AADIVAVRAM - Others

‘తుక్కు’ శిల్పాలు.. ప్రత్యేక రూపాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్రకారుడు కానిదే శిల్పి కాలేడు. చేయి తిరిగిన చిత్రకారుడే మంచి శిల్పి అవుతాడు. వర్తమానంలో శిల్పి అనేక మాధ్యమాలను ఎంచుకుంటున్నాడు. ఒకప్పుడు రాతి, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో శిల్పాలు తయారుచేసేవారు. ఇప్పుడు సృజనకు, కళాత్మకతకు కాదేదీ అనర్హమన్న రీతిలో తుక్కు (పనికిరాని ఇనుప సామాగ్రి) సైతం శిల్పానికి భేషుగ్గా ఉపయోగపడుతోంది. ఆధునికతకు అద్దం పట్టే విధంగా ఈ మాధ్యమంలో శిల్పులు ‘రూపాల’ను తీర్చిదిద్దుతున్నారు. వారిలో శ్రీకాంత్ బారుపాటి ఒకరు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి 2003 సంవత్సరంలో శిల్పంలో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్న శ్రీకాంత్ తన ప్రతిభను, సృజనను, నైపుణ్యాన్ని, నాజూకుతనాన్ని ‘స్క్రాప్ స్కల్‌ప్చర్’ (తుక్కు మాధ్యమంలో శిల్పం) ద్వారా ప్రపంచానికి చాటుతున్నారు. చూడ్డానికి ‘ఓస్ ఇంతేనా!...’ అనిపించినా అందులో చిత్రకారుడి ‘ఆత్మ’ దర్శనమిస్తుంది. కొందరికి తుక్కును పోగేసినట్టు అనిపించినా ఆ ఆకృతిలో ‘జీవం’ ఉట్టిపడుతుంది. విస్మయపరుస్తుంది. అదే ‘కళ’కున్న ప్రత్యేకత. ఆ రసాస్వాదన ఆ శిల్పంలో ద్యోతకమవుతుంది. కళ లక్ష్యం నెరవేరుతోంది. అంతకు మించి కావలసిందేముంది?
శ్రీకాంత్ రూపొందించిన అన్ని ఆకృతుల్లో ఈ రసాస్వాదన దర్శనమిస్తుంది. పిల్లలు - పెద్దలు అందరూ వాటికి ఆకర్షితులై కొన్ని క్షణాలు విస్మయానికి గురి కాకుండా ఉండలేరు. సంతోషంతో ముగ్దులవుతారు. ఇటీవల ఆయన ‘విలేజ్ అలారం’ అన్న శీర్షికతో ఓ ‘స్క్రాప్’ శిల్పం రూపొందించారు. గ్రామాల్లో కోడిపుంజు కూతనే ‘అలారం’గా భావిస్తారు. కోడి కూసిందంటే పల్లె నిద్ర లేవాల్సిందే! పనులు ప్రారంభించాల్సిందే. ఈ కీలకమైన అంశాన్ని శిల్పి తన సృజనతో తీర్చిదిద్దారు. ఓ ఎతె్తైన కర్రపై నిల్చొని కోడిపుంజు కూస్తున్నట్టుగా లోహపు ముక్కులతో రూపొందించారు. దూరం నుంచి చూస్తే అచ్చం కోడిపుంజే అనిపిస్తుంది. కానీ ఆ ఆకృతి నిండా నట్లు - బోల్టులున్నాయి. ఆ ఆకృతికి సరిపడే పాత ఇనుప సామాగ్రి అమర్చబడింది. కోడిపుంజు తోక ఈకలుగా ఇనుప కొడవళ్లు అమర్చి శిల్పి అందరినీ ఆశ్చర్యపరుస్తారు. ఇక్కడే శిల్పి సృజనాత్మకత - కళాత్మకత, నిశిత దృష్టి తేటతెల్లమవుతుంది. రోజూ ఎన్నో కొడవళ్లను చూసిన వారైనా అవి కోడితోక ఈకలుగా ఉంటాయన్న ధ్యాస కలగదు. ఆ ఆకృతి అచ్చం అలాగే ఉంటుందన్న ఊహ రాదు, చిత్రకారుడు - శిల్పి మాత్రం సునాయాసంగా వాటిని తీసుకొచ్చి ‘వెల్డింగ్’ చేసి ఆకృతికి సంపూర్ణత్వం తీసుకొచ్చి చూపితే నివ్వెరపోవడం వీక్షకుల వంతవుతుంది. శ్రీకాంత్ చేసిందే అది.
