Others

శ్రావణం.. వ్రతాలకు శుభదాయకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనాతన హిందూ ధర్మంలో చాంద్రమానం ప్రకారం మనకున్న పనె్నండు మాసాల్లో ఐదవది మరియు ఎంతో పవిత్రత కల్గినటువంటి మాసం శ్రావణమాసం. వర్షఋతువులో మొదటి మాసం శ్రావణం. ఈ మాసంలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడంవలన ఈ మాసానికి శ్రావణమాసం అనే పేరు వచ్చింది. స్ర్తిలకు అత్యంత పవిత్రమైంది. సౌభాగ్యం, కుటుంబ శ్రేయస్సు, సుఖ సంతోషాలకోసం స్ర్తిలు ఆచరించే వ్రతాల మాసం ఇదే. కలియుగదైవం, భక్తులపాలిట కొంగు బంగారంగా నిలిచిన వైకుంఠనాథుడైన వేంకటేశ్వరస్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. కావున సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వరస్వామి జన్మనక్షత్రంలో కూడిన మాసం ఈ శ్రావణమాసం కనుక ఈ మాసానికి భక్తులు మరింత ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది.
శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తి జన్మనక్షత్రం కూడా. ‘శ్రవం నయతీతి శ్రేణ నీయత ఇతివా శ్రవణం’- వేద వాఙ్మయం శ్రావణమాసంలోనే పుట్టిందంటారు. హయగ్రీవుడనే రాక్షసుడు వేదాలను అపహరిస్తే విష్ణుమూర్తి హయగ్రీవుడిగా వచ్చి వేదాలను సంరక్షించాడు. హయగ్రీవుడు అవతరించింది శ్రావణ శుద్ధ పౌర్ణమినాడే. అందుకే వేదాధ్యయయానికి, జ్ఞాన సముపార్జనకు శ్రావణమాసం అనుకూలమైనదని చెబుతారు. శ్రవణంవల్ల నేర్చుకోవలసింది వేదం. కొత్తగా ఉపనయనం అయినవారికి జంథ్యాల పౌర్ణమి రోజు వౌంజీ బంధనం తొలగిస్తారు. ఆ మరుసటి రోజు నుంచి వేదాధ్యయనం ప్రారంభిస్తారు. మత్స్యాకారంలో మూడు తారల సమూహం శ్రవణం. వేదాన్ని పెంపొందించేది, వేదం వద్దకు తీసుకుపోయేది, వేదమనే నీటి ఊటను సంరక్షించేది శ్రవణా నక్షత్రం. ఈ మాసాం శివకేశవుల ఆరాధనకు ఉపయుక్తమైనది. శివకేశవులకు భేదం లేదనే మాటను నిజం చేస్తూ ఈ నెలలోని సోమవారాలు శివుడికి, శనివారాలలో విష్ణువుకు పూజలను నిర్వహిస్తారు. శ్రావణమాసంలో వచ్చే సోమవారాలు శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. శ్రావణ సోమవారాల్లో శివాలయాల్లో అభిషేకాలు, అన్న పూజలు విరివిగా చేస్తారు. శ్రావణమాసంలో ప్రతి తిథికి ఓ ప్రత్యేకత ఉంది. ఆయా తిథులలో ఆయా పూజలు చేయడంవల్ల విశేష ఫలితం ఉంటుందని పెద్దలు చెబుతారు. శ్రావణ శుద్ధ పాడ్యమి అగస్త్య మహాముని జన్మదినం. విదియ రోజు అగ్నిదేవుడి భార్య అయిన స్వాహాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ రోజు భార్యాభర్తలిద్దరూ హోమం చేస్తారు. శ్రావణం నుంచి వర్షరుతువు మొదలవుతుంది. ‘వరం సీదతీతి వర్షః’ అంటే శ్రేష్ఠమైన పంటను ఇచ్చే కాలమని అర్థం. ఈ కాలంలో వర్షాలు పడతాయి కనుక ఇరు పంటలకు అనువైన కాలం. శ్రావణమాసం రైతుల మాసం. పొలం పనులు వేగంగా పుంజుకుంటాయి. పొలాల దగ్గర, బావుల దగ్గర కీటకాలు, సర్పాల సంచారం కూడా పెరుగుతుంది. మగవారికి క్రిమికీటకాదులనుంచి ప్రమాదం రాకూడదని కోరుతూ ఆడవాళ్లు వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు.
