Others

వేదోద్ధర్ణావతారమే హయగ్రీవుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘జ్ఞానానందమయం దేవం, నిర్మలం స్ఫటికాకృతిమ్, ఆధారం సర్వ విద్యానాం, హాయగ్రీవ ముపాస్మహే’’ పురాణేతిహాసాలలో ప్రసిద్ధములైన విష్ణువు అవతారాలలో హయగ్రీవావతారం ఒకటి. వేదోద్ధరణకై సంభవించిన అవతారమే ఇది. జ్ఞానము, వాక్కు, ఆచారము నాశనం కాకుండా సాగునట్లు అనుగ్రహించిన హయగ్రీవ మూర్తిగా శ్రావణ పూర్ణమి నాడు మహా విష్ణువును కొలవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. హయగ్రీవుడనగా గుర్రం శిరస్సు, మానవ దేహం కలిగిన స్వామి, నరసింహ స్వరూపం వలే వైకుంఠ నాథుడు హయగ్రీవధారియైనారు. ‘హయ’ అనగా విజ్ఞానం. ‘గ్రీవ’ అనగా కంఠం. అన్ని విద్యలూ కంఠస్థమై ఉన్న సర్వ విద్యా రూపమే హయగ్రీవ మూర్తి. భాగవతంలోని సప్తమ స్కంధంలో హయగ్రీవుడు బ్రహ్మ చేసిన యజ్ఞంలో ఆవిర్భవించినట్లు, స్కంద పురాణంలో దేవతల ప్రార్థనలతో విష్ణువు అశ్వముఖులై అవతరించినట్లు, పూర్వాగాథాలహరిలోనూ హయగ్రీవ వృత్తాంతాలు పేర్కొనబడినాయి.
దేవీ భాగవతం ప్రకారం ఒకానొక సమయాన మహావిష్ణువు రాక్షసులతో పదివేల ఏళ్ళు భీకర యుద్దం చేసి అలసి పోయి, అల్లెత్రాడు గట్టిగా బిగించి ఉన్న ధనుస్సును నేలమీద నిలబెట్టి, దాని కోపుమీద తమ గడ్డాన్ని ఆనించి, నిలబడే నిద్ర పోయారు. విష్ణువును వెదకుతూ వచ్చిన దేవతలు, నిద్ర లేపడానికి భయపడి, బ్రహ్మ దేవుడు ఒక చెదపురుగును సృష్టించి, వింటి నారిని కొరకమని చెపుతారు.
పురుగు కొరకడంతో ధనుస్సు విసురుగా తుళ్ళి, వింటికి ఉన్న బాణం కొన విష్ణువు మెడకు తగిలి, ఆయన శిరస్సు తెగి, ఎగిరి పోయింది. దేవతలంతా మహాదేవిని ప్రార్థించగా, ఆమె ప్రత్యక్షమై, సూచించిన విధంగా గుర్రాన్ని వధించి, దాని తలను తెచ్చి దేవశిల్పియైన త్వష్ట ద్వారా విష్ణువు మొండానికి అతికించారు. బ్రహ్మ ప్రాణం పోయగా, హయగ్రీవులైనారు. సృష్టి ఆరంభంలో అగణిత ఏళ్ళ క్రింద చతుర్ముఖ బ్రహ్మకు పరమాత్మ వేదశాస్త్రాలను బోధించారు. మధుకైటభులనే ఇరువురు అసురులు బ్రహ్మనుండి వేద విద్యను దొంగిలించి రసాతలానికి పారి పోయారు. హయగ్రీవ రూపంలోని శక్తితో మాత్రమే తాను మరణించునట్లు హయగ్రీవుడనే రాక్షసుడు బ్రహ్మ ద్వారా పొందిన వరం కారణంగా, దేవి కృప వల్ల హయగ్రీవ అవతారులైన విష్ణు అదే పేరుగలిగిన అసుర సంహారం చేయడం జరిగింది. తాను చంద్రమండల వాసియైన హయగ్రీవుడు, మహానంద స్వరూపుడు, ఆయన నాసిక నుండి వేదాలు ఆవిర్భవించాయని పురాణ కథనం. హయగ్రీవ విరాట్ స్వరూపాన సత్యలోకం శిరస్సుగా, భూలోకం నాభిగా, పాతాళం పాదాలుగా, అంతరిక్షం కళ్ళుగా, సూర్యుడు కంటి గుడ్డుగా, చంద్రుడు గుండెగా, దిక్పాలకులు భుజాలుగా, అగ్ని ముఖంగా, సముద్రాలు ఉదరంగా, నదులు నాడులుగా, పర్వతాలు ఎముకలుగా, మేఘాలు కేశాలుగా, సర్వదేవతా స్వరూపులైనారు. హయగ్రీవుడు తెల్లని శరీరం కలవారు.
లక్ష్మీదేవిని తొడపై కూర్చోబెట్టుకుని, తెల్లని పద్మాసీనులై ఉంటారు. పైకుడిచేతిలో చక్రం, పై ఎడమ చేతిలో శంఖం, కింది ఎడమ చేతిలో పుస్తకం, కింది కుడిచేయి చిన్ముద్ర ధరించి ఉంటారు. శే్వతపద్మం సమస్త ఐశ్వర్యాలకు చిహ్నం. చిన్ముద్ర జ్ఞానానికి, పుస్తకం సకల విద్యలకు, శంఖం సకల సృష్టికి కారణభూతమైన నాదానికి, చక్రం అజ్ఞాన సంహారానికి చిహ్నాలు. హయగ్రీవ ఉపాసించిన వారికి సకలం కలుగుతాయని విశ్వాసం. ఏ దేవతకైనా నామమే శరీరమని, ఆ నామంలోని అక్షరాలే అవయవాలని శాస్తవ్రచనం. అందుకే వైష్ణవులకు ఆధ్యాత్మిక విద్యాభ్యాసం హయగ్రీవ నామోపదేశంతో ప్రారంభించడం సంప్రదాయం. హయగ్రీవ నామాన్ని ఉచ్ఛరించిన వారు శివస్వరూపులుగా, పలికిన వారు విష్ణు స్వరూపులుగా, విన్నవారు బ్రహ్మ స్వరూపులుగా అవుతారని బ్రహ్మ చెప్పడాన్ని బట్టి హయగ్రీవ నామ ప్రాధాన్యత స్పష్టం అవుతున్నది.

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494