అంతేనా కాదు.. భౌగోళిక తెలంగాణ ‘మ్యాప్’ను పాత ఇనుప ముక్కలతో, తీగెలతో రూపొందించి పక్కన పాలపిట్ట, తంగేడు పువ్వును తీర్చిదిద్ది, రాష్ట్ర చిహ్నాలను పొందుపరిచి ఆ ఆకృతికి సంపూర్ణత్వం తీసుకొచ్చి వీక్షకులు విభ్రమ చెందేలా చేవారు. విచిత్రమేమిటంటే ఈ శిల్పం హరితపత్ర రహితంగా (ఎండిన ఆకులా) తీర్చిదిద్ది, ఆకులోని సన్నని ‘గీత’లను సహజంగా తీర్చిదిద్ది శిల్పి తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ‘శిల్పం’ అంటే ఇలా కూడా ఉంటుందా? అన్నట్టు కళను ‘సింప్లిఫై’ చేశారు. ఏ కళలోనైనా సింప్లిఫై చేయడాన్ని గొప్ప సృజనగా కళా విమర్శకులు భావిస్తారు. ఆ లక్షణం ఈ శిల్పిలో దండిగా కనిపిస్తోంది. తాను ఎంచుకున్న మాధ్యమం అందుకు మరింత దోహదపడుతోంది.
పౌరాణిక పురుషుడు బలరాముని ఆకృతిని ఈ మాధ్యమంలోనే ఆయన అద్భుతంగా రూపొందించి అందరిచేత ప్రశంసలందుకున్నారు. దాదాపు ఎనిమిది అడుగుల ‘విగ్రహాన్ని’ అలంకరణతో సహా అందంగా, అచ్చం బలరాముడిలా నాగలి పట్టుకుని నిల్చున్న రూపాన్ని వివిధ ఇనుప వస్తు సామాగ్రితో తీర్చిదిద్దడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. శ్రీకాంత్ తన చాతుర్యంతో అవలీలగా వివిధ సామాగ్రిని అతికించి (వెల్డింగ్ చేసి) ఆ రూపాన్ని కళ్లకు కట్టారు. చివరకు ఆనాటి అలంకరణ, పూలదండలు, ఇతర ఆభరణాలు సైతం ఆ ‘తుక్కు’లో దర్శనమివ్వడం ఆశ్చర్యంగాక ఏమవుతుంది?
మరో ఆశ్చర్యకర శిల్పమేమిటంటే.. కాకులు ఇంట్లోని వస్తువులు ఎత్తుకుపోవడం చాలామందికి అనుభవంలో ఉంటుంది. అదో అలా కాకి ఓ గొలుసును ఎత్తుకుపోతున్న శిల్పం రూపకల్పన నిజంగానే అభినందనీయం. పక్షి ఆకాశంలోనే కనిపిస్తుంది. ఆ లోహ విహంగాన్ని అలా నిలపడం ఎలా సాధ్యం?.. అదే శిల్పి చాతుర్యం. సృజనశక్తి.. ఊహాయుక్తి. దాన్ని సాకారం చేసి, కళ్ల ముందు నిలిపి పిల్లల్ని పెద్దల్ని ఆశ్చర్యచకితుల్ని చేసిన శిల్పి ధన్యుడు కదా?
ఇనుములో హృదయం మొలిచిందా? అన్న రీతిలో తూనీగలను సైతం, ‘సృష్టించా’రాయన. దూరం నుంచి చూసి పిల్లలు పట్టుకునేందుకు వెళతారేమో అన్నంత సహజసిద్ధంగా, అందంగా, అద్భుతంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాడు. వాటి ఎర్రరంగు ‘మూతి’ ముచ్చట గొలుపుతుంది.
థీమ్‌ను తీసుకుని శిల్పాన్ని తయారుచేయడం తనకిష్టమని శిల్పి శ్రీకాంత్ అంటున్నారు. దానికి ఉదాహరణగా వర్షం కోసం ఎదురుచూపు (వెయిటింగ్ ఫర్ రెయిన్) శిల్పం. ఓ గ్రామీణ వ్యకిత, తన బలహీనమైన దేహంతో, కర్ర సాయంతో ఆరుబయటకొచ్చి, కళ్లపై చేయి అడ్డంగా పెట్టుకుని మేఘాల కేసి తీక్షణంగా చూస్తుంటే అతని మేక సైతం తన యజమాని చూస్తున్న వైపే మెడ ఎత్తి చూడటం. ఈ శిల్పాన్ని సైతం ‘తుక్కు’తో చేసినా దాన్ని తక్కువ చేసి చూడలేం. అందులో ఎంతో ఆర్తి.. అవసరం, ఆకాంక్ష ప్రతిఫలిస్తున్నాయి. యజమానిని అనుకరించే మేకను పక్కన ప్రతిష్టించడం చిత్రకారుడి ప్రతిభకు నిదర్శనం. భావాన్ని ద్విగుణీకృతం చేయడంలో అదెంతో ఉపకరించింది.
