Others

అంబేద్కర్ సాక్షిగా చేయి చేయి కలపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘విభజించి పాలించు’ అనే అమానవీయ సూత్రాన్ని భారతదేశానికి మాత్రమే కాదు- మొత్తం ప్రపంచానికే అందించిన ఘనత మన దేశ వర్ణ, కుల వ్యవస్థ స్థాపకులకే దక్కుతుంది. విభజించి పాలించటాన్ని బ్రిటీష్‌వారు ఈ దేశంలోని కుల వ్యవస్థను చూసి నేర్చుకున్నదే. బ్రిటీష్‌వారు కాని, ఏ ఇతర దేశీయులు కాని ఈ దేశానికొచ్చి పాలకులుగా మారడానికి కులవ్యవస్థ వల్ల ఏర్పడిన భారతీయుల అనైక్యత, అంతర్గత కుమ్ములాటలే కారణం. మన వర్ణవ్యవస్థను ఆధారం చేసుకొని బ్రిటీష్ వాళ్ళు ఈ దేశాన్ని రెండు వందల సంవత్సరాలు హాయిగా ఏలగలిగారు.
వర్ణవ్యవస్థ వల్ల కొందరికి పుట్టుకతోనే సామాజిక గౌరవం, పూజ్యనీయత ప్రాప్తిస్తుంది. మరికొందరికి పరిపాలనాధికారాలు లభిస్తాయి. ఇంకొందరికి ఐశ్వర్యం సమకూర్చుకునే పద్ధతులు స్వంతమవుతాయి. తొంభై శాతం మంది మాత్రం సేవకులుగానే బతకాలి. కొద్ది మార్పులతో, అతి కొద్ది మినహాయింపులతో స్వాతంత్య్రానంతరం కూడా ఇదే పద్ధతి కొనసాగుతోంది. శూద్రుల్లో వేల కులాలు, అతి శూద్రుల్లో వందల కులాలు ఒకరితో ఒకరు కలువకుండా అంతరాలను, సరిహద్దు రేఖలను గీచాయి. కులవ్యవస్థలోని అమానవీయతను మొట్టమొదటిగా గుర్తించిన మనిషి తాత్వికుడు గౌతమ బుద్ధుడు. అందుకే ‘బహుజన హితాయ, బహుజన సుఖాయ’ అన్నాడు. కులవ్యవస్థ భారతీయ శూద్రులకు, అతిశూద్రులకు ప్రసాదించిన గులాం గిరీని జ్ఞాన సముపార్జన ద్వారా జయించాలని తాత్వికతనందించిన మేధావి మహాత్మా జ్యోతిబా పూలే. కుల వ్యవస్థ స్వరూప స్వభావాలను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అర్థం చేసుకున్నంతగా మరే తాత్వికుడూ అర్థం చేసుకోలేదు.
వేల కులాలలుగా వున్న శూద్ర సేవకా కులాలను ఒకే గొడుగు కిందికి తేవడానికి అందర్ని కలిపి బీసీలు అని ఆయన అన్నాడు. అంటరానివారుగా వున్న అతిశూద్రులను ఎస్సీ కులాలుగా వర్గీకరించాడు. అడవి బిడ్డలను ఎస్టీలుగా వర్గీకరణ చేసాడు. వీటికి రాజ్యాంగం ఆమోదం ఉంది. ఇలానైనా శూద్రులు, అతిశూద్రులు, గిరిపుత్రులు వేల కులాలను మరిచి ఐక్యంగా ఉంటారని భావించాడు. కాని అంబేద్కర్ ఆశించింది జరుగలేదు. కులవ్యవస్థ స్థాపక మహాశయులు గీచిన అంతరాలు, అసమానతలు ఆధునిక కాలంలోనూ చెరిగిపోలేదు. బీసీ కులాల మధ్య వైరుధ్యాలు, ఎస్సీ కులాల మధ్య వైరుధ్యాలు, ఎస్టీల మధ్య వైరుధ్యాలు, ఈ మూడు సామాజిక వర్గాలతో పాటు మైనారిటీ కులాల మధ్య వైరుధ్యాలు సమసిపోలేదు. అవి సమసిపోకుండా ఉంచడానికి, ఎగదోయడానికి పాలక కులాలు, పాలక వర్గాలు అగ్నిలో ఆజ్యం పోస్తూనే ఉంటాయి. ఇవి సమసిపోయి వాళ్ళంతా తమను ప్రశ్నించడం పాలకులుగా వున్న కులాలకు ఇష్టం లేదు.
