి నాకు నడుమ అక్కడ ఉంది, దానికి పెళ్లై అత్తారింటికి వెళ్లాక కూడా అది ఇప్పటికీ అంతే గౌరవ మర్యాదలు చూపిస్తుంది నాన్నగారి పట్ల - ఎంతైనా నాన్నలకు ఆడపిల్లలంటే మక్కువ ఎక్కువ అంటారు కదా, అలాగే ఆడపిల్లలకు పుట్టింటిపై మమకారం ఎక్కువే కదా!
ఇంటి ముందు కారు ఆగగానే ఎస్వీ ఆలోచనలకు బ్రేక్ పడింది. ఇంట్లోకి వెళ్తూనే ఎస్వీ నాన్నగారికి వంగి నమస్కరించి కళ్లల్లోకి తొంగి చూశాడు, పిలిపించిన కారణాన్ని తను చదివేద్దామని. చదివింది చాలు కానీ తొందరగా తెములు మామయ్య వాళ్లింటికి వెళ్లాలి గుక్క తిప్పుకోకుండా ఆర్డర్ వేశారు. అమ్మ తెచ్చిచ్చిన నీళ్లతో గుటక వేశాడు, అప్పటిగ్గాని గుటక పడింది కాదు ఎస్వీకి. తనని చూస్తూనే నానమ్మ కొంగుతో కళ్లు వత్తుకుంది. నానమ్మ కళ్లు చెమరించటానికి కారణం తనని చూస్తున్నందుకు కాదు.. తన పెళ్లి కళ్ల చూడబోతున్నందుకని.. నాన్నగారు తనని పిలిపించిన కారణం అమ్మ చెప్పింది తనకి మామయ్య కూతురు సౌందర్యతో ఫార్మల్‌గా పెళ్లిచూపులని. తదుపరి పెళ్లి మాటలని. అందుకే నానమ్మ కళ్లు వత్తుకుంది కొంగుతో.. ముదిమి ముంచుకొస్తోంది వీడి పెళ్లి ఆఖరుగా చూసేసి ప్రయాణానికి సిద్ధమవుదామని.. తప్పవీ భవబంధాలు - శారీరక బంధనాలు.
ఎస్వీకి ఓ పక్క పెళ్ళవుతున్నందుకు దిగులు, మరొక పక్క గుబులు.. దిగులు స్వేచ్ఛ పోతున్నందుకు, గుబులు సౌందర్యని ఎప్పుడెప్పుడు చూద్దామా అని. ఎప్పుడో యు.ఎస్. వెళ్లే ముందు చూసిన గుర్తు సౌందర్యని పరికిణీ పావడాల్లో. ఇప్పుడు చూడాలి మరి చీరలో సింగారాన్ని. అమ్మ చెప్తోంది సౌందర్య అమెరికా రెమ్మ అని - అక్క చెప్తోంది ఆ బాపూ బొమ్మ అని. ఇవన్నీ బాత్‌రూంలోఎస్వీ స్వగతం.. మధ్యమధ్య బాత్‌రూం సింగింగ్.. తెలుగు హిందీ ప్రేమగీతాలు.
త్వరగా రారా బాబూ.. నిన్ను వెంటపెట్టుకు రమ్మని నాన్నగారు నాకు ఆర్డర్ వేశారు.. అసలే అగ్గిదొర.. అన్నయ్య హెచ్చరిక. పదే పది నిమిషాల్లో రెడీ అయి నాన్నగారి ముందు హాజరయిపోయాడు ఎస్వీ. నాన్నగారు ఎస్వీని ఆపాదమస్తకం చూసి, ‘ఏంట్రా ఈ అవతారం.. వెళ్లేది అసలే పల్లెటూరు.. గొడ్డూ గోదా జడుసుకు మీద పడ్తయ్.. ఆ జీన్స్ పాంట్‌కి మోకాళ్ల మీద అంత పెద్ద కంత ఏంటి, ఆ టీ షర్ట్ మీద అమెరికన్ మ్యాపేంటి.. ఏంట్రా ఈ అవతారం. వెళ్లు.. నీ కోసం తెప్పించిన డ్రెస్ అమ్మనడిగి తీసుకుని త్వరగా తెములు.. ఎంచక్కా సందర్భోచితంగా ఉంటుంది ఆ డ్రెస్సు - ఆర్డర్ వేశారు డాడీ. అంతే.. ఎస్వీ మారుమాటాడకుండా లోనికి వెళ్లి, అంతే వేగంతో పెళ్లికొడుకులా ముస్తాబై కారెక్కి కూర్చున్నాడు అక్క, అన్న పక్కన వెనుక సీట్లో అమ్మ, నానమ్మ, వదిన మధ్య సీట్లో.. ముందు సీట్లో జస్టిస్ టైగర్. టైగర్ కళ్లతోనే రైట్ చెప్పిందో ఏమో మెర్సిడెజ్ బెంజ్ బయల్దేరింది.