ఇలా ఒకటా రెండా అనేక ఆకృతులకు ‘ఆత్మ’లను అద్ది అరుదైన శిల్పిగా గుర్తింపు పొందిన శ్రీకాంత్ బారుపాటి సూర్యాపేట జిల్లాలోని కుక్కడం గ్రామంలో ఓ నిరుపేద కుటుంబంలో 1973లో జన్మించారు. ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు సొంత ఊర్లోనే చదివారు. బాల్యంలోనే చిత్రాల పట్ల, ఆకృతుల పట్ల తెలియని ప్రేమ ఏర్పడింది. తాము నివసించే ప్రాంతంలో ఇళ్ల ముందు భాగంలో గోడలను ఎర్రమట్టితో అలికి ‘నాంగారం ముద్ద’ (సున్నపు ముద్ద)తో బొమ్మలు గీయడం అలవాటు. చీపురు పుల్లలనే బ్రష్‌లుగా మలిచి ఆ సుద్దలో ముంచి గీతలు ఇస్తారు. ప్రస్తుతం దీన్ని ‘వర్లి ఆర్ట్’గా వ్యవహరిస్తున్నారు. బాల్యంలో అలా తాను బొమ్మల్ని గోడలపై గీశానని, అంతేగాక తన అన్న రవి డ్రాయింగ్ వేయడాన్ని గమనించి అతనిలా తానూ గీయడం నేర్చుకున్నానని, పాఠశాలలో సైన్స్ బొమ్మలు, ఇతర బొమ్మలు కుదురుగా వేయడంతో ఉపాధ్యాయులు ప్రోత్సహించడం వల్ల చిత్రకలపై మక్కువ ఏర్పడిందని శ్రీకాంత్ చెప్పారు.
సూర్యాపేటలో హైస్కూల్లో చదువుతున్నప్పుడు డ్రాయింగ్ లోయర్ - హయ్యర్ పరీక్షలు రాశానని అనంతరం టెక్నికల్ టీచర్ కోర్స్ (టిటిసి) హైదరాబాద్‌లో చేశానని ఈ సమయంలోనే జెఎన్‌టియులోని బిఎఫ్‌ఏ కోర్సు గురించి తెలిసి ప్రవేశ పరీక్ష రాయగా 1998లో అందులో ‘శిల్పం’ కోర్సులో సీటొచ్చిందని ఆయన చెప్పారు. పెయింటింగ్‌లో టు డైమెన్షన్ అవగాహన ఉంటే సరిపోతుందని, శిల్పంలో అయితే త్రీ డైమెన్షన్ అవగాహన ఉండాలని, వస్తువుకున్న మూడు వైపుల్ని చూపే నైపుణ్యం, ఊహ అవసరమని ఆయన అంటున్నారు. టెర్రకోట, ఉడ్‌వర్క్, ఫైబర్, స్టోన్, మెటల్‌లో శిల్పాన్ని ఎలా తయారుచేయాలో బిఎఫ్‌ఏలో ప్రాథమికంగా నేర్పించారని ఇందుకోసం ముందుగా ‘లైవ్ స్కెచ్‌ల’ అభ్యాసం ఎక్కువగా జరిగిందని, అలాగే పెయింటింగ్ సంబంధించిన పూర్తి అవగాహన, కాన్వాస్‌పై ఉపయోగించే రంగుల తీరు తెలుసుకున్నామని అంటున్నారు.
బిఎఫ్‌ఏ పూర్తయ్యాక తన నైపుణ్యాన్ని మరింత సానబట్టేందుకు గాను శ్రీకాంత్ 2003 సంవత్సరంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ‘శిల్పం’లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అక్కడ డి.ఎల్.ఎన్.రెడ్డి, శ్యామ్‌సుందర్ లాంటి హేమాహేమీల మార్గదర్శనంలో బోధనలో మెలకువలు గ్రహించి శిల్పకళలో తనదైన ప్రయోగాలకు చదువుతున్నప్పుడే శ్రీకారం చుట్టారు.
అనంతరం సృష్టి ఆర్ట్ గ్యాలరీ వాళ్లు తొలిసారి తన శిల్పాన్ని అమ్మి పెట్టారని, ఆ డబ్బు చేతికందినప్పుడు మాటల్లో వ్యక్తం చేయలేని ఆనందం పొందానని శ్రీకాంత్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ 2003 సంవత్సరంలో నిర్వహించిన పోటీలో, అలాగే 2010 సంవత్సరం స్టేట్ ఆర్ట్ గ్యాలరీ (చిత్రమయి) నిర్వహించిన పోటీలో శ్రీకాంత్ అవార్డులు దక్కించుకున్నారు. అనేక ప్రదర్శనల్లో పాల్గొన్నారు. అలాగే ఆయన శిల్పాలు దేశంలోని పలు నగరాలలో కనిపిస్తాయి. మరింత మెరుగైన రీతిలో శిల్పాలు రూపొందించే పనిలో ఉన్నానని ఆయన చెప్పారు.
శ్రీకాంత్ బారుపాటి 98665 85545

- వుప్పల నరసింహం 99857 87799