Others

ముడతలకు ముగింపు.. ఆనందం రెట్టింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికాలో ఓ ఫిల్లవాడు తన స్కూల్ ఫంక్షన్‌కి భారతదేశం నించి వచ్చిన తన తాతనీ, నానమ్మనీ తీసుకురావద్దని వాళ్ల అమ్మ నాన్నకి చెప్పాడు. ‘‘ఎందుకని?’’ అడిగిన ఆ తల్లిదండ్రులకి ఆ పిల్లవాడు ఇలా జవాబిచ్చాడు. ‘‘తాత, నానమ్మ మొహం నిండా ముడతలున్నాయి. స్కూల్‌లో నా స్నేహితులు వాళ్లని చూస్తే రేపొద్దున నాక్కూడా అలా ముడతలొస్తాయని ఏడిపిస్తారు, అందుకే వద్దు’’. అది విన్న ఆ ముసలి వారు చాలా బాధపడ్డారు. వయసుమీద పడేకొద్దీ ముఖంలో ముడతలు రావడం సహజం. అలాంటి మనసు నొప్పించే మాటలు వినడం అసహజం. ఏడు సముద్రాల అవతల ఇది పరిస్థితి అయితే మన దేశంలో కథ ఇలా ఉంది. ఓసారి ఓ నలభై ఏళ్ల అతను నా దగ్గరికి వచ్చాడు. చాలా బాధపడుతూ ఇలా అన్నాడు. ‘‘మా అబ్బాయి స్కూల్‌లో టీచర్లని కలవడానికి వెళ్లినపుడు వాళ్ల ఉపాధ్యాయులు నన్ను వాడి తాతనుకున్నారు. నాకే చాలా ఇబ్బందిగా అనిపించింది. వాడికి చాలా నామోషీగా అనిపించింది. మళ్లీ ఇంకెపుడు నువ్వు స్కూల్‌కి రాకు నాన్నా’’ అని అన్నాడు. ‘‘నలభై ఏళ్లకే నా ముఖం ఈ ముడతల వల్ల పాడైపోయింది’’ అని వాపోయాడు అతను. వయసు మీదపడేకొద్ది అనుభవం పెరుగుతుంది. అందం తగ్గుతుంది. ఈ అందం తగ్గడానికి అతి ముఖ్యమైన కారణం ముఖానికి ముడతలు.
అసలు ముడతలు ఎందుకు వస్తాయి
వయసు పెరిగే కొద్ది చర్మం సన్నగా, పొడిగా మారుతుంది. సాగే గుణం తగ్గుతుంది. దీని మూలంగా చర్మం మీద ముడతలు వస్తాయి.
మొహంపై కనిపించే ముడతలు
ఇవి మన ముఖ కవళికల మూలంగా అవుతాయి. మన ముఖ కవళికలకు కారణమైన కండరాలమీద ముడత పడుతుంది. చిన్నవయసులో మన చర్మానికి సాగే గుణం వుంటుంది. కాబట్టి ఈ ముడత కనిపించదు. పెద్ద వయసులో సాగడం తగ్గుతుంది. ముడత కనిపిస్తుంది.
చిన్నవారిలో ముడతలు? వాటికి కారణాలు
తప్పకుండా రావచ్చు. ముడతలు రావడానికి అతి ముఖ్య కారణం సూర్యరశ్మి. ఈ సూర్యరశ్మిలో ఉండే అల్ట్రావైలెట్ కిరణాలు మన చర్మం సాగే తత్వాన్ని తగ్గించేస్తుంది. దీనివల్ల సూర్యకాంతి ఎక్కువగా తగిలే ప్రదేశాలైన మన ముఖం, మెడ, చేతులలో ముడతలు త్వరగా కనిపిస్తాయి. ఎండలో ఎక్కువగా తిరిగేవారిలో చిన్నవయసులోనే ముడతలు కనిపించే ప్రమాదం వుంది.
పొగాకు వల్ల చర్మంలో రక్త ప్రవాహం తగ్గడంవల్ల ముడతలు వచ్చే అవకాశం ఎక్కువ.
మద్యపానం అతిగా చేసేవారిలో చర్మం పొడిబారుతుంది. అలా పొడిబారిన చర్మంలో ముడతలు ఎక్కువగా వస్తాయి.
నిద్ర సరిగా లేనివారిలో, ముఖంపై నిద్రపోయేవారిలో (బోర్లా పడుకునేవారిలో) ముడతలు ఎక్కువగా కనిపిస్తాయి.
వంశపారంపర్యంగా వచ్చేవారిలో చిన్న వయసులోనే ఈ ముడతలు కనిపిస్తాయి.
ముడతలకి మందులతో చికిత్స
రెటినోయిడ్: సన్ననైన ముడతలను నిర్మూలించడానికి ఈ క్రీములు వాడొచ్చు. ఎలా వాడాలనేది సరైన వైద్యుడిని సంప్రదించి తెలుసుకోవడం మంచిది.