ఈ నేపథ్యంలోంచి వచ్చినవే మాల, మాదిగ వైరుధ్యాలు. అతి శూద్రకులాల్లో ఈ రెండు కులాలు సంఖ్యాబలంలోనూ, చైతన్యంలోను అగ్రభాగాన ఉన్నాయి. దళిత జాతిలో ఇవి బలమైన కులాలు. వీటికి అనేక ఉపకులాలున్నాయి. ఈ రెండు కులాలు చేయి చేయి కలిపితే బలమైన శక్తి అవుతారు. అద్భుతాలు సాధించగలరు. నిజానికి దళితులంతా పీడితులే. ఈ దేశపు మూలవాసులే, జాంబవంతుని వారసులే. సహజంగానే కులాలు, ఉపకులాలు మధ్యనుండే ఆచార వ్యవహారాలు, సాంస్కృతిక అంశాల్లో స్వల్పమైన తేడాలుంటే ఉండవచ్చు, కాని వీళ్ళంతా మాతృస్వామ్యాన్ని హృదయానికి హత్తుకొన్న భారతీయ మూలజాతులు. ప్రపంచంలో ఏ జాతి అనుభవించనంత వివక్షను దళిత జాతి అనుభవించింది, అనుభవిస్తున్నది. స్వాతంత్య్రం తర్వాత కూడా దీనికి తెరపడలేదు. ఈ రెండు కులాలు దళిత జాతినంతా ఏకం చేసి అంబేద్కర్ బాటలో పయనిస్తే బాగుండేది. కాని అలా జరగడం లేదు. అలా జరుగకుండా పాలక కులాలు, పార్టీలు ఈ సామాజిక వర్గాల మధ్య ఉన్న స్వల్ప వైరుధ్యాలను శత్రు వైరుధ్యాలుగా మార్చి ఆడుకుంటున్నారు.
బీసీ కులాల మధ్య వున్నట్టే దళిత కులాల్లోనూ అభివృద్ధి ఫలాలు అందుకోవడంలోను, రిజర్వేషన్ ఫలాలు అనుభవించడంలోను హెచ్చుతగ్గులున్నాయి. దేశమంతా పరిశీలించినపుడు అంబేద్కర్ ప్రసాదించిన రిజర్వేషన్ ఫలాలను అనుభవించడంలోనూ, వాళ్ళ వాళ్ళ చైతన్య స్థాయి, అవకాశాలు, అక్కడ పరిస్థితులు, ఉద్యమాలను బట్టి అభివృద్ధి చెందడంలోనూ మాల, మాదిగ కులాల్లో అంతరాలున్నాయి. కొన్నిచోట్ల మాలలు, మరికొన్నిచోట్ల మాదిగలు రిజర్వేషన్ ఫలాలను ఎక్కువగా అనుభవిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని దళితుల్లో అద్భుతమైన చైతన్యముంది. అంబేద్కర్ వాద చైతన్యముంది. పోరాట పటిమ ఉంది. ఫ్యూడలిజాన్ని ఢీకొన్న చరిత్ర ఉంది. చుండూరు సహా కొన్ని ప్రాంతాల్లో దళితులపై దాడులను ఎదుర్కొని సుప్రీం కోర్టు వరకు తీసుకెళ్లిన చైతన్యముంది. దళిత సాహిత్య చైతన్య తేజస్సుంది. మాల మహానాడు ఉద్యమముంది. మాదిగ దండోరా చైతన్యముంది.