ఈ మాసంలో ముఖ్యంగా జరుపుకునే పండుగలు-
వరలక్ష్మీవ్రతం
మహిళలందరూ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఆచరించడంవలన సకల సౌభాగ్యాలు కలుగుతాయి.
మంగళగౌరీవ్రతం
కొత్తగా పెళ్ళైన మహిళలు శ్రావణంలో వచ్చే ప్రతి మంగళవారం మంగళగౌరీ వ్రతాన్ని చేసుకోవాలి. ఈ వ్రతం ఆచరించడంవల్ల సుమంగళీదేవి అనుగ్రహం లభిస్తుంది. పసుపు, కుంకుమ, పూలు, సుగంధ ద్రవ్యాలు మొదలైన వాటిలో మంగళగౌరీ వుంటుందని భావించి, వాటినన్నింటినీ ఈ వ్రతంలో ఉపయోగిస్తారు.
నాగుల చవితి.. పూర్ణిమకు ముందు వచ్చే చతుర్థి అనగా శుద్ధ చతుర్థి రోజున సుబ్రమణ్య లేదా నాగదేవతా అభిషేకం విశేషం. ఈ రోజున నాగదేవతా అభిషేకం చేసినవారికి సంతాన సంబంధ దోషములు కొంతవరకు నివృత్తి అవుతాయి.
ఏకాదశివ్రతం.. పూర్ణిమకు ముందు వచ్చే ఏకాదశి అనగా శుద్ధ ఏకాదశినిపుత్రదా ఏకాదశి అని పేరు. సంతానాన్ని ఆశించే దంపతులు ఈ రోజున నిష్ఠగా ఏకాదశి వ్రతం చేయాలి. ఈ రోజుని లలితా ఏకాదశి అని కూడా అంటారు. పుత్ర సంతానం కలగడానికి ఈ రోజుని పుత్రదా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే మంచిది
రక్షాబంధన్
శ్రావణ పూర్ణిమ సంతోషిమాత జయంతి. ఈ రోజున సంతోషిమాత వ్రతం చాలా విశేషం. శ్రావణ పూర్ణిమకు రాఖీపూర్ణిమ అని కూడా అంటారు. స్ర్తిలు అన్నదమ్ములకు, సోదర సమానులకు రక్షను (రాఖీని) కట్టడం వల్ల శుభ ఫలితాలు చేకూరుతాయి. ఈ పౌర్ణమి రోజున నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు.
శ్రీ రాఘవేంద్ర ఆరాధన
పూర్ణిమ తర్వాత వచ్చే విదియ అనగా బహుళ విదియ రోజున శ్రీ రాఘవేంద్రుల స్వాములవారు సజీవంగా సమాధిలోకి వెళ్లిన రోజు. ఈ రోజున రాఘవేంద్రస్వామి అర్చన, అభిషేకం చేయడంవల్ల విశేష ఫలితాలు లభిస్తాయి.
సంకటహర చతుర్థి
బహుళ చతుర్థి రోజున గణపతికి అర్చన, అభిషేక అర్చన, వ్రతాదులు చేయటంవల్ల అన్ని కష్టములు తొలగిపోయి మంచి ఫలితాలు కలుగుతాయి.
శ్రీకృష్ణ జన్మాష్టమి
శ్రావణ బహుళ అష్టమిని కృష్ణాష్టమిగా జరుపుకుంటారు. దేవదేవుడైన విష్ణుమూర్త ఈ శ్రావణ బహుళ అష్టమినాడు కృష్ణావతారంతో జన్మించాడు. కృష్ణుడికి పూజలు చేసి పాలు, వెన్న నైవేద్యంగా పెడతారు. ఉట్లు కొడతారు.
శ్రావణ అమావాస్యగా వృషభపూజ
శ్రావణంలో 30 వ్రతాలు ఆచారాలు పాటించాలని స్కాంద పురాణ అంతర్గతమైన ‘శ్రావణమాస వైభవం’లో తెలియజేశారు. బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థాశ్రమంలో వున్నవారు, సన్యాసులు ప్రత్యేక వ్రతాలు చేసేకాలమిది. లవణవ్రతం, దధీవ్రతం లాంటి వ్రతాలు చేస్తుంటారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే శ్రావణమాసంలో ప్రతీరోజూ పండగే.

- కె.రామ్మోహన్‌రావు 9441435912