AADIVAVRAM - Others

అహంకారానికి ఆపరేషనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే’ అనడం వింటూంటాం. అయితే దీనితోబాటుగా, మరోలా మరోటి కూడా అనుకొంటే చాలా బాగుంటుందేమో ననిపిస్తుంది. కాలాన్నిబట్టి.. ‘పూర్వజన్మ కృతం పుణ్యం అహంకార రూపేణ శోభతే’ అని. పూర్వ పుణ్యం వలన తనకు సిరిసంపదలు, సమస్త భోగములు కలుగుట వలన, తనకు తెలీకుండానే తనలో ప్రవేశించిన అహంకారం ఓ అందమైన అలంకారంలా తనను ఆనందపరుస్తుంటే, చూపరులకు మాత్రం అదో వికృతమైన ఆకారంలా భయభ్రాంతులకు గురి చేస్తోంది.
అటువంటి మనసున్న ప్రతివాడికీ ఏదో రకమైన ఆలోచన అనుక్షణం కదిలిస్తూనే ఉంటుంది. అహంకార బాణాన్ని వదులుతూనే ఉంటుంది. ఇదే ఆ మనిషి ఆకారానికి గట్టి ప్రాకారం. అది దాటి ఇతరులకు రావడం అసాధ్యం. ఎందుకంటే అందులోని మాధుర్యం అటువంటిది. అలాంటప్పుడు దాన్ని ఎలా వదులుకుంటాడు. ప్రపంచంలోని సమస్త జీవరాశులకన్నా తానే గొప్పవాడని కదా ఆ అహంభావం.
ఆ అహంభావాన్ని ఎవరికి వారు అనుభవించడంలో తప్పు లేదు. కానీ, తమకన్నా ఆర్థికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా, తక్కువగా వున్న వారిని చూసి, ఏ మాత్రం మానవత్వం లేకుండా, అమర్యాదగా ప్రవర్తించడం సమంజసం కాదు కదా! సమాజంలో అందరూ డబ్బూ డాబూ అందం చందం వున్నవాళ్లే వుండరు కదా!
విచిత్రమేమిటంటే అహంకార స్వభావం కలిగిన ఇద్దరు ఏ విందులోనో ఏ మందులోనో లేదా ఏ సందులోనో తారసపడినప్పుడు, తామరాకుపై నీటిబొట్టులా, నవ్వురాని నవ్వులొలకబోస్తూ, ఆలింగనం చేసుకొని, కొని తెచ్చుకున్న ఆప్యాయతను నటిస్తూ, అందరి ముందూ ఆనందంగా పచార్లు చేస్తుంటారు. ఇది అందరూ నిత్యం గమనిస్తున్న విషయమే. ఇలాంటి చిన్న విఃయాల నుండీ, అనేక పెద్ద విషయాల దాకా, విస్తరిస్తున్న అహంకార భావజాలం విస్మయానికి గురిచేస్తూనే ఉంటోంది.
ఇటువంటి వికృతమైన విష సంస్కృతికి, తగిన వైద్యం అందుబాటులో లేనందువల్ల, ఎందరో అనేక మంది, రకరకాల మానసిక వ్యాధులకు బలయ్యే అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. మనిషిని మనిషి ప్రేమతో చూసుకోలేని మనుష్యజాతి, మేం మనసున్న మనుషులం అనుకొంటే ఏం లాభం? అందుకే దీనికి తక్షణ వైద్యం అవసరమనిపించి, అహంకారుల వలన బాధింపబడిన కొందరు చివరకు ఓ సర్జన్‌ను ఆశ్రయించారు. తాము మితిమీరిన అహంకారుల వలన పడిన పలు రకాల బాధలనూ, ఆయా వ్యక్తుల నిర్లక్ష్య వైఖరిని విస్తారంగా వివరించారు. అంతేకాదు ఆ సర్జన్ గనుక, అటువంటి అహంకారానికి ఆపరేషన్ చేస్తాననేట్లయితే, శరీరంలోని ప్రతి అణువు అహంకారపూరితమైన, తమకు తెలిసిన ఓ భారీ మనిషిని, తమ లారీలో ఎక్కించుకొని తమ వద్దకు తీసుకొస్తామని కూడా చెప్పారు. అందుకా సర్జన్ వాళ్ల బాధను అర్థం చేసుకొని, వారికి కొన్ని సూచనలు చేశాడు.
‘జన్మతః వచ్చిన ఇటువంటి మానసిక వ్యాధులకు ఆపరేషన్ చేయడం ఎవరివల్లా కాదు. ఎవరికి వారే ఆలోచించుకొని, తమ ప్రవర్తన వలన ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయో తెలుసుకొని, తమతమ అహంకార భావజాలానికి తగిన మోతాదులో ఆలోచించుకొని, అలా ప్రవర్తించడానికి అలవాటు చేసుకోవాలి. అప్పుడే దీనికి తగిన పరిష్కారం దొరుకుతుంది. ఇంత మంచి సలహా ఇవ్వడానికి నన్ను మించిన సర్జన్ ఇంకెవ్వరూ లేరు’ అన్నాడా సర్జన్ అహంకారంతో బిగ్గరగా.

-షణ్ముఖశ్రీ.. 8897853339