కారుకి ఎదురుగా పండు ముతె్తైదువ, శుభశకునం - సూచనగా నాన్నగారు అమ్మకు చూపించి సైగ చేశారు. నాకు కుడికన్ను అదిరింది.. శుభం కళ్లకి కనపడింది.
మామయ్య, అత్తయ్య వాకిట్లోనే మమ్మల్నందర్నీ ఘనంగా ఆహ్వానించి కాళ్లు కడుక్కునే ఏర్పాట్లు చేశారు. ఆ తరువాత మాటా మంతీ - కాఫీ, టీ, టిఫిన్లు ఫార్మల్‌గా ముగిశాయి. నా కళ్లు తన కోసం కలియ వెతుకుతుంటే గమనించిన నాన్నగారు మామయ్యతో ‘పిల్లదాన్ని పిలిపించరా.. ఓ పనై పోతుంది’ అన్నదే తడవుగా అత్తయ్య సౌందర్యని వెంటబెట్టుకు వచ్చి అందరికీ నమస్కారం చేయించి కూర్చోబెట్టింది సంప్రదాయబద్ధంగా. సౌందర్య బిడియంతో ఒదిగి కూర్చుంది.
నాన్నగారు ‘సౌందర్యా.. అమెరికా నుంచి పిలిపించా నీ బావని.. సరిగ్గా చూస్కో.. ఇక్కడ అందరూ నీవారే..’ అన్నారు. సౌందర్య వంచిన తల పైకెత్తి ముసి నవ్వు విసిరి మళ్లీ తల వాల్చేసింది కిందికి. ‘ఎంతైనా పెళ్లిచూపులనగానే ఆడపిల్లకి బిడియంగా ఉంటుంది అన్నయ్యగారు’ అన్నది అత్తయ్య.
‘చూడబోతే మా వాడూ అదే అవస్థ పడ్తున్నాడనుకుంటా, ఓ పనే్జద్దాంరా.. కాసేపు వాళ్లిద్దర్నీ ఒంటరిగా వదిలేద్దాం’ అన్నదే తడవుగా మామయ్య నాన్నగారి ప్రతిపాదనను బలపరచారు - వెంటనే ఎస్వీ లేచి నిలబడ్డాడు.. సౌందర్య మేడ మీదికి దారితీసింది.
సంధ్యకాంతుల్లో సౌందర్య బంగరు బొమ్మలా మెరిసిపోతూ సంధ్య కాంతికే గట్టి పోటీ ఇస్తోంది. తను అచ్చు ఆర్.ఎస్. బ్రదర్స్ యాడ్‌లో రకుల్ ప్రీత్‌సింగ్‌లా కట్టూ బొట్టూతో ముస్తాబై నా ఎదుట నిలిచింది - పులికి ఎదురైన హరిణంలా బెదురుచూపులు చూస్తోంది.
‘జిమ్ కెళ్తున్నావా...’ ఎస్వీ గుచ్చిగుచ్చి సౌందర్య బాడీ ఫిట్‌నెస్ చూస్తూ పలకరించాడు. ‘లేదూ...’ నాన్చుతూ కాలిబొటనవ్రేలు నేలకి రాస్తూ అంది. ‘మాట్లాడు.. గొంతు విప్పు.. ఈ ఏకాంతం.. ఈ సాయంత్రం అందుకేగా..’ అంటున్నంతలోనే ఎస్వీ సౌందర్య దగ్గరగా జరిగి ఎస్వీ కళ్లల్లోకి చూసింది. నవ్వుతూ అంది ‘అవునా..’ అని. సౌందర్య గొంతు విప్పితే కోయిల గానంలా వినిపించి, ఎస్వీ సౌందర్యలోని సౌందర్య స్థావరాలైన.. ‘పెదవులా’ అవి కావు తమలపాకులా, ఎర్రెర్రని దానిమ్మ పూతలా, తియతేనియ ధారలా పెదవుల.. ఎస్వీ ఉనికిని మరచి కవితాగానం చేస్తున్నాడు మనసు లోపల. తన సొగసు సోయగాల్ని, పరువపు పరుగుల్ని తనివితీరా రెప్పలార్చకుండా చూస్తుంటే సౌందర్య బావలోని మగతనానికి మురిసి మెరిసిపోతోంది.. బుగ్గలు సిగ్గుల మొగ్గలేస్తున్నయ్, ముసి నవ్వులు పువ్వులు పూయిస్తున్నయ్. వలపు తలపులతో ఇద్దరూ ఒకరి చేతిని ఒకరి చేతిలోకి తీసుకుని పందిరికి అల్లుకుపోయిన మల్లెతీగలై.. చిన్ననాటి ముచ్చట్లు, మురిపాలు నెమరేసుకుంటూ దగ్గరయ్యారు.. పెళ్లికి సంసిద్ధమయ్యారు.