బొటాక్స్:మొహంపై వచ్చే ముడతలకు ఇది చాలా గట్టి విరుగుడు కానీ తాత్కాలిక విరుగుడు మాత్రమే. ముఖంపై ముడతలు సాధారణంగా నుదుటిపై, కనుబొమలమధ్యన, కంటికి పక్కగా, బుగ్గలపై, గడ్డంపై వస్తుంటాయి. ఈ ముడతలు ఉన్న ప్రదేశంలో ఈ బొటాక్స్ ఇంజెక్షన్ కండరాలలోకి ఇస్తారు. చాలా కొంచెం నొప్పితో కూడుకున్న ఈ విధానంలో ముందు 24-48 గంటలలో పనిచేయడం మొదలవుతుంది. ఈ మందు ప్రభావం 3 నుంచి 6 నెలలు దాకా, కొంతమందిలో 9 నెలల వరకు కనిపిస్తుంది. ముడతలకు ముగింపు చెప్పిన ఈ బొటాక్స్ పేషంట్స్‌లో అతి ప్రముఖ చికిత్స. దీని ఖరీదు ఎక్కువ. వాటి ప్రభావం తగ్గిన తరువాత మళ్లీ ఇంజెక్షన్ తీసుకోవాల్సి వుంటుంది.
ఆపరేషన్ అంటే భయపడేవారికి అవే వైద్య శాస్త్రం ఇచ్చే వరాలు. శాశ్వత పరిష్కారం కావాలనుకునేవారికి ఈ కింది విధానాలు పనికొస్తాయి.
ఫేస్ లిఫ్ట్: ఇది కొంచెం పెద్ద ఆపరేషన్. అతిగా ఉన్న చర్మాన్ని, దాని కింద ఉన్న కొవ్వుని తీసేయడంతో పాటు, కింద ఉన్న కండరాలని గట్టిచేసే ప్రయత్నమే ఈ ఫేస్ లిఫ్ట్. ఈ ఆపరేషన్‌లో గాట్లు జుత్తులో దాగుండేలా చెయ్యడం జరుగుతుంది. దీని ఫలితాలు చాలా బావుంటాయి.
లేజర్: గత దశాబ్దంలో అతి ప్రాముఖ్యత పొందుతున్న విధానం ఈ లేజర్ చికిత్స. మన దేశంలో చాలా తక్కువ చోట్లలో చేసే ఈ చికిత్స విధానం ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి.
ఇవి చికిత్సా విధానాలైతే, డాక్టర్‌గా ఇవి నా సూచనలు.
- ఎండలో తిరిగేవారు సన్‌స్క్రీన్ రాసుకోవడం ఉత్తమం. ఎండలో తిరగడం కుదిరిన మేరకు తగ్గించడం, టోపీ, మొత్తం చేతులున్న చొక్కాలు వేసుకోవడం లాంటివి చేయడం మంచిది.
- పొగాకు, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ప్రతి సినిమా ముందు చూడడమే కాదు, పాటించడంవల్ల ముడతలు త్వరగా రావు.
- సరైన మోతాదులో నిద్రించడంతోపాటు, ముఖంపైన ఎక్కువ ఒత్తిడి కలగకుండా వీపుమీద పడుకునే అలవాటు చేసుకోవడం మంచిది. అలా చెయ్యడంవల్ల ముడతలు త్వరగా వచ్చే ప్రమాదం ఉండదు.
పై చెప్పిన ముడతలన్ని ఒక ఎతె్తైతే, పళ్లు లేని కారణంగా ముఖం కింది భాగంలో ముడతలు పడడం ఒక ఎత్తు. పళ్లు మన క్రింది ముఖభాగం ఎత్తుని నిర్ణయిస్తాయి. పళ్లులేనివారిలో ఆ ఎత్తు తగ్గి, నోరు మోతాదుని మించి మూసుకోవడంవల్ల చర్మం లోపలికి ముడుచుకొని ముడతలుగా మరియు లొట్ట చెంపలుగా కనిపిస్తాయి. వీరు తీసి పెట్టుకునే పళ్లని లేక డెంటల్ ఇంప్లాంట్స్ ద్వారా స్థిరమైన పళ్లని పెట్టించుకోవడం వల్ల తిరిగి క్రింది ముఖభాగం ఎత్తు పెరిగి ముడతలు మాయమవడం జరుగుతాయి.
మా బామ్మ అనేది- ‘‘అబ్బాయ్! నీ వయసు నాకు రాదుగాని నా వయసు నీకొస్తుందీ అని’’. వయసు ఎవర్నీ వదిలిపెట్టదు. సృష్టి తన పని తను చేసుకుపోతూ ఉంటుంది. అందరూ వృద్ధులు కావాల్సిందే. ముడతలు పడాల్సిందే. ముడతలు పడ్డ పెద్దవారిని చిన్నచూపు చూడడం మంచిది కాదు. అది మన భారతీయ సంప్రదాయమూ కాదు. వృద్ధులను గౌరవిద్దాం, వారికి చేయూతనిద్దాం.
*
పాఠకులకు సూచన
‘‘మీ సమస్యలకు, సందేహాలకు సమాధానాలు’’ పొందాలనుకుంటే ప్రశ్నలు ఈ చిరునామాకు క్లుప్తంగా పంపండి. వాటిని భూమికలో ప్రచురించడం జరుగుతుంది.
మీ ప్రశ్నలను ‘‘మీ సందేహాలు- నా సమాధానాలు’’
అనే శీర్షికకు పంపాలి.
చిరునామా : డా శ్రీరంగం రమేష్, ఫేస్ క్లీనిక్,
1-3-15, కలాసిగూడ,
సికింద్రాబాద్-500003

-డాక్టర్ రమేష్ శ్రీరంగం సెల్ నెం: 92995 59615 faceclinics@gmail.com