గత పాతికేళ్ళుగా కొనసాగుతున్న మాదిగ దండోరా ఉద్యమానికి వీలైనంత తొందరగా పరిష్కారం వెతకాల్సిందే. ఈ ఉద్యమం వల్ల మాల, మాదిగల్లో వైరం పెరిగిందన్న వాదంలో నిజమెంత వుందో కాని మాల మాదిగల వైరుధ్యాలు అన్ని కులాల్లోలాగే ఉద్యమం ముందునుంచే ఉన్నాయి. ఈ ఉద్యమం కేవలం ఎస్సీ వర్గీకరణకే పరిమితం కాకుండా ఆరోగ్యశ్రీ, వికలాంగుల సమస్యలు, తెలంగాణ మృతవీరుల తల్లుల కడుపుకోత, కొన్ని సామాజికాంశాలపై దృష్టి సారించిన మాట వాస్తవమే. మాల మాదిగ కులాలు ఈ విషయంపై అంబేద్కర్ విగ్రహం మందే కలహించుకున్నారు. తమ మధ్యనున్న మిత్ర వైరుధ్యాలను కూడా శత్రు వైరుధ్యాలుగా భావించి పరస్పర నిందారోపణలు చేసుకున్నారు. చేయి చేయి పట్టుకొని కలిసి నడవాల్సిన సోదరులు ఎడమొహం, పెడమొహంగా ఉన్నారు. దీంతో ఉమ్మడిగా చేయాల్సిన దళితోద్యమాలు, అంబేద్కర్ వాద ఉద్యమాలు వెనుకబడ్డాయన్న వాదమూ ఉంది.
పాతికేళ్ల ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని శ్రద్ధగా పరిశీలించినవారికెవరికైనా దీని పరిష్కారానికి రెండు మార్గాలున్నట్టు కనబడతాయి. ఒకటి పార్లమెంటులో బిల్లు పెట్టి మెజారిటీతో ఆమోదం పొందడం. ఈ విషయంలో మందకృష్ణ మాదిగ అన్ని పార్టీలను సంప్రదించాడు. కేంద్రంలో పాలనలో వున్న కాంగ్రెస్, బిజెపి తెలుగు రాష్ట్రాలను పాలించిన, పాలిస్తున్న టిడిపి, కాంగ్రెస్, టిఆర్‌ఎస్ పార్టీలు ఈ సమస్యను తమకు ఓట్ల బ్యాంకుగా ఉపయోగించుకున్నాయే కాని పరిష్కరించడం లేదు. పరిష్కరించవు కూడా. మాల మాదిగలను ఉమ్మడి పోరాటాలకు సన్నద్ధం చేయడం ఆ పార్టీలకు నచ్చదు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టు దీనికి రాజకీయ పరిష్కారం దొరకడం కష్టం. ఎనే్నండ్లు వేచి చూసినా ఏ పార్టీని నమ్మినా ఈ పని జరగదని గత పాతికేళ్ళ అనుభవాలు చెబుతున్నాయి.
ఇక రెండవ పద్ధతి- ఎస్సీ వర్గీకరణ జరిగి నాలుగేళ్ళు అమలు జరిగింది కాని సుప్రీం కోర్టుకు వెళ్ళడం వల్ల ఆగిపోయింది. సుప్రీం కోర్టు కెళ్లిన మాలలు, మాదిగలు కలిసి చర్చించుకొని, అందులోని అభ్యంతరకర విషయాలేమైనా ఉంటే తొలగించి పరిష్కరించుకుంటే మంచిది. ఇద్దరూ కలిసి ప్రభుత్వానికి, సుప్రీం కోర్టుకు అంగీకారం తెలిపితే ఏ గొడవ లేకుండా పరిష్కారమవుతుంది. ఇది అన్నదమ్ములు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని సమానంగా పంచుకోవడం లాంటి సమస్య. తల్లి రాజ్యాంగం, తండ్రి బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను దళిత కులాలు తమ తమ జనాభాను పట్టించుకోవడంలో అభ్యంతరమేమిటి? అంబేద్కర్ విగ్రహం ముందే తగవులాడిన మాల, మాదిగ నేతలు అంబేద్కర్ సాక్షిగా ఒక్కటై చేయి చేయి కలపడం నేటి సామాజికావసరం.

-డా. కాలువ మల్లయ్య 91829 18567