ఎస్వీ కలల రాణి, తను చిన్ననాటి నుండి చెలిమి చేసి, వలచిన సౌందర్య గుండె నిండా ఆక్రమించేసింది, ఇంకెవ్వరికి.. ఇంకెన్నటికి.. తావివ్వకుండా - ఇద్దరూ తృప్తిగా ఊపిరి తీసుకున్నారు.
పెళ్లైంది.. ప్రేమ విందుకు వేళయ్యింది.. బోట్‌హౌస్‌లో హనీమూన్. పున్నమి వెనె్నట్లో.. సమీర సరాగాల్లో సాఫీగా సాగుతున్న నదీ తరంగాల వైపు చూస్తూండిపోయింది సౌందర్య - గాలికి నుదురుని తాకుతున్న ముంగురులను సవరిస్తూ సౌందర్యలోని సౌందర్య స్థావరాల్ని వెతుకుతున్నాడు ఎస్వీ - అంగాంగాలా పొంగారు శృంగార రసమయ కావ్య కన్య సౌందర్య - ఆ వాతావరణంలో.. తొలి కలయికలో.. ఎంత పామరుడైనా రసజ్ఞుడవుతాడనడం అసమంజసం ఎంత మాత్రం కాదు అంటోంది ఎస్వీ స్వగతం - చూపులతో ఇంకెంత సేపు.. ఉస్సురస్సురంటూ సౌందర్య గది వైపుగా వెళ్లింది.
ఎస్వీ కళ్లల్లో అసహనం కొట్టొచ్చినట్టు కోడె నాగులా బుసలు కొడ్తోంది. నాన్నగారు ఎంత నిర్దయుడు.. సిద్ధాన్నం ముందుంచుకొని నీళ్లు నమలవలసి వస్తోంది తను. ఒక్క మాటతో తనని మూగవాణ్ణి చేసేశారు నాన్నగారు. సౌందర్య పక్కకి చేరనూ లేదు.. తండ్రి మాటని మీరనూ లేడు-
సౌందర్య తన గురించి ఏం ఆలోచిస్తుందో.. తన ఈ ముభావానికి, అభావానికి ముందు ముందు తనని దరి చేరనిస్తుందో లేదో.. ఎస్వీ మస్తిష్కంలో మధనం అంతరంగాన్ని అతలాకుతలం చేస్తోంది. నాన్నగారు వేసిన ‘ఆడర్’ తీసి కంచె దాటలేక.. సౌందర్య ఎద వీణియ మీటలేక.. ఇదే సంఘర్షణ.
సౌందర్యని సమీపించి మల్లెతీగలా అల్లుకుపోవాలని.. తన కళ్లల్లో కురిసే హాయిని కళ్లింతగా చేసి చూసి మురిసిపోవాలని.. తన నవ్వుల్లో పువ్వులనేరుకోవాలని...
కానీ నాన్నగారు ‘ముహూర్తం’ అంటూ ఆడర్ వేసి.. ఇరువురి ఆనందాలకి అడ్డుగోడ కట్టారు. ఈ విషయం సౌందర్యకి ఎలా చెప్పాలి.. అపార్థాన్ని ఎలా తొలగించాలి.. ముహూర్తం సమీపించగానే సౌందర్యని సమీపించబోయాడు. సౌందర్య కళ్లతో కోపం కురిపిస్తోంది..
అయినా ఎస్వీ సౌందర్యని దగ్గరగా తీసుకుని మృదువుగా పెదవులతో చెవులను తడుముతూ జరిగిన జాప్యానికి ‘ముహూర్తం’ అంటూ నాన్నగారు వేసిన ‘ఆడర్’ కారణం అంటూ విన్నవించుకుంటున్నాడు చెవికి.
చెలి చెక్కిన శిల్పంలా కనిపిస్తూ, అనిపిస్తూ ‘సౌందర్య’ ఎస్వీని ప్రతిఘటిస్తూనే సహకరిస్తోంది. సౌందర్య మనసు ఎస్వీని ఎడం చేస్తోంది - శరీరం మాత్రం తీగలా అల్లుకుపోతోంది ఎస్వీని - పూవులా పరిమళిస్తోంది. ఇదేదో ఇద్దరి ఒద్దికకు పద్ధతిగానే అనిపిస్తోంది-
జగతిని ఉన్నది మనమిద్దరమే అన్నది రుజువై.. నిజమయ్యింది ఆనందపు పరిష్వంగంలో.

-ఆచార్య క్రిష్ణోదయ 74168 88505